హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామంలోని కొన్ని కోళ్ల ఫారాలల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి కారక హెచ్5ఎన్1 వైరస్ నిర్దారణ కావడంతో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. కోళ్ల ఫారాల్లో పనిచేసే సిబ్బందితోపాటు కోళ్లను పూడ్చిపెట్టే పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ముందస్తుగా టామీ ఫ్లూ మాత్రలను అందిస్తున్నారు.
ఇందుకోసం 2,500 మాత్రలను రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సరఫరా చేశారు. వ్యాధి వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న తొర్రూరు పరిసర ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరిలోనూ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా ఉండేందుకు పెంపుడు జంతువులకు టీకాలు ఇప్పించాలని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.