
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14,140
సాధారణ పరిపాలన శాఖలో 11,958
ఒక్కో ఫైలు క్లియర్‌కు సగటున జలవనరుల శాఖలో 50 రోజులు
సీఎస్ కార్యాలయంలో రెండు రోజులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో 38 సచివాలయ శాఖల్లో 1,32,395 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈ–ఆఫీస్‌లో ఫైళ్ల క్లియరెన్స్‌ను పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ తేల్చింది. ఇటీవల సీఎం వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో జరిపిన సమీక్షలో ఈ విషయం వెలుగుచూసింది. ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తరువాత సీఎం నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అత్యల్పంగా 42 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సగటున ఒక రోజు సమయం తీసుకుంటుండగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి సగటున రెండు రోజులు సమయం తీసుకుంటున్నాయి.
న్యాయ శాఖ సగటున మూడు రోజుల్లో ఒక ఫైలు క్లియర్ చేస్తుండగా, రెవెన్యూ శాఖలో సగటున ఒక ఫైలు క్లియర్‌కు ఐదు రోజులు సమయం పడుతోంది. సగటున ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి అత్యధికంగా జలవనరుల శాఖ 50 రోజులు సమయం తీసుకుంటుండగా, విపత్తుల శాఖ 47 రోజులు సమయం తీసుకుంటోంది. ఈ–ఆఫీస్ వచ్చిన తరువాత సాధారణంగా రొటీన్ ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేయవచ్చు. ఏమైనా ఆర్థిక, విధానపరమైన ఫైళ్లను క్లియర్ చేయడానికి మాత్రం సమయం పడుతుంది.
అయితే మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నా, అటువంటి ఫైళ్లను ఆ శాఖలు క్లియర్ చేయడం లేదు. సీఎం అభీష్టం మేరకు ఆయన కార్యాలయ అధికారులు సంబంధిత అంశాలకు చెందిన ఫైలును సర్క్యులేట్ చేయల్సిందిగా ఆయా శాఖలకు ఆదేశిస్తారు. అలాంటి ఫైళ్లు సంబంధిత అన్ని విభాగాల్లోను వెంటనే క్లియర్ అవుతూ ఉంటాయి. కానీ ప్రజలకు సంబంధించిన లేదా ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు అంత వేగంతో క్లియర్ కాకపోవడం గమనార్హం.

Comments
Please login to add a commentAdd a comment