h5n1 virus
-
H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు!
ప్రపంచమంతటా కోవిడ్–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌లో హెచ్5ఎన్1 అనే వేరియంట్ తొలుత ఆవులకు, తర్వాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్‌ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ► అమెరికాలో మనుషులకు సోకిన తొలి బర్డ్‌ఫ్లూ కేసు 2022లో కొలరాడోలో బయటపడింది. ► బర్డ్‌ఫ్లూ వైరస్ గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారుల జాబితాలో తొలి స్థానంలో ఉందని పిట్స్బర్గ్కు చెందిన బర్డ్‌ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేశ్ కూచిపూడి చెప్పారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని, మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► కోవిడ్–19తో పోలిస్తే బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ జాన్ ఫల్టన్ వెల్లడించారు. ఇందులో మ్యుటేషన్లు(మార్పులు) జరిగితే బాధితుల్లో మరణాల రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు. ► నిజానికి ఇతర దేశాల్లోనూ మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకిన సంఘటనలున్నాయి. 2003 జనవరి 1 నుంచి 2024 ఫిబ్రవరి 26 దాకా 23 దేశాల్లో 887 కేసులు బయటపడ్డాయి. వీరిలో 462 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అంటే 52 శాతం మంది మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ► మనుషులు బర్డ్‌ఫ్లూ బారినపడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీ వైరల్ ఔషధాలు ఇస్తుంటారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
విజృంభిస్తున్న H5N1 బర్డ్‌ఫ్లూ.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం..!
ఏవియన్ ఫ్లూ కొత్తరకం వైరస్ H5N1(బర్డ్ ఫ్లూ) ఐరోపాలోని అడవి జంతువులు, పక్షుల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముంగిస, పందులు, ఎలుగుబంట్లు వంటి క్షీరదాలను ఇది తవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో హెచ్5ఎన్1 తదుపరి ముప్పు మానవులకేనా? ఇది మరో మహమ్మారిగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ వైరస్ ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని శాస్త్రవేత్తలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. పక్షలకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో చాలా రకాలున్నాయి. వాటిలో ఒకటి H5N1. 1997లోనే దీన్ని తొలిసారి గుర్తించారు. గత 20 ఏళ్లలో 850 మంది మనుషులు ఈ ఫ్లూ బారినపడ్డారు. కేసుల సంఖ్య తక్కువే ఉంది కదా? అనుకోవద్దు. ఎందుకంటే హెచ్5ఎన్1 సోకిన వారిలో 50 శాతం మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ ఇన్‌ఫ్లూయెంజా 1,000 మందికి సోకితే 500 మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇది భవిష్యత్తులో మరో మహమ్మారిగా అవతరించే ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2020లో ఏవియన్ ఫ్లూ-ఏ(H5N1) అనే ఈ వైరస్ కొత్త వంశం ఉద్భవించింది. అప్పటి నుంచి ఇది అడవి పక్షుల ద్వారా మాత్రమే కాకుండా పందులు, ఎలుగుబంట్లు వంటి నిర్దిష్ట జాతుల క్షీరదాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ 10 కంటే తక్కువ మంది మనుషులకే సోకినట్లు గణాంకాల్లో ఉంది. వీరిలో ఒక్కరు మాత్రమే చనిపోయారు. 2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో 6,615 జంతువులు ఈ ఫ్లూ బారినపడ్డాయి. అక్టోబర్ 2022 నుంచి ఇప్పటివరకు ఈ 2,701 కేసులు వెలుగుచూశాయి. మరో మహమ్మారిగా అవతరిస్తుందా? ఈ బర్డ్‌ఫ్లూ మరణాల రేటు 50 శాతం ఉండటం ప్రజారోగ్య అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 2009 హెచ్1ఎన్1 నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్లలో మరణాల రేటు దీనికే ఎక్కువ ఉండటం గమనార్హం. ఒకవేళ హెచ్5ఎన్1 మానవులకు కూడా వేగంగా వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ అవకాశం లేదని చెప్పి కాస్త ఊరటనిచ్చారు. ఇటీవల హెచ్5ఎన్1 వైరస్ బారినపడిన వారందరూ అడవి పక్షులతో అత్యంత సన్నిహితంగా మెలిగారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిచర్డ్ పిబాడీ తెలిపారు. వీరిలో పౌల్ట్రీ ఫాంలతో పనిచేసేవారు, పక్షులు, జంతువులను చంపేవారు ఉన్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన పక్షులు, జంతువులకు దూరంగా ఉంటే హైచ్5ఎన్1 వైరస్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పక్షులు, క్షీరదాలతో పాటు ఇతర జంతువులకు ఈ ఫ్లూ వ్యాపించడం మొదలైందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే.. -
కడక్‌నాథ్ కోళ్లకు బర్డ్‌ఫ్లూ.. చికెన్ విక్రయాలపై నిషేధం!
జార్ఖండ్: బర్డ్‌ఫ్లూ కారణంగా 4,000 కోళ్లు, బాతులను చంపివేయాలని జార్ఖండ్ బొకారో జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిచెందినందువల్ల దాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్‌నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఈ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్‌ప్లూ కారణంగా మరణించాయని, మరో 103 కోళ్లను తామే చంపేశామని పేర్కొన్నారు. దీంతో ఈ ఫాంకు ఒక కిలోమీటర్ రేడియస్‌లో ఉన్న కోళ్లు, బాతులు సహా మొత్తం 3,856 పక్షులను చంపనున్నట్లు పశు ఆరోగ్య, ఉత్పత్తి డైరెక్టర్ డా.బిపిన్ బిహారీ మహ్తా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న ఈ ఫాంలో కోళ్లు చనిపోవడం మొదలైందని, నమూనాలు ల్యాబ్‌కు పంపింతే బర్డ్‌ఫ్లూగా నిర్ధరణ అయిందని వివరించారు. అయితే కోళ్ల యజమానులకు కొంత పరిహారం ఇచ్చేందుకు ప్రక్రియ మొదలైందని, ఎవరెవరికి ఇచ్చే విషయాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. బర్డ్‌ఫ్లూను గుర్తించి పౌల్ట్రీ ఫాంకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న కోళ్ల ఫాంలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే బొకారా జిల్లాలో చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు. మనుషులు ఎవరైనా ఈ వైరస్ బారినపడితే వారికి చికిత్స అందించేందుకు సదర్ హాస్పిటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చదవండి: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
Bird Flu: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
పారిస్: హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. కంబోడియాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. అన్ని దేశాలు బర్డ్‌ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో ఈ బాలిక ఫిబ్రవరి 16న తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరీక్షలు నిర్వహించగా బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 22న ప్రాణాలు కోల్పోయింది. అనంతరం బాలిక తండ్రి సహా ఆమెతో సన్నిహితంగా మెలిగిన 12 మంది నమూనాలను అధికారులు సేకరించారు. తండ్రికి కూడా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. అయితే అతనిలో ఎలాంటి లక్షణాలు లేవు. మిగతావారి నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. వీరి పరిస్థితిపై కంబోడియా అధికారులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ సంప్రదింపులు జరుపుతోంది. కోళ్లు, ఇతర పక్షుల్లో మాత్రమే కన్పించే బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషులకు అత్యంత అరుదుగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో మనుషులకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటేనే అది సోకే అవకాశముంది. అయితే బాలికకు, ఆమె తండ్రికి బర్డ్‌ఫ్లూ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు కోళ్లు, పక్షులతో సన్నిహితంగా మెలిగారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బాలిక నుంచే ఆమె తండ్రకి వైరస్ సోకిందా? అనే విషయంపై ఇప్పుడే ఎలాంటి అంచనాకు రాలేమని అధికారులు పేర్కొన్నారు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతన్నాయని, కొందరు మానవులకు కూడా ఈ వైరస్ వాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అన్ని దేశాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ వైరస్ సోకితే ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని హెచ్చరించింది. చదవండి: టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య -
12 వేల బాతులను చంపేశారు!
అలప్పుజ: కేరళ వాసులను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. అలప్పుజ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తకళి గ్రామపంచాయతీలోని 10వ వార్డులో మొత్తం 12,000 బాతులను చంపేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ నిర్ధారణ పరీక్షల కోసం భోపాల్‌కు పంపించారు. మరోవైపు అలపుజ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు ముమ్మరం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. తకళి గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 10లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా వైద్యాధికారులు ప్రకటించారు. ఇక్కడ వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో బాతులు, కోళ్లు, పిట్టలు, పెంపుడు పక్షుల గుడ్లు, మాంసం అమ్మకాలు, పేడ వాడకంపై జిల్లా యంత్రాంగం నిషేధించింది. చంపకుళం, నేడుముడి, ముత్తార్, వీయపురం, కరువట్ట, త్రిక్కున్నపుళ, తకళి, పురక్కాడ్, అంబలపుజ సౌత్, అంబలపుజ నార్త్, ఎడత్వ పంచాయతీలు, హరిప్పాడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. (Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!) తకళి పంచాయతీ 10వ వార్డులో కిలోమీటరు పరిధిలో పక్షులను చంపే ప్రక్రియను పూర్తి చేసి సురక్షితంగా పాతిపెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సహకారం అందించాలని, ఆ ప్రాంతంలో నిఘా పెట్టాలని స్థానిక పోలీసులను కోరారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారిత ప్రాంతాల్లో పశుసంక్షేమ శాఖ.. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా ప్రజలకు నివారణ మందులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదికలు అందజేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: ఒమిక్రాన్ టెన్షన్.. 2 రోజుల పాటు కర్ఫ్యూ) -
బర్డ్ ప్లూపై తెలంగాణ సర్కార్ అప్రమత్తం
హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామంలోని కొన్ని కోళ్ల ఫారాలల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి కారక హెచ్5ఎన్1 వైరస్ నిర్దారణ కావడంతో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. కోళ్ల ఫారాల్లో పనిచేసే సిబ్బందితోపాటు కోళ్లను పూడ్చిపెట్టే పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ముందస్తుగా టామీ ఫ్లూ మాత్రలను అందిస్తున్నారు. ఇందుకోసం 2,500 మాత్రలను రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సరఫరా చేశారు. వ్యాధి వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న తొర్రూరు పరిసర ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరిలోనూ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా ఉండేందుకు పెంపుడు జంతువులకు టీకాలు ఇప్పించాలని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.