Bureau of Labor Statistics
-
గుడ్లు తేలేస్తున్న అమెరికా
కనీవినీ ఎరగని కొరత. ఆకాశాన్నంటిన ధరలు. అంతంత పెట్టయినా కొందామంటే వాటిపైనా ఆంక్షలు. మొత్తమ్మీద అగ్ర రాజ్యం అక్షరాలా ‘గుడ్లు’ తేలేస్తోంది. తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలలుగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే తప్ప తెరిపిన పడే సూచనలే కన్పించడం లేదు...! దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి! ఎందుకీ సమస్య? అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికీ పెరిగిపోతోంది. బర్డ్‌ఫ్లూగా పిలిచే హెచ్5ఎన్1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలో ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11 శాతం తగ్గుదల! అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపు దాలి్చంది. కొద్ది రోజులుగా డజను గుడ్లు్ల ఏకంగా 5 డాలర్లకు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే 435 రూపాయలు. ఒక్క గుడ్డు రూ.36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోనే ఆల్‌టైం గరిష్టం! అంతేకాదు, షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా 8 నుంచి 10 డాలర్ల దాకా ఎగబాకింది!! దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నాయి! డెన్సీస్, వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చెయిన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్‌చార్జీ కూడా వడ్డిస్తున్నాయి!ధరలు మరింత పైపైకే? సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కన్పించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం ఎగబాకాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40 శాతానికి పైగా పెరగవచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది! ట్రంప్ సర్కారు కూడా పరోక్షంగా అదే చెప్పింది. ‘‘ఏడాదిన్నరలోగా డజను గుడ్ల ధర ఎప్పట్లా 2 డాలర్ల లోపుకు దిగొచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు! దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియే వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచీ అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్నా కొన్నేళ్లుగా ఒక్క తుర్కియేకే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు.ఇవీ లెక్కలు..→ అమెరికాలో ఏటా సగటున 9,000 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తవుతాయి. → ఫ్లూ కారణంగా మూడేళ్లలో 14 కోట్ల కోళ్లను చంపేయాల్సి వచ్చింది. → 2021లో 1.6 డాలర్లున్న డజను గుడ్ల ధర ఇప్పుడు 5 డాలర్లను దాటేసింది. → 2024లో తుర్కియే నుంచి 7 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు. → ఈసారి ఏకంగా 42 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకోనున్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం! → అయినా డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇది ఏమాత్రమూ చాలదంటున్నారు.ట్రంప్ బిలియన్ డాలర్ ప్లాన్ గుడ్ల కొరతను అధిగమించి వాటి ధరలను నేలకు దించేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అందులో ఏమున్నాయంటే... → బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు. → బర్డ్‌ఫ్లూ చికిత్స, వ్యాక్సిన్ల అభివృద్ధి తదితరాలకు 10 కోట్ల డాలర్లు → పౌల్ట్రీఫారాల యజమానులకు ఆర్థిక సాయానికి 40 కోట్ల డాలర్లు → దిగమతుల ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకుని కొరతను అధిగమించడంబైడెన్ సర్కారు ఏం చేసింది? ఫ్లూపై పోరుకు బైడెన్ ప్రభుత్వం మూడేళ్లలో 150 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఫ్లూ బారిన పడ్డ కోళ్లను అంతమొందిస్తూ వచ్చింది. ఈ వైరస్ మనుషులకు పాకకుండా చూసేందుకు 60 కోట్ల డాలర్లు కేటాయించింది. వ్యాక్సిన్ల వృద్ధి తదితరాలపై దృష్టి పెట్టింది. ఎంత చేసినా గుడ్ల కొరత నానాటికీ పెరుగుతూనే వచ్చింది. బైడెన్ ప్రభుత్వ అర్థంలేని చర్యల వల్లే సమస్య విషమించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన చర్యలతో పరిస్థితి ఎంతో కొంత అదుపులోకి రాగలదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Great resignation: కొలువుకు టాటా
ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవనక్రమం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని. భార్యాబిడ్డలతో గడుపుతూనే, ఇంటి పనులూ చేసుకుంటూనే, బయటికెళ్లి సరదాగా గడుపుతూనే ఆఫీసు పని కూడా చేసుకునే కొత్త ట్రెండు. ఇంతకాలంగా కోల్పోయిందేమిటో సగటు ఉద్యోగికి తెలిసొచ్చేలా చేసింది కరోనా. అందుకే మళ్లీ ఎప్పట్లా ఆఫీసుకు వెళ్లి పని చేయాలంటే ఎవరికీ ఓ పట్టాన మనసొప్పడం లేదు. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పని చేసే వీలున్న కొలువు చూసుకొమ్మంటోంది. ఫలితం? ఉద్యోగుల రాజీనామా వెల్లువ... కరోనా తర్వాత ఉద్యోగుల రాజీనామాలు కొంతకాలంగా ప్రపంచమంతటా పెరుగుతూనే ఉన్నా, అమెరికాలో మాత్రం ఈ పోకడ పలు చిన్నా పెద్దా కంపెనీలను మరీ కుదిపేస్తోంది. గతేడాది అక్కడ 4.7 కోట్ల మంది ఉద్యోగాలకు రాంరాం చెప్పినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారట. ‘వీళ్లంతా నచ్చిన వేళల్లో తమకు నచ్చినట్టు పనిచేసే వెసులుబాటున్న ఉద్యోగాలు వెదుక్కుంటున్నారు. ఒకరకంగా చరిత్రలో తొలిసారిగా ఉద్యోగుల్లో ఒక ధీమా వంటివి వచ్చింది. ఉన్న ఉద్యోగం మానేసినా నచ్చిన పని వెదుక్కోవడం కష్టమేమీ కాదన్న భావన పెరిగింది’అని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ నికోలస్ బ్లూమ్ అన్నారు. నచ్చిన పనిలో ఇప్పుడున్న జీతం కంటే తక్కువ వచ్చినా పర్లేదనే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఆయన చెబుతున్నారు. ఉద్యోగుల్లో ఏకంగా 57 శాతం వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోరుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజా సర్వే తేల్చింది. కరోనా కాలంలో విపరీతమైన ఒత్తిడికి లోనైన టెక్, హెల్త్‌కేర్ కంపెనీల ఉద్యోగులే ఇప్పుడు ఎక్కువగా కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు. వీరిలో చాలామంది ఐదు నుంచి పదేళ్ల అనుభవమున్నవారే. మొత్తానికి వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు కొత్త జీవిత పాఠాలు నేర్పిందంటారు టెక్సాస్ ఎం–ఎం వర్సిటీ ప్రొఫెసర్ ఆంటోనీ క్లోజ్. 2021 నుంచీ పెరిగిపోయిన రాజీనామాల పోకడకు ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’అని పేరు పెట్టారాయన. మన దేశంలోనూ అదే ధోరణి మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్ పేజ్ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట!! సర్వేలు ఏం చెప్తున్నాయి.. ► ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు సాధ్యమైనంత త్వరలో ఉద్యోగం మారాలనుకుంటున్నట్టు ప్రైస్‌వాటర్‌కూపర్ ఇటీవల 44 దేశాల్లో నిర్వహించిన మెగా సర్వేలో తేలింది ► అధిక జీతం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నామని వీరిలో 44 శాతం మంది చెప్పగా, వృత్తి–వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల జాబ్ మారుతున్నట్టు మరో44 శాతం మంది చెప్పారు. ► ప్రపంచవ్యాప్తంగా కేవలం 29 శాతం మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగేందుకు ఇష్టపడుతున్నట్టు గార్టర్ అనే సంస్థ సర్వేలో తేలింది. ► తమకు నచ్చిన పనివిధానం, పని గంటలుండే ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నట్టు ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 79 శాతం మంది చెప్పారు. కంపెనీల తీరూ మారుతోంది రాజీనామాల నేపథ్యంలో కంపెనీలను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు అమెజాన్, గూగుల్ వంటి భారీ సంస్థలు కూడా అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. పని విధానాన్నే మార్చేస్తున్నాయి. అధిక జీతాలను ఆశగా చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఇంటినుంచి కొంత, ఆఫీసులో కొంత సమయం పని చేసేలా హైబ్రిడ్ విధానాన్నీ తెస్తున్నాయి. పింట్రెస్ట్ సంస్థ అయితే ఏకంగా బిడ్డల సంరక్షణ కోసం ఉద్యోగులకు సెలవులతో పాటు అనేక సౌకర్యాలిస్తోంది. జర్మనీకి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ డాబే అయితే ఇంటర్వ్యూలకు హాజరైన వారికీ నగదు బహుమతులిస్తోంది! తొలి రౌండ్లో 550 డాలర్లు, రెండో రౌండ్ చేరితే 1,100 డాలర్లు ముట్టజెబుతోంది! -
ట్రంప్ ఎఫెక్ట్: భారీగా పెరిగిన కొలువులు
అమెరికా వ్యాపార సంస్థలు ఒక్క నెలలో భారీగా ఉద్యోగులను నియమించుకున్నారు. జనవరి నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా పుంజుకున్నట్టు తాజా నివేదికలో తేలింది. ఆయా వాణిజ్య ఇతర సంస్థలు కొత్తగా 2లక్షల 27 వేల కొత్త ఉద్యోగాలను అదనంగా జోడించినట్టు తెలిపింది. అయితే ఈ సంఖ్య లక్షా75 వేలుగా ఉండగనుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. చిల్లర వ్యాపారం, నిర్మాణం, ఆర్థిక కార్యకలాపాల్లో ఈ ఉద్యోగాలు సాధించినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక తేల్చింది. గత డిశెంబర్ 157,000 ఉద్యోగాలతో పోలిస్తే ఈ నెలలో పెరిగినట్టు తెలిపింది. అలాగే 4.8 శాతం నిరుద్యోగ రేటుతో, 7.6 మిలియన్ల నిరుద్యోగులు ఉన్నట్టు నివేదించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య భారీగా ఉన్నట్టు తెలిపింది. గత సెప్టెంబర్ తో పోలిస్తే గరిష్టంగా ఉంది.జనవరి 2009-17 మధ్య కాలంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో 11.25 మిలియన్ ఉద్యోగాల పెరుగుదల నమోదైనట్టు బ్యూరో పేర్కొంది. మరోవైపు జనవరి నెల జాబ్ రిపోర్ట్ అంచనాలను మించి నమోదు కావడంతో అమెరికా మార్కెట్లు భారీలాభాలతో మొదలయ్యాయి. కాగా ఫర్ అమెరికన్స్, హైర్ అమెరికన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే 10 ఏళ్ల కాలానికి 25 మిలియన్ల ఉద్యోగాల సృష్టించనున్నట్టు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.