=పదోన్నతుల జాబితా సిద్ధంగా ఉన్నా పట్టని ఉన్నతాధికారులు
=డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు
=నత్తనడకన పంటల పరిహారం, ఓటర్ల జాబితా సవరణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా రెవెన్యూ శాఖలోని కీలక విభాగాల్లో కొంత కాలంగా పైళ్ల కదలిక మందగించింది. వివిధ కార్యాలయాలు, విభాగాల నుంచి ఉన్నతాధికారుల ఆమోదం కోసం కలెక్టరేట్‌కు వెళ్లిన ఫైల్ ఎన్నాళ్లకు తిరిగొస్తుందో తెలియని అయోమయస్థితి నెలకొంది. ఉద్యోగులకు సంబందించిన విషయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బంది అధికారులకు సరైన సమాచారం ఇవ్వడం లేదా... నిర్ణయం తీసుకునే విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారా అనేది తెలియరావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే పలు నిర్ణయాల వల్ల ఫైళ్ల కదలికలో ఏర్పడుతున్న జాప్యం పరిపాలనపై ప్రభావం చూపుతోంది.
జిల్లా అధికారుల చేతుల్లోనే ఉన్నా...
జిల్లాలో సుమారు 20 మంది తహసీల్దార్లకు ఇటీవల స్థానచలనం కల్పించారు. వీరిలో సుమారు ఎనిమిది వరకు అఫీషియోటింగ్ ద్వారా తహసీల్దార్లుగా వెళ్లారు. అంటే ఒకచోట డిప్యూటీ తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న వారిని అవసరాలు, ఉద్యోగుల సామర్థ్యాన్ని బట్టి తహసీల్దార్లుగా అవకాశం కల్పించారు. ఇలా డీటీలు తహసీల్దార్లుగా వెళ్లడంతో దాదాపు 12 వరకు డీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈక్రమంలో సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించి డీటీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సీసీఎల్‌ఏ నుంచి వచ్చే ప్రో డీటీలతో కొన్ని భర్తీ చేసుకోవచ్చు.
ప్రస్తుతం రెండో దానికి ఎలాగూ ఇప్పట్లో అవకాశం లేదు కనక.. అర్హులైన సీనియర్లకు డీటీలుగా పదోన్నతి ఇవ్వడం మాత్రమే చేయాల్సి ఉంటుంది. పరిపాలనాపరంగా సమస్యలు తీరాలంటే చేయాల్సిన ఈ పని జిల్లా అధికారుల పరిధిలోనే ఉంటుంది. అధికారులు తలుచుకుంటే సిద్ధంగానే ఉన్న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు పరిశీలించడం, ఆ తర్వాత తుది జాబితాకు ఆమోదం తెలిపి పోస్టింగ్ ఇవ్వడం... ఒకదాని వెంట ఒకటి జరిపోగాయి. కానీ జిల్లాలో మాత్రం నెలల తరబడి ఇందుకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం వల్ల సహజంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికప్పుడు అధికారులు పదోన్నతుల ఫైల్ కదిపితే కనీసం ఎనిమిది నుంచి పది మంది సీనియర్ సహాయకులకు డీటీలుగా పదోన్నతి వచ్చే అవకాశముం డగా, ఆ వెంటనే ఖాళీలు కూడా భర్తీ అవుతాయి. కానీ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు.
జిల్లాలో డీటీల ఖాళీలు
డీటీల పదోన్నతులు, తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక ఆత్మకూరు, ధర్మసాగర్, గీసుకొండ, పరకాల, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడ, ఏటూరునాగారం(సీఎస్), వరంగల్(సీఎస్) వంటి చోట్ల సూపరింటెండెంట్, ఎన్నికల డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వీటితో పాటు ఎస్సారెస్పీ, తాడ్వాయిలో కూడా డీటీ పోస్టులు ఖాళీగా ఉండగా, ఎస్డీసీ ఏటూరునాగారం వంటి చోట్ల డీటీలు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. అయితే, ఇందులో తాడ్వాయి డీటీగా చెన్నయ్యను ఇటీవలే నియమించారు. మేడారం జాతర ముంచుకొస్తున్న సమయంలో విమర్శలు వస్తాయనే ఈ పోస్టును భర్తీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, మరికొందరు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి ఆర్జీలను పరిగణనలోకి తీసుకుంటారా, లేదా అన్నది ఉన్నతాధికారుల విస్తృత అధికారాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ పరిపాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డీటీ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
కీలక సమయంలో...
ప్రస్తుతం ఒకవైపు రైతులు పంట నష్టానికి సంబంధించి పరిహారం ఖరారు, చెల్లింపుతో పాటు ధాన్యం సేకరణ పనులు జరుగుతుండగా, ఓటర్ల జాబితా సవరణ కీలక దశకు చేరింది. ఈ పనులన్నీ చూడాల్సిన రెవెన్యూ శాఖలో.. అందునా నియోజకవర్గ కేంద్రాలైన పరకాల, జనగామ వంటి చోట్ల కూడా పోస్టులు భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తహసీల్దార్ల బదిలీలకు మూడుసార్లు ఉత్తర్వులు
ఒకవైపు జిల్లాలో డీటీల బదిలీలు, సీనియర్ సహాయకుల పదోన్నతులకు సంబంధించి ఫైల్ ఉన్నతాధికారుల వద్ద మూలుగుతుండగా.. తహసీల్దార్లకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వులు అందుకున్న వారు విధుల్లో చేరి పాతబడిపోయారు. మరో రెండు నెలల్లో ఎన్నికల నిబంధనల వల్ల తహసీల్దార్లు పక్క జిల్లాలకు బదిలీ వెళ్లే అవకాశముంది. దీన్ని గుర్తించి డీటీల పోస్టుల భర్తీపై వెంటనే దృష్టి సారించకపోతే.. రెవెన్యూ కార్యాలయాల్లో దిక్కు లేనివిగా మారే ప్రమాదముంది.
వెక్కిరిస్తున్న ‘రెవెన్యూ’ ఖాళీలు
Published Thu, Dec 26 2013 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement