=పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులు
=పెండింగ్ ఫైళ్లపై దృష్టి
=వారంలోగా పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి. ఉద్యోగులతో సందడిగా మారాయి. 66 రోజులపాటు ప్రభుత్వోద్యోగులు చేపట్టిన సమ్మె ముగియడంతో శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తెరుచుకున్నాయి. ఉదయం నుంచే దాదాపు 63 ప్రభుత్వశాఖల్లో పనులు ప్రారంభమయ్యాయి. అపరిష్కృతంగా ఉన్న అనేక పనులకు సంబంధించిన ఫైళ్లు చకచకా కదిలాయి. మరోపక్క అన్ని శాఖల్లో కలిపి వేలాదిగా పేరుకుపోయిన ఫైళ్లను వారంలోగా పరిష్కరించడానికి జిల్లా అధికారులు నడుంకట్టారు.
ఉదయమే పెండింగ్ ఫైళ్లపై సమీక్ష జరిపి వారంలోగా పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. మరోపక్క చాన్నాళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, బిల్లుల మంజూరు వంటి వాటికి సంబంధించిన పనులు మళ్లీ ఊపందుకున్నాయి. సర్కారుకు ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులశాఖ, ట్రెజరీ, ఎక్సయిజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు పోటెత్తాయి.
వారంలోగా పరిష్కారం: జిల్లాలో అరవైకి పైగా ఉన్న వివిధ శాఖల్లో ఉద్యమం కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఫైళ్లు, ప్రతిపాదనలు ఉన్నచోటనే నిలిచిపోయాయి. ఇప్పుడు సమ్మె విరమించడంతో అన్ని జిల్లా శాఖల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారు. దీంతో పేరుకుపోయిన ఫైళ్ల ను పరిష్కరించడంపై ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిం చారు. రెవెన్యూ, పరిశ్రమల శాఖ, పౌరసరఫరాల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సయిజ్, అటవీ, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి పలు కీలక శాఖల ఉన్నతాధికారులు ఉదయమే సిబ్బందితో సమావేశమయ్యారు.
అన్ని పెండింగ్ ఫైళ్లను వా రంలోగా పరిష్కరించాలని ఆదేశాలి చ్చారు. పేరుకుపోయినవాటిలో ము ఖ్యమైన వాటి ప్రాతిపదికన వేగంగా పరిష్కరించాలని సూచించారు. మరోపక్క జిల్లాకు రావలసి ఉన్న రూ.3 కోట్ల అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధి పథకం నిధులు, పంచాయతీలకు మంజూరు కావలసిన ప్రత్యేక నిధులు, జిల్లా పరిషత్‌కు రావలసిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపడానికి ఫైళ్లకు బూజు దులిపారు. ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ విభాగంలో జిల్లాలో పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన కొత్తచట్టం రూపకల్పన పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లాలో రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టడానికి వీలుగా కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన ఫైళ్లపై పౌరసరఫరాలశాఖ వేగం పెంచింది. పేదలకు భూ పంపిణీ పథకంలో భాగంగా జిల్లాలో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను రెవెన్యూ శాఖ ప్రారంభించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చాలాచోట్ల ప్రజలు పోటెత్తారు. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ భారీగా జరిగింది. దీని వల్ల శుక్రవారం ఒక్కరోజే ఈ శాఖకు రూ. 25 కోట్ల మేరకు ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేశారు.
జిల్లా ట్రెజరీ విభాగంలో సుమారుగా రూ.52 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని అంచనా. జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. రెండు నెలలుగా వర్షపాతం వివరాలు లేకపోవడంతో తక్షణం సమాచారం రప్పించే వీలుగా అధికారులు పనులు మొదలుపెట్టారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు చాలావరకు పనులు చేపట్టారు. కానీ వీటికి సంబంధించి బిల్లులు సమైక్య ఉద్యమం కారణంగా నిలిచిపోయాయి.దీంతో కాంట్రాక్టర్లు ఉదయమే ఆయా శాఖలకు చేరుకుని బిల్లుల మంజూరు కోసం క్యూ కట్టారు.