
వాషింగ్టన్:ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను సాగనుంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి ట్రంప్(Trump) అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు న్యూయార్క్,న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాము పవిత్రంగా భావించే ప్రార్ధనా మందిరాల్లో అక్రమ వలసదారుల కోసం హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెతకడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతను ట్రంప్ చర్య దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.కాగా, ట్రంప్ యంత్రాంగం అమెరికాలో ఇప్పటివరకు వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది.
అరెస్టయిన వారంతా ఉగ్రవాదం,డ్రగ్స్,లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ(Deportation) ఆపరేషన్ చేపట్టారు.
ఇప్పటికే సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశామని వైట్‌హౌస్ వెల్లడించింది.మరోవైపు,అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని,ఎందుకంటే అది పలురకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్ స్పష్టం చేయడం గమనార్హం.