H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు! | H5N1 Bird Flu: Scientists warn of deadly bird flu pandemic | Sakshi
Sakshi News home page

H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు!

Published Sat, Apr 6 2024 5:40 AM | Last Updated on Sat, Apr 6 2024 12:33 PM

H5N1 Bird Flu: Scientists warn of deadly bird flu pandemic - Sakshi

అమెరికాలో మరో హెచ్‌5ఎన్‌1 వేరియంట్‌ కేసు 

కోవిడ్‌–19 తరహాలో మహమ్మారిగా మారొచ్చు

అమెరికా సైంటిస్టుల హెచ్చరిక  

ప్రపంచమంతటా కోవిడ్‌–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌లో హెచ్‌5ఎన్‌1 అనే వేరియంట్‌ తొలుత ఆవులకు, తర్వాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది.

ఏప్రిల్‌ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ప్రివెన్షన్‌(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్‌ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌1 వేరియంట్‌ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్‌ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.  

► అమెరికాలో మనుషులకు సోకిన తొలి బర్డ్‌ఫ్లూ కేసు 2022లో కొలరాడోలో బయటపడింది.  
► బర్డ్‌ఫ్లూ వైరస్‌ గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారుల జాబితాలో తొలి స్థానంలో ఉందని పిట్స్‌బర్గ్‌కు చెందిన బర్డ్‌ఫ్లూ పరిశోధకుడు డాక్టర్‌ సురేశ్‌ కూచిపూడి చెప్పారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని, మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  
► కోవిడ్‌–19తో పోలిస్తే బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌1 వేరియంట్‌ 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్‌ జాన్‌ ఫల్టన్‌ వెల్లడించారు. ఇందులో మ్యుటేషన్లు(మార్పులు) జరిగితే బాధితుల్లో మరణాల రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు.  
► నిజానికి ఇతర దేశాల్లోనూ మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకిన సంఘటనలున్నాయి. 2003 జనవరి 1 నుంచి 2024 ఫిబ్రవరి 26 దాకా 23 దేశాల్లో 887 కేసులు బయటపడ్డాయి. వీరిలో 462 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అంటే 52 శాతం మంది మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.  
► మనుషులు బర్డ్‌ఫ్లూ  బారినపడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీ వైరల్‌ ఔషధాలు ఇస్తుంటారు.  

 
- సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement