ఉదయం 11కే మటన్‌ మాయం! | Telangana: Mutton Price Reaches Rs 1000 Due To Bird Flu Effect | Sakshi
Sakshi News home page

ఉదయం 11కే మటన్‌ మాయం!

Published Mon, Feb 17 2025 6:17 AM | Last Updated on Mon, Feb 17 2025 6:17 AM

Telangana: Mutton Price Reaches Rs 1000 Due To Bird Flu Effect

ఒక్కసారిగా పెరిగిన మేక, గొర్రె మాంసం విక్రయాలు

కిలోకు రూ.1,000కి పైగా ధర వసూలు చేసిన దుకాణదారులు

బర్డ్‌ఫ్లూ, ఇతర వైరస్‌ల భయంతో చికెన్‌కు తగ్గిన డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌:  ఆదివారం ఉదయం... 11.30 గంటల సమయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన అరవింద్‌ మటన్‌ తీసుకురావడం కోసం బయల్దేరాడు.. తాను రెగ్యులర్‌గా వెళ్లే షాపు దగ్గరికి వెళ్లే సరికి మూసేసి ఉంది. దగ్గర్లోని మరో దుకాణానికి వెళితే బారెడంత క్యూ కనిపించింది. లేటవుతుందేమోనని మరో చోటికి వెళ్తే... మటన్‌ అయిపోయిందని చెప్పారు.

దీనితో వెనక్కి వచ్చి క్యూలో నిలబడి అయినా తీసుకెళదామనుకుంటే... తన వంతు కూడా రాకముందే మటన్‌ అయిపోయిందంటూ దుకాణం కట్టేయడం మొదలుపెట్టారు.. అరవింద్‌ ఒక్కడికే కాదు, ఉప్పల్‌ ఒక్క ప్రాంతంలోనే కాదు.. ఆదివారం హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. చెంగిచర్ల, జియాగూడ వంటి మటన్‌ మండీల్లోనూ మధ్యాహా్ననికే స్టాక్‌ ఖాళీ అయిపోయింది. మరోవైపు బర్డ్‌ ఫ్లూ, ఇతర వైరస్‌లతో కోళ్లు మృతిచెందుతున్నాయన్న వార్తలతో చికెన్‌ దుకాణాలు వెలవెలబోయాయి. 

ధర విపరీతంగా పెరిగినా.. 
ఇటీవలి కాలంలో మటన్‌ ధరలు కిలో రూ.800 నుంచి రూ.900 వరకు చేరాయి. అలాంటిది డిమాండ్‌ పెరిగిపోవడంతో.. ఆదివారం చాలా చోట్ల కిలో రూ.1,000 నుంచి రూ.1,100 వరకు ధరతో విక్రయించారు. అయినా సరే మటన్‌ షాపుల వద్ద జనం కిటకిటలాడారు. కిలో తీసుకునే చోట అరకిలో, అరకిలో తీసుకునే చోట పావుకిలోనో, 400 గ్రాములో కొనుక్కుని వెళ్లారు. 

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో.. 
సాధారణంగా మహారాష్ట్ర, రాజస్తాన్‌తోపాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు మేకలు, గొర్రెలు దిగుమతి అవుతాయి. అయితే బర్డ్‌ ఫ్లూ, ఇతర వైరస్‌ల ప్రభావం నేపథ్యంలో ఈ దిగుమతులు తగ్గిపోయాయి. వైరస్‌లు ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దన్న ఉద్దేశంతో మేకలు, గొర్రెల రవాణాను నియంత్రిస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి అరకొరగా గొర్రెలు, మేకలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో.. ధరలు పెరిగాయని మీరాలం మండిలోని మక్బూల్, జియాగూడ మండిలో మేకల వ్యాపారి రమేశ్‌ తెలిపారు.

చికెన్‌కు తగ్గిన డిమాండ్‌
బర్డ్‌ ఫ్లూ, ఇతర వైరస్‌లతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయన్న వార్తలతో చికెన్‌కు డిమాండ్‌ ఒక్కసారిగా తగ్గిపోయింది. సాధారణంగా ప్రతి ఆదివారం కిటకిటలాడే చికెన్‌ సెంటర్లు... ఈ ఆదివారం వెలవెలబోయాయి. వైరస్‌ భయం కారణంగా ఎందుకైనా మంచిదంటూ.. చికెన్‌కు బదులు మటన్‌ తీసుకెళ్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు. నిజానికి చికెన్‌ను 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణో గ్రత వద్ద బాగా ఉడికించి తింటే ఎటువంటి హానీ ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement