మోహన ‘తంత్రం’
మోహన ‘తంత్రం’
Published Sun, Apr 23 2017 11:09 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- బదిలీపై వెళ్తూ చివరి రోజు
పలు ఫైళ్లపై పూర్వ కలెక్టర్ సంతకం
- ముగ్గురు తహసీల్దార్లకు స్థాన చలనం
- అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- చక్రం తిప్పిన ఓ అధికారులు
- భారీగా ముడుపులు అందినట్లు విమర్శలు
కర్నూలు(హాస్పిటల్): బదిలీపై వెళ్తూ జిల్లా పూర్వ కలెక్టర్ విజయమోహన్ పెండింగ్ ఫైళ్లకు మోక్షం కల్పించారు. ఇందులో ఏదో తంత్రం ఉన్నట్లు విమర్శలు వినిపించాయి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ఫైలు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంది. ఈ ఫైలుపై చివరి రోజున పూర్వ జిల్లా కలెక్టర్ విజయమోహన్ సంతకం చేశారు. ఇందులో జిల్లాకు చెందిన ఓ కీలక అధికారి ముఖ్యపాత్ర పోషించారు. జిల్లాలో మొత్తం 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 3,480 అంగన్‌వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు నాలుగు నెలల క్రితం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఎంపిక ఫైలును మాత్రం పక్కన పెట్టారు. పూర్వ జిల్లా కలెక్టర్ విజయమోహన్ బదిలీ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి ఈ ఫైలుకు మోక్షం లభించింది. మొత్తం 19 అంగన్‌వాడీ వర్కర్లు(ఆదోని–2, ఆలూరు–3, ఎమ్మిగనూరు–2, పత్తికొండ–3, కోడుమూరు–1, డోన్–3, ఆత్మకూరు–1, నందికొట్కూరు–1, ఆళ్లగడ్డ–1, కోయిలకుంట్ల–2)తో పాటు 132 అంగన్‌వాడీ హెల్పర్లు(ఆదోని రూరల్–11, ఆదోని అర్బన్–1, ఆలూరు–16, ఎమ్మిగనూరు–16, పత్తికొండ–8, కర్నూలు అర్బన్–9, కర్నూలు రూరల్–1, కోడుమూరు–13, డోన్–14, ఆత్మకూరు–2, నందికొట్కూరు–3, నంద్యాల రూరల్–4, నంద్యాల అర్బన్–2, ఆళ్లగడ్డ–7, బనగానపల్లి–16, కోయిలకుంట్ల–9) పోస్టులు భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక జాబితాను kurnool.ap.gov.inలో ఉంచారు.
చక్రం తిప్పిన ఓ జిల్లా అధికారి
అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో జిల్లాకు చెందిన, ఐసీడీఎస్‌కు సంబంధం లేని ఓ అధికారి చక్రం తిప్పినట్లు సమాచారం. ఆయనకు సంబంధం లేకపోయినా ఇతర శాఖ ఫైలును ఆయన తీసుకెళ్లి సంతకం చేయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనే స్వయంగా సదరు ఫైలును పూర్వ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించినట్లు కలెక్టరేట్‌లో చర్చ జరుగుతోంది. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైలుకు చివరిరోజున పూర్వ జిల్లా కలెక్టర్ సంతకం చేస్తూ భర్తీ చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఓ అధికారి కీలక పాత్ర పోషించి, అభ్యర్థుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుల భర్తీ విషయమై ఐసీడీఎస్ ఇన్‌ఛార్జి పీడీ అరుణను వివరణ కోరగా శుక్రవారం పూర్వ కలెక్టర్ విజయమోహన్ సంతకాలు చేసినట్లు తెలిపారు. ఫైలు ఎందుకు పెండింగ్‌లో ఉందన్న విషయం తనకు తెలియదని, తాను రెండు నెలల క్రితమే ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు.
ముగ్గురు తహసీల్దార్లకు స్థానచలనం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బదిలీపై పోతూ రెవెన్యూ శాఖలో ఈ బదిలీలు చేశారు. బదిలీ ఉత్తర్వులు ఆదివారం బయటికి వచ్చాయి. ఇదే తరహాలోనే వివిధ శాఖల్లోను బదిలీలు చేసినట్లు సమాచారం. కలెక్టర్ కార్యాలయంలో ఎఫ్ సెక్షన్ సూపరింటెంటుగా పనిచేస్తున్న తిరుపతిసాయిని బనగానపల్లె తహసీల్దారుగా బదిలీ చేశారు. బనగానపల్లె తహసీల్దారుగా ఉన్న అనురాధను ఆదోని ఆర్‌డీఓ కార్యాలయ పరిపాలనాధికారిగా నియమించారు. ఆదోని ఆర్‌డీఓ ఆఫీసు ఏఓ రామాంజనేయులును కలెక్టర్ కార్యాలయంలోని ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంటుగా నియమించారు. ఓర్వకల్లు డిప్యూటీ తహసీల్దారు శ్రీనాథ్‌కు ఇటీవలనే పదోన్నతి లభించింది. ఆయనను అక్కడే పూర్తి స్థాయి తహసీల్దారుగా నియమించారు.
Advertisement
Advertisement