సీడీఎంఏ సర్వర్ డౌన్
-
నిలిచిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ
-
15 రోజులుగా మొరాయించిన సర్వర్
-
కాళ్లరిగేలా తిరుగుతున్న దరఖాస్తుదారులు
-
పెండింగ్‌లో 1,700 ఫైళ్లు
నెల్లూరుకు చెందిన పి.నాగరాజు తన కుమార్తె లక్ష్మీజ్యోతికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కె.హరీష్‌తో పెళ్లి చేశారు. వారు అక్కడే స్థిరపడ్డారు. గర్భం దాల్చిన లక్ష్మీజ్యోతి ఈ నెల 22వ తేదీన ప్రసవిస్తుందని వైద్యులు తెలిపారు. అమెరికా నిబంధనల ప్రకారం తల్లి జననధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్రమంలో లక్ష్మీజ్యోతి జనన ధ్రువీకరణ పత్రం కోసం నాగరాజు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశారు. వారం గడుస్తున్నా సర్టిఫికెట్ జారీ కాలేదు. అధికారులను సంప్రదిస్తే సర్వర్ డౌన్ అయిందని సమాధానమిస్తున్నారు. కాన్పు సమయానికి తల్లి జనన ధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే పుట్టేబిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కదని నాగరాజు కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క నాగరాజే కాదు నెల్లూరుకు చెందిన పలువురు సకాలంలో జనన ధ్రువీకరణ పత్రాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెల్లూరు, సిటీ: సీడీఎంఏ సర్వర్ మొరాయించడంతో నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. నెల్లూరు నగర పరిధిలో సుమారు 200 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో ఏ ఆస్పత్రిలో పుట్టిన, చనిపోయిన వారికైనా కార్పొరేషన్ కార్యాలయం ద్వారానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతుంటాయి. నిర్దేశిత పత్రాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల వ్యవధిలో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ క్రమంలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం రోజూ 100 నుంచి 120 దరఖాస్తులు, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం 20 నుంచి 50 దరఖాస్తులు వస్తుంటాయి. మరోవైపు వివిధ రకాల తప్పుల సవరణ కోసం సుమారు 50 మంది వరకు దర ఖాస్తు చేసుకుంటుంటారు.
నిలిచిన సేవలు
నెల్లూరులోని అన్ని హాస్పిటళ్ల పరిధిలో 14 మంది బీడీఆర్‌లు(బర్త్ అండ్ డెత్ రికార్డు అసిసెంట్లు) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ద్వారా ఆస్పత్రుల రికార్డులు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుతుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని ఆన్‌లైన్ చేస్తుంటారు. మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత ధ్రువపత్రాలు జారీ చేసేవారు. అయితే 15 రోజులుగా సర్వర్ మొరాయించింది. రెండు రోజుల క్రితం కాసేపు పనిచేసినా కాసేపటికే మళ్లీ ఆగిపోయింది. ఈ క్రమంలో దరఖాస్తుదారులు రోజూ మీసేవ కేంద్రాలు, కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉద్యోగులు మాత్రం తమ చేతిలో ఏమి లేదని, రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య ఉందని చెబుతున్నారు. సర్టిఫికెట్లు అత్యవసరమైన వారు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 1,700 ఫైళ్లు కార్యాలయంలో అపరిష్కృతంగా పేరుకుపోయాయి.
ఫాస్ట్ అంటే ఇదేనా..
మున్సిపల్ శాఖలో ఆన్‌లైన్ విధానం అమలులోకి తెచ్చామని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే పనులు సకాలంలో చేయించుకోవచ్చని ఆ శాఖ మంత్రి పి.నారాయణ తరచూ గొప్పలు చెబుతుంటారు. సాక్షాత్తు ఆయన సొంత జిల్లాలోనే పక్షం రోజులుగా సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో ఆన్‌లైన్ అంటే ఇదేనా..అని ప్రజలు మండిపడుతున్నారు. పరిస్థితి చక్కదిద్ది సేవలను సకాలంలో అందించాలని సూచిస్తున్నారు.
సర్వర్ మొరాయించింది: వెంకటరమణ, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన సర్వర్ పనిచేయని విషయం నిజమే. సర్వర్ పనిచేస్తే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేస్తాం.