![Telangana Govt Warning Issued Over Chicken And Bird Flu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Telangana-Govt-Warning.jpg.webp?itok=ak8dF4Rd)
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకవద్దని నిర్వాహకులకు సూచిస్తూనే.. సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల దిగుమతులపై నిఘా పెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ భయంతో ఇప్పటికే చికెన్ అమ్మకాలు భారీ పడిపోయాయి. ఇదే సమయంలో చికెన్ రేట్లు కూడా తగ్గిపోయాయి. మరోవైపు.. ఏపీ నుంచి కోళ్లతో వస్తున్న వాహనాలను అధికారులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో పశుసంవర్ధకశాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ప్రారంభించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎనిమిది, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్ల వాహనాలను అడ్డుకుంటున్నారు.
![Bird Flu: కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం..](https://www.sakshi.com/s3fs-public/inline-images/km_1.jpg)
ఇదిలా ఉండగా.. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్లో 040-23314876 నంబర్ కాల్ చేయాలని సూచించారు. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే ఈ హెల్ప్ లైన్‌లకు సమాచారం ఇవ్వాలని జిల్లాల పశువైద్యాధికారులకు తెలిపారు.
ఇక, బర్డ్ ప్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో భారీ నష్టాలు వచ్చాయని ఆవేదన చెందుతున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/WhatsApp%20Image%202025-02-12%20at%2011.40.44.jpeg)
చెక్‌పోస్టులు ఇలా..
ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఏపీ వైపు నుంచి కోళ్లతో వస్తున్న డీసీఎంను వెనక్కి పంపినట్టు కోదాడ మండల పశువైద్యాధికారి మధు తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దుగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ–ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ కోళ్లు దిగుమతి కాకుండా అడ్డుకుంటున్నారు.
ఏపీ సరిహద్దుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు, పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.వెంకటనారాయణ, వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర, కందకుర్తిచెక్ పోస్టుల వద్ద పశుసంవర్థక, పోలీసు శాఖలు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నిజామాబాద్‌లోకి కోళ్లతో పాటు ఏ జీవాలను కూడా రవాణా చేయకుండా నిరోధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment