
రికార్డు స్థాయిలో కిలో రూ.వెయ్యి దాటిన వైనం
చేపలకూ డిమాండ్.. కిటకిటలాడిన మార్కెట్లు
రాష్ట్రంలో భారీగా కనిపించిన బర్డ్‌ఫ్లూ ప్రభావం
కిలో చికెన్ రూ.100కే ఇస్తామన్నా కొనేవారు కరువు.. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో మారుతున్న కూరల మెనూ
ధరల నియంత్రణపై దృష్టి సారించని ప్రభుత్వం
సాక్షి, అమరావతి: సహజంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు అందుబాటు ధరలో ఉండే చికెన్ (Chicken) కోసం షాపుల ముందు క్యూ కడతారు. కాస్త ఆలస్యమైనా వేచి చూస్తుంటారు. కానీ ఈ ఆదివారం ‘ముక్క’ లెక్క మారింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వదిలేసిన జనం మటన్ (Mutton), చేపల వైపు మొగ్గు చూపారు. దుకాణాల ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరారు. రాత్రి అవుతున్నా అదే కోలాహలం నెలకొంది. ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. కొద్ది వారాలుగా బర్డ్‌ఫ్లూ (Bird Flu) విస్తరిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కూటమి సర్కారు.. మటన్, చేపల ధరల నియంత్రణను సైతం గాలికి వదిలేసింది.
రెడ్‌జోన్లుగా ప్రకటించడంతో..
కోళ్లకు సోకిన బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రభావం మాంసం విక్రయాలపై భారీగా పడింది. తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ బయటపడటంతో అక్కడ కోళ్లను, కోడి గుడ్లను తినవద్దని హెచ్చరించిన అధికారులు ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చికెన్ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. దీంతో 15 రోజుల క్రితం రూ.220 పలికిన కిలో చికెన్ రూ.180కి పడిపోయింది. ఆదివారం కిలో చికెన్ రూ.150 నుంచి రూ.100కి అమ్మినా కొనేవారు కరువయ్యారు.
ప్రత్యామ్నాయంగా మటన్, చేపల కోసం మాంసం ప్రియులు ఎగబడుతున్నారు. మటన్, చేపల విక్రయాలు రెట్టింపు అయ్యాయి. ఆదివారం తెల్లవారగానే మాంసం ప్రియులు చేపలు, మటన్ మార్కెట్లకు పరుగులు దీశారు. అప్పటికే అక్కడ రద్దీగా ఉండటాన్ని చూసి ఉసూరుమన్నారు. మాంసం అమ్మకాలు ఉదయమే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈ ఆదివారం రాత్రి 9 గంటలైనా పొట్టేళ్లను కోశామని వ్యాపారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కోళ్ల విక్రయాలు మాత్రం భారీగా పడిపోయాయి.
ఇష్టానుసారం ధరలు..
కోళ్లను తినకూడదనే హెచ్చరికలతో చేపలు, మటన్ ధరలు అమాంతం ఎగబాకాయి. సాధారణంగా కిలో మటన్ రూ.800 – రూ.900 వరకు ఉండగా డిమాండ్ కారణంగా రూ.1,000 నుంచి రూ.1,100 వరకు పెరిగింది. కొందరు వ్యాపారులు మాత్రం రెట్టింపు అమ్మకాలు జరుగుతుండటంతో కేజీ మటన్ రూ.900కి ఇస్తున్నారు. కిలో చేపలు రాగండి రకం రూ.160 నుంచి రూ.180కి పెరిగాయి. బొచ్చెలు రూ.180 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. కొరమీను కేజీ రూ.650 నుంచి రూ.1,000 వరకూ పలుకుతోంది. రొయ్యలు, పీతలకు సైతం డిమాండ్ ఏర్పడింది. రొయ్యలు కిలో రూ.500 నుంచి రూ.700 వరకూ, పీతలు కేజీ రూ.400 నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు. రకాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి. అనకాపల్లిలో కేజీ మటన్ సాధారణంగా రూ.800–900 ఉండగా ఈ ఆదివారం రూ.1,000 వరకు పలికింది.
కూరగాయల రేట్లు సైతం..
హోటల్‌కి వెళితే చికెన్ బిర్యానీ, చికెన్ స్టార్టర్స్‌ను ఇష్టపడే వారంతా ఇప్పుడు మటన్‌తో పాటు చేపలు, పీతలు, రొయ్యల వంటకాలను అడుగుతున్నారు. వీధుల్లో బండ్ల మీద చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్స్, కబాబ్స్, ఫ్రైడ్ చికెన్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, షవర్మా లాంటి చికెన్ వంటకాల వ్యాపారాలన్నీ పడిపోయాయి. కర్రీ పాయింట్లు, మెస్‌లలో సైతం చికెన్ వంటకాల విక్రయాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ, ప్రైవేటు విద్యాసంస్థల హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లల్లో మెనూలో మార్పులు చేశారు. మాంసం పెట్టాల్సిన రోజు కూడా కాయగూరలతో వండినవే పెడుతున్నారు.
దీంతో కూరగాయల ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాలుగా బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతుండటంతో చికెన్‌కు దూరమైన వినియోగదారులు మటన్, చేపల వైపు మొగ్గు చూపుతారని తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ధరలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. బర్డ్ ఫ్లూను రాష్ట్రవ్యాప్తం చేసి కళ్లు మూసుకుని కూర్చుందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం వస్తే కనీసం 60 నుంచి 100 కోళ్ల విక్రయాలు జరిగేవి. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్మలేకపోతున్నాం. దీంతో ఈ వారం అసలు కోళ్లు తేవడమే మానేశాం. అయితే మటన్ బాగా కొంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 10 నుంచి 15 పొట్టేళ్ల మాంసాన్ని అమ్మేవాళ్లం. ఇప్పుడు అది రెట్టింపు అయ్యింది. రాత్రి అయినా ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి.
– సురేష్, మాంసం వ్యాపారి, బల్లెంవారి వీధి, విజయవాడ
చికెన్ తిందామంటే బర్డ్‌ఫ్లూ వచ్చిందని వద్దంటున్నారు. పోనీ చేపలుగానీ మటన్‌గానీ కొందామంటే వాటి రేట్లు అమాంతం పెంచేశారు. దుకాణాల వద్ద జనం భారీగా ఉంటున్నారు. చాలాసేపు వేచి ఉంటేగానీ మటన్ దొరకలేదు. ఒక్కో దుకాణంలో ఒక్కో విధంగా వసూలు చేస్తున్నారు.
– సూర్యారావు, వందడుగుల రోడ్డు, విజయవాడ.
Comments
Please login to add a commentAdd a comment