T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! | National Cricket League T10 2024 Robin Uthappa Smashes 66 off 27 Balls | Sakshi
Sakshi News home page

T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!

Published Tue, Oct 8 2024 2:45 PM | Last Updated on Tue, Oct 8 2024 3:05 PM

National Cricket League T10 2024 Robin Uthappa Smashes 66 off 27 Balls

నేషనల్‌ క్రికెట్‌ టీ10 లీగ్‌-2024లో టీమిండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  మొత్తంగా 27 బాల్స్‌ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్‌రేటు 244.44గా నమోదైంది.

చికాగో జట్టుకు కెప్టెన్‌గా
అమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్‌లో యాక్టివ్‌ క్రికెటర్లతో పాటు రిటైర్డ్‌ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు.  టైటిల్‌ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్‌లో రాబిన్‌ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్‌ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.

క్రిస్‌ లిన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌
ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్‌ లూయీస్‌ 10 బంతుల్లోనే 34 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.

 41 పరుగుల తేడాతో జయభేరి
లక్ష్య ఛేదనలో టెక్సాస్‌ గ్లాడియేటర్‌కు డేవిడ్‌ మలన్‌ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్‌ ఫుల్లర్‌ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వి​కెట్లు నష్టపోయి టెక్సాస్‌ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

అమెరికా నేషనల్‌ క్రికెట్‌ టీ10లీగ్‌లో ఆరుజట్లు
న్యూయార్క్‌ లయన్స్‌, టెక్సాస్‌ గ్లాడియేటర్స్‌, చికాగో సీసీ, డల్లాస్‌ లోన్‌స్టార్స్‌, లాస్‌ ఏంజెలిస్‌ వేవ్స్‌, అట్లాంటా కింగ్స్‌. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్‌ రైనా న్యూయార్క్‌కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్‌కు షాహిద్‌ ఆఫ్రిది, డల్లాస్‌కు దినేశ్‌ కార్తిక్‌, లాస్‌ ఏంజెలిస్‌కు షకీబ్‌ అల్‌ హసన్‌, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్‌ కెప్టెన్లుగా ఉన్నారు.

చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్‌?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement