
తీవ్ర కొరతతో సతమతం
బర్డ్‌ఫ్లూయే ప్రధాన కారణం
ఆల్‌టైం గరిష్టానికి ధరలు
ఒక్క గుడ్డు ఏకంగా రూ.36
మరో 40 శాతం పెరిగే చాన్స్
ఒక్కరికి గరిష్టంగా రెండు గుడ్లే
పలు సూపర్‌మార్కెట్ల ఆంక్షలు
తుర్కియే వైపు అమెరికా చూపు
ఈ ఏడు 42 కోట్ల గుడ్ల దిగుమతి
కనీవినీ ఎరగని కొరత. ఆకాశాన్నంటిన ధరలు. అంతంత పెట్టయినా కొందామంటే వాటిపైనా ఆంక్షలు. మొత్తమ్మీద అగ్ర రాజ్యం అక్షరాలా ‘గుడ్లు’ తేలేస్తోంది. తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలలుగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే తప్ప తెరిపిన పడే సూచనలే కన్పించడం లేదు...! దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి!
ఎందుకీ సమస్య?
అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికీ పెరిగిపోతోంది. బర్డ్‌ఫ్లూగా పిలిచే హెచ్5ఎన్1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలో ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు.
వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11 శాతం తగ్గుదల! అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపు దాలి్చంది. కొద్ది రోజులుగా డజను గుడ్లు్ల ఏకంగా 5 డాలర్లకు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే 435 రూపాయలు.
ఒక్క గుడ్డు రూ.36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోనే ఆల్‌టైం గరిష్టం! అంతేకాదు, షికాగో, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా 8 నుంచి 10 డాలర్ల దాకా ఎగబాకింది!! దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్‌మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నాయి! డెన్సీస్, వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చెయిన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్‌చార్జీ కూడా వడ్డిస్తున్నాయి!
ధరలు మరింత పైపైకే?
సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కన్పించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం ఎగబాకాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40 శాతానికి పైగా పెరగవచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది! ట్రంప్ సర్కారు కూడా పరోక్షంగా అదే చెప్పింది.
‘‘ఏడాదిన్నరలోగా డజను గుడ్ల ధర ఎప్పట్లా 2 డాలర్ల లోపుకు దిగొచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు! దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియే వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచీ అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్నా కొన్నేళ్లుగా ఒక్క తుర్కియేకే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు.
ఇవీ లెక్కలు..
→ అమెరికాలో ఏటా సగటున 9,000 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తవుతాయి.
→ ఫ్లూ కారణంగా మూడేళ్లలో 14 కోట్ల కోళ్లను చంపేయాల్సి వచ్చింది.
→ 2021లో 1.6 డాలర్లున్న డజను గుడ్ల ధర ఇప్పుడు 5 డాలర్లను దాటేసింది.
→ 2024లో తుర్కియే నుంచి 7 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు.
→ ఈసారి ఏకంగా 42 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకోనున్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం!
→ అయినా డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇది ఏమాత్రమూ చాలదంటున్నారు.
ట్రంప్ బిలియన్ డాలర్ ప్లాన్
గుడ్ల కొరతను అధిగమించి వాటి ధరలను నేలకు దించేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అందులో ఏమున్నాయంటే...
→ బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు.
→ బర్డ్‌ఫ్లూ చికిత్స, వ్యాక్సిన్ల అభివృద్ధి తదితరాలకు 10 కోట్ల డాలర్లు
→ పౌల్ట్రీఫారాల యజమానులకు ఆర్థిక సాయానికి 40 కోట్ల డాలర్లు
→ దిగమతుల ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకుని కొరతను అధిగమించడం
బైడెన్ సర్కారు ఏం చేసింది? ఫ్లూపై పోరుకు బైడెన్ ప్రభుత్వం మూడేళ్లలో 150 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఫ్లూ బారిన పడ్డ కోళ్లను అంతమొందిస్తూ వచ్చింది. ఈ వైరస్ మనుషులకు పాకకుండా చూసేందుకు 60 కోట్ల డాలర్లు కేటాయించింది. వ్యాక్సిన్ల వృద్ధి తదితరాలపై దృష్టి పెట్టింది. ఎంత చేసినా గుడ్ల కొరత నానాటికీ పెరుగుతూనే వచ్చింది. బైడెన్ ప్రభుత్వ అర్థంలేని చర్యల వల్లే సమస్య విషమించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన చర్యలతో పరిస్థితి ఎంతో కొంత అదుపులోకి రాగలదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉండటం విశేషం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment