
గుండ్రాంపల్లి, దోతిగూడెం, నేలపట్ల గ్రామాల్లో లక్షల కోళ్లు పూడ్చివేత
వేల కొద్ది గుడ్లు, టన్నుల కొద్ది ఫీడ్‌ను పూడ్చుతున్న అధికారులు
ఫారాల సమీపంలో మూడు కిలోమీటర్లు రెడ్ జోన్‌గా ప్రకటన
నల్లగొండ అగ్రికల్చర్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోది. వ్యాధి వ్యాప్తి పెరిగి లక్షలాది బ్రాయిలర్, లేయర్ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్‌ఫ్లూ సోకడంతో ఇప్పటికే భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం, చౌటుప్పల్ మండటం నేలపట్లలోని పలు పారాల్లోని వేలాది కోళ్లను అధికారులు పూడ్చి వేయించారు. ప్రస్తుతం చిట్యాల మండలం ఏపూరు సమీపంలోని కోళ్ల పారాల్లో వ్యాధి నిర్ధారణ కావడంతో కోళ్లను పూడ్చి వేయిస్తున్నారు. జిల్లా పశు వైద్య సంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమై బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల పారాలకు సమీప ప్రాంతాల్లో 3 కిలో మీటర్ల దూరం వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు. అక్కడి పరిసర ప్రాంతాలకు వ్యక్తులు, ఇతర వాహనాలు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
భోపాల్ ల్యాబ్‌లో తనిఖీలు..
చిట్యాల మండలం ఏపూరు సమీపంలోని కోళ్లఫారాల్లో పశు సంవర్థక శాఖ తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించగా కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అంచనాకు వచ్చారు. వాటి శాంపిళ్లను భోపాల్‌లోని నేషనల్ లెవెల్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్ సెంటర్‌కు పంపారు. ఫలితాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో జిల్లా పశు సంవర్థక శాఖ అప్రమత్తమైంది. ఇక్కడి కోళ్ల పారాల్లోని సుమారు 2 లక్షల లేయర్ కోళ్లతో పాటు వేలాది గుడ్లను, టన్నుల కొద్దీ పీడ్‌ను జేసీబీలతో గుంతలు తీయించి పూడ్చివేయిస్తున్నారు.
52 ఆర్‌ఆర్‌టీ బృందాలు ఏర్పాటు..
ఉమ్మడి జిల్లాలో బర్డ్‌ఫ్లూ ఉధృతి నేపథ్యంలో జిల్లా పశు సంవర్థక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (ఆర్‌ఆర్‌టీ) ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో డాక్టర్‌తో పాటు ఐదుగురు సిబ్బందిని నియమించింది. కోళ్ల శాంపిల్స్‌ను సేకరించేందుకు వీరందరికీ ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఎక్కడైనా బర్డ్‌ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే ఈ బృందాలు అక్కడికి వెళ్లి పీపీఈ కిట్లను ధరించి శాంపిల్స్ సేకరించి భోపాల్ ల్యాబ్‌కు పంపనున్నారు.
బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూస్తాం
చిట్యాల: బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. చిట్యాల మండలం ఏపూరు పరిధిలోని వీఎస్‌ఆర్ కోళ్ల ఫారాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఆనంతరం గుండ్రాంపల్లి గ్రామంలోని పశు వైద్యాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఏపూరు వీఎస్‌ఆర్ కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ రావటంతో సుమారు రెండు లక్షల కోళ్లను నిర్మూలించనున్నట్లు తెలిపారు.
మిగిలి ఉన్న కోళ్ల దాణా కాల్చివేయటంతో పాటు కోళ్లఫారాలను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని యజమానులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణకుగాను డివిజన్‌కు ఒక ప్రత్యేక పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేసి కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తున్నామన్నారు. బర్డ్‌ఫ్లూ సోకని చికెన్‌ను ఎలాంటి అనుమానాలు లేకుండా తీసుకోవచ్చునని సూచించారు. సమావేశంలో చిట్యాల, ఉరుమడ్ల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment