dharmasagar
-
ఎంపీపీ భర్తపై గ్రామస్తుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వరంగల్ : జిల్లాలోని ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో ఓ యువకుడిని చితకబాదారంటూ.. స్థానిక ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి భర్త రమణారెడ్డిపై నారాయణగిరి గ్రామస్తులు దాడికి దిగారు. రమణారెడ్డి, అతని అనుచరుల ఇళ్లపై ఒక్కసారిగా రాళ్లు దాడులు జరిపారు. ఇళ్లపైకి వచ్చి ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి.. ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం గ్రామంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సుధీర్ అనే యువకుడిపై శనివారం సాయంత్రం దాడి జరిగింది. సుధీర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భూవివాదం విషయంలో సుధీర్‌పై రమణారెడ్డే దాడి చేయించాడంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ తాతా పేరుమీద ఉన్న భూమిని కొనేందుకు గతంలో రమణారెడ్డి ప్రయత్నం చేశారు. కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆయన వెనుకకు తగ్గారు. ఈ క్రమంలో సుధీర్ కుటుంబం రమణారెడ్డి వద్ద అప్పు తీసుకోవడం.. ఆ అప్పు కింద భూమిని తనకు ఇవ్వాలని రమణారెడ్డి ఒత్తిడి తేవడంతో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే సుధీర్‌పై రమణారెడ్డి దాడి చేయించాడని గ్రామస్తులు అంటున్నారు. తాజా ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో నారాయణగిరి గ్రామం పోలీసుల పహారాలో ఉంది. -
వృద్ధులకు స్వర్గధామం.. జీవన క్షేత్ర ఆశ్రమం
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రకృతి వైద్యం గోఆధారిత వంటలతో సంపూర్ణ భోజనం 30 ఏళ్లలో వేలాది మందికి యోగా శిబిరాలు మల్లికార్జున గురూజీ ఆధ్వర్యంలో ఆశ్రమం ఏర్పాటు కరుణాపురంలో త్వరలో ప్రారంభం కరుణాపురం (స్టేషన్‌ఘన్‌పూర్) : మలిదశలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకునేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని జీవన క్షేత్ర వృద్ధాశ్రమం సిద్ధమవుతోంది. తమ వద్దకు వచ్చే పండుటాకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ముస్తాబవుతోంది. వివరాల్లోకి వెళితే.. పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని కరుణాపురంలో సుమారు 15 ఎకరాల విశాలమైన స్థలంలో, ప్రశాంతమైన వాతావరణంలో సనాతన సంస్కృతి విద్యా కేంద్ర వ్యవస్థాపకులు మల్లికార్జున గురూజీ ఆధ్వర్యంలో జీవన క్షేత్ర వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో చాలా మంది వృద్ధులు అన్నీ ఉండి కూడా శారీరకంగా, మానసికంగా అనాథలుగా బాధపడుతున్నారు. అయితే వృద్ధాప్యం శాపం కాదని.. మలిదశలో బాల్య వ్యవస్థను తిరిగి పొంది ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని చెబుతూ ముందుకుసాగేందుకు అన్ని వనరులు సమకూర్చుకుంది జీవనక్షేత్ర వృద్ధాశ్రమం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. వయో వృద్ధులకు సేవ చేస్తూ వారిలో ఆనందాన్ని నింపడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధమైంది. మానసిక ప్రశాంతత.. జీవనక్షేత్ర ఆశ్రమంలో చేరే వారికి గోఆధారిత వంటలతో భోజనం అందించనున్నారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రకృతి వైద్యం అందించి నిర్వాహకులు వారికి అండగా నిలువనున్నారు. ఆశ్రమం ఆధ్వర్యంలో ఇప్పటివరకు వేలాది మందికి యోగా శిబిరాలు నిర్వహించి వారికి మానసిక ప్రశాంతత చేకూర్చారు. త్వరలో ప్రారంభంకానున్న ఆశ్రమంలో చేరేందుకు ఇప్పటివరకు 15 మంది వృద్ధులు పేర్లు నమోదు చేసుకున్నారు. వృద్ధులకు సేవ చేసేందుకే.. తమ ఆశ్రమం ఆధ్వర్యంలో 30 ఏళ్లలో వేలాది మందికి యోగా క్యాంపులు నిర్వహించాం. వృద్ధులకు సేవ చేయాలనే లక్ష్యంతోనే కరుణాపురంలో జీవన క్షేత్ర వృద్ధాశ్రమాన్ని నెలకొల్పుతున్నాం. ఆశ్రమంలో చేరే వారికి ప్రతి రోజు యోగా చేయించడంతో పాటు ప్రకృతి వైద్యం అందిస్తాం. అలాగే గోఆధారిత వంటలతో భోజనం అందిస్తాం. 50 ఏళ్లకు పైబడిన స్త్రీ, పురుషులు ఆశ్రమంలో చేరవచ్చు. పూర్తి వివరాలకు 98660-15666, 98484-42355 నంబర్లలో సంప్రదించవచ్చు. - మల్లికార్జున గురూజీ, జీవనక్షేత్ర ఆశ్రమ వ్యవస్థాపకులు -
మృత్యువులోనూ వీడని స్నేహం
-
కడుపుకోతకు బాధ్యులెవరు
♦ మృత్యుకుహరంగా ధర్మసాగర్ రిజర్వాయర్ ♦ పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం వరంగల్: అనంతమైన జలరాశి... ఆ పక్కనే గుట్టలు... ఎత్తయిన చెరువు కట్ట.. దానిపై నిలబడి నీటిఅందాలు వీక్షిస్తూ ఫొటోలు దిగాలనే కోరిక.. అందులో ఈత కొట్టాలన్న ఉత్సాహంతో యువత కొద్దిపాటి నిర్లక్ష్యంతో మృత్యు ఒడికి చేరుతున్నారు. నగరానికి సమీపంలో ఉన్న ధర్మసాగర్ చెరువు వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రజలకు తాగునీరు అందిస్తోంది. దీన్ని స్టోరేజీ రిజర్వాయర్‌గా కార్పొరేషన్ ప్రకటించింది. దేవాదుల పథకంలో భాగంగా ఆయకట్టుకు సాగు నీరందించేందుకు ధర్మసాగర్ చెరువు స్థామర్థ్యం పెంచారు. ఒకటి, రెండో విడత పైపులైను పూర్తి కావడంతో గోదావరి జలాలు భారీగా పంపింగ్ చేయడంతో చెరువు పూర్తి స్థాయిలో నిండి సందర్శకులను ఆకట్టుకుంటోంది. కాలేజీ విద్యార్థులు ఏ చిన్న పిక్నిక్ అయినా ధర్మసాగర్ చెరువునే ఎంచుకుంటున్నారు. నిండు కుండలా ఉన్న చెరువులో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితులు నెలకొంది. చెరువుకట్ట మీద హెచ్చరిక బోర్డు ఒకటి పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇటు కార్పొరేషన్ అధికారులు, అటు దేవాదుల ప్రాజెక్టు అధికారులు ఎవరూ కూడా చెరువు భద్రతను పట్టించుకోకపోవడంతో యువత మృత్యువాతపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 మందికిపైగా మృతిచెందారు. వీరంతా చెరువులోకి స్నానానికి దిగడం, ఫొటోలు తీసుకునే క్రమంలో అందులో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. రెండు పైపులైన్లతో నీళ్లు చెరువులో పడుతుంటే అందులో స్నానం చేయాలన్న ఉత్సాహమే వారి ప్రాణాలు తీస్తున్నాయి. భద్రతా చర్యలు చేపట్టాలి రిజర్వాయర్‌లో మరణాలను నివారించేందుకు సందర్శకులను చెరువులోకి దిగకుండా ఉండేందుకు నిరంతరం పర్యవేక్షణ పెట్టాల్సిన అవసరం ఉంది. దేవాదుల నీటిని పంపింగ్ చేస్తున్న అధికారులు సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేస్తే ఈ మరణాల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా మరికొందరు కడుపుకోతలకు గురి కాకముందే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి భద్రత చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు. 2012 నుంచి 2016 వరకు 11 మంది... పర్యాటక ప్రదేశాన్ని తలపించేలా ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్ మృత్యుకుహరంగా మారుతోంది. నగరానికి సమీపంగా ఉండడంతో సెలవులొస్తే చాలు పెద్దసంఖ్యలో విద్యార్థులు, స్థానికులు రిజర్వాయర్ వద్ద సరదగా గడిపేందుకు వస్తుంటారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తో.. నిర్లక్ష్యంగా కారణంగానో పలువురు మృత్యువాత పడుతుండడంతో వారి కుటుంబీకులకు శోకాన్ని మిగులుస్తోంది. 2012వ సంవత్సరంలో రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన నగరానికి చెందిన ఇద్దరు యువతీ, యువకులు మృత్యువాత పడ్డారు. ఇంకా 2013వ సంవత్సరంలో మడికొండకు చెందిన యువకుడు పైప్‌లైన్ పోస్తున్న ప్రదేశంలో ఈతకు వెళ్లి కన్నుమూశాడు. అనంతరం కాజీపేట నిట్‌కు చెందిన విద్యార్థి తెప్పపై నీటిలోకి దిగి మృత్యువాత పడ్డాడు. అలాగే, రెండు నెలల క్రితం దోమతెర సాయంతో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ కానిస్టేబుల్, మరో యువకుడు రిజర్వాయర్ వద్ద పైప్‌లైన్ పోస్తున్న ప్రదేశంలోనే పడిపోయి మతి మృతి చెందారు. ప్రస్తుతం ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు రిజర్వాయర్ వద్ద సరదాగా గడిపేందుకు వచ్చి మృతి చెందడంతో పలువురు విషాదంలో మునిగిపోయారు. మరోమారు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఐదుగురు విద్యార్థులు నీటమునిగి మృతిచెందడం అత్యంత బాధాకరమని, మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతామని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. మేయర్ వెంట స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొలిపాక రజిత, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఘటన స్థలానికి చేరుకుని ఘటన వివరాలు ఆరా తీసి, సానుభూతిని వ్యక్తం చేశారు. -
మృత్యు‘సాగరం’
ఒకరిని రక్షించేందుకు మరొకరు వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృత్యువాత మృత్యువులోనూ వీడని స్నేహం ధర్మసాగర్ : ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతితో ధర్మసాగర్ దుఃఖసాగరంగా మారింది. ఎక్కడో పుట్టి పెరిగిన పిల్లలు ఆహ్లాదం కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలు విడవడంతో తల్లడిల్లింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు రిజర్వాయర్ ప్రాంతంలో మిన్నంటాయి. రిజర్వాయర్‌లో జరుగుతున్న వరుస ఘటనలతో స్థానిక ప్రజలు కలత చెందుతున్నారు. వరంగల్ నగర శివారు బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్ఈ(కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్) థర్డ్ ఇయర్ విద్యార్థులైన పత్తి శ్రావ్యరెడ్డి(20), పోలినేని వినూత్న(20), కర్నె శివసాయి(20), ఉత్పల శ్రీనిధి(20), ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న పోలినేని శివసాయికృష్ణ(18) శనివారం ధర్మసాగర్ మండల కేంద్రం శివారులోని రిజర్వాయర్‌కు విహారయాత్రకు ఉదయం 10.30 గంటలకు టూ వీలర్లపై వచ్చారు. వీరితోపాటు కలిసి వచ్చేందుకు సిద్ధమైనప్పటికీ ఆలస్యం కావడంతో వంగాల రమ్యప్రత్యూష అనే మరో విద్యార్థిని వీరి వెనకాల ఆటోలో బయల్దేరింది. రిజర్వాయర్ వద్ద తాము ఎక్కడ ఉన్నది శ్రావ్యరెడ్డి ఆమెకు ఫోన్ చేసి చెప్పింది. రమ్యప్రత్యూష వీరి వద్దకు వచ్చేలోపు వీరంతా చెరువుకట్టపై కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత నీళ్లలో కాళ్లు పెట్టుకొని వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను తినే ఉద్దేశంతో కట్ట దిగువభాగంలో ఉన్న బండపైకి చేరుకున్నారు. నీళ్లలో కాళ్లు వేసి సరదాగా ఆడిస్తూ మాట్లాడుకుంటుండగా కర్నె శివసాయి నీటిలోకి ఒక్కసారిగా జారిపడిపోయాడు. అక్కడ లోతును అంచనా వేయని ఉత్పల శ్రీనిధి, పోలినేని శివసాయికృష్ణ అతడిని బయటకులాగే ఉద్దేశంతో చేయందించగా అప్పటికే నీటిలో మునిగిపోతున్న శివసాయి వీరిద్దరిని గట్టిగా పట్టుకోగా వారు కూడా నీటమునిగారు. దీంతో కంగారుపడిన పోలినేని వినూత్న కూడా తన తమ్ముడు, స్నేహితులను కాపాడేందుకు నీటిలో దిగేందుకు ప్రయత్నించి అందులో పడిపోయింది. వెంటనే పత్తి శ్రావ్యారెడ్డి తన స్నేహితురాలిని రక్షించేందుకు యత్నించి ఆమె కూడా నీటిపాలైంది. ఈలోగా వంగాల రమ్య ప్రత్యూష ఘటన స్థలానికి చేరుకునేసరికే శ్రావ్యరెడ్డి నీటి మునుగుతూ కనిపించింది. దీంతో ఆమె హెల్ప్.. హెల్ప్ అంటూ గట్టిగా కేకలు వేస్తూ చున్నీతో ఊపుకుంటూ నీటిపైపు పరుగులు తీసింది. ఆమెను గమనించిన దూరంగా ఉన్న నలుగురు యువకులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నలుగురు విద్యార్థులు నీటమునిగిపోగా ఒడ్డుపక్కన పడిపోయి ఉన్న శ్రావ్యరెడ్డిని వారు ఒడ్డుకు చేర్చారు. కొనఊపిరి ఉన్నట్లు గమనించి 108, 100కు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునేసరికి శ్రావ్యరెడ్డి మృతిచెందింది. మృతుల్లో పోలినేని వినూత్న, శివసాయికృష్ణ ఇద్దరు అక్కాతమ్ముడు. వీరి తల్లిదండ్రులకు ఇద్దరే సంతానం. వీరిద్దరూ మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పాకురు ఎక్కువగా ఉండటంతో ఘటన విద్యార్థులు నీట మునిగిన ప్రదేశంలో లోతు అధికంగా ఉండటంతోపాటు, వీరు కూర్చున్న ప్రాంతంలో బండ పూర్తిగా పాకురు పట్టి ఉండడం, విద్యార్థుల్లో ఎవరికి ఈత రాకపోవడతో ఒకేసారి మృత్యువాతపడ్డారు. వీరు కూర్చున్న చోట ఒక్కఅడుగు నీటిలో కాలు మోపినా ఒక్కసారిగా మనిషి పూర్తిగా నీటమునిగిపోయేంత లోతు ఉంటుంది. బండలను పట్టుకుని ఒడ్డుకు చేరాలని ప్రయత్నించినప్పటికీ బండపూర్తిగా పాకురు పట్టి ఉండటంతో పట్టు దొరకని పరిస్థితి నెలకొంది. ఈత వచ్చిన వారు సైతం ఒడ్డుకు చేరడానికి బయటి వ్యక్తి సాయం అవసరం ఉంటుందని స్థానిక జాలర్లు తెలిపారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం.. పొలినేని సంపత్‌రావు, వసంత దంపతులు హన్మకొండ హంటర్ రోడ్డులోని నందినిహిల్స్లో నివాసముంటున్నారు, వారికి వీరిద్దరే సంతానం. మృతుల్లో హన్మకొండ ఎక్సైజ్‌కాలనీ, కనకదుర్గ కాలనీకి చెందిన మరో విద్యార్థి కర్నె శివసాయి తండ్రి రవీందర్ గతంలో మృతి చెందగా, తల్లి మంజులారాణి ఎస్సార్ఎస్పీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఆమెకు కూడా శివసాయి ఏకైక సంతానం కావడంతో బోరున విలపిస్తోంది. వడ్డెపల్లిలోని పరిమళకాలనీకి చెందిన ఉత్పల శ్రీనిధి ఇంటికి పెద్ద కుమారుడు. తండ్రి దాశరథి ఎలక్ట్రీషియన్ కాగా తల్లి అనురాధ ప్రైవేట్ టీచర్. మరో మృతురాలు పత్తి శ్రావ్యరెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక కాగా ఆమె తండ్రి సత్యనారాయణరెడ్డి హన్మకొండ, అశోకకాలనీలో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పోలినేని సంపత్‌రావు, రజిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో తమ ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం గత కొన్నేళ్లుగా హన్మకొండలోని నందీహిల్స్‌లో నివాసముంటున్నారు. వారి కూతురు వినూత్న ఎస్ఆర్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివింది. బీటెక్ వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో చేస్తుంది. కుమారుడు శివసాయికృష్ణ కేయూ క్రాస్‌రోడ్డులోని ఎస్పీఆర్ పాఠశాలలో పదో తరగతి చదువుకోగా హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఎస్ఆర్లోలాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. చూస్తుండగానే నీట మునిగింది : వంగాల రమ్యప్రత్యూష చూస్తుండగానే తన స్నేహితురాలు నీటమునిగిందని, అప్పటికే ఇతర విద్యార్థులు నీటమునిగారని ఆలస్యంగా గమనించినట్లు ఘటన స్థలానికి వీరికన్నా ఆలస్యంగా ఆటోలో వచ్చిన వంగాల రమ్యప్రత్యూష తెలిపింది. హెల్ప్ అంటూ అరవటంతో కొద్ది దూరంలోని నలుగురు యువకులు అక్కడికి చేరుకున్నట్లు ఆమె వెల్లడించింది. గుడికి వెళతానని.. దేవుడి దగ్గరికి పోయిండు : కర్నె శివసాయి తల్లి మంజుల ‘నా కొడుకు గుడికి వెళ్లొస్తానని చెప్పి.. నన్ను వదిలిపెట్టి ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయిండు. నా కొడుకును ఒకసారి బతికించు దేవుడా.. నా ఆయుష్షు వానికి పోయి దేవుడా.. నాకు అన్యాయం చేయకూ.. నేను ఎవరిని చూసుకొని బతకాలి దేవుడా’ అంటూ శివసాయి తల్లి మంజుల రోదించిన తీరు ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది. శివసాయి తండ్రి గత నాలుగేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతిచెందగా తల్లి మంజుల కారుణ్య నియామకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగిగా చింతగట్టు క్యాంపులో ఇరిగేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. మంజుల కుమారుడు శివసాయి బీటెక్ థర్డియర్ చదువుతుండగా కూతురు కాత్యాయిని ఇంటర్ చదువుతోంది. నన్ను కూడ తీసుకపోరా దేవుడా.. : వినూత్న, శివసాయికృష్ణ తల్లి రజిత దేవుడా నా బిడ్డను, కొడుకును తీసుకపోయినవు. నన్నెందుకు ఉంచావురా దేవుడా.. నన్ను కూడ తీసుకపో.. నా ఆయుష్షు పోసి నా పిల్లలను బతికించు దేవుడా.. బిడ్డా నీకు పాలు పోస్తా రా బిడ్డ, నీకు అన్నం పెడుతా రా బిడ్డా’ అంటూ వినూత్న, శివసాయికృష్ణ తల్లి రజిత గుండెలవిసేలా రోదిస్తుండగా ఆపడం ఎవరివల్లా కాలేదు. ముచ్చర్లనాగారం వెళతామని చెప్పారు : వినూత్న తండ్రి సంపత్‌రావు కళాశాలకు సెలవు రావడంతో నా కూతురు వినూత్న, కుమారుడు శివసాయికృష్ణ స్నేహితులతో కలిసి ముచ్చర్ల నాగారం వెళ్తున్నామని చెప్పారు. ఇంతలోనే ఈ వార్త తెలిసింది. స్నేహితులతో వెళ్లింది : శ్రావ్యరెడ్డి తల్లిదండ్రులు స్నేహితులతో వెళ్లొస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లావా బిడ్డా అంటూ శ్రావ్యరెడ్డి తల్లిదండ్రులు విలపించారు. శ్రావ్య తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి - రజిని హన్మకొండలోని అశోకా కాలనీలో నివాసముంటున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇంటికి వచ్చిన ఆమె తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. అనంతరం 12.30 గంటల సమయంలో రిజర్వాయర్‌లో పడి మృతి చెందిన సమాచారం కుటుంబ సభ్యులకు అందింది. శ్రావ్య చెల్లెలు రితీక ఇంటర్ చదువుతోంది. ఆరు నెలల క్రితం బైక్ కొనిచ్చారు : శ్రీనిధి స్నేహితులు శ్రీనిధి కోసం అతడి తల్లిదండ్రులు ఆరు నెలల కింద బైక్ కొనిచ్చారు. వాడు ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవాడు’ అని అతడి స్నేహితులు చెప్పుకొచ్చారు. కాగా శ్రీనిధి తల్లిండ్రులు దాశరథి-అనురాధ హన్మకొండలోని పరిమళకాలనీలో నివాసముంటున్నారు. శ్రీ నిధి తమ్ముడు శ్రీ వాత్సవ ఇంటర్ చదువుతున్నాడు. శివసాయిని మరిచిపోలేం.. స్నేహితులు శివసాయి గొప్ప స్నేహితుడు. వాడిని ఎప్పటికీ మరిచిపోలేం. వాని బతకాలనే కోరిక ఎక్కువగా ఉండేది. కళాశాలలో మాకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నంటూ మాకు దైర్యం చెబుతూ మాతో ఉండేవాడు. కన్నీటి సంద్రమైన ఎంజీఎం మార్చురీ ఎంజీఎం : తమ ఆశాదీపాలు ఆరిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదిస్తూ తమ పిల్లలను జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మరో సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని ఉద్యోగాల్లోకి వెళ్లాల్సిన విద్యార్థుల మృతితో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి మృతిచెందిన వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తరలివచ్చి రోదించిన తీరును చూపరులను కలచివేసింది. -
ధర్మసాగర్ సర్పంచ్‌కు పీఎంఓ లేఖ
ధర్మసాగర్ : ‘మా ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహకరించండి’ అంటూ ధర్మసాగర్ సర్పంచ్ కొలిపాక రజిత ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి ఈ–మెయిల్ పంపించారు. దీనికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి బదులు లభించిందని సర్పం చ్ రజిత శనివారం తెలిపారు. ధర్మసాగర్ సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ పీఎంఓ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందిందన్నారు. జవాబుదారీగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు ప్రజాప్రతినిధులపై నమ్మకం పెరుగుతుందన్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం వెలికితీత
ధర్మసాగర్ : ధర్మసాగర్ రిజర్వాయర్‌లో గల్లంతైన ఇద్దరిలో కానిస్టేబుల్ పొలుమారి సృజన్(25) మృతదేహం సోమవారం ఉద యం లభ్యమైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ లో ఆదివారం ఇద్దరు గల్లంతు కాగా అందులో పీఈటీ మాచర్ల సునీల్ మృతదేహాన్ని ఆదివా రం రాత్రి వెలికితీశారు. అయితే, చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక జాలర్ల గాలింపు లో సృజన్ మృతదేహం బయటపడగా పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృత్యువులోనూ కలిసే.. ఉజ్వల భవిష్యత్ ఉన్న సృజన్, సునీల్ ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాత పడడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎంజీఎంలో యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక సోమవారం మధ్యాహ్నం వారి స్వగృహాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుండి కలిసి చదువుకుని, మృత్యువులో సైతం వీడిపోని తమ స్నేహితుల మృతదేహాలను చూసిన సహచరులు గుండెలవిసేలా రోదించారు. ఇక జీవిత చరమాంకంలో తమకు అండగా ఉంటారనుకున్న తమ కుమారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. కాగా, కానిస్టేబుల్ పొలిమారి సృజన్ మృతదేహానికి పోలీస్ సిబ్బంది, స్థానిక సెయింట్ మా«థ్యూస్ స్కూల్లో పీఈటీగా పని చేస్తున్న మాచర్ల సునీల్ మృతదేహానికి పాఠశాల సిబ్బంది నివాళులర్పించారు. ఈ మేరకు సాయంత్రం యువకుల మృతదేహాలకు స్థానిక రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పొలుమూరి సుజన్(22), ఓ ప్రైవేటు స్కూల్లో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తోన్న మాచర్ల సునీల్(22)లు గల్లంతైన వారిగా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. -
మన గుండెల్లో బతికే ఉంటారు
మల్లికుదుర్ల(ధర్మసాగర్): మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన మర్రి లక్ష్మి కుటుంబ సభ్యులను షర్మిల బుధవారం పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. ‘రాజన్న చనిపోరుున విషయం గురించి రోజూ పేపర్లో వచ్చిన వార్తలు చదివించుకునేది. టీవీల వార్తలు చూసేది. ఇట్లనే గుండెపోటుతో చనిపోరుుంది’ అని లక్ష్మి మృతిని కుటుంబ సభ్యులు వివరించారు. ‘వారికి మరణం లేదు. మన గుండెల్లో బతికే ఉంటారు. ధైర్యం చెదరనీయొద్దు. మంచి రోజులు ముందున్నారుు’ అని షర్మిల ధైర్యం చెప్పారు. కుటుంబం బాగోగులు కనుక్కున్నారు. ‘ఎంబీఏ ఫైనాన్స్‌కు మంచి భవిష్యత్ ఉంది. కష్టపడి చదు వు. ఉద్యోగం కోసం సాయం కావాలంటే నన్ను సంప్రదించు’ అని లక్ష్మి కుమారుడికి సూచించారు. ‘ఎలాంటి కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి’ అని కుటుంబ సభ్యులతో చెప్పారు. ‘మీరు రావడంతో మా కుటుంబానికి ఎంతో ధైర్యం వచ్చింది’ అని మర్రి ఐలయ్య అన్నాడు. -
మన ఊరు - మన ప్రణాళిక
ధర్మసాగర్ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మన ఊరు - మన ప్రణాళికలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రం లోని సుస్మితాగార్డెన్స్లో మంగళవారం ఎంపీ పీ వల్లపురెడ్డి లక్ష్మీ అధ్యక్షతన ‘మన మండలం - మన ప్రణాళిక’ సమావేశాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం రాజయ్య హాజరై మాట్లాడారు. సీమాంధ్రులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయీస్‌తో ముందుకుసాగుతుందని, అయితే విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే మాత్రం ఎవరినీ ఉపేక్షించేదిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అం దుతాయన్నారు. అలాగే రైతులకు సంబంధిం చిన అన్ని రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం అభివృద్ధిలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని, తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం దాశరథి కృష్ణామాచార్యుల చిత్రపటానికి డిప్యూటీ సీఎం, కలెక్టర్ పూలమాల నివాళులర్పించారు. డ్వామా పీడీ వెంకటేశ్వ ర్లు, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కాలేరే కరంచంద్, సొసైటీ డెరైక్టర్ వీర న్న, మండల ప్రత్యేకాధికారి సురేష్, ఎంపీడీఓ రాజారావు, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సర్పంచ్ కొలిపాక రజిత పాల్గొన్నారు. -
వెక్కిరిస్తున్న ‘రెవెన్యూ’ ఖాళీలు
=పదోన్నతుల జాబితా సిద్ధంగా ఉన్నా పట్టని ఉన్నతాధికారులు =డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు =నత్తనడకన పంటల పరిహారం, ఓటర్ల జాబితా సవరణ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా రెవెన్యూ శాఖలోని కీలక విభాగాల్లో కొంత కాలంగా పైళ్ల కదలిక మందగించింది. వివిధ కార్యాలయాలు, విభాగాల నుంచి ఉన్నతాధికారుల ఆమోదం కోసం కలెక్టరేట్‌కు వెళ్లిన ఫైల్ ఎన్నాళ్లకు తిరిగొస్తుందో తెలియని అయోమయస్థితి నెలకొంది. ఉద్యోగులకు సంబందించిన విషయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బంది అధికారులకు సరైన సమాచారం ఇవ్వడం లేదా... నిర్ణయం తీసుకునే విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారా అనేది తెలియరావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే పలు నిర్ణయాల వల్ల ఫైళ్ల కదలికలో ఏర్పడుతున్న జాప్యం పరిపాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లా అధికారుల చేతుల్లోనే ఉన్నా... జిల్లాలో సుమారు 20 మంది తహసీల్దార్లకు ఇటీవల స్థానచలనం కల్పించారు. వీరిలో సుమారు ఎనిమిది వరకు అఫీషియోటింగ్ ద్వారా తహసీల్దార్లుగా వెళ్లారు. అంటే ఒకచోట డిప్యూటీ తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న వారిని అవసరాలు, ఉద్యోగుల సామర్థ్యాన్ని బట్టి తహసీల్దార్లుగా అవకాశం కల్పించారు. ఇలా డీటీలు తహసీల్దార్లుగా వెళ్లడంతో దాదాపు 12 వరకు డీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈక్రమంలో సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించి డీటీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సీసీఎల్ఏ నుంచి వచ్చే ప్రో డీటీలతో కొన్ని భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండో దానికి ఎలాగూ ఇప్పట్లో అవకాశం లేదు కనక.. అర్హులైన సీనియర్లకు డీటీలుగా పదోన్నతి ఇవ్వడం మాత్రమే చేయాల్సి ఉంటుంది. పరిపాలనాపరంగా సమస్యలు తీరాలంటే చేయాల్సిన ఈ పని జిల్లా అధికారుల పరిధిలోనే ఉంటుంది. అధికారులు తలుచుకుంటే సిద్ధంగానే ఉన్న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు పరిశీలించడం, ఆ తర్వాత తుది జాబితాకు ఆమోదం తెలిపి పోస్టింగ్ ఇవ్వడం... ఒకదాని వెంట ఒకటి జరిపోగాయి. కానీ జిల్లాలో మాత్రం నెలల తరబడి ఇందుకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం వల్ల సహజంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికప్పుడు అధికారులు పదోన్నతుల ఫైల్ కదిపితే కనీసం ఎనిమిది నుంచి పది మంది సీనియర్ సహాయకులకు డీటీలుగా పదోన్నతి వచ్చే అవకాశముం డగా, ఆ వెంటనే ఖాళీలు కూడా భర్తీ అవుతాయి. కానీ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో డీటీల ఖాళీలు డీటీల పదోన్నతులు, తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక ఆత్మకూరు, ధర్మసాగర్, గీసుకొండ, పరకాల, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడ, ఏటూరునాగారం(సీఎస్), వరంగల్(సీఎస్) వంటి చోట్ల సూపరింటెండెంట్, ఎన్నికల డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్సారెస్పీ, తాడ్వాయిలో కూడా డీటీ పోస్టులు ఖాళీగా ఉండగా, ఎస్డీసీ ఏటూరునాగారం వంటి చోట్ల డీటీలు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. అయితే, ఇందులో తాడ్వాయి డీటీగా చెన్నయ్యను ఇటీవలే నియమించారు. మేడారం జాతర ముంచుకొస్తున్న సమయంలో విమర్శలు వస్తాయనే ఈ పోస్టును భర్తీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, మరికొందరు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి ఆర్జీలను పరిగణనలోకి తీసుకుంటారా, లేదా అన్నది ఉన్నతాధికారుల విస్తృత అధికారాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ పరిపాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డీటీ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కీలక సమయంలో... ప్రస్తుతం ఒకవైపు రైతులు పంట నష్టానికి సంబంధించి పరిహారం ఖరారు, చెల్లింపుతో పాటు ధాన్యం సేకరణ పనులు జరుగుతుండగా, ఓటర్ల జాబితా సవరణ కీలక దశకు చేరింది. ఈ పనులన్నీ చూడాల్సిన రెవెన్యూ శాఖలో.. అందునా నియోజకవర్గ కేంద్రాలైన పరకాల, జనగామ వంటి చోట్ల కూడా పోస్టులు భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తహసీల్దార్ల బదిలీలకు మూడుసార్లు ఉత్తర్వులు ఒకవైపు జిల్లాలో డీటీల బదిలీలు, సీనియర్ సహాయకుల పదోన్నతులకు సంబంధించి ఫైల్ ఉన్నతాధికారుల వద్ద మూలుగుతుండగా.. తహసీల్దార్లకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వులు అందుకున్న వారు విధుల్లో చేరి పాతబడిపోయారు. మరో రెండు నెలల్లో ఎన్నికల నిబంధనల వల్ల తహసీల్దార్లు పక్క జిల్లాలకు బదిలీ వెళ్లే అవకాశముంది. దీన్ని గుర్తించి డీటీల పోస్టుల భర్తీపై వెంటనే దృష్టి సారించకపోతే.. రెవెన్యూ కార్యాలయాల్లో దిక్కు లేనివిగా మారే ప్రమాదముంది.