
అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార్త ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. సోమవారం యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ ఇ.బోస్‌బర్గ్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ సర్కార్ పూచికపుల్లలాగా తీసిపక్కన పడేయడమే ఇందుకు ప్రధాన కారణం. వలసదారులను వెనిజులాకు చెందిన నేరాల గ్యాంగ్ సభ్యులుగా ఆరోపిస్తూ దేశ బహిష్కరణ (deportation) చేయడం సబబుకాదని జడ్జి బోస్‌బర్గ్ ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే.
ఎల్ సాల్వెడార్‌కు వలసదారులను విమానాల్లో తరలించడం తక్షణం ఆపేయాలని కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు. అయితే ఆ సమయానికే రెండు విమానాలు బయల్దేరాయని, గాల్లో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. అయితే విమానాలను వెంటనే వెనక్కి తిప్పాలని జడ్జి ఆదేశించారు. అయినాసరే ప్రభుత్వ న్యాయవాదులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం వెనుక ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యధోరణి దాగుందని తెలుస్తోంది. పైగా దేశ అధ్యక్షుడి నిర్ణయాన్ని కేవలం ఒక జిల్లా జడ్జి ప్రశ్నించేంత సాహసం చేస్తారా? అన్న దురహంకారం అధికారయంత్రాంగంలో ఎక్కువైందని వార్తలొచ్చాయి.
తానే సర్వశక్తివంతుడినంటున్న ట్రంప్
యుద్ధకాలంలో ప్రయోగించాల్సిన కఠిన చట్టాలు, నిబంధనలను శాంతికాలంలో ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు న్యాయనిపుణులు వాదిస్తున్నారు. అక్రమ వలసదారులను తరిమేసేందుకు ఏకంగా 18వ శతాబ్దంనాటి విదేశీ శత్రుచట్టాన్ని హఠాత్తుగా అమలుచేయాల్సిన పనేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను మాత్రమే అమెరికాను కాపాడగలనన్న విశ్వాసంతో రెండో దఫా భారీ మెజారిటీతో తనను ప్రజలు గెలిపించారన్న అతివిశ్వాసం ట్రంప్‌లో పెరిగిందని, అందుకే సర్వశక్తివంతుడినన్న ధీమాతో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. సొంత పార్టీలో తన వ్యతిరేకవర్గాన్ని పూర్తిగా అణిచేసి, విపక్ష డెమొక్రాట్ల చేతిలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వరంగంలోని ఏ విభాగం లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇదే ధోరణి ఆయన పాలనాయంత్రాంగంలోని సీనియర్ సభ్యుల్లోనూ కనిపిస్తోంది.
సోమవారం సీఎన్‌ఎన్ ‘కేసీ హంట్’ కార్యక్రమంలో శ్వేతసౌధం (White House) సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సైతం ట్రంప్‌లాగా మాట్లాడారు. ‘‘అమెరికాలోకి విదేశీయుల చొరబాట్లను అడ్డుకునే, వారిని తరిమేసే సర్వాధికారం అధ్యక్షుడికే ఉంటుంది. ఈ అంశాన్ని సమీక్షించే హక్కు కోర్టులకు లేదు. అందులోనూ ఒక జిల్లా జడ్జికి అస్సలు లేదు’’అని ఆయన అన్నారు.
ట్రంప్ సైతం జడ్జి బోస్‌బర్గ్‌ను తిడుతూ ‘ట్రూత్‌సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఆ జడ్జిని అభిశంసించాల్సిందే. ఆయన పెద్ద సమస్యగా తయారయ్యారు. నిరసకారుడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గత ఏ డాది ఎన్నికల్లో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో పాపులర్ ఓటు సాధించి నా నాయకత్వం, నా నిర్ణయం ఎంత సరైనవో నిరూపించుకున్నా. అధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతను సమీక్షించే అధికారం జడ్జి కంటే నాకే ఉందని తాజా ఎన్నికలు నిరూపించాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
జిల్లా జడ్జిని తిడుతూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ఒక పోస్ట్‌పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ మంగళవారం స్పందించారు. ‘‘గత రెండు శతాబ్దాల చరిత్రను గమనిస్తే కోర్టుల నిర్ణయాన్ని విబేధించేందుకు కార్యనిర్వాహణ వ్యవస్థ ‘అభిశంసన’ అనే విధానాన్ని ప్రయోగించడం ఎంతమాత్రం సబబు కాదు’’ అని వ్యాఖ్యానించారు.
చదవండి: పుతిన్.. ఎవరి మాటా వినని సీతయ్య!
జడ్జీలపై కన్నెర్ర
పాలక రిపబ్లికన్లు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పే జడ్జీలను సాగనంపాలని చూస్తున్నారు. బూస్‌బర్గ్‌కు వ్యతిరేకంగా అభిశంసన తెస్తే బాగుంటుందని ఇప్పటికే ఇద్దరు దిగువసభ రిపబ్లికన్ సభ్యులు వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు సంబంధించన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జీలు అమీర్ అలీ, పౌల్ ఈగల్ మేయర్‌లను అభిశంసించాలని దిగువసభలో గతంలో వ్యాఖ్యానించారు. 2019 జూలైలో అధ్యక్షుడిగా ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడిగా నాకేం కావాలన్నా నచ్చినట్లు చేసుకునే హక్కు రాజ్యాంగంలోని రెండో ఆర్టికల్ నాకు ప్రసాదించింది’’అని వ్యాఖ్యానించడం తెల్సిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment