pending files
-
హెచ్ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దళారులు, మధ్యవర్తులకు అడ్డాగా వరింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మధ్యేమార్గంలో అధికారులను సంప్రదించాల్సిందే. లేదంటే ఫైళ్లు పెండింగ్ జాబితాలో పడిపోతాయి. నెలల తరబడి పడిగాపులు కాసినా అనుమతులు లభించవు. భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులు తదితర అన్ని రకాల పనుల్లో దళారుల దందానే నడుస్తోంది. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసి టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినా సకాలంలో అనుమతులు లభించడం లేదు. దీంతో గత్యంతరం లేక మధ్యవర్తులను ఆశ్రయించాల్సివస్తోందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులకు వెళితే రకరకాల కొర్రీలు పెట్టి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందలాది ఫైళ్లు పెండింగ్ జాబితాలో చేరిపోతున్నాయి. ఈ క్రమంలో ‘మధ్యేమార్గంగా’ సంప్రదించి చేయి తడిపితే ఫైళ్లు చకచకా ముందుకు కదులుతున్నాయని భవన నిర్మాణదారులు, రియల్డర్లు చెబుతున్నారు. కొర్రీలు ఇలా.. ► హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో సవరించిన విధంగానే వెంచర్‌కు సన్నాహాలు చేసుకొని డాక్యుమెంట్లు సమర్పించినా ఏదో ఓ లోపాన్ని ఎత్తి చూపుతారు. రోడ్డు వెడల్పు తక్కువగా ఉందని, వెంచర్లో పార్కులు, గ్రీనరీ సూచించిన విధంగా లేదని అనుమతులను నిలిపివేస్తారు. ► నిబంధనలను అనుగుణంగా డాక్యుమెంట్లను అప్లోడ్ చేసినప్పటికీ ఏదో ఒకవిధంగా కాలయాపన చేస్తే సదరు నిర్మాణదారు నేరుగా కాని, మధ్యవర్తి ద్వారా కాని కలిసేలా ఒత్తిడి తెస్తారు. దీంతో లేఅవుట్ పర్మిషన్లు, భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. ► ఇలాంటి జాప్యానికే కారణమైన ముగ్గురు అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, ఓ తహసీల్దారుపై హెచ్ఎండీఏ కమిషనర్ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే వాళ్లు ఫైళ్లను పక్కన పెట్టినట్లు కమిషనర్ గుర్తించారు. రోజుకు 100కు పైగా ఫైళ్లు.. ► హెచ్ఎండీఏ పరిధిలోని శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్, మేడ్చల్ జోన్ల పరిధిలో రియల్ బూమ్ జోరుగా సాగుతోంది. ఇటు దుండిగల్, శంకర్పల్లి నుంచి అటు చౌటుప్పల్, భువనగిరి తదితర ప్రాంతాల వరకు లే అవుట్ పర్మిషన్ల కోసం రోజుకు 100కు పైగా ఆన్లైన్ దరఖాస్తులు వస్తున్నాయి. ► సాధారణంగా ఈ ఫైళ్లను పరిశీలించి నిబంధనల మేరకు ఫీజులు తీసుకొని అనుమతులు ఇచ్చేందుకు వారం రోజులు సరిపోతుంది. ఉద్దేశ్యపూర్వకంగా ఫైళ్లను పక్కన పెట్టడంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నట్లు రియల్టర్లు ఆరోపిస్తున్నారు. ► మధ్యేమార్గంగా అధికారులను ప్రసన్నం చేసుకుంటే మాత్రం క్షణాల్లో అనుమతులు వస్తాయి. ఇందుకోసం ఎకరానికి రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సివస్తోందని ఓ మధ్యవర్తి తెలిపారు. ‘పది ఎకరాల లోపు వెంచర్లైతే కిందిస్థాయి అధికారులతోనే పని పూర్తి చేసుకోవచ్చు. భారీ ప్రాజెక్టులకు మాత్రం ఉన్నతాధికారులను సంప్రదించాల్సి ఉంటుంది’ అని వివరించారు. పెరిగిన పని భారం... ► రియల్ ఎస్టేట్ బూమ్‌ను సొమ్ము చేసుకొనేందుకు కొందరు అధికారులు అక్రమాలకు తెర తీయడంతోనే కాకుండా ఒకరిద్దరు అధికారులపై పెరిగిన పని భారంతో కూడా ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ► శంకర్పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ జోన్లకు మూడింటికీ ఒక్క అధికారే ఉన్నారు. పైగా అదనపు బాధ్యతలు కూడా ఉండడంతో పని భారం పెరుగుతోంది. ల్యాండ్ సర్వేయరు సైతం ఒక్కరే ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో పనుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటున్నట్లు నిర్మాణదారులు, రియల్టర్లు చెబుతున్నారు. -
మోహన ‘తంత్రం’
- బదిలీపై వెళ్తూ చివరి రోజు పలు ఫైళ్లపై పూర్వ కలెక్టర్ సంతకం - ముగ్గురు తహసీల్దార్లకు స్థాన చలనం - అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చక్రం తిప్పిన ఓ అధికారులు - భారీగా ముడుపులు అందినట్లు విమర్శలు కర్నూలు(హాస్పిటల్): బదిలీపై వెళ్తూ జిల్లా పూర్వ కలెక్టర్ విజయమోహన్ పెండింగ్ ఫైళ్లకు మోక్షం కల్పించారు. ఇందులో ఏదో తంత్రం ఉన్నట్లు విమర్శలు వినిపించాయి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ఫైలు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంది. ఈ ఫైలుపై చివరి రోజున పూర్వ జిల్లా కలెక్టర్ విజయమోహన్ సంతకం చేశారు. ఇందులో జిల్లాకు చెందిన ఓ కీలక అధికారి ముఖ్యపాత్ర పోషించారు. జిల్లాలో మొత్తం 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 3,480 అంగన్వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు నాలుగు నెలల క్రితం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఎంపిక ఫైలును మాత్రం పక్కన పెట్టారు. పూర్వ జిల్లా కలెక్టర్ విజయమోహన్ బదిలీ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి ఈ ఫైలుకు మోక్షం లభించింది. మొత్తం 19 అంగన్వాడీ వర్కర్లు(ఆదోని–2, ఆలూరు–3, ఎమ్మిగనూరు–2, పత్తికొండ–3, కోడుమూరు–1, డోన్–3, ఆత్మకూరు–1, నందికొట్కూరు–1, ఆళ్లగడ్డ–1, కోయిలకుంట్ల–2)తో పాటు 132 అంగన్వాడీ హెల్పర్లు(ఆదోని రూరల్–11, ఆదోని అర్బన్–1, ఆలూరు–16, ఎమ్మిగనూరు–16, పత్తికొండ–8, కర్నూలు అర్బన్–9, కర్నూలు రూరల్–1, కోడుమూరు–13, డోన్–14, ఆత్మకూరు–2, నందికొట్కూరు–3, నంద్యాల రూరల్–4, నంద్యాల అర్బన్–2, ఆళ్లగడ్డ–7, బనగానపల్లి–16, కోయిలకుంట్ల–9) పోస్టులు భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక జాబితాను kurnool.ap.gov.inలో ఉంచారు. చక్రం తిప్పిన ఓ జిల్లా అధికారి అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో జిల్లాకు చెందిన, ఐసీడీఎస్‌కు సంబంధం లేని ఓ అధికారి చక్రం తిప్పినట్లు సమాచారం. ఆయనకు సంబంధం లేకపోయినా ఇతర శాఖ ఫైలును ఆయన తీసుకెళ్లి సంతకం చేయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనే స్వయంగా సదరు ఫైలును పూర్వ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించినట్లు కలెక్టరేట్లో చర్చ జరుగుతోంది. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైలుకు చివరిరోజున పూర్వ జిల్లా కలెక్టర్ సంతకం చేస్తూ భర్తీ చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఓ అధికారి కీలక పాత్ర పోషించి, అభ్యర్థుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుల భర్తీ విషయమై ఐసీడీఎస్ ఇన్‌ఛార్జి పీడీ అరుణను వివరణ కోరగా శుక్రవారం పూర్వ కలెక్టర్ విజయమోహన్ సంతకాలు చేసినట్లు తెలిపారు. ఫైలు ఎందుకు పెండింగ్‌లో ఉందన్న విషయం తనకు తెలియదని, తాను రెండు నెలల క్రితమే ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. ముగ్గురు తహసీల్దార్లకు స్థానచలనం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బదిలీపై పోతూ రెవెన్యూ శాఖలో ఈ బదిలీలు చేశారు. బదిలీ ఉత్తర్వులు ఆదివారం బయటికి వచ్చాయి. ఇదే తరహాలోనే వివిధ శాఖల్లోను బదిలీలు చేసినట్లు సమాచారం. కలెక్టర్ కార్యాలయంలో ఎఫ్ సెక్షన్ సూపరింటెంటుగా పనిచేస్తున్న తిరుపతిసాయిని బనగానపల్లె తహసీల్దారుగా బదిలీ చేశారు. బనగానపల్లె తహసీల్దారుగా ఉన్న అనురాధను ఆదోని ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారిగా నియమించారు. ఆదోని ఆర్డీఓ ఆఫీసు ఏఓ రామాంజనేయులును కలెక్టర్ కార్యాలయంలోని ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంటుగా నియమించారు. ఓర్వకల్లు డిప్యూటీ తహసీల్దారు శ్రీనాథ్‌కు ఇటీవలనే పదోన్నతి లభించింది. ఆయనను అక్కడే పూర్తి స్థాయి తహసీల్దారుగా నియమించారు. -
సీడీఎంఏ సర్వర్ డౌన్
నిలిచిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ 15 రోజులుగా మొరాయించిన సర్వర్ కాళ్లరిగేలా తిరుగుతున్న దరఖాస్తుదారులు పెండింగ్‌లో 1,700 ఫైళ్లు నెల్లూరుకు చెందిన పి.నాగరాజు తన కుమార్తె లక్ష్మీజ్యోతికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కె.హరీష్‌తో పెళ్లి చేశారు. వారు అక్కడే స్థిరపడ్డారు. గర్భం దాల్చిన లక్ష్మీజ్యోతి ఈ నెల 22వ తేదీన ప్రసవిస్తుందని వైద్యులు తెలిపారు. అమెరికా నిబంధనల ప్రకారం తల్లి జననధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్రమంలో లక్ష్మీజ్యోతి జనన ధ్రువీకరణ పత్రం కోసం నాగరాజు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశారు. వారం గడుస్తున్నా సర్టిఫికెట్ జారీ కాలేదు. అధికారులను సంప్రదిస్తే సర్వర్ డౌన్ అయిందని సమాధానమిస్తున్నారు. కాన్పు సమయానికి తల్లి జనన ధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే పుట్టేబిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కదని నాగరాజు కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క నాగరాజే కాదు నెల్లూరుకు చెందిన పలువురు సకాలంలో జనన ధ్రువీకరణ పత్రాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు, సిటీ: సీడీఎంఏ సర్వర్ మొరాయించడంతో నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. నెల్లూరు నగర పరిధిలో సుమారు 200 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో ఏ ఆస్పత్రిలో పుట్టిన, చనిపోయిన వారికైనా కార్పొరేషన్ కార్యాలయం ద్వారానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతుంటాయి. నిర్దేశిత పత్రాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల వ్యవధిలో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ క్రమంలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం రోజూ 100 నుంచి 120 దరఖాస్తులు, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం 20 నుంచి 50 దరఖాస్తులు వస్తుంటాయి. మరోవైపు వివిధ రకాల తప్పుల సవరణ కోసం సుమారు 50 మంది వరకు దర ఖాస్తు చేసుకుంటుంటారు. నిలిచిన సేవలు నెల్లూరులోని అన్ని హాస్పిటళ్ల పరిధిలో 14 మంది బీడీఆర్లు(బర్త్ అండ్ డెత్ రికార్డు అసిసెంట్లు) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ద్వారా ఆస్పత్రుల రికార్డులు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుతుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని ఆన్లైన్ చేస్తుంటారు. మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత ధ్రువపత్రాలు జారీ చేసేవారు. అయితే 15 రోజులుగా సర్వర్ మొరాయించింది. రెండు రోజుల క్రితం కాసేపు పనిచేసినా కాసేపటికే మళ్లీ ఆగిపోయింది. ఈ క్రమంలో దరఖాస్తుదారులు రోజూ మీసేవ కేంద్రాలు, కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉద్యోగులు మాత్రం తమ చేతిలో ఏమి లేదని, రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య ఉందని చెబుతున్నారు. సర్టిఫికెట్లు అత్యవసరమైన వారు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 1,700 ఫైళ్లు కార్యాలయంలో అపరిష్కృతంగా పేరుకుపోయాయి. ఫాస్ట్ అంటే ఇదేనా.. మున్సిపల్ శాఖలో ఆన్లైన్ విధానం అమలులోకి తెచ్చామని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే పనులు సకాలంలో చేయించుకోవచ్చని ఆ శాఖ మంత్రి పి.నారాయణ తరచూ గొప్పలు చెబుతుంటారు. సాక్షాత్తు ఆయన సొంత జిల్లాలోనే పక్షం రోజులుగా సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో ఆన్లైన్ అంటే ఇదేనా..అని ప్రజలు మండిపడుతున్నారు. పరిస్థితి చక్కదిద్ది సేవలను సకాలంలో అందించాలని సూచిస్తున్నారు. సర్వర్ మొరాయించింది: వెంకటరమణ, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన సర్వర్ పనిచేయని విషయం నిజమే. సర్వర్ పనిచేస్తే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేస్తాం. -
ఈ-పాలన అమలు అంతంతే!
► పూర్తిస్థాయిలో అమలు కాని వైనం ► కలెక్టరేట్ తప్ప మిగిలిన శాఖల్లో మొక్కుబడే ► నెలలో జిల్లా స్థాయి ఈ- ఫైళ్లు 1,910 అనంతపురం అర్బన్ : జిల్లాలో మొదటి దశలో పది ప్రభుత్వ శాఖలో ఈ-పాలన (ఈ-ఆఫీస్)కు గత నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తెచ్చారు. అయితే ఈ- పాలన అంతంత మాత్రంగానే అమలవుతోంది. కలెక్టర్ కార్యాలయం మినహా మిగిలిన తొమ్మిది శాఖల్లో తూతూ మంత్రంగా నిర్వహిస్తునట్టు తెలుస్తోంది. తొలి దశ పరిస్థితే ఇలా ఉంటే, ఇక రెండవ దశ కింద 92 శాఖల్లో ఈ- పాలన ఏ మేరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. నెల రోజుల్లో 1,910 ఫైళ్లే తొలిదశలో రెవెన్యూ. డ్వామా, డీఆర్డీఏ, మునిసిపల్ కార్పొరేషన్, జిల్లా సరఫరాలు, జిల్లా పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఖజానా శాఖలలో ఈ-పాలన అమలు ప్రారంభించారు. వీటిలో వంద శాతం ఫైళ్లు ఈ- పాలన ద్వారానే సాగాలని కచ్చితమైన ఆదేశాలిచ్చారు. అయితే ఈ- పాలన ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. కలెక్టర్ కార్యాలయంలో పర్వాలేదన్న రీతిలో అమలవుతున్నా, మిగిలిన తొమ్మిది శాఖల్లో మొక్కుబడి తంతే అయ్యింది. నెల రోజు వ్యవధిలో జిల్లా స్థాయికి సంబంధించిన పదిశాఖల పరిధిలో 1,910 ఫైళ్లు, రాష్ట్ర స్థాయికి సంబంధించి 1,124 ఫైళ్లు ఈ- పాలన ద్వారా సాగాయి. ఆరంభశూరత్వం.. ప్రతి రోజు ఈ- పాలన అంశంపై ఏకధాటిగా సమీక్షలు నిర్వహించారు. వంద శాతం అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఒక్క ఫైలు కూడా మాన్యువల్‌గా జరగకూడదని చెప్పారు. అయితే ఇది ఆరంభ శూరత్వమే అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ-పాలనపై సమీక్షలు మచ్చుకు కనిపించడం లేదు. ఈ- పాలన ఇలా... ఇక ఫైళ్ల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ప్రజలు ఏదేని సమస్యపై అర్జీ ఇచ్చినప్పుడు టపాలాలో దాన్ని స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా సంబంధిత విభాగం గుమస్తాకి పంపిస్తారు. దాన్ని ఆ గుమస్తా పరిశీలించి నోట్ ఫైల్ (ముసాయిదా లేఖ) లేదా ఉత్తర్వులు సిద్ధం చేసి ఆన్లైన్లో ఉంచుతారు. సీఎం డాష్ బోర్డులో... ప్రతి ఫైలు వివరం సీఎం డాష్‌బోర్డులో ఉంటుంది. దీన్ని నేరుగా కలెక్టర్ ఆ తరువాత నోడల్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తారు. ఫైలు ఎప్పుడు ఉంచారు. ఏన్ని రోజుల్లో క్లియర్ చేశారు. ఒక వేళ పరిష్కారం కాకపోయినా, జాప్యం చేసినా అది ఏ స్థాయిలో జరిగిందో కూడా తెలిసిపోతుంది. దీంతో అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారు. -
పెండింగ్ ఫైల్స్‌పై స్పెషల్ డ్రైవ్
► ప్రతి ఉద్యోగి ఐదు ఫైళ్లు పరిష్కరించాలి ► జూన్‌లోపు గత ఏడాది ఫైళ్లు పరిష్కారం కావాలి ► అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ ఒంగోలు: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో పెండింగ్ ఫైళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్లో చాలాకాలంగా 12 వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. పెండింగ్ ఫైళ్లను శాఖల వారీగా, సంవత్సరాల వారీగా విభజించారన్నారు. కలెక్టరేట్లోని అన్ని సెక్షన్లకు చెందిన ప్రతి ఉద్యోగి కనీసం ఐదు ఫైళ్లు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన ఫైళ్లను ఈ ఏడాది జూన్‌లో పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో మీకోసంలో వచ్చిన అర్జీలను ఏవిధంగా పరిష్కరించినా ఒకే ఆప్షన్ ఉండటంతో విజయవంతంగా పరిష్కరించినట్లు సంబంధిత అర్జీదారునికి సమాచారం వెళ్లేదన్నారు. ఇప్పటి వరకు మీకోసం ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో 7,198 అర్జీలు గడువు దాటినవి ఉన్నాయని, డీవో లేఖ ద్వారా పరిష్కరించమని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. పరిశ్రమల శాఖకు సంబంధించి 1308 అర్జీలు, గనుల శాఖకు 979, రెవెన్యూ శాఖకు 890 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం మీకోసంకు సంబంధించి ఉన్నత స్థాయి ప్రతినిధులతో మాట్లాడి దాని సాఫ్ట్‌వేర్‌ను మార్పించినట్లు తెలిపారు. ఇకపై ఎవరు అర్జీ అయినా పరిష్కరించారా, పెండింగ్‌లో ఉందా, తిరస్కరించారా, ఎవరికి పంపారనే విషయమై స్పష్టమైన సమాచారం సంబంధిత అర్జీదారునికి పంపిస్తామని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో పెండింగ్ ఫైళ్లు ఉంచొద్దు:కలెక్టర్
ఖమ్మం జెడ్పీసెంటర్: కలెక్టరేట్లో పెండింగ్ ఫైళ్లు ఉంచొద్దని అధికారులను కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఆదేశించారు. ఆయన శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఆయువుపట్టరుున కలెక్టరేట్లోనే ఫైల్స్ ఆగితే పాలన కుంటుపడుతుందన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి ఫైలును వెంటనే క్లియర్ చేయూలన్నారు. సమస్యాత్మక ఫైల్స్‌కు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలన్నారు. వారంలో రెండు సార్లు సమావేశం నిర్వహిస్తానని, పెండింగ్ ఫైల్ కనిపించవద్దని అన్నారు. ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలన కోసం ఐటీడీఏకి పంపాలన్నారు. ఏ ఫైల్ ఎక్కడుంది... ఎక్కడాగింది అనే విషయం తెలుసుకునేందుకు స్పెషల్ సాఫ్ట్వేర్ రూపొందించి వెంటనే అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మస్తాన్‌రావు, చంద్రశేఖర్, మదన్‌గోపాల్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ ఫైళ్లు
అనుమతులకోసం దుర్గగుడి అధికారుల ఎదురుచూపులు కీలక నిర్ణయాల్లోనూ జాప్యం భక్తులకు తప్పని ఇబ్బందులు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం తీరిదీ సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన ప్రతి ఫైలూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గడప దాటడం లేదు. గుడికి సంబంధించి పదుల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో దేవాదాయ శాఖ విభజన తదితర కారణాలవల్ల ఏడాదిన్నర కాలంగా ఫైళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. కీలక ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో దేవస్థానానికి ఆదాయం నష్టపోవడమే కాకుండా ఉద్యోగులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాదాయ శాఖ విభజన పూర్తయితే తప్ప ఫైళ్లు కదిలే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దేవస్థానానికి అత్యవసరం అనుకున్న ఫైళ్లను అధికారులు వ్యక్తిగతంగాా తీసుకువెళ్లి హైదరాబాద్‌లోనే నాలుగైదు రోజులు ఉండి, అక్కడ పనిచేసే కిందిస్థాయి సిబ్బందిని సంతృప్తిపరిస్తే చకచకా క్లియర్ అవుతాయని తెలిసింది. సిబ్బంది పదోన్నతులు, ఇంక్రిమెంట్ ఫైళ్లు ఈ విధంగానే సాగుతున్నాయని అంటున్నారు. గుడిబాట నిర్వహిస్తే.. గతంలో సుందరకుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు.. కమిషనర్ కార్యాలయ సిబ్బందిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఫైళ్లు పరిశీలించి క్లియర్ చేశారు. ప్రాధాన్యత లేని ఫైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల నగరానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. దేవాలయాల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో గుడిబాట లేదా దేవాదాయశాఖ మేళా వంటి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. కమిషనర్ కార్యాలయం కేవలం అనుమతులు ఇస్తే సరిపోతుందని, నిధులను దేవస్థానం సొంత ఆదాయం నుంచే సమకూర్చుకుంటుదని అధికారులు చెబుతున్నారు. -
మంత్రాలయ మూగబోయింది..
సాక్షి, ముంబై: నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే విజిటర్లతో కిటకిటలాడే మంత్రాలయ భవనం ఎన్నికల పుణ్యమా అని బోసిపోయి కనిపిస్తోంది. మంత్రులు తమతమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలు, రోడ్ షోలు తదితర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మంత్రాలయలో పనిచేసే అనేక మంది సిబ్బంది ఎన్నికల పనులకు వెళ్లిపోయారు. దీంతో క్లర్క్‌లు, ప్యూన్లు, చిన్న చితక ఉద్యోగులు మాత్రమే దర్శనమిస్తున్నారు. వీరివల్ల ఎలాంటి పనులు జరగకపోవడంతో ప్రజలు మంత్రాలయ ఛాయలకు రావడం మానుకున్నారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌లో బదిలీలు, పాఠశాలల అడ్మిషన్ల కోసం పైరవీలు, వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే విజిటర్ల తాకిడి ఎక్కువ శాతం ఉంటుంది. కాని ఎన్నికల కారణంగా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మంత్రులు, వారి కార్యదర్శులు, సంబంధిత అధికారులు మంత్రాలయ ఛాయలకు రాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో పెండింగు ఫైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌తోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైంది. మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత ఉన్నతాధికారులు లేకపోవడంతో వారి కింద పనిచేసే ఉద్యోగులు కూడా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సెలవులపై వెళుతున్నారు. దీంతో వివిధ పనుల నిమిత్తం గంపెడాశతో మంత్రాలయకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఈ పరిస్థితి లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే శాసన సభ ఎన్నికల తంతు పూర్తయ్యేంత వరకు తప్పదేమోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు రాకపోవడంతో విజిటర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో మంత్రాలయ ప్రవేశ ద్వారాల వద్ద వాహనాలను తనిఖీకి ఏర్పాటుచేసిన భద్రతా సిబ్బందిని సైతం తగ్గించారు. -
ఎక్కడికక్కడ ఆగిపోయిన ప్రభుత్వ ఫైళ్లు
-
వెక్కిరిస్తున్న ‘రెవెన్యూ’ ఖాళీలు
=పదోన్నతుల జాబితా సిద్ధంగా ఉన్నా పట్టని ఉన్నతాధికారులు =డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు =నత్తనడకన పంటల పరిహారం, ఓటర్ల జాబితా సవరణ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా రెవెన్యూ శాఖలోని కీలక విభాగాల్లో కొంత కాలంగా పైళ్ల కదలిక మందగించింది. వివిధ కార్యాలయాలు, విభాగాల నుంచి ఉన్నతాధికారుల ఆమోదం కోసం కలెక్టరేట్‌కు వెళ్లిన ఫైల్ ఎన్నాళ్లకు తిరిగొస్తుందో తెలియని అయోమయస్థితి నెలకొంది. ఉద్యోగులకు సంబందించిన విషయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బంది అధికారులకు సరైన సమాచారం ఇవ్వడం లేదా... నిర్ణయం తీసుకునే విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారా అనేది తెలియరావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే పలు నిర్ణయాల వల్ల ఫైళ్ల కదలికలో ఏర్పడుతున్న జాప్యం పరిపాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లా అధికారుల చేతుల్లోనే ఉన్నా... జిల్లాలో సుమారు 20 మంది తహసీల్దార్లకు ఇటీవల స్థానచలనం కల్పించారు. వీరిలో సుమారు ఎనిమిది వరకు అఫీషియోటింగ్ ద్వారా తహసీల్దార్లుగా వెళ్లారు. అంటే ఒకచోట డిప్యూటీ తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న వారిని అవసరాలు, ఉద్యోగుల సామర్థ్యాన్ని బట్టి తహసీల్దార్లుగా అవకాశం కల్పించారు. ఇలా డీటీలు తహసీల్దార్లుగా వెళ్లడంతో దాదాపు 12 వరకు డీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈక్రమంలో సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించి డీటీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సీసీఎల్ఏ నుంచి వచ్చే ప్రో డీటీలతో కొన్ని భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండో దానికి ఎలాగూ ఇప్పట్లో అవకాశం లేదు కనక.. అర్హులైన సీనియర్లకు డీటీలుగా పదోన్నతి ఇవ్వడం మాత్రమే చేయాల్సి ఉంటుంది. పరిపాలనాపరంగా సమస్యలు తీరాలంటే చేయాల్సిన ఈ పని జిల్లా అధికారుల పరిధిలోనే ఉంటుంది. అధికారులు తలుచుకుంటే సిద్ధంగానే ఉన్న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు పరిశీలించడం, ఆ తర్వాత తుది జాబితాకు ఆమోదం తెలిపి పోస్టింగ్ ఇవ్వడం... ఒకదాని వెంట ఒకటి జరిపోగాయి. కానీ జిల్లాలో మాత్రం నెలల తరబడి ఇందుకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం వల్ల సహజంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికప్పుడు అధికారులు పదోన్నతుల ఫైల్ కదిపితే కనీసం ఎనిమిది నుంచి పది మంది సీనియర్ సహాయకులకు డీటీలుగా పదోన్నతి వచ్చే అవకాశముం డగా, ఆ వెంటనే ఖాళీలు కూడా భర్తీ అవుతాయి. కానీ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో డీటీల ఖాళీలు డీటీల పదోన్నతులు, తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక ఆత్మకూరు, ధర్మసాగర్, గీసుకొండ, పరకాల, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడ, ఏటూరునాగారం(సీఎస్), వరంగల్(సీఎస్) వంటి చోట్ల సూపరింటెండెంట్, ఎన్నికల డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్సారెస్పీ, తాడ్వాయిలో కూడా డీటీ పోస్టులు ఖాళీగా ఉండగా, ఎస్డీసీ ఏటూరునాగారం వంటి చోట్ల డీటీలు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. అయితే, ఇందులో తాడ్వాయి డీటీగా చెన్నయ్యను ఇటీవలే నియమించారు. మేడారం జాతర ముంచుకొస్తున్న సమయంలో విమర్శలు వస్తాయనే ఈ పోస్టును భర్తీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, మరికొందరు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి ఆర్జీలను పరిగణనలోకి తీసుకుంటారా, లేదా అన్నది ఉన్నతాధికారుల విస్తృత అధికారాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ పరిపాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డీటీ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కీలక సమయంలో... ప్రస్తుతం ఒకవైపు రైతులు పంట నష్టానికి సంబంధించి పరిహారం ఖరారు, చెల్లింపుతో పాటు ధాన్యం సేకరణ పనులు జరుగుతుండగా, ఓటర్ల జాబితా సవరణ కీలక దశకు చేరింది. ఈ పనులన్నీ చూడాల్సిన రెవెన్యూ శాఖలో.. అందునా నియోజకవర్గ కేంద్రాలైన పరకాల, జనగామ వంటి చోట్ల కూడా పోస్టులు భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తహసీల్దార్ల బదిలీలకు మూడుసార్లు ఉత్తర్వులు ఒకవైపు జిల్లాలో డీటీల బదిలీలు, సీనియర్ సహాయకుల పదోన్నతులకు సంబంధించి ఫైల్ ఉన్నతాధికారుల వద్ద మూలుగుతుండగా.. తహసీల్దార్లకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వులు అందుకున్న వారు విధుల్లో చేరి పాతబడిపోయారు. మరో రెండు నెలల్లో ఎన్నికల నిబంధనల వల్ల తహసీల్దార్లు పక్క జిల్లాలకు బదిలీ వెళ్లే అవకాశముంది. దీన్ని గుర్తించి డీటీల పోస్టుల భర్తీపై వెంటనే దృష్టి సారించకపోతే.. రెవెన్యూ కార్యాలయాల్లో దిక్కు లేనివిగా మారే ప్రమాదముంది. -
ఎక్కడి ఫైళ్లు అక్కడే!
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాల యంలో చాలా ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోవటం వివాదాలకు కారణమవుతోంది. డీఎంహెచ్ఓ డాక్టర్ గీతాంజలి వ్యవహార శైలిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్‌లు, కారుణ్య నిమాయకాలకు సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని, అయినా ఆమె పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. దీంతో కార్యాలయంలో పరిస్థితి చినుకు చినికి గాలివానలా తయరయ్యేలా ఉంది. జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేసిన బహుదుర్ దాదాపు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతర ప్రయోజనాలను కుటుంబ సభ్యులకు ఇంతవరకు చెల్లించలేదు. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడికి ఉద్యోగమూ ఇవ్వలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లా కేంద్రంలో పనిచేసినవారి పరిస్థితే ఇలా ఉంటే పీహెచ్‌సీల్లో పనిచేసే వారి దుస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని ఉద్యోగులు అంటున్నారు. అస్మదీయులకు పెద్దపీట నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించని డీఎంహెచ్ఓ, తన వెనుక తిరుగుతున్నవారి పనులను మాత్రం త్వరిత గతిన పూర్తి చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సొమ్ము ఇస్తే గాని సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతి కోసం ఓ ఉద్యోగి రూ.40 వేలు ఇచ్చినా ఇంకా పనిచేసి పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి ఇవ్వటానికి కూడా డబ్బు అడిగారని, సొమ్ము ఇచ్చినా పని చేయలేదని ఆ ఉద్యోగి వాపోతున్నట్టు సమాచారం. యూనియన్ నేత ఒకరు నిత్యం డీఎంహెచ్ఓ పక్కనే ఉంటూ తమవారి పనులను చక్కబెట్టుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పీహెచ్సీలో పనిచేస్తున్న ఆయన అక్కడి విధులను విస్మరించి డీఎంహెచ్ఓ పనులు చేసిపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని చెబుతున్నారు. -
కార్యాలయాలకు కళ
=పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులు =పెండింగ్ ఫైళ్లపై దృష్టి =వారంలోగా పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి. ఉద్యోగులతో సందడిగా మారాయి. 66 రోజులపాటు ప్రభుత్వోద్యోగులు చేపట్టిన సమ్మె ముగియడంతో శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తెరుచుకున్నాయి. ఉదయం నుంచే దాదాపు 63 ప్రభుత్వశాఖల్లో పనులు ప్రారంభమయ్యాయి. అపరిష్కృతంగా ఉన్న అనేక పనులకు సంబంధించిన ఫైళ్లు చకచకా కదిలాయి. మరోపక్క అన్ని శాఖల్లో కలిపి వేలాదిగా పేరుకుపోయిన ఫైళ్లను వారంలోగా పరిష్కరించడానికి జిల్లా అధికారులు నడుంకట్టారు. ఉదయమే పెండింగ్ ఫైళ్లపై సమీక్ష జరిపి వారంలోగా పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. మరోపక్క చాన్నాళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, బిల్లుల మంజూరు వంటి వాటికి సంబంధించిన పనులు మళ్లీ ఊపందుకున్నాయి. సర్కారుకు ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులశాఖ, ట్రెజరీ, ఎక్సయిజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు పోటెత్తాయి. వారంలోగా పరిష్కారం: జిల్లాలో అరవైకి పైగా ఉన్న వివిధ శాఖల్లో ఉద్యమం కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఫైళ్లు, ప్రతిపాదనలు ఉన్నచోటనే నిలిచిపోయాయి. ఇప్పుడు సమ్మె విరమించడంతో అన్ని జిల్లా శాఖల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారు. దీంతో పేరుకుపోయిన ఫైళ్ల ను పరిష్కరించడంపై ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిం చారు. రెవెన్యూ, పరిశ్రమల శాఖ, పౌరసరఫరాల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సయిజ్, అటవీ, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి పలు కీలక శాఖల ఉన్నతాధికారులు ఉదయమే సిబ్బందితో సమావేశమయ్యారు. అన్ని పెండింగ్ ఫైళ్లను వా రంలోగా పరిష్కరించాలని ఆదేశాలి చ్చారు. పేరుకుపోయినవాటిలో ము ఖ్యమైన వాటి ప్రాతిపదికన వేగంగా పరిష్కరించాలని సూచించారు. మరోపక్క జిల్లాకు రావలసి ఉన్న రూ.3 కోట్ల అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధి పథకం నిధులు, పంచాయతీలకు మంజూరు కావలసిన ప్రత్యేక నిధులు, జిల్లా పరిషత్‌కు రావలసిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపడానికి ఫైళ్లకు బూజు దులిపారు. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ విభాగంలో జిల్లాలో పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన కొత్తచట్టం రూపకల్పన పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టడానికి వీలుగా కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన ఫైళ్లపై పౌరసరఫరాలశాఖ వేగం పెంచింది. పేదలకు భూ పంపిణీ పథకంలో భాగంగా జిల్లాలో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను రెవెన్యూ శాఖ ప్రారంభించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చాలాచోట్ల ప్రజలు పోటెత్తారు. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ భారీగా జరిగింది. దీని వల్ల శుక్రవారం ఒక్కరోజే ఈ శాఖకు రూ. 25 కోట్ల మేరకు ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేశారు. జిల్లా ట్రెజరీ విభాగంలో సుమారుగా రూ.52 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని అంచనా. జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. రెండు నెలలుగా వర్షపాతం వివరాలు లేకపోవడంతో తక్షణం సమాచారం రప్పించే వీలుగా అధికారులు పనులు మొదలుపెట్టారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు చాలావరకు పనులు చేపట్టారు. కానీ వీటికి సంబంధించి బిల్లులు సమైక్య ఉద్యమం కారణంగా నిలిచిపోయాయి.దీంతో కాంట్రాక్టర్లు ఉదయమే ఆయా శాఖలకు చేరుకుని బిల్లుల మంజూరు కోసం క్యూ కట్టారు.