కొండెక్కిన ‘కోడి’ | Heavily raised chicken price | Sakshi
Sakshi News home page

కొండెక్కిన ‘కోడి’

Published Wed, Jan 2 2019 3:57 AM | Last Updated on Wed, Jan 2 2019 8:05 AM

Heavily raised chicken price - Sakshi

సాక్షి, అమరావతి: కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుని సామాన్యుడికి అందకుండా ఊరిస్తోంది. డిసెంబర్‌ నెల ప్రారంభం నుంచి మొదలైన పెరుగుదల నెలాఖరు నాటికి కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.210 నుంచి 230 వరకూ పలికింది. నూతన సంవత్సరం రోజున కొద్దిగా తగ్గినా మళ్లీ పెరిగే సూచనలే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్‌ ప్రియులు ఆవేదన చెందుతున్నారు. నెలన్నర క్రితం వరకూ కిలో రూ.150 నుంచి రూ.170 మధ్య ఉన్న బ్రాయిలర్‌ చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర 20 రోజులుగా బాగా పెరిగింది. పది రోజులపాటు కిలో రూ.210 – 230 మధ్య (చికెన్‌ కంపెనీలు, నాణ్యత, ప్రాంతాన్ని బట్టి రూ.15 నుంచి రూ.20 వరకూ తేడా ఉంటుంది) స్థిరపడింది. రెండు మూడు రోజుల్లో తగ్గుముఖం పట్టి రూ.180–200కి దిగివచ్చింది. గత రెండు మూడు రోజుల్లో తగ్గడానికి అయ్యప్ప, భవానీ దీక్షలు, కొత్త సంవత్సరం, సెంటిమెంటు కారణాలని చికెన్‌ వ్యాపారులు, బ్రాయిలర్‌ పౌల్ట్రీ ఫారాల వారు విశ్లేషిస్తున్నారు.

రెండు రోజుల్లో భవానీ దీక్షలు ముగియనున్నాయి. అలాగే అయ్యప్ప భక్తుల్లో కూడా అత్యధిక మంది (మఖరజ్యోతి దర్శనం కోసం ఆగేవారు మినహా) వారం పది రోజుల్లో మాలలు తీసేస్తారు. వీటికి తోడు సంక్రాంతి సందర్భంగా కోళ్లకు డిమాండు పెరుగుతుందని వ్యాపారవర్గాల అంచనాగా ఉంది. వీటికి తోడు గతంతో పోల్చుకుంటే మందు వినియోగం కూడా బాగా పెరగడంతో అదే స్థాయిలో చికెన్‌ అమ్మకాలూ పెరిగాయి. ‘ చెప్పడానికి బాగున్నా బాగులేకపోయినా మందుప్రియులవల్లే ఎక్కువగా చికెన్‌ అమ్ముడుపోతోందన్నది మాత్రం నిజం. చికెన్‌ విక్రయించే షాపు నిర్వాహకుడిగా ఇది నేను గ్రహించిన వాస్తవం...’ అని విజయవాడకు చెందిన ఒక దుకాణం యజమాని ‘సాక్షి’కి వివరించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే విజయవాడలో చికెన్‌ వినియోగమే కాదు ధర కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని ఒక హోటల్‌ యజమాని అభిప్రాయపడ్డారు. 

ముక్కలేనిదే ముద్ద దిగనివారెందరో...
పొట్టేలి మాంసంతో పోల్చితే ధర తక్కువగా ఉండటం కూడా కోడికూరకు డిమాండు పెరగడానికి కారణం. మటన్‌ కొనలేని వారంతా చికెన్‌వైపే మొగ్గుచూపుతున్నారు. హోటళ్లలో సైతం మటన్‌ కంటే చికెన్‌ వినియోగమే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రతి నెలా మూడు కోట్లకు పైగా బ్రాయిలర్‌ కోళ్ల ఫారాల నుంచి బయటకు వస్తున్నాయి. సీజన్‌ను బట్టి కొంచెం అటు ఇటుగా అదే స్థాయిలో కోడి పిల్లలు పెంపకం కోసం పౌల్ట్రీలకు చేరుతున్నాయి. వచ్చే వేసవిలో చికెన్‌ ధరలు పెరగవచ్చని బ్రాయిలర్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ఈఏడాది ఖరీఫ్‌లోనూ, రబీలోనూ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోవడం వల్ల కోళ్లకు దాణాగా వాడే మొక్కజొన్న, తౌడు, సజ్జలు తదితరాల ధర పెరుగుతుంది. కరువువల్ల నీటి సమస్య ఏర్పడుతుంది. 

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వేడి పెరిగి భూతాపంవల్ల కోళ్లు చనిపోయి మాంసం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ కారణాలవల్ల చికెన్‌ ధర పెరిగితే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి వస్తుందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. ధరల్లో నాటుకోడి పొట్టేలు మాంసంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో పొట్టేలి మాసం రూ.550 ఉంటే నాటుకోడి రూ.500 ఉంది. పెద్ద పెద్ద హోటళ్లలో సైతం నాటుకోడి పులుసు, సంగటి మెనూకు క్రేజి ఏర్పడింది. నాటుకోళ్ల పెంపకం ఖర్చు కూడా ఎక్కువే ఉంటుందని పౌల్ట్రీల యజమానులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement