కడుపుకోతకు బాధ్యులెవరు
♦ మృత్యుకుహరంగా ధర్మసాగర్ రిజర్వాయర్
♦ పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
వరంగల్: అనంతమైన జలరాశి... ఆ పక్కనే గుట్టలు... ఎత్తయిన చెరువు కట్ట.. దానిపై నిలబడి నీటిఅందాలు వీక్షిస్తూ ఫొటోలు దిగాలనే కోరిక.. అందులో ఈత కొట్టాలన్న ఉత్సాహంతో యువత కొద్దిపాటి నిర్లక్ష్యంతో మృత్యు ఒడికి చేరుతున్నారు. నగరానికి సమీపంలో ఉన్న ధర్మసాగర్ చెరువు వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రజలకు తాగునీరు అందిస్తోంది. దీన్ని స్టోరేజీ రిజర్వాయర్‌గా కార్పొరేషన్ ప్రకటించింది. దేవాదుల పథకంలో భాగంగా ఆయకట్టుకు సాగు నీరందించేందుకు ధర్మసాగర్ చెరువు స్థామర్థ్యం పెంచారు. ఒకటి, రెండో విడత పైపులైను పూర్తి కావడంతో గోదావరి జలాలు భారీగా పంపింగ్ చేయడంతో చెరువు పూర్తి స్థాయిలో నిండి సందర్శకులను ఆకట్టుకుంటోంది. కాలేజీ విద్యార్థులు ఏ చిన్న పిక్నిక్ అయినా ధర్మసాగర్ చెరువునే ఎంచుకుంటున్నారు. నిండు కుండలా ఉన్న చెరువులో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితులు నెలకొంది. చెరువుకట్ట మీద హెచ్చరిక బోర్డు ఒకటి పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు.
ఇటు కార్పొరేషన్ అధికారులు, అటు దేవాదుల ప్రాజెక్టు అధికారులు ఎవరూ కూడా చెరువు భద్రతను పట్టించుకోకపోవడంతో యువత మృత్యువాతపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 మందికిపైగా మృతిచెందారు. వీరంతా చెరువులోకి స్నానానికి దిగడం, ఫొటోలు తీసుకునే క్రమంలో అందులో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. రెండు పైపులైన్లతో నీళ్లు చెరువులో పడుతుంటే అందులో స్నానం చేయాలన్న ఉత్సాహమే వారి ప్రాణాలు తీస్తున్నాయి.
భద్రతా చర్యలు చేపట్టాలి
రిజర్వాయర్‌లో మరణాలను నివారించేందుకు సందర్శకులను చెరువులోకి దిగకుండా ఉండేందుకు నిరంతరం పర్యవేక్షణ పెట్టాల్సిన అవసరం ఉంది. దేవాదుల నీటిని పంపింగ్ చేస్తున్న అధికారులు సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేస్తే ఈ మరణాల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా మరికొందరు కడుపుకోతలకు గురి కాకముందే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి భద్రత చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.
2012 నుంచి 2016 వరకు 11 మంది...
పర్యాటక ప్రదేశాన్ని తలపించేలా ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్ మృత్యుకుహరంగా మారుతోంది. నగరానికి సమీపంగా ఉండడంతో సెలవులొస్తే చాలు పెద్దసంఖ్యలో విద్యార్థులు, స్థానికులు రిజర్వాయర్ వద్ద సరదగా గడిపేందుకు వస్తుంటారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తో.. నిర్లక్ష్యంగా కారణంగానో పలువురు మృత్యువాత పడుతుండడంతో వారి కుటుంబీకులకు శోకాన్ని మిగులుస్తోంది. 2012వ సంవత్సరంలో రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన నగరానికి చెందిన ఇద్దరు యువతీ, యువకులు మృత్యువాత పడ్డారు. ఇంకా 2013వ సంవత్సరంలో మడికొండకు చెందిన యువకుడు పైప్‌లైన్ పోస్తున్న ప్రదేశంలో ఈతకు వెళ్లి కన్నుమూశాడు. అనంతరం కాజీపేట నిట్‌కు చెందిన విద్యార్థి తెప్పపై నీటిలోకి దిగి మృత్యువాత పడ్డాడు. అలాగే, రెండు నెలల క్రితం దోమతెర సాయంతో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ కానిస్టేబుల్, మరో యువకుడు రిజర్వాయర్ వద్ద పైప్‌లైన్ పోస్తున్న ప్రదేశంలోనే పడిపోయి మతి మృతి చెందారు. ప్రస్తుతం ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు రిజర్వాయర్ వద్ద సరదాగా గడిపేందుకు వచ్చి మృతి చెందడంతో పలువురు విషాదంలో మునిగిపోయారు.
మరోమారు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఐదుగురు విద్యార్థులు నీటమునిగి మృతిచెందడం అత్యంత బాధాకరమని, మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతామని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. మేయర్ వెంట స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొలిపాక రజిత, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఘటన స్థలానికి చేరుకుని ఘటన వివరాలు ఆరా తీసి, సానుభూతిని వ్యక్తం చేశారు.