జాయింట్ కలెక్టర్‌గా రెండేళ్లు.. మహా విశాఖనగరపాలకసంస్థ కమిషనర్‌గా దాదాపు రెండేళ్లు.. కలెక్టర్‌గా సుమారు మూడేళ్లు.. సీనియర్ ఐఏఎస్ అధికారి(సెలక్షన్ గ్రేడ్ ఆఫీసర్)గా ఇక్కడి నుంచే గుర్తింపు..
ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రవీణ్‌కుమార్ కచ్చితంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలెక్టర్‌గా గానీ, లేదంటే సచివాలయంలో ఏదైన కీలక ప్రభుత్వ శాఖకు కార్యదర్శిగా గానీవెళ్తారని అందరూ భావించారు. ఆయనా అదే ఆశించారు..కానీ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గాపంపడంతో అందరూ షాక్ అయ్యారు.జేసీగా, కమిషనర్‌గా ఎంతో మంచిపేరు పొందిన ప్రవీణ్.. కలెక్టర్ అయిన తర్వాత పచ్చ నేతల చేతిలో పావుగా మారిపోయారన్నవిమర్శలు మూటగట్టుకున్నారు. లక్షల కోట్ల భూకుంభకోణాల్లోసూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలిసినా.. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలోకి వెళ్లిన ప్రవీణ్‌పై కూడా ఎన్‌వోసీల జారీవిషయంలో ఆరోపణలున్నాయి. ఎన్ని విమర్శలు, ఎంత అపప్రద మూటగట్టుకున్నా సీఎం చంద్రబాబు గుడ్‌లుక్స్‌లో ఉంటే చాలు.. మంత్రి లోకేష్ బాబుతో సన్నిహితంగా ఉంటే చాలు.. మంత్రులతో చెట్టాపట్టాల్ వేసుకుంటే చాలు..అన్నట్లు భావించి.. వారి పనులన్నీ చక్కబెట్టిన ప్రవీణ్‌కు చివరికి దక్కిందేమిటి?!తాను ఆశించిన పోస్టులు పక్కనపెడితే.. తనకంటే జూనియర్లు పనిచేసిన జిల్లాకు, మహావిశాఖ ‘నగరం’ నుంచి చిన్న పట్టణమైన ‘ఏలూరు’కు వెళ్లాల్సి వస్తోంది. ఐఏఎస్, రెవెన్యూ అధికారవర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బదిలీ వ్యవహారం ఐఏఎస్ వర్గాల్లోనే కాదు.. రెవెన్యూ వర్గాల్లోనూ చర్చకు తెరలేపింది. ఆరేళ్లకుపైగా విశాఖలోనే పాతుకుపోయిన ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేసే క్రమంలో టీడీపీ ప్రభుత్వం మంచి పోస్టు కట్టబెడుతుందన్న వాదనలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గ నేపథ్యమూ బలంగానే కనిపించింది. 2012లో కాంగ్రెస్ హయాంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వచ్చిన ప్రవీణ్‌కుమార్ తొందర్లోనే సమర్ధుడైన అధికారిగా పేరు సంపాదించారు. ఇక టీడీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మహావిశాఖ నగర పాలకసంస్థ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అక్కడా తనదైన ముద్ర చూపించారు. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్స్‌లో విశాఖను ముందువరుసలో నిలబెట్టారు. ఇక హుద్‌హుద్ తుఫాను సమయంలో కూడా ఆయన పనితీరు ప్రశంసలు పొందింది. ఆ తర్వాత 2016లో జిల్లా కలెక్టర్‌గా ఓరకంగా పదోన్నతి పొందిన ప్రవీణ్ వ్యవహారశైలిలో క్రమంగా మార్పు వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు కలెక్టర్లు హడావుడి చేయడం సర్వసాధారణమే. కానీ మంత్రి లోకేష్ వచ్చినప్పుడు కూడా ప్రవీణ్ అంటిపెట్టుకునే ఉండటం, జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులతో సైతం ప్రవీణ్ ఒదిగిఒదిగి ఉండటం చూసి.. ప్రవీణ్ ‘అయ్యా ఎస్’ జాబితాలోకి వెళ్ళిపోయారన్న వాదనలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఏడాదిన్నర క్రితం బయటపడిన లక్షల కోట్ల భూ కుంభకోణాల వ్యవహారంలో ఆయన పావుగా మారిపోయారన్న వాదనలున్నాయి. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు రికార్డులు తారుమారు చేసి కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేసేస్తే.. తెలిసి కూడా ఆయన అడ్డుకోలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఇక జిల్లాలో భూ రికార్డులు తారుమారు కావడం, తప్పుడు ఎన్‌వోసీలు జారీచేయడం, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం వంటి వ్యవహారాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కొద్దిమంది ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించింది. ఇందులో ప్రవీణ్‌కుమార్ పేరు ఉండటం అప్పట్లో కలకలం రేపింది.
పచ్చ నేతలకు ఎంత చేసినా...!
ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, మంత్రుల ఒత్తిళ్ల వల్లే ప్రవీణ్ ఆ వ్యవహారాల్లో ఇరుకున్నారన్న వాదనలు సహ ఐఏఎస్ అధికారుల నుంచి, రెవెన్యూ అధికారవర్గాల నుంచి కూడా వినిపించాయి. ఇలా పచ్చనేతలకు మేలు చేసి ఎన్నో ఆరోపణలను మూటకట్టుకున్న ప్రవీణ్‌కు టీడీపీ ప్రభుత్వం మంచి లిఫ్ట్ ఇస్తుందన్న ప్రచారం బాగా వినిపించింది. ఆ మేరకు రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమైన కృష్ణా, గుంటూరుల్లో ఏదో జిల్లాకు కలెక్టర్‌గా నియమిస్తారని, లేదా సచివాలయంలోని కీలక విభాగంలో కార్యదర్శి హోదా ఇస్తారన్న ప్రచారం బాగా జరిగింది. ఆమేరకు సెలక్షన్ గ్రేడ్ కలెక్టర్‌గా పదోన్నతి రావడంతో కచ్చితంగా ఇక్కడి నుంచి మంచి పోస్టులోకే వెళ్తారన్న ప్రచారం సాగింది. కానీ ఎవరూ ఊహించని విధంగా పరస్పర బదిలీల్లా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించడం చర్చకు తెరలేపింది. పోనీ పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ జిల్లాకు సీనియర్ అధికారిగా నియమించారని అనుకున్నా.. వాస్తవానికి పోలవరం క్రెడిట్ ఇప్పటికే అక్కడి కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు సర్కారు కట్టబెట్టేసింది. గత నాలుగేళ్లుగా అక్కడే కలెక్టర్‌గా ఉన్న కాటమనేనికి పోలవరం క్రెడిట్ కట్టబెట్టిన తర్వాతే పదోన్నతిగా మహావిశాఖకు సర్కారు బదిలీ చేసింది. మరి విశాఖలో ఇంతా చేసిన ప్రవీణ్‌కు దక్కిందేమిటి?.. పచ్చనేతల చేతిలో పావుగా మారిన ప్రవీణ్‌కు మరో జిల్లా కలెక్టర్‌గా బదిలీ తప్ప ఒరిగిందేమిటి.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రవీణ్‌నూ వెంటాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment