బార్‌ను తలపిస్తున్న హాస్టల్ వార్డెన్ గది
పిల్లల చదివిస్తూ ఆలనాపాలనా చూడాల్సిన వార్డెన్ దారి తప్పాడు. మద్యం తాగిన తర్వాత సైకోలా మారిపోతున్నాడు. విద్యార్థులను గదికి రప్పించుకుని బట్టలూడదీయించి నరకం చూపిస్తున్నాడు. ఎవరికై నా చెబితే మరింత పనిష్మెంట్ ఉంటుందని బెదిరించి శాడిజం ప్రదర్శిస్తున్నాడు. చివరకు విద్యార్థుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం కొడిమి సమీపంలో సంసిధ్ ఇంటర్నేషనల్ (సబీఎస్‌ఈ) స్కూల్ నిర్వహిస్తున్నారు. స్కూల్ ఆవరణలోనే హాస్టల్ కూడా ఉంది. విజయశంకర వరప్రసాద్ అనే వ్యక్తి హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నారు. ఈయన వార్డెన్ విధులను పక్కనపెట్టి ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఇతను తన గదిని బార్‌లా మార్చేశాడు.
బయటి నుంచి మద్యం తెచ్చుకోవడం గదిలోనే పూటుగా తాగడం.. ఆ మత్తులో రోజూ కొంతమంది విద్యార్థులను గదికి రప్పించుకుని వికృత చేష్టలకు పాల్పడటం పరిపాటిగా మార్చుకున్నాడు. వార్డెన్ దెబ్బలకు తట్టుకోలేక కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు, పటిష్ట నిఘాతో కూడిన పర్యవేక్షణ ఉంటుందని పంపితే వార్డెన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటంపై తల్లిదండ్రులు రగిలిపోయారు.
ఆదివారం రాత్రి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్ వద్దకు వస్తున్న విషయం తెలుసుకున్న వార్డెన్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు వార్డెన్ గదిని తనిఖీ చేయగా అక్కడ తాగి పడేసిన మద్యం బాటిళ్లు వందల సంఖ్యలో కనిపించాయి.
వార్డెన్‌పై కేసు నమోదు..
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వార్డెన్ విజయశంకర్ వరప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు అనంతపురం రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. వార్డెన్ పరారీలో ఉన్నాడన్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపామని చెప్పారు.
యాజమాన్యానికి నోటీసులు..
విద్యార్థులపై సంసిధ్ స్కూల్ హాస్టల్ వార్డెన్ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం అందడంతో డీఈఓ నాగరాజు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు సోమవారం స్కూలు కెళ్లి విచారణ చేపట్టారు. వార్డెన్ ప్రవర్తనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కూలు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి..
సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణయ్య, కుళ్లాయిస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ సంసిధ్ స్కూల్ హాస్టల్ వార్డెన్ నిత్యం మద్యం తెచ్చుకుని తాగుతున్నాడన్నారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు
మద్యం మత్తులో విద్యార్థులను విచక్షణారహితంగా చావబాదుతున్నాడన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, మంజు, పవన్, హరి, విశ్వ, రారాజు, శామ్యూల్, సిద్దు, గిరి, భీమేష్, సోము, చంద్రకాంత్, నందన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment