Anantapur Latest News
-
ఇంగ్లిష్ సార్లు లేరిక్కడ!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ పాఠ్యాంశాలు బోధించే టీచర్లు లేరు. ఫలితంగా పదో తరగతి విద్యార్థులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. 2023 జూన్‌లో అన్ని సబ్జెక్టులకు పదోన్నతులు కల్పించినా... హై కోర్టులో వివాదం కారణంగా ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతులకు బ్రేక్ పడింది. ఇంగ్లిష్ పదోన్నతులు తమకు మాత్రమే కల్పించాలంటూ డిగ్రీలో ఇంగ్లిష్ ప్రధాన అంశంగా ఉన్న ముగ్గురు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులు జరగకుండా హైకోర్టు స్టే విధించింది. అప్పట్లో 230 ఎస్జీటీలకు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 280కు చేరింది. వాస్తవానికి 2023, జనవరిలో సీనియార్టీ జాబితా తయారు చేసి తాత్కాలిక పదోన్నతులు కల్పించారు. జూన్‌లో రెగ్యులర్ పదోన్నతులు ఇచ్చే సమయంలో కోర్డు కేసు కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆగిపోయింది. నష్టపోతున్నది విద్యార్థులే ఉమ్మడి జిల్లాలోని టి.వీరాపురం, నేత్రపల్లి, 74–ఉడేగోళం, డి.కొండాపురం, భూపసముద్రం, గుమ్మఘట్ట, గోనబావి, గొల్లపల్లి, కలుగోడు, తాళ్లకెర, రంగచేడు, భూపసముద్రం, పూలకుంట, గొల్లపల్లి, మురడి, మండ్లి, అపిలేపల్లి, బసాపురం, బెస్తరపల్లి, యర్రగుంట, మలయనూరు, తెంగల్లు, లక్ష్మంపల్లి, కనకూరు, వలస, ఆగ్రహారం, కె.శివరం, హేమావతి, బుచ్చయ్యగారిపల్లి, బాచేహల్లి, శెట్టూరు, తిప్పనపల్లి గ్రామాల్లోని జిల్లాపరిషత్ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలలతో పాటు కేపీ దొడ్డి, తూముకుంట, మహనంతపురం, కరిగానపల్లి తదితర గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. కుందుర్పి మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుండగా ఏ ఒక్క స్కూల్లోనూ ఇంగ్లిష్ టీచరు లేరు. అక్కడక్కడా కొన్ని పాఠశాలల్లో ఇతర పాఠ్యాంశాల టీచర్లతో ఇంగ్లిష్ బోధించేలా సర్దుబాటు చేసి విద్యాశాఖ అధికారులు మిన్నకుండిపోయారు. ఇంగ్లిష్ టీచర్ల కొరత కాస్త విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. వీడని చిక్కుముడి.. ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతుల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరి 5న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతులపై దాఖలైన కేసులన్నీ డిస్పోజ్ చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పదోన్నతులు కల్పించాలని తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడి ఇప్పటికీ రెండు నెలలు దాటినా చిక్కుముడి వీడలేదు. మరోవైపు అర్హులైన ఎస్జీటీలకు అన్యాయం జరిగింది. మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే ఇంగ్లిష్ పదోన్నతులు పొందే వారు రెండేళ్ల సీనియార్టీని కోల్పోయారు. వీరిలో కొందరు ఉద్యోగ విరమణ పొందారు. అయినా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ మేల్కొనలేదు. ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ పాఠ్యాంశాల బోధనకు తీవ్ర ఆటంకం తీవ్రంగా నష్టపోతున్న విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో ఆగిన పదోన్నతులు హైకోర్టు ఉత్తర్వులిచ్చినా పదోన్నతుల్లో వీడని చిక్కుముడి రాష్ట్రంలో ఒక్క ఉమ్మడి ‘అనంత’ జిల్లాలోనే ఈ దుస్థితి -
‘ఉపాధి’ డిమాండ్ల సాధనకు 21న పాదయాత్ర
అనంతపురం అర్బన్: ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు ఈ నెల 21న ‘కష్టజీవుల పాదయాత్ర’ చేపట్టనున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాసం) రాష్ట్ర కార్యదర్శి బి.కేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాఽధి పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయని మండిపడ్డారు. ఉపాధి భృతిగా ప్రతి కూలీకి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కూలీలకు బకాయి పడిన రూ.37 కోట్ల వేతనాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకెళ్లే క్రమంలో కష్టజీవుల పాదయాత్రను నాడు ఉపాధి హామీ పథకం ప్రారంభించిన నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి ఈ నెల 21న ప్రారంభించనున్నామన్నారు. 22 సాయంత్రం 4.39 గంటలకు అనంతపురంలోని కృష్ణకళామందిర్‌లో బహిరంగసభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి వ్యకాసం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, తదితరులు పాల్గొంటారన్నారు. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నాగరాజు, పెద్దయ్య, రామాంజనేయులు, నరేష్ పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి -
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
బత్తలపల్లి: విద్యుత్ షాక్‌కు గురైన వివాహితను కాపాడే ప్రయత్నంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన కేశవనాయుడు రామాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయని గుర్తించిన ఆయన జీఏ వైరుతో పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గొర్రెల కాపరులు మేపునకు జీవాలను తోలుకు రావడంతో వారు ప్రమాదం బారిన పడకూడదని భావించిన ఆయన నాలుగు రోజుల క్రితం పొలం చుట్టూ విద్యుత్ కంచెను తొలగించాడు. అయితే విద్యుత్ స్తంభం నుంచి పొలం వరకూ లాగిన వైరును తొలగించడం మరచిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వివాహిత లక్ష్మి శుక్రవారం దుస్తులు ఉతికేందుకు అటుగా వెళ్లింది. ఆమె వెంట వెళ్లిన కుమారుడు విద్యుత్ తీగ వైపుగా వెళుతుండడం గమనించి కాపాడే ప్రయత్నంలో అటుగా అడుగు వేసింది. అయితే అక్కడ నేల తేమగా ఉండడంతో షాక్‌కు గురైంది. ఆ సమయంలో గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో ఉన్న నాగభూషణ వెళ్లి కట్టెతో తీగను కొట్టాడు. ఆ సమయంలో తీగ ఎగిరి నాగభూషణను తాకడంతో షాక్‌కు గురై కుప్పకూలాడు. విషయాన్ని గమనించగానే తల్లిదండ్రులు ఓబులేసు (69), లింగమ్మ ఒకరి వెనుక మరొకరు పరుగున వెళ్లి నాగభూషణు పైకి లేపే ప్రయత్నం చేయడంతో వారు కూడా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని అక్కడికి సమీపంలో ఉన్న రవీంద్రారెడ్డి గమనించి వెంటనే ట్రాన్స్ఫార్మర్ వద్దకెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. షాక్‌కు గురైన నలుగురూ అపస్మారక స్థితిలో ఉండడంతో గ్రామస్తులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందేలోపు ఓబులేసు మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆర్డీటీ ఆస్పత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఏఈ శివయ్య గ్రామానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఘటనపై బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నాటుసారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా
అనంతపురం: నాటు సారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా విధిస్తామని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంపై ఎకై ్సజ్ అధికారులతో స్థానిక ఆ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. పాత నేరస్తులు, అనుమానితులపై నిఘా ఉంచి, వారిని బైండోవర్ చేయాలన్నారు. తిరిగి నాటు సారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించేలా కఠినంగా వ్యవహరించాలన్నారు. నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా పీడీ చట్టం కింద కేసు నమోదుకు సిఫారసు చేయాలన్నారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. జిల్లాలో కల్తీ కల్లు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మద్యంషాపులు, బార్లలో ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లాప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్ రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రేవతి, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీరామ్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ సీఐ జయంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చర్చిపై నుంచి పడి యువకుడి మృతి
తాడిపత్రి టౌన్: గుడ్ ప్రైడే వేళ చర్చిపై నుంచి కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు.. తాడిపత్రిలోని నందలపాడులో నివాసముంటున్న జయమ్మ, మనోహర్ దంపతుల కుమారుడు విక్టర్కుమార్ (25)కు మతిస్థిమితం సరిగా లేదు. గుడ్ ఫ్రైడే ని పురస్కరించుకుని గురువారం రాత్రి చర్చి అలంకరణలో భాగంగా పిల్లలతో చాలా సేపు ఆడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చర్చిపైకి చేరుకున్న విక్టర్కుమార్.. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ లోపు పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలి ఆత్మహత్య యల్లనూరు: మండలంలోని గడ్డంవారిపల్లికి చెందిన రాగిపిండి చిన్న అంకిరెడ్డి భార్య వెంగమ్మ (80) ఆత్మహత్య చేసుకుంది. గత నెలలో చెయ్యి విరిగిన ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయించారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అంకిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రైల్లో ప్రయాణికుడి మృతి గుత్తి: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఉన్నఫళంగా మృతి చెందాడు. వివరాలు.. తెలంగాణలోని యాదాద్రికి చెందిన భీమన్న (42) బెంగుళూరుకు వలస వెళ్లి బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులు క్రితం సొంతూరుకు వెళ్లిన ఆయన శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి రైలులో బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. గుత్తి జీఆర్పీ పరిధిలో ప్రయాణిస్తుండగా బోగీలోనే కుప్పకూలాడు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే వైద్యులు చేరుకుని పరీక్షించారు. అప్పటికే గుండెపోటుతో భీమన్న మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ నాగప్ప దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణం అనంతపురం: నగర శివారులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన ఎర్రగుంట్ల రంగారెడ్డి (46) శుక్రవారం ఉదయం అనంతపురంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. 44వ జాతీయ రహదారిపై ఆర్కే ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రయాణిస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన చంద్రబాబు కొట్టాలకు చెందిన బైక్ మెకానిక్ షేక్ రహమాన్ ఢీకొన్నాడు. ఘటనలో కిందపడిన రంగారెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మామిడి చెట్ల నరికివేత పెద్దవడుగూరు: మండలంలలోని గ్రామానికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మన్న, పుల్లన్న, సన్న నారాయణ, పెద్ద నారాయణ, అనిల్‌కు చెందిన 105 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. మూడేళ్ల క్రితం పెన్నానదీ పరివాహక ప్రాంతంలో మామిడి మొక్కలు నాటుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొక్కలను నరికి వేయడంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, స్నిప్పర్ డాగ్‌ను రంగంలో దించి నిందితుల ఆధారాలను సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనంతపురం: టీడీపీ నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రజాప్రతినిధులు తమను గుర్తించడం లేదని, పోస్టులు, పనుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని రభస చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ సమక్షంలోనే లుకలుకలు బయటపడ్డాయి. శుక్రవారం అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ చేపట్టారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీపై పలువురు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మండల ఇన్చార్జ్గా ఉంటూ ఇబ్బందులు పడుతూనే పార్టీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు తమను ఏమాత్రమూ గుర్తించకుండా ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారని యల్లనూరు మండలానికి చెందిన వాసాపురం బాబు అలియాస్ మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. స్టోర్ డీలర్‌షిప్పులు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో తమ వర్గానికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొప్పేపల్లి రవికుమార్ రెడ్డి కల్పించుకోవడంతో వాగ్వాదం మొదలైంది. వాసాపురం బాబు, రవికుమార్‌రెడ్డి పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు. ఇన్చార్జ్ మంత్రి కల్పించుకుని ఇద్దరినీ అతిథిగృహం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వాసాపురం బాబుపై బొప్పేపల్లి రవికుమార్‌రెడ్డి తన అనుచరులతో కలసి దాడికి యత్నించాడు. దీంతో రవికుమార్‌రెడ్డి చొక్కాను వాసాపురం బాబు అనుచరులు గట్టిగా పట్టుకోగా.. అది చిరిగిపోయింది. సమీపంలోనే ఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడే రాళ్లు రువ్వుకునే స్థాయికి వెళ్లారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు. అనంతరం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, రవికుమార్‌రెడ్డి కలసి వెళ్లి ఎస్పీ కార్యాలయంలో వాసాపురం బాబుపై ఫిర్యాదు చేశారు. తన్నుకున్న తమ్ముళ్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమక్షంలోనే రభస నాయకుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు లీలావతి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోంది శింగనమల: ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని డమ్మీ చేసి తల్లి బండారు లీలావతి పెత్తనం చెలాయిస్తున్నారని టీడీపీకి చెందిన వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ సభ్యురాలు అంజినమ్మ, ప్రసాద్‌నాయక్ దంపతులు ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కడం లేదని వారు శుక్రవారం అనంతపురం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్‌కు ఎమ్మెల్యే సమక్షంలోనే ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పది నెలలైనా ప్రజా సమస్యల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ప్రజా సమస్యలు తీర్చకుండా పదవిలో ఉండి అవమానం పొందడం కన్నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి, వ్యక్తిగత గౌరవం కాపాడుకుంటామని స్పష్టం చేశారు. టూమెన్ కమిటీకి ప్రాధాన్యత ఏదీ? శింగనమల నియోజకవర్గంలో ఫీల్డ్ అసిసెంట్ పోస్టులను ఎమ్మెల్యే వర్గానికి చెందినవారితోనే భర్తీ చేశారని, టూమెన్ కమిటీ సిఫార్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడును ఇన్చార్జ్ మంత్రికి తెలియజేసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సదరు కార్యకర్త తీవ్రస్థాయిలో వాగ్వాదం చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని అతనికి మంత్రిని కలిసే అవకాశం కల్పించారు. -
ఆర్టీసీ ఆదాయానికి ‘ప్రైవేటు’ గండి
ఉరవకొండ: ప్రైవేట్ వాహనాల దెబ్బతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. అధికార పార్టీ అండదండలతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపోలో సూపర్ లగ్జరీ–4, అల్ట్రా డీలక్స్–4, ఎక్స్‌ప్రెస్–7 ఆర్డినరీ –44 చొప్పున మొత్తం 59 బస్ సర్వీసులు ఉన్నాయి. రోజూ 21వేల కిలోమీటర్లు తిరుగుతూ 20 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అధికార టీడీపీ నాయకులతో ప్రైవేట్ ఆపరేటర్లు ఒప్పందం కుదుర్చుకుని ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన 10 ఎర్టిగా కార్లను కొనుగోలు చేశారు. వీటిని ఉరవకొండ – అనంతపురానికి 8 సింగిల్స్ తిప్పుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా ఉరవకొండ నుంచి అనంతపురానికి ఆర్టీసీ బస్సులో టిక్కెట్ ధర రూ.85 ఉంది. ఎర్టిగా వాహనంలో ఒక్కొక్కరికి వంద రూపాయల చార్జీ వసూలు చేస్తున్నారు. చిన్న, పెద్ద అందరికీ ఇదే ధర వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను తరలించాలంటే ఎల్లో బోర్డు ఉండాలి. అయితే వైట్‌బోర్డు కలిగిన వాహనంలోనే యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అంతేకాదు పెట్రోలుతో నడిచే ఈ వాహనాలను ఆపరేటర్లు ఆదాయం కోసం గ్యాస్ సిలిండర్లను అమర్చుకుని తిప్పుతున్నారు. నాన్‌స్టాప్ కావడం, సమయం కలిసి రావడంతో ధర ఎక్కువైనా కొందరు ప్రయాణికులు వీటిలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రైవేట్ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా తిప్పడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి నెలకు రూ.2.50 లక్షల దాకా కోత పడుతోంది. ఎక్కడైనా అధికారులు పట్టుకుంటే తమ పేరు చెప్పాలని టీడీపీ నాయకులు చెప్పడంతో ప్రైవేట్ ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిపో ఎదుటే ప్రైవేట్ వాహనాల హల్చల్ ఆర్టీసీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్న వైనం టీడీపీ నాయకుల అండతో నిబంధనల ఉల్లంఘనప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఉరవకొండ డిపో నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేస్తాం. – హంపన్న, డిపో మేనేజర్, ఉరవకొండ ఆ వాహనాలను సీజ్ చేస్తాం ఉరవకొండ ఆర్టీసీ డిపో వద్దనే ప్రైవేట్ వాహనాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. వైట్ బోర్డులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఏడు నుంచి ఎనిమిది మందిని ఒకే వాహనంలో తీసుకెళ్తూ ఆర్టీసీకి నష్టం కల్గిస్తున్నారు. త్వరలోనే దాడులు నిర్వహించి ఆ వాహనాలను సీజ్ చేస్తాం. – రాజాబాబు, ఆర్టీఓ, గుంతకల్లు -
తప్పులకు ఎంఈఓలు, హెచ్‌ఎంలదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 117 జీఓకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరగాలని, ఏ చిన్న తప్పు జరిగినా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులదే పూర్తి బాధ్యత అని అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎం.ప్రసాద్‌బాబు, క్రిష్టప్ప హెచ్చరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. తుదిదశకు చేరుకోవడంతో ఎలాంటి తప్పులూ ఉండకూడదనే ఉద్దేశంతో శుక్రవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు హాజరయ్యారు. 15 రోజుల నుంచి సాగుతున్న ఎక్సర్సైజ్లో భాగంగా చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, డీఎస్పీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సమయం దగ్గర పడడంతో స్కూళ్ల వారీగా ఎన్ని పోస్టులున్నాయి... ఎన్ని ఖాళీలున్నాయనేది పక్కాగా తేల్చాల్సి ఉందని డీఈఓలు స్పష్టం చేశారు. హెచ్ఎంలు, ఎంఈఓలు ప్రతిపాదించిన స్కూళ్ల వివరాలు, నిబంధనల ప్రకారం జరిగాయా లేదా? అని పరిశీలించారు. గుర్తించిన తప్పిదాలను సవరించారు. అన్నమూ లేదు.. తాగునీళ్లూ లేవు విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లకు కనీసం భోజన వసతి కల్పించలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశంలో పాల్గొన్నారు. అసలే ఎండవేడిమి దంచేస్తోంది. మధ్యాహ్నం వరకు కనీసం తాగేనీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదు. సమావేశానికి హాజరైన వారు తరచూ నీళ్ల కోసమని బయటకు వెళ్లడం కనిపించింది. మధ్యాహ్నం పైన చల్లని తాగునీరు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉన్నా...మధ్యాహ్నం భోజనం విషయం గురించి పట్టించుకోలేదు. నిబంధనల మేరకే పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి జిల్లా డీఈఓల ఆదేశం -
క్రేజీ గేమ్ క్రికెట్. పొట్టి ఫార్మాట్, వన్డే, టెస్టు ఏదైనా సరే ఆట చూసేందుకు అభిమానులు అమితాసక్తి కనబరుస్తారు. ఆటను ఆటగా ఆస్వాదించినంత వరకు బాగానే ఉంటుంది. అయితే కొంతమంది కుర్రాళ్లు ఆ ఆటపై పందెం కాసి సునాయాసంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. పాకెట్ మనీ
● రోజూ రూ.150 కోట్ల వ్యాపారం ● తాడిపత్రి కేంద్రంగా భారీగా బెట్టింగ్ ● ఆర్థికంగా చితికి... చైన్‌స్నాచర్లుగా మారుతున్న యువత ● ఇంటర్మీడియెట్ విద్యార్థులూ బెట్టింగ్ మీద ఆసక్తి ● ఐపీఎల్ మ్యాచ్‌లతో ఆర్థికంగా పతనావస్థకు సాక్షి ప్రతినిధి, అనంతపురం : క్రికెట్.. ప్రేక్షకులను రంజింపచేయడమేమో కానీ బెట్టింగ్ రూపంలో పలువురి జీవితాలను కబళిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే దుఃఖసాగరంలో మునిగిపోతున్న దుస్థితి. ఎక్కడో జరుగుతున్న ఆటపై ఇక్కడ పందెం కాస్తూ క్రికెట్‌ను అతిపెద్ద జూద స్థావరంగా మార్చుకున్న యువతకు ఇదొక శాపంగా పరిణమించింది. పండ్ల తోటలు, మెట్ట పైర్లకు వేదికగా, కరువు ప్రాంతంగా ముద్రపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అతిపెద్ద బెట్టింగ్ కేంద్రంగా మారి వందలాది కుటుంబాలను చిదిమేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ఒక్కరోజులోనే ఎంతోమంది యువకుల జీవితాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఒక్కో మ్యాచ్‌కు రూ.150 కోట్ల బెట్టింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.150 కోట్లకుపైగా బెట్టింగ్ జరుగుతున్నట్టు అంచనా. బెట్టింగ్‌లో ఎక్కువగా 30 ఏళ్లలోపు యువత పాల్గొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ మొత్తానికి ఒక పందెం, ఓవర్ టు ఓవర్ ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. నాలుగు రోజుల కిందట పంజాబ్ కింగ్స్ లెవెన్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ కింగ్స్ లెవెన్ 111 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా గెలుస్తుందని వెయ్యికి లక్ష రూపాయలు పందెం జరిగింది. పంజాబ్ ఓడిపోతుందని బెట్టింగ్ కాసిన వాళ్లు బికారులైపోయారు. ఆర్థికంగా చితికి దొంగలుగా మారి.. నాలుగు రోజుల క్రితం ఆరుగురు చైన్స్నాచర్లను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి పూర్వాపరాలు ఆరా తీస్తే.. అందరూ క్రికెట్ బెట్టింగ్ ఆడి ఆర్థికంగా అప్పులపాలైన వారే. అప్పుల నుంచి గట్టెక్కేందుకు చైన్‌స్నాచర్లుగా మారారు. ఎక్కడ ఒంటరి మహిళలు కనిపించినా బంగారు గొలుసులు లాక్కెళ్లడం, వచ్చిన డబ్బుతో జల్సా చేయడం.. ఇదీ పరిస్థితి. వీళ్లే కాదు ధర్మవరం, కదిరి, హిందూపురం, అనంతపురం, ఉరవకొండ ఇలా పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయిన వారు దొంగలుగా మారారు. కొంతమంది అప్పుల వారి నుంచి ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా బుకీలు గంజాయి, మట్కాకే కాదు ఇప్పుడు బుకీలకూ తాడిపత్రి కేంద్ర బిందువైంది. గొలుసు దొంగలు (చైన్‌స్నాచర్లు) దొరికిన రెండు రోజులకే తాడిపత్రిలో క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కారు. దొరికింది ఏడుగురే అయినా ఇంకా చాలామంది ఉన్నట్టు పోలీసుల అంచనా. అమాయక యువకులకు ఆశ చూపి బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్నారు. సర్వస్వం కోల్పోయాక కానీ కుర్రాళ్లు తెలుసుకోలేరు. ఇంటర్మీడియెట్ కుర్రాళ్లు సైతం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఒక విషవలయంలా మారింది. జీవితాలు ఫణంగా పెట్టొద్దు పంపాచారి, షాకీర్, నాగార్జున, ఫజిల్ అహ్మద్ ఈ నలుగురూ పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లలో నష్టపోయి దొంగలుగా మారారు. ఈజీ మనీకోసం ఇలా బెట్టింగ్.. ఆ తర్వాత దొంగతనాలు చేయడం జరుగుతోంది. యువత కెరీర్ చూడాలి కానీ బెట్టింగ్ వైపు కాదు. క్రికెట్ బెట్టింగ్ ప్రమాదకరం. ఆటను ఆటవరకే ఆస్వాదించాలి కానీ బెట్టింగ్‌వైపు చూడకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆర్థిక స్థితిగతులపై ఒక నిఘా వేసి ఉంచాలి. పేకాట, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్వైపు వెళ్లి జీవితాలు ఫణంగా పెట్టకండి. –పి.జగదీష్, ఎస్పీ, అనంతపురం -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
బుక్కరాయసముద్రం: తీవ్రమైన ఎండల తో ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. ఓబులాపురం గ్రామానికి చెందిన మహానందరెడ్డి శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తోటకు వెళ్లారు. కాసేపటి తర్వాత ఆయన తల్లి రామక్క (80) కూడా నడుచుకుంటూ తోటకు వెళ్లింది. కాసేపు తోటంతా కలియదిరిగి 11.30 గంటల తర్వాత తిరిగి ఆమె నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. భగభగమండే ఎండలోనే తిరగడంతో ఆమె వడదెబ్బకు గురైంది. కాస్త అలుపు వచ్చినట్టవడంతో ఇంటి బయటే మంచంపై పడుకుంది. గంట తర్వాత కుమారుడు, కోడలు వచ్చారు. నీళ్లు తాగాలని చెబుతూ లేపడానికి ప్రయత్నించగా ఆమెలో చలనం లేదు. నిశితంగా పరిశీలించగా అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది. వడదెబ్బతోనే ప్రాణం విడిచిందని నిర్ధారించుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఓబులాపురం వెళ్లి రామక్క మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న నాన్‌టీచింగ్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు www.samagrashik shaatp.blogspot.com వెబ్సైట్ ద్వారా శనివారం నుంచి ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 42 ఏళ్ల వరకు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగినులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, గౌరవ వేతనం, విద్యార్హత వివరాలు వెబ్సైట్లో ఉంచిన నోటిఫికేషన్ ద్వారా పొందాలని ఏపీసీ వివరించారు. ఖాళీల వివరాలు ఇలా... ● టైప్–3లో మొత్తం 43 ఖాళీలు (హెడ్కుక్– 8, అసిస్టెంట్ కుక్–19, డేఅండ్‌నైట్ వాచ్ ఉమెన్–5, స్వీపర్–6). ● టైప్–4లో మొత్తం 28 ఖాళీలు (హెడ్కుక్–6, అసిస్టెంట్ కుక్–14, చౌకీదార్–8) ‘కూలీల హాజరు పెంచండి’ ఆత్మకూరు: ఉపాధి కూలీల హాజరు శాతాన్ని పెంచాలని సంబంధిత అధికారులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ మల్లెల శివప్రసాద్ ఆదేశించారు. గొరిదిండ్ల పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ప్రతి పంచాయతీలో కూలీల సంఖ్య పెంచి పనుల లక్ష్యం త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు తమ పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే భూములు సారవంతమవుతాయన్నారు. డ్రైల్యాండ్ హార్టీకల్చర్‌లో భాగంగా మెట్ట భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీంబాషా, ఏపీడీ చెన్నకేశవులు, ఈసీ బబ్లు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు. -
కూటమిలో సమస్యలు చిన్నవే
అనంతపురం టవర్‌క్లాక్: కూటమి పార్టీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని సర్దుకుంటూ ముందుకెళ్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల భర్తీ, తదితర విషయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందు కోసమే ప్రతి జిల్లాకూ ఇన్చార్జ్ మంత్రులను నియమించారన్నారు. టీటీడీ గోశాలపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలూ లేవని, గోవుల మృతికి కారణాలు అనుకోకుండా జరిగేవేనని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, గుమ్మనూరు జయరామ్, బండారు శ్రావణిశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు. -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రొళ్ల మండలం హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతాండ, రొళ్లకొండ, అలుపనపల్లి, ఏ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల్లో ఉత్సవాన్ని జరుపుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి
ముదిగుబ్బ: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో దొరిగిల్లు క్వార్టర్స్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు.. దొరిగిల్లుకు చెందిన రమణయ్య (46) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి పనులు ముగిసిన తరువాత స్నానం చేసేందుకు తోట సమీపంలోని గుర్రాల మడుగులోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. రోడ్డు ప్రమాదంలో తమ్ముడు.. నాలుగు రోజుల క్రితం రమణయ్య సోదరుడు మునికృష్ణ (45) మొలకలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో దొరిగిల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. రమణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే మునికృష్ణ భార్య ఇప్పటికే చనిపోగా ఓ కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శివరాముడు తెలిపారు. ● నీటి మడుగులో ఒకరు.. రోడ్డు ప్రమాదంలో మరొకరు ● దొరిగిల్లులో విషాదం -
ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
అనంతపురం సిటీ: స్తానిక రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న ఈపీఎఫ్ కార్యాలయం వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. బకాయి వేతనాలు పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా కాంట్రాక్టర్లు తప్పుడు ఆరోపణలు చేయడం, వారికి అధికారులు వత్తాసు పలుకడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు చెల్లించాల్సిన వేతన బకాయిలతో పాటు పీఎఫ్ డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయాలని నినాదాలు చేశారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు అధికారులు తొత్తులుగా మారి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్దం
రాయదుర్గం టౌన్: మండలంలోని కదరంపల్లి గ్రామంలో రైతు కుమారస్వామి సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో శరవేగంగా మంటలు వ్యాపించి 9 ఎకరాల్లోని మొక్కజొన్న పంటను చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న రైతు స్థానికుల సాయంతో మంటలు అదుపు చేశారు. ఈ లోపు 5 ఎకరాల్లోని పంట పూర్తిగా కాలిపోయింది. మరో రెండు రోజుల్లో మొక్కజొన్న కంకులు కోయాల్సి ఉండగా ఈ ఘటన జరగడంతో రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్లో ఇద్దరికి చోటు అనంతపురం అర్బన్: అఖిల భాతర కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తమిళనాడులోని నాగపట్నంలో మూడు రోజులుగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం కౌన్సిల్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు అన్నగిరి కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జునకు చోటు దక్కింది. -
కనెక్షన్ కింగ్‌లు!
● తారస్థాయికి విద్యుత్ అధికారుల అక్రమాలు ● ఇష్టారాజ్యంగా వసూళ్లు ● డబ్బు దండుకుని అక్రమంగా కనెక్షన్లు ● పైసలివ్వకుంటే అంతులేని జాప్యం అనంతపురం టౌన్:విద్యుత్ శాఖ అధికారుల చేతివాటం తారస్థాయికి చేరింది. ముడుపులు ముట్టజెబితే తప్ప ముందుకెళ్లని పరిస్థితి నెలకొంది. స్వయంగా ఉన్నతాధికారులే వసూళ్లు చేస్తుండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని కింది స్థాయి సిబ్బంది సైతం జేబులు నింపుకుంటున్నారు. అనంతపురం నగర పరిధి రోజు రోజుకూ విస్తరిస్తోంది. పెద్ద పెద్ద భవనాలు, వెంచర్లు, డూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇదే అదునుగా విద్యుత్ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముందు అనుమతుల పేరిట కొర్రీలు విధిస్తూ.. ముడుపులు అందగానే అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. డీ 2, డీ3 సెక్షన్లలో అపార్ట్మెంట్లను సైతం వదలడం లేదని తెలిసింది. ‘మీరు 4 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి తీసుకున్నారు.. ఇక్కడ మాత్రం 5 ఫ్లోర్లు నిర్మించారు.. 5వ ఫ్లోర్‌కు విద్యుత్ సర్వీసు ఇవ్వం’ అంటూ బెదిరించడం.. డబ్బు అందగానే వాటికి సైతం సర్వీసు మంజూరు చేయడం షరామామూలుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆరుకు పైగానే సర్వీసులు మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. ఇక.. 100 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉన్న అపార్ట్మెంట్లకు 60, 40 కిలోవాట్లకు మాత్రమే ఎస్టిమేషన్లు వేస్తున్నట్లు సమాచారం. సంస్థపై పెనుభారం.. విద్యుత్ అధికారుల బాగోతంతో ఎస్పీడీసీఎల్ సంస్థపై అదనపు భారం పడుతోంది. ఇష్టారాజ్యంగా సర్వీసులు ఇస్తుండడంతో లో ఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సమస్యను అధిగమించేందుకు ఎస్పీడీసీఎల్ రూ.కోట్లు ఖర్చు చేస్తూ అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం రోడ్డు బాలాజీ విల్లాస్ వెనుక భాగంలో నాలుగేళ్ల క్రితం వెలసిన వెంచర్ ఇది. కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన ఓ బిల్డర్ ఇక్కడ కొన్ని ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు విద్యుత్ సర్వీస్ కోసం డీ–5 సెక్షన్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే విద్యుత్ శాఖ టౌన్ 2లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెంచర్‌కు అనుమతులు లేవు.. విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించవని చెప్పారు. ఈ క్రమంలో ఉన్నతాధికారికి సదరు బిల్డర్ రూ.2 లక్షలకు పైగా ముడుపులివ్వగా.. వెనువెంటనే సర్వీస్ మంజూరు చేశారు. నారాయణపురంలో సైతం ఇలాగే ఓ వెంచర్ నిర్వాహకుడి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలిసింది. అపార్ట్మెంట్లకు సైతం అనుమతుల నెపంతో ఆయన భారీగా వసూళ్లు చేస్తున్నట్లు విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న షూమార్టును అనంతపురం సుభాష్ రోడ్డులో ఇటీవలే ప్రారంభించారు. భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో టౌన్–1లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 40 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉంటుందని, 63 కిలోవాట్ల సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని బిల్డింగ్ నిర్వాహకుడికి చెప్పారు. ఈ క్రమంలో నిర్వాహకుడు రూ.5 లక్షలకు పైగా చెల్లించగా.. వెంటనే సిటీమీటర్ను రిలీజ్ చేసి సర్వీస్ మంజూరు చేశారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ట్రాన్స్ఫార్మర్ను చార్జ్ చేసిన తర్వాతనే సర్వీస్ మంజూరు చేయాలి. అయితే ముడుపులు అందడంతో అవన్నీ గాలికి వెళ్లిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇటీవల సుభాష్‌రోడ్డు, కమలానగర్ ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తుతుండటం గమనార్హం. చర్యలు తీసుకుంటాం విద్యుత్ సర్వీసుల మంజూరు కోసం వెంచర్ల నిర్వాహకుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్న ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ చేపడతాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేసిన తర్వాతే సిటీ మీటర్లు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. – శేషాద్రిశేఖర్, ఎస్ఈ -
ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురిని గురువారం తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ వివరాలు వెల్లడించారు. పట్టణ శివారులోని రజక కల్యాణ మంటపం వద్ద ‘ఏస్ టీకింగ్’ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏజెంట్ మకందర్ సంధానీ తచ్చాడుతుండగా... అనుమానంతో ఎస్ఐ గౌస్‌బాషా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈజీ మనీ కోసం సెల్ఫోన్లలో మట్కా, యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారణ కావడంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితులు బలపనూర్ షబ్బీర్, మకందర్ జిలానీ, మకందర్ మహబూబ్‌బాషా, డోంగ్రీ హరూన్, పోస నరేష్ బాబు, షేక్ ముజీబ్, పామిడి మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.20 లక్షలు నగదుతో పాటు 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందరూ జేసీ అనుచరులే అరెస్ట్‌యిన వారిలో మకందర్ సంధానీ క్రికెట్ బుకీ కాగా, డోంగ్రీ హరూన్ తాడిపత్రిలో హరూన్ మోటార్స్ పేరుతో ఎలక్ట్రికల్ బైక్‌లు విక్రయిస్తున్నాడు. అతనికి పార్టనర్‌గా మకందర్ జిలానీ ఉన్నారు. హరూన్ మోటార్స్‌లో డ్రైవర్‌గా షేక్ ముజీబ్ పనిచేస్తున్నాడు. హరూన్‌కు బలపనూర్ షబ్బీర్ స్నేహితుడు. పామిడి మహమ్మద్ మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతనికి పోస నరేష్‌బాబు స్నేహితుడు. వీరంతా స్థానిక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. 4.20 లక్షలు నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం -
ఊరించి ఉసూరుమనిపించారు..
●పట్టుమని పది నెలల్లోనే టీడీపీకి దూరమైన ‘అనంతపురం’ నేతలు ●తాజాగా జరిగిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల సమావేశానికి డుమ్మా ●అధిష్టానం సీరియస్‌గా ఉందని హెచ్చరించినా బేఖాతరు ●ఎన్నికల ముందు ఊరించి ఉసూరుమనిపించారంటూ ఆవేదన ●అన్ని ఆదాయ వనరులూ ఒకరికే చెందుతున్నాయని నిట్టూర్పు సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో అప్పుడే అసమ్మతి సెగలు రేగాయి. కూటమి సర్కారు ఏర్పడి పట్టుమని పది నెలలు కూడా కాకుండానే టీడీపికి చెందిన ముఖ్య నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత రెండు మాసాలుగా కేడర్‌కూ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేడర్‌లో ఏ ఒక్కరికీ పనులు కావడం లేదని, అన్నీ ఎమ్మెల్యే మనుషులకే దక్కుతున్నాయని, ఈ మాత్రం దానికి తామెందుకు పార్టీ కోసం కష్టపడాలని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సభ్యత్వ నమోదు కూడా తూతూమంత్రంగా జరిగినట్లు తెలిసింది. సమావేశానికి రాంరాం.. రెండు రోజుల క్రితం అనంతపురం టీడీపీ పరిశీలకుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల సమావేశం జరిగింది. ఇందుకు అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులెవరూ హాజరు కాలేదు. మాజీ మేయర్ స్వరూప, సుధాకర్ నాయుడు, ఆదెన్న, బుగ్గయ్య, రాయల్మురళి, జేఎల్ మురళి వంటి వారు ఆ వైపు చూడలేదు. వీళ్లందరూ ఇటీవలి వరకూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారే. అలాంటి నేతలు నేడు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. మార్కెట్ యార్డు చైర్మన్‌గిరీ.. అన్ని చోట్లా వారికే..! అనంతపురం మార్కెట్ యార్డ్ తనకే దక్కుతుందని టీడీపీకి చెందిన ఓ మహిళ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పటికే సంబంధిత ప్రజాప్రతినిధికి రూ.65 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. సదరు మహిళ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పటికే రాప్తాడు మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీని కమ్మ సామాజిక వర్గ నేతకే కట్టబెట్టారు. ఈ క్రమంలో అనంతపురంలో కూడా అదే సామాజిక వర్గ నేతకు పదవి ఎలా అప్పజెబుతారని కేడర్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ మహిళకు ఇవ్వకపోతే తన సమీప బంధువు కోనంకి గంగారాంకు పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్లు తెలిసింది. గంగారాం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాపు, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు గుర్రుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకునేది లేదని బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉండగా దగ్గుపాటి ప్రసాద్‌కు సొంత పార్టీలోనే బద్ధశత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాం.. ఎన్నికల ముందు మాకు ఎన్నో హామీలిచ్చారు. పదవులు ఇస్తామన్నారు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త వ్యక్తి అయినా దగ్గరుండి గెలిపించాం.. కానీ ఇప్పుడు పదవులూ లేవు, ఆదాయమూ లేదు’ అంటూ ఓ టీడీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డామని.. అప్పులు చేసి ఖర్చు పెడితే ఇప్పుడా అప్పులకు వడ్డీలు కడుతున్నామని కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఒక నాయకుడు వాపో యారు. ‘ఆదాయమొచ్చే పనులు ఎమ్మెల్యేకు, కష్టం మాకా’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఎమ్మెల్యే పాల్గొంటున్న సమావేశాలకు వెళ్లడం లేదని మరో నాయకుడు తెగేసి చెప్పారు. కేడర్ ఎవరూ ఇష్టంగా పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమని కాపు సామాజిక వర్గ నేత చెప్పారు. -
హోరీహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్: కాశిరెడ్డి నాయన నూతన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామంలో గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 14 జతల దేశం ఎద్దులను పోటీలకు రైతులకు తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన రైతు హుసేనప్ప ఎద్దులు మొదటి స్థానంలో, డి.హీరేహాల్ మండలం ఉద్యాల గ్రామ రైతు నరసింహులు ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమాలను గ్రామ సర్పంచ్ మల్లికార్జున, మాజీ సర్పంచ్ రాజన్న, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రంగనాయకులు, పరశురాముడు, వెంకటరాముడు, పందికోన శివ.. నగదు పురస్కారాలతో సత్కరించారు. విద్యుదాఘాతంతో రైతు మృతి రాయదుర్గం: మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన రైతు కావలి ఎర్రిస్వామి (54)విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఎర్రిస్వామి.. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులు ఎగిరిపోయినట్లుగా గుర్తించి, వాటిని వేస్తున్న క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ.10 లక్షల విలువైన బైక్‌ల స్వాధీనం
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ప్రణయ్, ధనూష్, సిద్ది వినయ్ వ్యసనాలకు బానిసలుగా మారి జులాయిగా తిరుగుతూ తమ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను కలుపుకున్నారు. వీరంతా కలసి ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అనంతరం ఇతర రాష్ట్రాలకు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో బత్తలపల్లిలోని జాతీయ రహదారి కూడలిలో గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వెళుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బత్తలపల్లి, ధర్మవరం, అనంతపురం నగర పరిధిలో అపహరించిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుందని నిర్ధారించారు. వీరిపై బత్తలపల్లిలో రెండు, ధర్మవరం టూ టౌన్ పరిధిలో మూడు కేసులు, అనంతపురంలో ఐదు కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్లను బాలుర పరివర్తన కేంద్రానికి తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన ఎస్ఐ సోమశేఖర్, సిబ్బందిని సీఐ ప్రభాకర్ అభినందిస్తూ రివార్డులను అందజేశారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ -
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం కొనసాగుతోంది. గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
అనంతపురం నుంచి బెంగళూరుకు రైలు ● కొత్తగా ఏడు స్టేషన్లలో స్టాపింగ్ అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు వరకు నడిచే మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించారు. దీంతో పాటు అనంతపురం నుంచే బెంగళూరుకు బయలుదేరేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసులు కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని అధికారులు ఎట్టకేలకు మన్నించారు. త్వరలోనే రైలు అనంతపురం నుంచి బయలుదేరేలా ప్రణాళిక రచించారు. ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్య ఇప్పటి వరకు ఉన్న స్టాపింగులతో పాటు అదనంగా ప్రసన్నాయపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల, బాసంపల్లె, కొత్తచెరువు, విదురాశ్వర్థం, సోమేశ్వరలో స్టాపింగ్ సదుపాయం కల్పించారు. సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అతి త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్ కుమార్ వేర్వేరుగా తెలిపారు. అనంతపురంలో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు బెంగళూరు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. -
పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే
గార్లదిన్నె: పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే నిర్వహించనున్నట్లు ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గార్లదిన్నె మండలంలోని ముకుందాపురాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో గురువారం ఉద్యాన శాఖ, ఎఫ్పీఓలు, ఏపీఎంఐపీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రైతులకు చేరువ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. 17 బృందాలు ముకుందాపురంలో చీనీ తోటలను సందర్శించి జీపీఎస్ ట్రాకింగ్ చేస్తాయన్నారు. చీనీ తోటలకు ఆశించే చీడపీడలు, యాజమాన్య పద్ధతులపై ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాయన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ‘జూమ్’ ద్వారా ఏపీఎంఐపీ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్, ఐటీ (ఇంటెలిజెన్స్) శ్రీహరి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ మైక్రో ఇరిగేషన్ అధికారులు మధు, గణేష్, నాగార్జున, ఎఫ్పీఓలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పైలట్ గ్రామంగా ముకుందాపురం ఎంపిక -
ఉత్సాహంగా ఉరకలెత్తిన దున్నలు
కణేకల్లు: స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన దున్నపోతుల రాతిదూలం పోటీలు ఆసక్తిగా సాగాయి. స్థానిక జెడ్పీఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిగా పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో రాతి దూలాన్ని లాగుతూ దున్నపోతులు ఉరకలేయడాన్ని చూసి ప్రజలు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. రైతు కె.ముజ్జుకు చెందిన దున్నపోతులు 15 నిమిషాల వ్యవధిలో 2,608.10 అడుగుల మేర దూరాన్ని రాతిదూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మరో రైతు తిప్పేష్కు చెందిన దున్నపోతులు ద్వితీయ స్థానంలో, రైతు జి.రిజ్వంత్కు చెందిన దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నల యజమానులను అభినందిస్తూ సర్పంచ్ దంపతులు నిర్మల, డాక్టర్ సోమన్నతో నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో కణేకల్లు మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్, కణేకల్లు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, స్థానికులు లాలెప్ప, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాతిదూలం లాగుతున్న దున్నపోతులు -
గంజాయి మహమ్మారిని నిర్మూలిద్దాం
అనంతపురం: గంజాయి మహమ్మారి నిర్మూలనకు సమష్టిగా పనిచేద్దామని అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్జీఓలతో అడిషనల్ ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి గుర్తింపునకు డోర్ టు డోర్ సర్వే చేయాలన్నారు. పోలీస్, ఎకై ్సజ్, జిల్లా ఈగల్ సెల్, విద్యాశాఖ, గ్రామ, వార్డు సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సీఐలు హరినాథ్, వెంకటేశ్ నాయక్, జయపాల్ రెడ్డి, జిల్లా ఈగల్ సెల్ ఆర్ఎస్ఐ హనుమంతు తదితరులున్నారు. -
తలపై రాయిపడి యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: నిద్రిస్తున్న యువకుడి తలపై రాయిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేణు, సునందమ్మ దంపతులు కరూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం ఇంటి ఆవరణలో నిద్రకు ఉపక్రమించారు. అర్థరాత్రి సమయంలో మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తు రాయి నిద్రిస్తున్న వేణు తలపై పడడంతో తీవ్ర గాయమైంది. భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అధిక రక్తస్రావంతో అప్పటికే వేణు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య గుంతకల్లు: బీటెక్‌లో ఒక సబ్జెక్ట్ తప్పడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కూడేరుకు చెందిన జాఫర్‌వలి కుమారుడు పి.మహమ్మద్ జావేద్ (18) గుత్తిలోని గేట్స్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గుంతకల్లులోని ద్వారాక నగర్లో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చేవాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినట్లుగా గుర్తించి మానసికంగా కుదేలయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చిన జావేద్ రాత్రి 9 గంటలవుతున్నా ఇంటికి చేరుకోలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన జావేద్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జావేద్ సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలో చేరుకుని పరిశీలించగా పట్టాలపై రెండుగా విడిపోయిన జావేద్ శరీర భాగాలు కనిపించాయి. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి దుర్మరణం పామిడి: అతి వేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన శివకుమార్ కుమారుడు సుమంత్ (25) వ్యక్తిగత పనిపై గురువారం ఉదయం గుంతకల్లుకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన.. పామిడి గ్రామ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక నేరుగా వెళ్లి కల్వర్టు రక్షణ గోడను ఢీకొన్నాడు. ఘటనలో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బాధితులకు ఇదేనా మీరు చేసే న్యాయం?
అనంతపురం అర్బన్: ‘మీకు ఎస్సీ, ఎస్టీలన్నా, వారి సమస్యలన్నా చిన్న చూపు. బాధితుల సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ చూపరు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలను పరిష్కరించడం లేదు’ అంటూ అధికారులను సంఘాల నాయకులు నిలదీశారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌తో పాటు జిల్లా ఎస్పీ పి.జగదీష్, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, సాంఘిక సంక్షేమశాఖాధికారి రాధిక, అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 238 అర్జీలు అందాయి. ఒక బాధితురాలికి న్యాయం చేసే విషయంలో డీఆర్‌ఓతో ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా వీరా వాగ్వాదానికి దిగారు. నగర పరిధిలో నివాసముంటున్న ఎరికల కులానికి చెందిన మహిళ సామూహిక అత్యాచారానికి గురైందన్నారు. అప్పట్లో పోరాటం చేస్తే రూ. లక్ష ఆర్థిక సాయం అందించారన్నారు. జీఓ 95 ప్రకారం బాధితురాలికి ఐదు సెంట్ల స్థలం ఇవ్వాల్సి ఉందని, తొమ్మిదేళ్లుగా అర్జీలిస్తున్నా బాధితురాలికి న్యాయం చేయలేద న్నారు. ఈ విషయంలో ఆర్డీఓ, తహసీల్దారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. డీఆర్ఓ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానన్నారు. వినతుల్లో కొన్ని... ● తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారంటూ కళ్యాణదుర్గం మండలం లక్ష్మీపురం ఎస్టీ కాలనీకి చెందిన వాలేనాయక్ ఫిర్యాదు చేశాడు. కంబదూరు మండలం పాలూరు గ్రామ పొలం సర్వే నంబరు 80–1లో 3.50 ఎకరాల భూమి తన తల్లి పేరిట ఉందని, ఈ భూమిని గ్రామంలోని ఒక వ్యక్తి, తహసీల్దారు కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు కలిసి ఆక్రమించారని తెలిపారు. దీనిపై ఆర్డీఓ, తహసీల్దారు, పోలీసులు భూమి హద్దులు వేసినా ఆక్రమణ దారులు తొలగించారని, భూమిలోకి వస్తే చంపుతామంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు. ● 20 నెలలుగా తనకు వేతనం అందడం లేదంటూ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి సూర్యనారాయణ విన్నవించాడు. డ్యూటీపై ఎక్కడా తిరగనివ్వడం లేదని, ఆఫీసులో కూర్చోబెడుతున్నారని వాపోయాడు. ● రుణానికి సంబంధించి సబ్సిడీ మంజూరులో అధికారులు జాప్యం చేస్తున్నారని యల్లనూరు మండలం పాతపల్లికి చెందిన పి.విజయ ఫిర్యాదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైందని, అయితే సబ్సిడీ మంజూరు క్రమంలో ఫైల్‌ను బ్యాంకుకు పంపకుండా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులను నిలదీసిన ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ప్రత్యేక గ్రీవెన్స్‌లో 238 వినతులు భద్రతా ప్రమాణాలు పాటించాలి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆరు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. రసాయనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత జిల్లా మినరల్ ఫండ్ ద్వారా తాగునీరు, విద్య, వైద్యానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కల్యాణ యోజన (పీఎంకేకేకేవై)పై గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, జేసీ అస్మిత్‌రెడ్డి, దగ్గుపాటి ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 31 నాటికి రూ.52.66 కోట్ల నిధులు నూతన పనులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో నియోజకవర్గానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనులు మంజూరు చేసేందుకు కమిటీ ప్రతిపాదన చేసిందని చెప్పారు. సమావేశంలో గనుల శాఖ డీడీ వెంకటేశ్వర్లు, తాడిపత్రి ఏడీ ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశ్వాసముంచితేనే నిత్య జీవము
‘ఎదుటి వారి కష్టాలను పంచుకోవడంలోనే శాంతి దాగుంది’ అనే పరమ సత్యాన్ని చాటడానికే క్రీస్తు సిలువనెక్కి రక్షకుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము చేయనివాడు కనుకనే తనకు తానే సిలువకు అప్పగించుకున్నాడు. మనుష్యుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ, త్యాగము క్రీస్తు జీవితంలో మాత్రమే చూడగలం. విశ్వాసముంచితేనే నిత్య జీవము అనే క్రీస్తు బోధనల సారమే గుడ్‌ఫ్రైడే పర్వదినం. గుల్జార్‌పేట్‌లోని గాస్పెల్ అసెంబ్లీ హాలులో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో అందరూ పాల్గొనండి. – ఫిలిఫ్, దైవజనులు -
క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే
అనంతపురం కల్చరల్: క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడే గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం సమాజంలో నెలకొన్న చెడును తొలగించడానికి ఈ రోజున తన జీవితాన్ని యేసు క్రీస్తు త్యాగం చేశాడు. ఆ త్యాగాలను మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్షమ, కరుణకు ప్రతిరూపంగా నిలిచిన యేసు క్రీస్తు.. లోకంలో పాపులను పరిశుద్ధులను చేసే క్రమంలో సిలువపై రక్తం చిందించిన దైవ కుమారుడిగా మరణించి కూడా పునరుత్థానుడై లేచిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఆ ఘట్టాలను వివరించే గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం వచ్చే ఈస్టర్ పర్వదినం వరకు సాగే వేడుకలకు జిల్లాలోని ప్రతి ప్రార్థనామందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నేనే మార్గం – నేనే జీవం పాపులను పరిశుద్ధులను చేసేందుకు కరుణామయుడైన క్రీస్తు సిలువనెక్కిన రోజున గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నట్లు పలువురు పాస్టర్లు తమ సందేశాలలో చెపుతున్నారు. నేనే మార్గం.. నేనే జీవం అని సమస్త మానవాళిలో స్థైర్యం నింపుతూ యేసయ్య చిరునవ్వుతో తన దేహాన్ని బలిదానంగా అర్పించిన రోజు శుభ శుక్రవారంగా మారిందని, ఉపవాసాలతోనే ఆయనను మెప్పించాలని పేర్కొన్నారు. ముస్తాబైన చర్చిలు సాధారణంగా ఇతర పండుగలకు భిన్నంగా గుడ్‌ఫ్రైడే ఆనందోత్సాహాలతో కాకుండా క్రీస్తు త్యాగానికి ప్రతీకగా కనపడుతుంది. కాబట్టే ఈ దినాల నాడు ఉపవాసాలుండడం ఆనవాయితీగా వస్తోంది. క్రీస్తు చివరిసారి సిలువపై పలికిన ఏడు వ్యాక్యాలు ప్రార్థనామందిరాలలో ఇప్పటికే ప్రతిధ్వనిస్తున్నాయి. అనంతలోని పురాతన మందిరాలైన సీఎస్ఐ చర్చిలో పెద్ద ఎత్తున క్రైస్తవులతో రెవరెండ్ బెనహర్‌బాబు నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో ప్రాచీన ప్రార్థనామందిం ఎస్ఐయూ చర్చిలో బెంగళూరు నుంచి విచ్చేసే అంతర్జాతీయ సువార్తీకులు స్టీఫెన్ బాబ్, సంఘ కాపరి పాస్టర్ సంపత్‌కుమార్‌తో కలసి వల్యక్యోపదేశం చేయనున్నారు. రామచంద్ర నగర్‌లోని కార్మియల్ మాత మందిరంలో క్రీస్తు జీవితాన్ని సజీవంగా ఆవిష్కరించే లఘు నాటికను ప్రదర్శించనున్నారు. కోర్టురోడ్డు, గుల్జార్‌పేట్‌లోని గాస్పెల్ హాల్, కళాకారుల కాలనీలోని రేమా చర్చి సామూహిక ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. క్రీస్తు సిలువపై పలికిన చివరి మాటల ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనల్లో విరివిగా పాల్గొనాలని పాస్టర్లు పిలుపునిచ్చారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న చర్చిలు ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు -
1.20 కోట్ల పనిదినాలు..రూ.368 కోట్ల నిధులు
రాయదుర్గం: ఉపాధి హామీ పథకం కింద పని దినాల లక్ష్యం ఖరారైంది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.368 కోట్లతో 1.20 కోట్ల పని దినాలు కల్పించేలా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో జూన్ ఆఖరుకు జిల్లాలోని 31 మండలాల్లో 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఒక్కో కూలీకి సగటు వేతనం రూ.307 చెల్లించేలా కార్యాచరణ చేపట్టారు. ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు, నర్సరీల్లో మొక్కల పెంపకం, చెక్‌డ్యాంలు, వ్యక్తిగత మరుగు దొడ్లు, పంట పొలాలకు అనుసంధానంగా రోడ్లు, నీటి కుంటల నిర్మాణాలు, మొక్కలు నాటడం లాంటి పనులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. దొంగ మస్టర్ల కలకలం.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.చాలా చోట్ల గత వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన పనుల వద్దే మళ్లీ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారని, మరి కొన్నిచోట్ల వృథా పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలున్నాయి.ఇటీవల కొన్ని మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల దొంగ మస్టర్ల మాయాజాలం కలకలం రేపింది. కూలీలు పనులకు రాకున్నా హాజరు వేస్తూ డబ్బులు మింగేస్తున్న వైనం అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా సరిహద్దు మండలాల్లో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన శ్రమశక్తి సంఘాల ముసుగులో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పనులను అధికారులు నిత్యం తనిఖీ చేయడంతో పాటు ప్రతి మస్టర్‌ను నిశితంగా పరిశీలించాకే వేతనాలు జమ చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ‘ఉపాధి’ ప్రణాళిక ఖరారు సగటు వేతనం రూ.307కు పెంపు జూన్ ఆఖరుకు 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా కార్యాచరణ అక్రమాలు లేకుండా చర్యలు తీసుకోవాలంటున్న కూలీలుఅక్రమాలకు తావులేదు ఉపాధి పథకంలో ఈ ఏడాది లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అడిగిన ప్రతి కూలీకి పని చూపుతాం. సగటు వేతనం రూ.307 పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది 1.10 కోట్ల పని దినాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్లకు పెంచాం. మస్టర్లలో అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడతాం. పనులకు రాకుండా వేతనాలు జమ చేసినట్టు తేలితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. – సలీమ్బాష, డ్వామా పీడీ -
వేరుశనగకు పంట రుణం రూ.38 వేలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది వేరుశనగ పంటకు సంబంధించి ఎకరాకు రూ.38 వేల ప్రకారం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. ఖరీఫ్, రబీలో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలివ్వాలనే అంశంపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారైనట్లు బ్యాంకర్లు తెలిపారు. గతేడాది కన్నా పంట పెట్టుబడులను బట్టి 10 నుంచి 20 శాతం రుణ పరిమితి పెంచారు. జిల్లాలోని బ్యాంకుల్లో రైతులకు సంబంధించి ఖరీఫ్ పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల పంపిణీ ప్రారంభమైనట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అదనంగా 15 శాతం అధికంగా ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. పంటల వారీగా ఇలా: వర్షాధారంగా సాగు చేసే వేరుశనగ ఎకరాకు రూ.38 వేలు, నీటి వసతి కింద అయితే రూ.41 వేల ప్రకారం రుణం ఇవ్వనున్నారు. కంది పంట వర్షాధారంగా ఎకరాకు రూ.29 వేలు, నీటి వసతి కింద రూ.30 వేలు, ఆముదం రూ.22 వేలు, పప్పుశనగ రూ.37 వేలు, పత్తి రూ.51 వేలు– 55 వేలు, విత్తనోత్పత్తి పత్తి రూ.1.60 లక్షలు, వరి రూ.52 వేలు, విత్తన వరి రూ.55 వేలు, జొన్న రూ.25 వేలు, రాగి రూ.22 వేలు– 25 వేలు, సజ్జ రూ.21 వేలు– 24 వేలు, కొర్ర రూ.17 వేలు– 21 వేలు, వర్షాధారంగా మొక్కజొన్న రూ.31 వేలు, నీటి వసతి కింద రూ.47 వేలు, విత్తన మొక్కజొన్నకు రూ.50 వేలుగా నిర్ణయించారు. ఉద్యాన, కూరగాయల పంటలకు.. పచ్చిమిరపకు రూ.1.10 లక్షలు, ఎండుమిరప రూ.1.75 లక్షలు, టమాట ట్రెల్లీస్ లేకుండా రూ.41 వేలు, ట్రెల్లీస్ టమాట రూ.65 వేలు, హైబ్రీడ్ టమాట రూ.78 వేలు, ట్రెల్లీస్ హైబ్రీడ్ టమాట రూ.1.25 లక్షలు, వంకాయ రూ.54 వేలు, హైబ్రీడ్ వంకాయ రూ.67 వేలు, బెండ రూ.36 వేలు, హైబ్రీడ్ బెండ రూ.50 వేలు, ఉల్లి రూ.60 వేలు,మునగ రూ.49 వేలు,వర్షాధారంగా బేబీకార్న్‌కు రూ.28 వేలు, నీటి వసతి కింద రూ.44 వేలు, కరివేపాకు రూ.60 వేలు, ధనియాలు రూ.24 వేలు, సోయాబీన్స్ రూ.17 వేలు, అరటి ఎకరా రూ.1.10 లక్షలు, టిష్యూ కల్చర్ అరటి రూ.1.36 లక్షలు, దానిమ్మ రూ.1.60 లక్షలు, చీనీ రూ.71 వేలు, నిమ్మ రూ.85 వేలు, బొప్పాయి రూ.1.20 లక్షలు, మామిడి రూ.55 వేలు, సపోట రూ.43 వేలు, ద్రాక్ష రూ.1.25 లక్షలు, రేగు రూ.34 వేలు, కళింగర రూ.54 వేలు, దోస రూ.66 వేలు, జామ రూ.55 వేలు, అంజూర రూ.42 వేలు, సీతాఫలం రూ.27 వేలు, డ్రాగన్‌ఫ్రూట్ రూ.77 వేలు, చింత రూ.27 వేలు, కొబ్బరి రూ.70 వేలు, మల్లెపూల తోటల సాగుకు రూ. లక్ష, రోజాపూలు రూ.43 వేలు – 66 వేలు, బంతిపూలు రూ.55 వేలు, చామంతి రూ.60 వేలు, కనకాంబరాలు రూ.39 వేలు, గడ్డి సాగు రూ.36 వేలు, మల్బరీ సాగుకు రూ.1.20 లక్షల మేర స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. 10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ప్రారంభమైన పంట రుణాల రెన్యువల్స్ -
కఠిన చర్యలు తీసుకుంటాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ జరిగితే.. ఒరిజనల్ డాక్యుమెంటు అందుకునేందుకు వారం నుంచి 10 రోజులు పడుతుంది. కానీ రూ.1,000 కొడితే సాయంత్రానికే సిబ్బంది ఇచ్చేస్తున్నారు. డబ్బులివ్వకుంటే ఆలస్యం చేస్తున్నారు. ఈ నెల 8న భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇప్పటికీ డాక్యుమెంట్ రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. సిబ్బంది అక్రమ వ్యవహారంతో సామాన్యులు విసుగెత్తిపోతున్నారు. అన్ని విషయాలు ఆయా సబ్ రిజిస్ట్రార్లకు తెలిసే జరుగుతున్నట్టు సమాచారం. నకళ్లకు వంద... స్థిరాస్తులకు సంబంధించిన నకళ్లు (సర్టిఫైడ్ కాపీలు) కావాలంటే రూ.500 చలానా చెల్లించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.150 చెల్లిస్తే డాక్యుమెంటు ఇస్తారు. కానీ కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బంది రూ. వంద తీసుకుని.. డాక్యుమెంటు నంబర్ ద్వారా వాట్సాప్‌లో పీడీఎఫ్ కాపీలు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చలానాల రూపంలో అందే ఆదాయం పడిపోతోంది. ఇక.. పక్కాగా ఉన్న డాక్యుమెంటు రిజిస్ట్రేషన్‌కు అయినా సబ్ రిజిస్ట్రార్‌కు ముడుపులు చెల్లించాల్సి వస్తోందనే విమర్శలు ఉన్నాయి. లేదంటే ‘కామా లేదు, ఫుల్స్టాప్ లేదు, దిశలు సరిగా లేవు’ అని కొర్రీలు పెట్టి తిప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్, రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్లు ఏమీ తెలియనట్టే ఉంటూ కిందిస్థాయి సిబ్బంది ద్వారా పిండుకుంటున్నారు. జీపీఏలు చూసి రిజిస్ట్రేషన్.. సామాన్యులకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాక రిజిస్ట్రేషన్లు చేస్తున్న అనంతపురం రూరల్, అర్బన్ రిజిస్ట్రేషన్ అధికారులు.. ఇటీవల జీపీఏను చూపించినా భారీగా రిజిస్ట్రేషన్లు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. శోత్రియం భూములపై రాప్తాడుకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ)లు సృష్టించారు. వీటిని అడ్డు పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్లు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ‘పచ్చ’ నేతల సొంతం చేశారు. ఈ క్రమంలో ఆయా భూములు కొన్న వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరో నాలుగు చోట్లా ఇంతే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తీరు మారడం లేదు. ఎన్ని సంస్కరణలు తెచ్చినా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి,రాయదుర్గం కార్యాలయాల్లోనూ పరిస్థితి అధ్వానంగా ఉంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు వెళ్లిన వారికి ఆయా కార్యాలయాల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఏసీబీ దాడులు జరిగినా, విజిలెన్స్ సోదాలు నిర్వహించినా మూణ్నాళ్ల ముచ్చటే అవుతోంది. అనంతపురం అర్బన్, రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం ఒకేరోజులో డాక్యుమెంటు కావాలంటే ఒకరేటు సర్టిఫైడ్ కాపీ వాట్సాప్‌లో పంపేందుకు ఇంకో రేటు.. ఇప్పటికే జీపీఏల ద్వారా రూ. కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్ అనంతపురం నగరంలోని సిండికేట్‌నగర్‌లో వారం రోజుల క్రితం ఓ వ్యక్తి నాలుగు సెంట్ల స్థలం కొన్నారు. అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి స్థలానికి సంబంధించి డాక్యుమెంటు కావాలని అడిగితే మొదట ససేమిరా అన్నారు. సదరు వ్యక్తి రూ. 2 వేలు ఇచ్చేసరికి సాయంత్రానికే మహిళా సిబ్బంది డాక్యుమెంటు అందించారు. రాప్తాడు రూరల్ పరిధిలో రెండెకరాల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు వచ్చింది. ఇటీవల భూమి కొనుగోలుదారుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంటు కావాలని కోరగా మొదట ఎవరూ స్పందించలేదు. తర్వాత కొంతసేపటికే ఆఫీసు సిబ్బంది అతడి దగ్గరికి వెళ్లి రూ.5 వేలు చెల్లిస్తే సాయంత్రానికి ఇస్తామని చెప్పారు. డబ్బు తీసుకుని చెప్పిన టైంకి అందించారు. మచ్చుకు ఇవి రెండు ఉదాహరణలే.. ఇలాంటివి అనంతపురం అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్యం పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. గతంలో మాదిరి డాక్యుమెంట్లు ఎక్కువ రోజులు పట్టడం లేదు. అయినా డబ్బు తీసుకుని ఒక్క రోజులో ఇవ్వడం సరి కాదు. సర్టిఫైడ్ కాపీలు వాట్సాప్‌లో పంపడం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. –భార్గవ్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి -
గడువులోపు పరిష్కారం చూపాలి
గుంతకల్లు: రెవెన్యూ పరమైన అంశాల్లో అర్జీదారులు ఇచ్చిన వినతులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ ఆదేశించారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై స్థానిక శ్రీశంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఆర్ఓ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. భూతగాదాలు,రస్తా సమస్యలు,ఇంటి స్థలాలు... తదితర సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయంటూ అధికారులతో ఆరా తీశారు. రెవెన్యూ పరమైన భూసేకరణ, ఆర్ఓఆర్ సమస్యలు తదితర విషయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జున, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, సర్వే ఏడీ రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. నక్కనదొడ్డి తండాలో పర్యటించిన కలెక్టర్ గుంతకల్లు రూరల్: ఆర్ఓ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం గుంతకల్లుకు వచ్చిన కలెక్టర్ వినోద్‌కుమార్... అనంతరం ఇదే మండలంలోని నక్కనదొడ్డి తండాలో పర్యటించారు. గ్రామానికి చెందిన రైతు మునే నాయక్ సర్వే నంబర్ 342లో ఉన్న తన భూమిని రీ సర్వే చేయడంతోపాటు, సబ్ డివిజన్ కూడా చేయాలని కోరుతూ ఇటీవల కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చాడు. ఈ క్రమంలో నక్కనదొడ్డి తండాకు చేరుకున్న కలెక్టర్... క్షేత్రస్థాయిలో సర్వే నంబర్ 342లోని భూములను పరిశీలించారు. మునేనాయక్కు చెందిన భూమి వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు ఇచ్చిన అర్జీ మేరకు సదరు భూమిని వెంటనే సబ్ డివిజన్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ రమాదేవి, ఇతర సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ నక్కనదొడ్డి తండాలో పర్యటన -
ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ఖాతాలు
● అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వినోద్‌కుమార్ సూచన అనంతపురం అర్బన్: కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారుల పేర్లపై సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలు సృష్టించారని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఆ ఖాతాలు, ఫోన్ ద్వారా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటి పట్ల ఉద్యోగులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెసేజ్‌లు వస్తే సహ ఉద్యోగులైనా, తెలిసిన వారైనా నిర్ధారించుకోకుండా తొందరపడి డబ్బు పంపరాదన్నారు. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక తెలిపారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు. తపాలా ఎస్పీగా రాజేష్ అనంతపురం సిటీ: అనంతపురం డివిజన్ తపాలా సూపరింటెండెంట్‌గా రాజేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప డివిజన్ రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న ఆయనకు అనంతపురం డివిజన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు తపాలా ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు బ్రహ్మానందరెడ్డి, కృష్ణయ్య యాదవ్ తదితరులు వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ ఆ స్థానంలో కొనసాగిన గుంపస్వామి బుధవారం రాత్రి రిలీవ్ అయ్యారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయనపై ఫిర్యాదులు వెల్లువెతిన నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆదిలాబాద్ డివిజన్‌కు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు పెద్దవడుగూరు: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను గుంటూరు నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ రమణమూర్తి, గుత్తి ఏడీఏ వెంకట్రాముడు హెచ్చరించారు. పెద్దవడుగూరులోని ఉమామహేశ్వర ఫర్టిలైజర్ షాపును బుధవారం వారు ఆకస్మిక తనిఖీ చేశారు. విక్రయిస్తున్న విత్తనాలు, పురుగు మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. విక్రయించే ప్రతి విత్తనమూ నాణ్యతగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పత్తి విత్తనాల కొనుగోలు సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అక్కడి రైతులకు సూచించారు. రసీదు లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.కార్యక్రమంలో కమిషనరేట్ ఏఓ సుకుమార్, అనంతపురం జేడీఏ కార్యాలయ టీఏఓ రాకేష్‌నాయక్, ఏఓ మల్లీశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యక్తిగతంగా పరికరాలు అవసరమైన రైతులు ఆర్ఎస్కేల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన రూ.3 కోట్ల బడ్జెట్లో ఇప్పటికే రూ.1.60 కోట్ల మేర అవసరమైన పరికరాలు కావాలని రైతులు తమ వాటా కింద సొమ్ము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా బడ్జెట్ ఉన్నందున సాధ్యమైనంత తొందరగా స్ప్రేయర్లు, టిల్లర్లు, తదితర వాటికి 50 శాతం మేర రైతు వాటా చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరికరాలు అందజేస్తామని పేర్కొన్నారు. -
●చౌడేశ్వరీ.. నమోస్తుతే..
అమడగూరు: చల్లని తల్లి చౌడేశ్వరమ్మ జ్యోతుల వెలుగుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ దేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ధర్మకర్త, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జ్యోతి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, అమ్మవారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జ్యోతిదర్శనంతో పులకించిన భక్తజనం ఉత్సవంలో భాగంగా తొలుత అమ్మవారి విగ్రహాన్ని పూలపల్లకీపై కొలువుదీర్చి ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి పల్లకీ ముందు జ్యోతిని రగిలించారు. జ్యోతి ముందు వెళ్తుండగా... ఆ వెలుగుల్లో చౌడేశ్వరీదేవి భక్తులను దర్శనమిచ్చారు. ఈ క్రమంలో జ్యోతిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. డప్పు, మంగళవాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య యువకులు చిందులేస్తూ ఆడి, పాడారు. భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన కోలాటలు, భజనలు, హరికథలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చీకిరేవులపల్లి యూత్ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
●తప్పతాగి... హల్చల్ చేసి
కూటమి పాలనలో తాగుబోతుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం రాత్రి అనంతపురంలోని రైల్వే స్టేషన్ కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. ఒంటిపై చొక్కా విప్పేసి దర్జాగా రోడ్డుపై పడుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. రాష్ట్రంలో సంపద సృష్టి అంటే యువకులను మద్యానికి బానిసలను చేయడం కాదని, ఇప్పటికై నా ప్రభుత్వం మత్తు వదిలి మద్యం విక్రయాలను కట్టడి చేయాలని ఈ సందర్భంగా అటుగా వెళుతున్న వారు వ్యాఖ్యానించడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంమహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ ధర్మవరం రూరల్: మండలంలోని రేగాటిపల్లి పొలాల్లో గత నెల 16న దారుణ హత్యకు గురైన చిట్రా అక్కమ్మ (57) కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలను బుధవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మవరం రూరల్ పీఎస్ సీఐ ఎన్.ప్రభాకర్ వెల్లడించారు. రావులచెరువు గ్రామానికి చెందిన చిట్రా అక్కమ్మకు 30 సంవత్సరాల క్రితం మేడాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల క్రితం అక్కమ్మ తన భర్త, పిల్లలను వదిలేసి ధర్మవరంలోని తిక్కస్వామి నగర్లో అద్దె ఇంటికి మకాం మార్చింది. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కళాజ్వోతి సర్కిల్లో వ్యభిచారం సాగిస్తుండేది. గత నెల 16న సాయంత్రం కళాజ్వోతి సర్కిల్లో విటుల కోసం వేచి ఉన్న ఆమెను స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కట్టుబడి షెక్షావలి, టీచర్స్ కాలనీలోని చౌడమ్మ గుడి వద్ద నివాసముంటున్న తలారి లోకేంద్ర ఆటోలో ఎక్కించుకుని రేగాటిపల్లి పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అక్కమ్మతో లోకేంద్ర లైంగిక కోరిక తీర్చుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో షెక్షావలి సాయంతో అక్కమ్మ తలపై లోకేంద్ర రాయితో కొట్టి గాయపరిచాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కత్తితో ముఖంపై ఉన్న చర్మాన్ని తొలగించి అక్కడ నుంచి ఉడాయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ హేమంత్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం సీతారంపల్లి వద్ద జాతీయ రహదారిపై తచ్చాడుతున్న షెక్షావలి, లోకేంద్రను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ ఎన్.ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు బాబ్జాన్, రాజప్ప, షాకీర్, అనిల్‌కుమార్, రాఘవేంద్ర, బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చత్రూనాయక్, రామాంజినేయులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్‌కుమార్ అభినందించారు. -
అంతర జిల్లా చైన్‌స్నాచర్ల అరెస్ట్
అనంతపురం: ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించే అంతర జిల్లా చైన్‌స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అనంతపురం శివారులోని రాజీవ్ కాలనీకి చెందిన కె.పంపాచారి అలియాస్ నరేష్, రాయల్ నగర్‌కు చెందిన షేక్ షాకీర్, ప్రియాంకనగర్ నివాసి షేక్ ఫజిల్ అహమ్మద్ అలియాస్ షేక్ ఫజిజ్ అహమ్మద్, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ నివాసి కంబం నాగార్జున అలియాస్ చిన్నా ఉన్నారు. బుధవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. అందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే పట్టుబడిన నిందితులందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కె.పంపాచారి కార్పెంట్ వృత్తితో పాటు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి సంపాదన మొత్తం వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. ఇతనికి నాలుగు నెలల క్రితం కంబం నాగార్జున పరిచయమయ్యాడు. నాగార్జున సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ కాగా, ఏడాదిన్నర క్రితం కుటుంబంతో సహా అనంతపురానికి వలస వచ్చి సుఖ్దేవ్నగర్లో నివాసముంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంపాచారి పరిచయమైన తర్వాత ఇద్దరూ కలసి పేకాట, ఆన్లైన్ జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుని అప్పుల పాలయ్యారు. రాయల్ నగర్‌కు చెందిన షేక్ షాకీర్... కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో సొంతంగా ఓ ఫర్నీచర్ షాప్ ఏర్పాటు చేసుకుని అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తుండగా పంపాచారి, నాగార్జున పరిచయమయ్యారు. ముగ్గురు కలసి వ్యక్తిగత అవసరాలకు, అప్పులు తీర్చేందుకు చైన్‌స్నాచింగ్‌లకు సిద్ధమయ్యారు. అనంతరం వీరందరూ కలసి బృందాలుగా విడిపోయి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడేవారు. ప్రైవేట్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ ఫజిల్ అహమ్మద్ సైతం ఆన్లైన్ బెట్టింగ్, పేకాట తదితర వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పాటు ఇటీవల పెళ్లి సంబంధం కూడా ఖాయమైంది. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో చైన్‌స్నాచర్‌గా మారాడు. ఒంటిరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా..పంపాచారి ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళుతూ శివారు కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు నగలను లాక్కొని అదే టూవీలర్‌పై ఉడాయించేవాడు. 2023 నుంచి కురుగుంట, మన్నీల, రాప్తాడు, అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డు, గణేష్ నగర్, లలితానగర్, ఒకటో రోడ్డు, తదితర ప్రాంతాల్లో 10 చైన్ స్నాచింగ్‌లు చేశాడు. అనంతరం షేక్ షాకీర్‌తో కలసి బైక్‌పై వెళుతూ కళ్యాణదుర్గం రోడ్డు, ద్వారకా విల్లాస్‌లో రెండు స్నాచింగ్‌లు, కంబం నాగార్జునతో కలసి హెచ్చెల్సీ రోడ్డు, స్టాలిన్ నగర్, బుక్కరాయసముద్రం, బి.కొత్తపల్లి గ్రామాల్లో నాలుగు స్నాచింగ్‌లు చేశాడు. మొత్తం 16 కేసుల్లో పంపాచారి నిందితుడు. ఇందులో రెండు కేసుల్లో షేక్ షాకీర్, నాలుగు కేసుల్లో కంబం నాగార్జున నిందితులుగా ఉన్నారు. షేక్ ఫజిల్ అహమ్మద్ ఎవరూ గుర్తుపట్టకుండా తలకు ఎరుపు రంగు క్యాప్ పెట్టుకుని, ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. అనంతపురంలోని శ్రీశ్రీ నగర్, హెచ్చెల్సీపై సచివాలయ మహిళా ఉద్యోగిని మెడలో ఉన్న బంగారు చైన్ అపహరణ, ఇతర మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. నిందితులు నలుగురూ వేర్వేరుగా పట్టుబడ్డారు. చైన్‌స్నాచర్ల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐలు ఎన్.శేఖర్, కె.సాయినాథ్, ఇస్మాయిల్, జయపాల్‌రెడ్డి తదితరులను ఎస్పీ అభినందించారు. రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్‌ల స్వాధీనం వ్యసనాలతో అప్పులపాలై చైన్‌స్నాచర్లుగా మారిన యువకులు -
మద్యం మత్తులో గొడవ
● ఇటుకతో బాదడంతో వ్యక్తి మృతి హిందూపురం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి సహనం కోల్పోయి ఇటుక పెళ్లతో బాదడంతో సుబ్బరాయప్ప(65) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హిందూపురం మండలం గోళాపురం గుడ్డంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోళాపురం గుడ్డంపల్లి కర్ణాటక సరిహద్దున ఉండటంతో పాటు గ్రామంలో బెల్టుషాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బంధువులైన సుబ్బరాయప్ప, నంజేగౌడ మంగళవారం పూటుగా మద్యం సేవించారు. ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు రావడంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నంజేగౌడ ఇటుక పెళ్లతో సుబ్బరాయప్ప తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయమైంది. బంధువులు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాత్రి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డొకాయ్ ఆపరేషన్లు చేపట్టి లింగ నిర్ధారణ స్కానింగ్‌లకు పాల్పడుతున్న సెంటర్లపై చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. అలాగే లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘనకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశంపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, పెథాలజిస్టు డాక్టర్ శ్రావణి పాల్గొన్నారు. 64 గ్రామాల్లో రక్తపూతలు సేకరించాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో దోమకాటు వ్యాధులు అధికంగా నమోదవుతున్న 32 మండలాల్లోని 64 గ్రామాల్లో పైలేరియా వ్యాధిని గుర్తించేందుకు రక్తపూతల సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను డీఐఓ ఓబులు ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినంలో భాగంగా ప్రతి పీహెచ్సీ పరిధిలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో సహాయ మలేరియా సబ్ యూనిట్ అధికారులు మద్దయ్య, మునాఫ్, బత్తుల కోదండరామిరెడ్డి, తిరుపాల్, నాగేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి -
కొత్త పింఛన్లు మంజూరు చేయాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ ఉరవకొండ: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుపై దృష్టి సారించడం లేదని, ఫలితంగా అర్హులైన లక్షలాది మంది నిరాశ నిస్పృహలతో జీవనం సాగిస్తున్నారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పింఛన్ కోసం ఎంతో మంది వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అర్హులైన వీరికి పింఛన్ అందిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజురు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికు లేఖలు రాసినట్లు తెలిపారు. తల్లిదండ్రుల చెంతకు ఇంటర్ విద్యార్థి తాడిపత్రి టౌన్: ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన విద్యార్థి ఆచూకీని 24 గంటల్లోపే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. వివరాలు... తాడిపత్రి మండలం బొడాయిపల్లికి చెందిన పుల్లారెడ్డి కుమారుడు నాగవర్దన్‌రెడ్డి తాడిపత్రి లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 12న ఫలితాలు వెలువడడంతో తన ఉత్తీర్ణతను తెలుసుకునేందుకు తాడిపత్రికి వచ్చిన నాగవర్దన్‌రెడ్డి ఫెయిల్ అయినట్లుగా నిర్ధారించుకుని ఎటో వెళ్లిపోయాడు. రోజు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఫెయిల్ అయిన కుమారుడు ఏ అఘాయిత్యం చేసుకున్నాడోనని కన్నీరుమున్నీరవుతూ ఈ నెల 14న తండ్రి తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతిలో ఉన్న నాగవర్దన్రెడ్డిని అక్కడి పోలీసుల సాయంతో గుర్తించి మంగళవారం రాత్రి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. బుధవారం తాడిపత్రి పీఎస్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ అనంతరం తండ్రి పుల్లారెడ్డికి అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించేలా చొరవ చూపిన ఎస్ఐ గౌస్‌బాషాకు పుల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
వృద్ధురాలిని ఏమార్చి చైన్ స్నాచింగ్
గార్లదిన్నె: వృద్ధురాలిని ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగుడు అపహరించుకెళ్లాడు. పోలీసులు తెలిపిన మేరకు గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన వృద్ధురాలు నీలావతి బుధవారం మండల కేంద్రంలో కిరాణా సరుకులు కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై గుడ్డాలపల్లి క్రాస్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో తలకు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు వృద్ధురాలి పక్కనే వాహనాన్ని ఆపి తాను కూడా గుడ్డాలపల్లికి వెళుతున్నట్లు నమ్మబలికి ఆమెను ఎక్కించుకుని ముందుకు కదిలాడు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వాహనాన్ని ఆపి తనకు ఫోన్‌కాల్ రావడంతో వెనక్కి వెళ్లాల్సి ఉందని తెలపడంతో వృద్ధురాలు కిందకు దిగింది. ఆ సమయంలో ఆమె మెడలోని 5 తులాల బంగారు చైన్‌ను లాక్కొని ద్విచక్ర వాహనంపై వేగంగా జాతీయ రహదారి వైపుగా ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. పాఠశాలలో ఆకతాయిల విధ్వంసం ఉరవకొండ: స్థానిక 8వ వార్డు పాతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక సెంట్రల్ పాఠశాలలో ఆకతాయిలు, తాగుబోతులు మంగళవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత పాఠశాల గ్రౌండ్ ప్లోర్లోని వరండా ఇనుప గ్రిల్ తలుపును విరగొట్టి లోపలికి ప్రవేశించారు. తరగతి గదిలోని రెండు సీలింగ్ ఫ్యాన్లు తొలగించి పక్కన పడేశారు. అనంతరం విద్యుత్ స్విచ్ బోర్డుతో పాటు నీటి మోటార్‌కు చెందిన స్టార్టర్ బోర్డును పగులగొట్టారు. ప్లోరింగ్ టైల్స్ బండరాళ్లతో ధ్వంసం చేశారు. తరగతి గదిలోనే మద్యం తాగి అక్కడే సీసాలు పగులగొట్టి, మూత్ర విసర్జన చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు అక్కడి విధ్వంసాన్ని గుర్తించి ఎంఈఓ ఈశ్వరప్ప దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓ పరిశీలించిన అనంతరం హెచ్ఎం నసీరాబేగంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సమ్మె బాటలో ఎంఎల్‌హెచ్‌పీలు
● స్తంభించిపోనున్న ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ సేవలు అనంతపురం మెడికల్: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు (గతంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు) స్తంభించిపోనున్నాయి. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో ఎన్హెచ్ఎం ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, కార్యనిర్వహణ కార్యదర్శి షేబా ప్రియాంక, కోశాధికారి గౌరి మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 23 శాతం జీతం పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు అతీగతి లేకుండా పోయిందని, ఆరేళ్లుగా పని చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెగ్యులరైజేషన్, జాబ్ చార్ట్ తదితర వాటిపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆన్లైన్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 17న పీహెచ్‌సీల వద్ద ధర్నా, 19న డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిరసన, 21న పోస్టుకార్డు ఉద్యమం, 22న జిల్లా కేంద్రంలో ధర్నా, 24న నిరవధిక సమ్మెలోకి వెళ్తామని వెల్లడించారు. -
యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి
అనంతపురం అర్బన్: ఉపాధి కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాబ్‌మేళాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి 8 జాబ్‌మేళాలు నిర్వహించాల్సి ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధిపై కార్యాచరణ పక్కాగా అమలు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పరిశ్రమలను అనుసంధానించాలన్నారు. ‘పీఎం విశ్వకర్మ యోజన’ కింద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే పథకం ద్వారా 205 బ్యాచ్‌ల్లో 6 వేల మందికి శిక్షణ ఇచ్చారని, 111 మందికి శిక్షణ కొనసాగుతోందన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్ ఏర్పాటు పనులు వేగంగా చేపట్టాలన్నారు. అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక జాబ్‌మేళా క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతపురం అర్బన్‌కు సంబంధించి ఏప్రిల్ 25న, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మే 2న, కళ్యాణదుర్గానికి సంబంధించి మే 16, రాయదుర్గం మే 23, గుంతకల్లు మే 30, తాడిపత్రి జూన్ 6, శింగనమల జూన్ 13, ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి జూన్ 27న జాబ్‌మేళా నిర్వహిస్తారన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, జేఎన్టీయూ ప్లేస్మెంట్ సీఈఓ శ్రీనివాసులు, ఎస్కేయూ అధికారి సీహెచ్కృష్ణ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, జేడీఎం సూర్య నారాయణ, కార్మిక శాఖ ఏసీ రమాదేవి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి, రూడ్సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్‌కుమార్ ‘ఉల్లాస్’ లక్ష్యం సాధించాలి ‘ఉల్లాస్’ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16 నుంచి ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించాల్సి ఉందన్నారు. మే 5 నుంచి సెప్టెంబరు వరకు అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో వయోజన విద్య డీడీ ఆంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉమ్మడి అనంతలో చాపకింద నీరులా విస్తరిస్తున్న షుగర్ వ్యాధి
● అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.గ్రామీణులూ బాధితులే..మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది.అవగాహన లేకే..అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్‌టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది.సమస్యలెన్నో..షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.కంటిచూపుపై దుష్ప్రభావం పడుతుంది.శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం.మధుమేహం అదుపులో లేకపోతే గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ.అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.అలవాట్లు మార్చు కోవాలిమధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. – డా.సుధాకర్‌రెడ్డి, గుండె వైద్య నిపుణులు -
గిన్నిస్ బుక్‌లో రైల్వే ఉద్యోగికి చోటు
గుంతకల్లు: స్థానిక భాగ్యనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి సునీల్‌కుమార్‌కు గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. చైన్నెలో ఉద్యోగం చేస్తున్న ఆయన గత ఏడాది డిసెంబర్ 1న 1,090 మంది విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు గంట పాటు కీబోర్డు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథులుగా పాస్టర్ అనిల్‌కుమార్, అగస్టిన్ దండింగి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పత్రాన్ని ఆయన అందుకున్నారు. -
రైతుల సమస్యలు పట్టని బ్యాంక్ అధికారులు
బ్రహ్మసముద్రం : మండలంలోని వేపులపర్తి గ్రామంలోని యూనియన్ బ్యాంక్ అధికారులకు రైతుల సమస్యలు పట్టడం లేదని మండల వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు గోపాలరెడ్డి, రైతులు మండిపడ్డారు. పంట రుణాల రెన్యువల్లో బ్యాంక్ అధికారుల అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం యూనియన్ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు తీసుకున్న పంట రుణాల రెన్యువల్ జరుగుతున్నాయని జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో రైతుల నుంచి కేవలం వడ్డీ మాత్రమే తీసుకుని రుణాలను రెన్యువల్ చేస్తున్నారని తెలిపారు. అయితే స్థానిక యూనియన్ బ్యాంక్ అధికారులు మాత్రం రుణం మొత్తం చెల్లించాల్సిందేనంటూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి రైతుల పట్ల నిర్ధయగా వ్యవహరిస్తున్న బ్యాంక్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
● ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారిలో కలవరం ● ఇప్పటికే రాజీనామా చేసిన ఓ అంగన్వాడీ టీచర్ ● విచారణకు ముందుగానే రాజీనామా చేద్దామనే యోచనలో మరికొందరు సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న ఐసీడీఎస్ సూపర్వైజర్లు డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన టీచర్లు, ఆయాలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వారి వద్ద ఉన్న సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టాం. ఎలాంటి వివక్ష చూపకుండా సర్టిఫికెట్లను పరిశీలించాలని సూపర్వైజర్లను ఆదేశించాం. ఫేక్సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారని నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఈ నెల 22వ తేదీ లోపు సర్టిఫికెట్లు అందజేయాలి. అందజేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నాం. – సాజిదాబేగం, సీడీపీఓ, తాడిపత్రి ప్రాజెక్టు తాడిపత్రి రూరల్: ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఐసీడీఎస్‌ను కుదిపేస్తోంది. ఫేక్ సర్టిఫికెట్లతో అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా ఉద్యోగాలు పొందిన వారిలో కలవరం మొదలైంది. ఐసీడీఎస్ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు తాడిపత్రిలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. తాడిపత్రి ప్రాజెక్టు పరిధిలోని తాడిపత్రి టౌన్, తాడిపత్రి మండలం, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన దాదాపు 302 అంగన్వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు, ఆయాలు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకుని తమ పదవ తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్లు, ఉద్యోగం పొందిన ఆర్డర్ కాపీలను ఒరిజనల్‌తో పాటు గెజిటెడ్ సంతకంతో కూడిన జిరాక్స్ కాపీలను అందజేసేందుకు తరలిరావడంతో కార్యాలయం మంగళవారం కిక్కిరిసింది. సూపర్వైజర్లు తమకు కేటాయించిన క్లస్టర్ పరిధిలోని టీచర్లు, ఆయాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన తాడిపత్రి ఘటన ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్ల డొంక కదులుతోంది. తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టులో ప్రారంభమైన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విచారణకు కారణమైంది. ప్రకాశం జిల్లాలోనూ పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లుగా గుర్తించిన అధికారులు అక్కడ సైతం విచారణ చేపట్టారు. దీంతో తాడిపత్రి ప్రాజెక్ట్‌లో కొందరు కోర్టును ఆశ్రయించిన తరహాలోనే అక్కడి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇది కాస్త ఐసీడీఎస్ డైరెక్టరేట్‌కు తలనొప్పి మారడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేలా ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగం పొందిన టీచర్లు, ఆయాలను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విచారణ బాధ్యతను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించడంతో సర్టిఫికెట్ల పరిశీలన వేగవంతమైంది. స్పష్టమైన ఆదేశాలు జారీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూపర్వైజర్లకు స్పష్టమైన అదేశాలు అందాయి. గతంలో వెలుగు చూసిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై అప్పట్లో జిల్లా ఐసీడీఎస్ అధికారులు చేపట్టిన పరిశీలన ప్రక్రియ కాస్త యూనియన్ నాయకుల ఒత్తిళ్ల కారణంగా నీరుగారిపోయింది. పలు కారణాలు చూపుతూ అప్పట్లో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు శాఖపరమైన చర్యల నుంచి తప్పించుకున్నారు. తాజాగా ఈ వివాదం రాష్ట్రస్థాయి సమస్యగా మారడంతో స్వయంగా డైరెక్టరేట్ జోక్యం చేసుకుని పునర్విచారణకు ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అక్రమార్కులకు అండగా నిలిచిన వారు సైతం చేతులెత్తేశారు. రాజీనామా బాటలో.. వ్యక్తిగత కారణాల పేరుతో ఇప్పటికే అంగన్వాడీ టీచర్ ఒకరు రాజీనామా చేశారు. అయితే ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటే ఉన్న పరువు కాస్త పోతుందన్న ఆలోచనతో ఆమె రాజీనామా చేసినట్లుగా వదంతులు వ్యాపించాయి. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన మరికొందరు కూడా ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు యూనియన్ నాయకులతో మంతనాలు జరుపుతుండగా, మరికొందరు పరువు పోకుండా ముందస్తుగానే రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారు తొలిరోజు సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. -
స్వల్పంగా పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆస్తి, పంట, పశువులు, జీవాలు, కోళ్ల నష్టానికి వర్తింపజేసే ఎక్స్‌గ్రేషియా (స్కేల్ ఆఫ్ రిలీఫ్) స్వల్పంగా పెంచుతూ రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ 2024 ఆగస్టు నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు. ● పాడి ఆవు లేదా గేదె చనిపోతే రూ.50 వేలు, ఎద్దుకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7,500, కోడికి రూ.100 ప్రకారం గరిష్టంగా రూ.10 వేలు, పశువుల పాక నష్టానికి రూ.5 వేల ప్రకారం వర్తింపజేశారు. ● మనిషి చనిపోతే రూ.5 లక్షలు, ఇళ్లు కూలినా, దెబ్బతిన్నా రూ. 10 వేలు, కిరాణా కొట్టుకు రూ.25 వేలు, రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ కలిగిన కుటీర పరిశ్రమలకు రూ.50 వేలు, రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వాటికి రూ.లక్ష, రూ.ఒకటిన్నర కోటికి పైగా టర్నోవర్ కలిగిన వాటికి రూ.1.50 లక్షలు, ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ.10 వేలు, తోపుడు బండ్లకు రూ.20 వేలు, చేనేతలకు రూ.25 వేలు, పాక్షికంగా బోట్లు దెబ్బతింటే రూ.9 వేలు, వలలకు రూ.5 వేలు, బోట్లు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, మోటార్ బోట్లు, వలలు దెబ్బతింటే రూ.25 వేలు, చేపల చెరువుకు రూ.18 వేలు, పట్టు రైతులకు 25 వేల ప్రకారం నష్ట ఉపశమనం వర్తింపజేస్తారు. ● వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం లెక్కకట్టి ఇస్తారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. ● అరటి,మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్ ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరపహెక్టారుకు రూ.35 వేలు,కళింగర,కర్భూజా, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం ఖరారు చేశారు. -
హంద్రీ–నీవాకు లైనింగ్ వద్దు
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టి రైతుల బతుకులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఏఐకేకేఎంఎస్ (అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గిరీష్, నాగముత్యాలు మండిపడ్డారు. లైనింగ్ కారణంగా భూగర్భజలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే లైనింగ్ పనులు ఆపి, కాలువ వెడల్పు పనులు చేపట్టాలని, హంద్రీ–నీవాకు 40 టీఎంసీల నీటిని కేటాయించాలనే డిమాండ్లతో సంఘం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేపట్టడమంటే రైతులకు భవిష్యత్తు లేకుండా చేయడమేనని మండిపడ్డారు. హంద్రీ–నీవా కాలువ పరిసరాల్లోని వై.కొత్తపల్లి, పంపనూరు, పంపనూరు తండా, వేపచెర్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంటలు పండించుకోగలుగుతున్నారని తెలిపారు. ఫేజ్–2లో భాగంగా హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేపట్టడం ద్వారా భూగర్భజలాలు అడుగంటి పండ్ల తోటలు, ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రనష్టపోతారన్నారు. అలాగే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుందన్నారు. రైతులు వ్యవసాయం వదులుకుని ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని లైనింగ్ పనులు ఆపి, 8వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాంతో కాలువను వెడల్పు చేయాలని, ఏటా 40 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, నాయకులు వెంకటేష్ నాయక్, రమేష్, రామకృష్ణ, ఎర్రిస్వామి, రైతులు పాల్గొన్నారు. ఏఐకేకేఎంఎస్ నాయకుల డిమాండ్ పనులు ఆపి, కాలువ వెడల్పు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 40.2–41.3, రాత్రి 23.9–24.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు. రూ.2.91 కోట్ల పంట నష్టం అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా సోమవారం సాయంత్రం రూ.2.91 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, అనంతపురం, యల్లనూరు, ఉరవకొండ, కూడేరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుమ్మఘట్ట, గుంతకల్లు, పెద్దవడుగూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో అరటి, మామిడి, బొప్పాయి, కళింగర, మునగ తదితర పంటలు 95 హెక్టార్లలో దెబ్బతినడంతో 115 మంది రైతులకు రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే, శింగనమల, నార్పల, గార్లదిన్నె, కంబదూరు, బెళుగుప్ప మండలాల్లో 173 హెక్టార్లలో మొక్కజొన్న, వరి, పత్తి పంటలు దెబ్బతినడంతో 92 మంది రైతులకు రూ.1.41 కోట్ల నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. మెట్ట భూముల సాగుకు తోడ్పాటు : డ్వామా పీడీ అనంతపురం టౌన్: మెట్ట భూముల్లో మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, సపోటా తదితరాలు సాగు చేసేవారికి ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటునందిస్తామని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 8 వేల ఎకరాల మెట్టభూముల్లో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లోపు మెట్ట భూములున్న రైతులు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది మామిడి, చీనీ, దానిమ్మ, నిమ్మ, జామ, అల్లనేరుడు, డ్రాగన్ ఫ్రూట్, సపోట, అంజూర సాగుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. రైతులే మొక్కలను కొనుగోలు చేసుకుంటే వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. ఎకరా లోపు పొలం ఉన్న రైతులు సైతం మునగ, పూల మొక్కల సాగుకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.అక్రమాలకు పాల్పడొద్దు అనంతపురం అర్బన్: పింఛన్ల పంపిణీలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పింఛను లబ్ధిదారులతో గౌరవంగా మాట్లాడాలన్నారు. డీఆర్ఈఏ పీడీ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జడ్జికి ఘన సన్మానం
అనంతపురం: ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ సేవలు ప్రశంసనీయమని ఎస్పీ పి.జగదీష్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్న జడ్జి జి.శ్రీనివాస్‌ను మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. న్యాయమూర్తి జి.శ్రీనివాస్ మార్గదర్శకంలో జిల్లా పోలీసు, న్యాయశాఖలు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేశాయన్నారు. కఠిన నేరాల్లో ముద్దాయిలకు కఠిన శిక్షలు వేయడాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన గిరిస్వామి (60) మంగళవారం వ్యక్తిగత పనిపై తాడిపత్రికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన గిరిస్వామిని అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే అనంతపురంలోని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి యల్లనూరు: మండలంలోని పాతపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట కొండారెడ్డి(86) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మండలంలోని జంగంపల్లి, పాతపల్లి, కాచర్లకుంట తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో ఆయన ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తించారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో స్థిరపడిన ఆయన అకాల మృతితో పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలను స్వగ్రామం పాతపల్లిలో నిర్వహించారు. -
వడ్డీతో రుణాలు రెన్యువల్ చేయండి
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు సంబంధించి బ్యాంకుల్లో బంగారు నగల తాకట్టు రుణాలతో పాటు పంట రుణాలను కేవలం వడ్డీ కట్టించుకుని రెన్యువల్ చేయాలని బ్యాంకర్లకు ఏపీ రైతు సంఘం నాయకులు విన్నవించారు. ఈ మేరకు... రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎం.బాలరంగయ్య, ఎం.కృష్ణమూర్తి, బీహెచ్ రాయుడు, వలీ తదితరుల బృందం ఎస్బీఐ, కెనరాబ్యాంకు, ఏపీజీబీ, యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్లను మంగళవారం కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పెట్టుబడిసాయం లాంటివి అందక రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు రుణాలు, పంట రుణాలు పూర్తిగా చెల్లించి రెన్యువల్ చేసుకోవాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. దీని వల్ల రైతులు మరింత కష్టాల్లో పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించి కేవలం వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేయాలని కోరారు. అసలు, వడ్డీ చెల్లించాలని బలవంతం చేయడం మంచిదికాదన్నారు. ఖరీఫ్ వస్తున్నందున బ్యాంకుల్లో ఇక నుంచి జోరుగా రెన్యువల్ కొనసాగుతాయన్నారు. బ్యాంకుల వద్ద తాగునీరు, నీడ సదుపాయం కల్పించాలని కోరారు. బ్యాంకుల్లో వచ్చిన సర్కులర్లు, నోటీసులు తెలుగులో ముద్రించి పెట్టాలన్నారు. ప్రతి రైతుకూ కిసాన్ క్రెడిట్ కార్డు అందించాలని, మార్టిగేజ్ లేకుండా రూ.5 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు. బ్యాంకర్లకు రైతు సంఘం వినతి పత్రం -
‘కామన్ సీనియారిటీ వర్తింపజేయాలి’
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని డీఎస్సీ 2008 హామీ పత్ర ఉపాధ్యాయులకు కామన్ సీనియార్టీ అమలు చేయాలని ఏపీటీఎఫ్(1938) నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘టిస్’లో బాధిత ఉపాధ్యాయులకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలన్నారు. 2023 వేసవి సెలవుల్లో ఇండక్షన్ ట్రైనింగ్‌లో మొదటి మూడు విడతలకు హాజరైన డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు మాత్రమే ఐదు రోజుల వేతనం మంజూరుకు ఉత్తర్వులు ఇచ్చారని, 4, 5 విడతలకు హాజరైన డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు కూడా ఐదు రోజుల వేతనం మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఈఓ స్పందిస్తూ త్వరగతిన ఉత్తర్వులు విడుదల చేస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస నాయక్, డీఎస్సీ 2008 హామీ పత్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మొదటి సంతకంతోనే మోసం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకంతోనే డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు మోసం చేశారని డెమోక్రటిక్ యూత్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో కలిసి మంగళవారం అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, జిల్లా కన్వీనర్ కసాపురం రమేష్, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ పది నెలలు గడిచినా ముఖ్యమంత్రి మొదటి సంతకాన్ని అమలు చేసే పరిస్థితి లేనప్పుడు వారంలోనే మెగా డీఎస్సీని విడుదల చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అనేక ప్రకటనలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారన్నారు. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అప్పటికీ దిగిరాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలను అడ్డుకుంటామన్నారు. అనంతపురం జిల్లాకు డీఎస్సీలో వెయ్యి ఎస్జీటీ పోస్టులు పెంచాలన్నారు. జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కూడా ద్వితీయ ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలన్నారు. అనంతరం డీఈఓ ప్రసాద్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నూరుల్లా, సురేంద్రబాబు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దు, పరమేష్, తరిమెల గిరి, భీమేష్, సాయి పాల్గొన్నారు. నిరుద్యోగులను వంచించిన చంద్రబాబు డీఈఓ ఆఫీస్‌ను ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థులు -
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే కేసులే..
ఉరవకొండ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ ఉరవకొండ రూరల్ సీఐ సయ్యద్ చిన్నగౌస్ హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలోని బీబీ జైనబ్బీ దర్గాలో రెండు రోజుల క్రితం సీఐ అధ్యక్షతన మైనార్టీల సమావేశం జరిగింది. అనధికారికంగా జరిగిన ఈ సమావేశానికి మత పెద్దలతో పాటు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఐ చిన్నగౌస్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. రాజకీయంగా దీన్ని వాడుకోవాలని చూస్తే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని బెదిరించారు. మైనార్టీల అభివృద్ధి కోసం మంత్రి పయ్యావుల కేశవ్ కృషి చేస్తున్నారని, టీడీపీతోనే మైనార్టీల అభ్యున్నతి సాధ్యమవుతుందంటూ టీడీపీ నాయకుడి తరహాలో సీఐ మాట్లాడడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి తొత్తుగా.. సీఐ సయ్యద్ చిన్నగౌస్ టీడీపీ తొత్తుగా పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఉరవకొండలో టీడీపీ గెలుపు కోసం పార్టీ అభ్యర్థితో సమానంగా వ్యూహాలు రచించి అమలు చేశారని ఆ పార్టీ ముఖ్య నేతలే చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులను సీఐ బెదిరించి టీడీపీ కండువా వేసుకునేలా చేయడంతో పాటు ఉరవకొండలో తాను చెప్పిందే వేదమనేలా వ్యవహరిస్తున్నారు. రాజకీయ అరంగేట్రం కోసమేనా? మంత్రి కేశవ్‌కు నమ్మిన బంటుగా పేరుగాంచిన సీఐ చిన్నగౌస్ మరో నెలలో ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మొదటిసారిగా ముస్లింలతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని సామాజిక వర్గాలతోనూ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఇప్పటికే సీఐ గౌస్ తనదైన శైలిలో టీడీపీ నేత తరహాలో చక్రం తిప్పుతున్నట్లు విమర్శలున్నాయి. ఉరవకొండ రూరల్ సీఐ చిన్నగౌస్ వివాదాస్పద వ్యాఖ్యలు -
హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్
బొమ్మనహాళ్: మండలంలోని కల్లుహోళ గ్రామంలో టీడీపీ నేత సోమన్నగౌడ్పై హత్యాయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్ఐ నబీరసూల్ వెల్లడించారు. గ్రామానికి చెందిన హనుమక్కతో పదేళ్లుగా వివాహతేర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన సోమన్నగౌడ్ చివరకు అమెకు అన్యాయం చేసి, మతిస్థిమితం కోల్పోయేలా చేశాడని, దీంతో గ్రామంలో పరువు పోయిందన్న అక్కసుతో సోమన్న గౌడ్‌పై హనుమక్క మేనల్లుడు గోవిందు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వన్నప్ప సహకారంతో ఆదివారం రాత్రి తన ఇంటి ఎదుట నిద్రిస్తున్న సోమన్నపై పిడిబాకుతో దాడి చేశారు. సోమన్నగౌడ్ కేకలు వేయడంతో పరారయ్యారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... మంగళశారం ఉదయం నేమకల్లు గ్రామ రహదారిలో తచ్చాడుతున్న గోవిందు, వన్నప్పను అరెస్ట్ చేసి, పిడిబాకు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో బోల్తా...రైతు మృతి రాప్తాడు రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన పలువురు మంగళవారం ఉదయం వ్యక్తిగత పనిపై అదే గ్రామానికి చెందిన దూదుకుల భక్తర్ ఆటోలో అనంతపురానికి బయలుదేరారు. గ్రామ శివారులోని సచివాలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన మట్టి లేకపోవడంతో కిందకు దిగిన ఆటో తిరిగి రోడ్డు ఎక్కే క్రమంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో రైతు ఎర్రముద్దయ్యగారి వెంకట్రాముడు (59) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన పలువురిని స్థానికులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 మంది విద్యార్ధులకు గాయాలు బొమ్మనహాళ్: పాఠశాల విద్యార్ధులను తరలిస్తున్న ఆటో బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం కానాపురం, కొత్తూరు గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు డి.హీరేహాళ్ మండలం సోమలాపురంలోని ప్రఝఝబుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమైన విద్యార్థులు.. కానాపురం సమీపంలోని మలుపు వద్ద డ్రైవర్ చంద్ర వేగ నియంత్రణ కోల్పోవడంతో ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో విద్యార్థులు శ్రీకాంత్, కావ్య, జయలత, భూమిక, గణేష్, హుసేన్, పర్వీన్, కావేరి, మహాలక్ష్మి, ఈశ్వరమ్మ, సింధు, శంకర్, సంతోష్, అభయ్, నరేష్ తదితరులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్దులను స్ధానికులు బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. నేడు బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా శిబిరం అనంతపురం సిటీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సమస్యల పరిష్కార శిబిరం బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డివిజనల్ ఇంజినీర్ డి.గోపాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కస్టమర్ సర్వీస్ మాసంలో భాగంగా అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో ఉన్న వేమన భవన్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. మొబైల్ సిమ్ సేవలు, ఎఫ్టీటీహెచ్(ఫైబర్ ఇంటర్నెట్), ఇతర సేవలకు సంబంధించిన సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. -
పీ4 పేరుతో చంద్రబాబు వంచన
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో పీ4 అమలుతో పేదరికం పోగొడతానంటూ ప్రజలను సీఎం చంద్రబాబు వంచనకు గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మోదీ, చంద్రబాబు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పేదలు, ధనవంతుల మధ్య తారతమ్యం పెరుగుతోందన్నారు. దేశ, రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ పేదరికం పెంచుతున్నట్లుగా గొప్పలకు పోతున్నారని విమర్శించారు. వక్ఫ్ చట్టం సవరణ పేరుతో రాజ్యాంగం, లౌకికవాదంపై కేంద్రంలోని కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. ఇది ఇక్కడితో ఆగదని, ముస్లింల తర్వాత చర్చిల భూములు, అటు తర్వాత హిందు ఆలయాల భూములపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. దెబ్బతిన్న పంటలపై శ్రద్ధ చూపని ప్రభుత్వం కూడేరు: ప్రకృతి వైపరీత్యాలతో అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో దెబ్బతిన్న తోటలు, ఇతర పంటలపై నష్టం అంచనా వేయించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన కూడేరు మండలం ముద్దలాపురం, కడదరకుంట, చోళసముద్రం గ్రామాల్లో పర్యటించి, మూడు రోజుల క్రితం పెను గాలులు, వర్షానికి దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.35 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తోందని, అయితే ఈ సాయం రైతులకు ఏ లెక్కన సరిపోదన్నారు. పంటను బట్టి నష్టపరిహారం అందివ్వడంతో పాటు మళ్లీ ఉద్యాన పంటలు సాగుకు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు కేశవరెడ్డి, గోపాల్, రమణ, రాజేష్‌గౌడ్, కుళ్లాయిస్వామి, కృష్ణుడు, ఆంజనేయులు, సంగప్ప, మలరాయుడు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం -
అల్ట్రాసౌండ్కు గంటలు... 2డీ ఎకోకు చుక్కలు
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో సర్వజనాస్పత్రిలో రోజు రోజుకు వైద్య ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. పబ్లిక్ హాలీడే పేరుతో సోమవారం వైద్యులు, సిబ్బంది జాలీగా బయటకు వెళ్లిపోవడంతో రోగులు నరకయాతన అనుభవించారు. వేచి ఉన్న సహాయకులకు చుక్కలు కనిపించాయి. ఆస్పత్రిలోని 2డీ ఎకో, అల్ట్రాసౌండ్ స్కాన్లు తీవ్ర జాప్యమయ్యాయి. ‘2డీ ఎకో’ టెక్నీషియన్ గంటల తరబడి పత్తా లేకుండా పోవడంతో రోగులు వేచి ఉండాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు, అత్యవసర సర్జరీ కేసులకు 2డీ ఎకో తప్పనిసరి. అటువంటి కేసులను సకాలంలో చేయాల్సి ఉన్నా ఆ పరిస్థితి లేకుండా పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గంటల తరబడి గదుల ముందు ఉంచేశారు. 2డీ ఎకో కోసం రెండు సార్లు వార్డు నుంచి రావాల్సి వచ్చిందని శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. పీజీలే దిక్కు.. సర్వజనాస్పత్రి అల్ట్రాసౌండ్ స్కాన్‌లో పీజీలే దిక్కుగా మారారు. రేడియాలజిస్టు డాక్టర్ కల్యాణ్ కానరాకపోవడంతో అల్ట్రాసౌండ్ స్కాన్లు నెమ్మదిగా సాగాయి. 50 మందికిపైగా రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థి దశలో ఉన్న వారి దగ్గరుండి స్కాన్లు ఏ విధంగా తీయాలో నేర్పించాల్సిన రేడియాలజిస్టులు విధులను నిర్లక్ష్యం చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఇక.. డాప్లర్ స్కాన్‌కు గత మూడు రోజులుగా తిప్పుతున్నారని పూలకుంటకు చెందిన లత వాపోయింది. తీరు మార్చుకోని సర్వజనాస్పత్రి వైద్యులు రోగులకు తప్పని కష్టాలు -
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం
అనంతపురం: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో అగ్ని మాపక వారోత్సవాల ప్రారంభోత్సవంలో జిల్లా జడ్జి పాల్గొన్నారు. వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. 2024లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఫైర్ ఫైటింగ్ చేస్తూ అమరులైన సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ప్లకార్డులు చేతబట్టి నగరంలో ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంచారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఫైర్ సర్వీస్ సిబ్బంది, అధికారులు, విశ్రాంత అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ లింగమయ్య, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం. భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి వి. శ్రీనివాస రెడ్డి, ఎస్ఆర్ఐటీ, బాలాజీ విద్యా సంస్థలు, ట్రెల్లీస్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎం పదోన్నతుల సీనియార్టీ జాబితా సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను తయారు చేశారు. deoanantha puramu.blogspot.com వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈనెల 19లోపు ఫిర్యాదు చేయాలని డీఈఓ సూచించారు. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు అనంతపురం రూరల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం–1, 2లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, దీంతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలసి వసతి గృహంలోనే భోజనం చేశారు. కార్యక్రమంలో జేసీ శివ్‌నారాయణశర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఇన్చార్జ్) రాధిక తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
అనంతపురం సిటీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్‌లో గల డీపీఆర్సీ భవన్లో ఆదివారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ వినోద్‌కుమార్, ఉభయ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సంఘాల ప్రతినిధులు అనేక సమస్యలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. శ్మశాన వాటికల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని వెల్లడించారు. సబ్ ప్లాన్‌కు సంబంధించి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తామని, సివిల్ రైట్స్ డేని ఏప్రిల్ నుంచి ప్రతి తహసీల్దార్, ఎస్హెచ్ఓ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు లేని వారిని గుర్తించి న్యాయం చేస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా ఎదుగుతున్నారంటే అంబేడ్కర్ భిక్షేనని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అనంతపురంలోని అంబేడ్కర్ భవనానికి రూ.12 లక్షలు ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు చేస్తున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. కస్తూర్బాగాంధీ గురుకులాలతో పాటు మోడల్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం సీట్లను పెంచేలా చూస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. అంతకుముందు సందర్భంగా జెడ్పీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ క్యాంపస్‌లోని డీపీఆర్సీ భవన్లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకం రుణాలు, ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 12 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎన్డీఎఫ్డీసీ కింద రూ.27.55 లక్షల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. డిగ్రీ, ఇతర వృత్తి విద్య కోర్సులు అభ్యసిస్తున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.9.50 లక్షల విలువ చేసే ల్యాప్ ట్యాప్‌లు, నలుగురు బధిరులకు రూ.58 వేల విలువ చేసే టచ్ ఫోన్లు, మరో ఐదుగురికి రూ.56 వేల విలువ చేసే వీల్ చైర్లను పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ -
కొల్లగొట్టు కాంతారావ్!
ప్రకృతిని చెరబట్టాడు. కొండలను కరిగించేశాడు. ప్రజలపై దుమ్ము కొట్టాడు. అందిన కాడికి వెనకేసుకున్నాడు. అతని విశృంఖలత్వాన్ని చూసి అధికారులే విస్తుబోయారు. ఏకంగా రూ. 13 కోట్లకు పైగా ఫైన్ విధించారు. సదరు వ్యక్తి నుంచి ముక్కు పిండి ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉండగా.. కూటమి సర్కారు మాత్రం కరుణ చూపుతోంది. మన వాడే కదా.. అని ఏకంగా జరిమానాను రద్దు చేసేలా పావులు కదుపుతోంది.సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో మైనింగ్ మాఫియా డాన్‌గా పేరుగాంచిన టీవీఎస్ కాంతారావుకు కూటమి సర్కారు దన్నుగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీవీఎస్ కాంతారావు గతంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కేంద్రంగా భారీ దోపిడీ సాగించారు. కొండలను కొల్లగొట్టి రూ. కోట్లు కూడగట్టారు. అక్రమంగా కంకర, గ్రావెల్‌ను ఓబులాపురం మీదుగా కర్ణాటకకు తరలించారు. ఇతనిపై ఫిర్యాదుల నేపథ్యంలో 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మైనింగ్ అధికారులు నేమకల్లు వద్ద తనిఖీలు నిర్వహించారు. కాంతారావు అక్రమాలు చూసి ఆశ్చర్యపోయారు.పూర్తిస్థాయి విచారణ అనంతరం రూ.13.19 కోట్ల జరిమానా విధించారు. కానీ ఇప్పటికీ పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు.జరిమానాపై పునఃపరిశీలన..కూటమి సర్కారు కొలువుదీరిన మూడు నెలలకే అంటే 2024 సెప్టెంబర్ 7న గతంలో కాంతారావుకు విధించిన జరిమానాను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా గనుల శాఖను ఆదేశించింది. 2019లో గనులశాఖ అధికారులు స్వయంగా వారం రోజులు పరిశీలించి.. భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించి... ఆ మేరకు నివేదిక ఇచ్చిన తర్వాత వేసిన జరిమానాపై పునఃపరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడం చూస్తే... దాన్ని పూర్తిగా మాఫీ చేసే తలంపులో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికితోడు అప్పట్లో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు కూడా జప్తు చేయాలని, ఆ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఇచ్చిన నివేదికను కాదని ఇప్పుడు మళ్లీ పరిశీలించమన్నారంటే ఏ స్థాయిలో మైనింగ్ డాన్‌కు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందో ఊహించుకోవచ్చు.కూటమి సర్కారు రాగానే స్టార్ట్..కాంతారావుకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల వెనుక ఆయన పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి కాంతారావు నిధులు సమకూర్చారని, అందుకే ‘రివిజన్’ చేస్తున్నారని టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద కొండలు, గుట్టల్ని పిండి చేసి ఏళ్ల తరబడి రూ.కోట్లు దోచుకున్న కాంతారావు.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాగానే అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ప్రారంభించడం గమనార్హం. సర్కారు కొలువుదీరిన మరుసటి రోజే నేమకల్లు పరిసరాల్లో జేసీబీలు, క్రషర్లు గద్దల్లా వాలినట్లు తెలిసింది. -
ఆగని ‘కూటమి’ కక్ష సాధింపులు
● ఉరవకొండలో మరికొందరు వైఎస్సార్సీపీ నేతలకు పోలీసు నోటీసులు ఉరవకొండ: వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి సర్కారు కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ 27న ఉరవకొండలో పోరుబాట పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా కదం తొక్కడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ క్రమంలో దీన్ని ఓర్వలేని స్థానిక టీడీపీ నేతలు విద్యుత్ అధికారిపై ఒత్తిడి చేసి కేసు పెట్టించారు. ర్యాలీతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిందంటూ ఓ ‘పచ్చ’ నాయకుడి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. దీనిపై ఫిబ్రవరి 2న కొంతమంది వైఎస్సార్సీపీ నాయ కులను పిలిచి విచారణ చేపట్టిన పోలీసులు తిరిగి సోమవారం మరో 10 మంది పార్టీ ముఖ్య నాయకులకు నోటీసులు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్ మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తామన్నారు. ఉరవకొండలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మంత్రి కేశవ్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. నోటీసులు అందుకున్న వారిలో ఉరవకొండ రూరల్, మండల కన్వీనర్లు ఎర్రిస్వామిరెడ్డి, మూలగిరిపల్లి ఓబన్న, నాయకులు శింగనమల్ల ఉస్మాన్, సుద్దాల వెంకటేష్, వడ్డే ఆంజినేయులు, వెలిగొండ నాగన్న, అనిల్, బూదగవి ధనంజయలు తదితరులు ఉన్నారు. -
యువ కౌలు రైతు ఆత్మహత్య
నార్పల: కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక సుల్తాన్‌పేటకు చెందిన నాగభూషణం కుమారుడు కురువ చరణ్ (23) మామిడి తోటలను కౌలుకు తీసుకొనేవాడు. అలా ఈ ఏడాది తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని దాదాపు 15 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. పంట బాగా వచ్చేందుకు పురుగు మందులు కొట్టడంతో పాటు కూలీలతో ఇతర పనులు చేయించాడు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో పంట సరిగా రాలేదు. దీనికితోడు దళారుల మోసంతో మామిడికి సరైన ధరలు కూడా దక్కలేదు. దీంతో దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చింది. ఈ క్రమంలో అప్పులు కట్టే దారి కానరాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్ జంగంరెడ్డిపల్లి వద్ద తాను కౌలుకు తీసుకున్న మామిడితోటలో సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతుల వారు వెంటనే అతడిని జల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. చరణ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
మందకొడిగా రైతు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ చేపట్టిన రైతు రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. ఆధార్‌కార్డు మాదిరిగా ప్రతి రైతుకూ 11 నంబర్లతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య (ఫార్మర్ రిజిష్ట్రీ ఐడీ) కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఇందులో భాగంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) అగ్రీ స్టాక్ యాప్ నెల రోజులుగా సక్రమంగా పని చేయడం లేదని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలంటూ వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆర్ఎస్కే సిబ్బంది సతమతమవుతున్నారు. రైతు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నెంబరు ద్వారా రిజిస్టరేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాల్సివుంటుంది. చాలా వరకు రెండు ఓటీపీలు సక్సెస్ అవుతున్నా మూడోసారి ఓటీపీ కావడం లేదని తెలిసింది. దీంతో అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. భవిష్యత్తులో ఇన్‌పుట్‌సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, పావలావడ్డీ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, రాయితీ విత్తనాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు తదితర వ్యవసాయ అనుబంధ శాఖల పరిధిలో ప్రభుత్వ ఫలాలు వర్తించాలంటే రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. రెండు నెలల్లో 60 శాతమే.. జిల్లా వ్యాప్తంగా 3,42,666 మందికి విశిష్ట సంఖ్య కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1.97 లక్షల మందికి కేటాయించారు. అంటే గత రెండు నెలలుగా చేస్తున్నా 60 శాతం పూర్తీ చేశారు. ఇంకా 40 శాతం పెండింగ్ ఉండటంతో ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఆ లోపు కూడా ప్రక్రియ పూర్తి కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇప్పటివరకూ పెద్దవడుగూరు మండలంలో 94 శాతం పూర్తి కావడంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. పెద్దపప్పూరులో 90 శాతం, గుత్తి 88, రాయదుర్గం 83, యాడికి 83, తాడిపత్రి 79, గుంతకల్లు 78 శాతం ఇలా కొన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్లు బాగానే జరిగాయి. అయితే గుమ్మఘట్ట 33 శాతం, కుందుర్పి 36, వజ్రకరూరు 37, బుక్కరాయసముద్రం 38, బెళుగుప్ప 39, కళ్యాణదుర్గం 40 శాతం... ఇలా కొన్ని మండలాల్లో మందకొడిగా కొనసాగుతోంది. యాప్ సరిగా పనిచేయక సిబ్బంది సతమతం ఇప్పటి వరకు 60 శాతం పూర్తయినట్లు వెల్లడి -
మట్టి తోలితే.. మనల్నెవడ్రా ఆపేది..?!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మేమేం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరు.. ఆపేవారు అంతకన్నా లేరు.. అంతా మా ఇష్టం’ అన్న తరహాలో ఆత్మకూరు మండలంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడికై నా మట్టి తోలాలంటే ముందుగా రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి నిబంధనలేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మట్టిని అక్రమంగా తరలిస్తూ ఓ తెలుగు తమ్ముడు జేబులు నింపుకుంటున్నాడు. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి సమీపంలో టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ నెల రోజుల నుంచి మట్టిని కొల్లగొడుతున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 500 టిప్పర్ల వరకు అక్రమంగా మట్టి తరలించినట్లు తెలి సింది. ఒక టిప్పర్ రూ.7 వేల వరకు విక్రయిస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నాడు. గత వైఎస్సార్సీపీ హయాంలో గ్రామంలో శ్రీ కృష్ణుని గుడి నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి భూమి పూజ చేయగా.. అప్పట్లో సదరు కృష్ణమోహన్ వేరే వారితో ఫోన్లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే గుడి కట్టినా, బడి కట్టినా కూల్చేస్తాం అన్న మాటలు పెద్ద దుమారమే లేపాయి. చోద్యం చూస్తున్న అధికారులు.. నిత్యం వందల మట్టి టిప్పర్లు అనుమతి లేకుండా హైవేపైనే వెళ్తున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండల రెవెన్యూ అధికారు లకు విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వడ్డుపల్లి సమీపంలో టిప్పరుతో అక్రమంగా మట్టి తరలిస్తున్న దృశ్యం -
జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు
అనంతపురం మెడికల్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ నెల 13న గుంటూరులో అఖిల భారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర విభాగం కో ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎం.శాంతిప్రియకు అవకాశం దక్కింది. డాక్టర్ పోగుల కుమారయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హోమియో వైద్యం ప్రాముఖ్యత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగదు అపహరణ కేసులో నిందితుడి అరెస్ట్ నార్పల: నగదు అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పల పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో వెంకటాంపల్లికి చెందిన శ్రీనివాసులు, తన భార్యతో కలసి నార్పలలోని స్టేట్‌బ్యాంకులో ఉన్న తన ఖాతా నుంచి రూ.3 లక్షలు డ్రా చేసి ద్విచక్ర వాహనంలోని బ్యాగ్‌లో ఉంచుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో నార్పల సంతలో నిత్యావస సరుకులు తీసుకునేందుకు వాహనాన్ని ఆపాడు. ఆ సమయంలో చిన్నా అనే యువకుడు నగదు అపహరించాడు. ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి సంచరిస్తున్న చిన్నాను.. సోమవారం నార్పల క్రాస్ సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. -
టీడీపీ నేతపై హత్యాయత్నం
బొమ్మనహాళ్: మహిళ పరువు తీశాడన్న కక్షతో టీడీపీ నేతపై బాధితురాలి సంబంధీకులు కత్తితో దాడి చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం కల్లుహోళ గ్రామానికి చెందిన టీడీపీ నేత సోమన్నగౌడ్... అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం వెలుగు చూడడంతో కొన్నేళ్ల క్రితం పెద్ద మనుషుల పంచాయితీ నిర్వహించి ఇద్దరినీ మందలించారు. ఇటీవల సోమన్నగౌడ్ మళ్లీ ఆమెతో మాట్లాడుతుండడం సదరు మహిళ మేనల్లుడు గోవిందు గమనించాడు. దీంతో గ్రామంలో తమ మేనత్త పరువు తీయడమే కాక మళ్లీ ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుండడాన్ని జీర్ణించుకోలేక అదే గ్రామానికి చెందిన బి.వన్నప్పతో కలసి ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత తన ఇంటి ఎదుట నిద్రిస్తున్న సోమన్నగౌడ్పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో సోమన్నగౌడ్ దాడిని ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు మేల్కొనడంతో గోవిందు, వన్నప్ప అక్కడి నుంచి పారిపోయారు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అపశ్రుతి ఉరవకొండ: పట్టణంలో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో దళిత సంఘం నాయకుడు, పెద్ద ముష్టూరు గ్రామానికి చెందిన నాగరాజు (49) గుండెపోటుతో మృతి చెందాడు. ముందుగా ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తుండగా ఒక్క సారిగా ఛాతి పట్టుకుని కుప్పకూలాడు. గమనించిన నాయకులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్దారించారు. నాగరాజు మృతిపై దళిత సంఘం నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు సంతాపం తెలిపారు. పెనుగాలుల బీభత్సం గార్లదిన్నె: మండల కేంద్రం గార్లదిన్నెతో పాటు కల్లూరులో సోమవారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కల్లూరులో 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలి రోడ్డు మీద పడింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అలాగే గార్లదిన్నెలోని డ్యాం రోడ్డు రైల్వే గేట్ వద్ద పురాతన వేపవృక్షం విరిగి పడింది. గ్రామాల్లోని పలు తోటల్లో చెట్లు విరిగి పడినట్లు రైతులు తెలిపారు. పామిడిలో గాలీవాన పామిడి: మండల కేంద్రం పామిడిలో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో ఇళ్ల రేకులు, పీఓపీ సీట్లు ఎగిసి పడ్డాయి. రేకుల షెడ్లు నేల కొరిగాయి. -
ప్రాణం పోసిన మెడిసిన్ వైద్యులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో చికిత్స ఆస్పత్రికి చేరుకున్న రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా అతని ప్రాణాలను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగం వైద్యులు కాపాడారు. కంబదూరు మండలం ఒంటిరెడ్డిపల్లికి చెందిన 34 ఏళ్ల వయసున్న నాగేంద్ర.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నఫళంగా కాళ్లు చేతులు పడిపోయి, మాట రాకపోవడంతో ఈ నెల 7న కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మెడికల్ కేర్‌లో అడ్మిట్ చేసుకుని మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ భీమసేనాచార్ నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పావని తదితరులు చికిత్స మొదలు పెట్టారు. గులియన్ బరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ అయిన తర్వాత పీజీ వైద్యులు, స్టాఫ్‌నర్సులు నాగేంద్రకు రౌండ్ ద క్లాక్ సేవలందించారు. రూ.7వేలు విలువ చేసే ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా 20కి పైగా అందించాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై ఉన్న నాగేంద్ర కోలుకోవడంతో వార్డుకు షిప్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తమకు ముగ్గురు పిల్లలున్నారని, ఆస్పత్రి వైద్యులు తన భర్తకు ఊపిరి పోశారని, వారి మేలును ఎన్నడూ మరవనంటూ వైద్యులు, స్టాఫ్‌నర్సులు, తదితర సిబ్బందికి భార్య సుకన్య కృతజ్ఞతలు తెలిపింది. ప్రైవేట్‌గా ఈ తరహా వైద్యం పొందాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వైద్యులంటున్నారు. -
మహిళా కమిషన్ సభ్యురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
గుత్తి: ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు, గుత్తి పట్టణానికి చెందిన రుఖియాబేగం ఆదివారం శ్రీకాళహస్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రుఖియా బేగంకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.మద్యం అడిగితేఇవ్వలేదని వ్యక్తిపై దాడియాడికి: తాగేందుకు మందు ఇవ్వలేదన్న అక్కసుతో ఖాళీ మద్యం బాటిళ్లతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాడికిలో సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన మంగల గంగాధర్ సోమవారం వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మిగిలిన వారితో కలసి తాగుతూ కూర్చొన్నాడు. అదే సమయంలో గంగాధర్‌తో ఎలాంటి ముఖపరిచయం లేని యాడికి గ్రామానికి చెందిన మహేష్ అక్కడకు చేరుకుని తనకూ తాగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు గంగాధర్ నిరాకరించడంతో మహేష్ వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడుతూ ఆ పక్కనే పడి ఉన్న ఖాళీ మద్యం గాజు బాటిల్ తీసుకుని గంగాధర్ తలపై బలంగా బాదాడు. దీంతో గంగాధర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. సమాచారం అందుకున్న గంగాధర్ సమీప బంధువు అక్కడకు చేరుకుని వెంటనే క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న యాడికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.పేలుడు పదార్థం తిని గొర్రె మృతిఎన్పీ కుంట: అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన పేలుడు పదార్థం తిని ఓ గొర్రె మృతి చెందింది. ఎన్పీ కుంటకు చెందిన గొర్రెల కాపరి భాస్కర్ సోమవారం ఉదయం తన గొర్రెలను రోడ్డుకు సమీపంలోని చవట గుంతల వద్ద మేపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవాలు మేపు సమయంలో నల్లమందు ఉంటలపై కాలు పెట్టినా పేలుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
అనంతపురం కార్పొరేషన్: ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ వసీం ధ్వజమెత్తారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కక్ష సాధింపులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. రూ.2.75 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా పేదరికం నిర్మూలనకు కృషి చేశారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ మాట్లాడుతూ.. పారదర్శకత, అవినీతిరహిత పాలనను జగనన్న అందిస్తే.. ఇందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూటమి సర్కార్ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం అనంతరం జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర నాయకులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, పెన్నోబులేసు, కృష్ణవేణి, వేముల నదీం, అనుబంధ సంఘాల అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, వైపీ బాబు, శ్రీదేవి, సైఫుల్లాబేగ్, అమర్నాథ్ రెడ్డి, చంద్రలేఖ, నాయకులు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, మీసాల రంగన్న, పసులూరు ఓబులేసు, దాదు, తలారి వెంకటేష్, మారుతీనాయుడు, తనీష, మాల్యవంతం మంజుల, ఫయాజ్, సతీష్, లక్ష్మణ్, శోభారాణి , శోభాబాయి, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, దుర్గాదేవి, రహంతుల్లా, రాజేశ్వరి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి -
అంబేడ్కర్ కాలనీ నేమ్‌బోర్డు ఏర్పాటుపై ఉద్రిక్తత
రాయదుర్గం టౌన్: మండలంలోని రాయంపల్లి ఎస్సీ కాలనీ ప్రవేశ మార్గంలో ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్ బోర్డు ఏర్పాటుపై సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు నేమ్‌బోర్డును దౌర్జన్యంగా పెకలించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లా కలెక్టర్‌గా గంధం చంద్రుడు పనిచేసిన సమయంలో దళిత, ఎస్సీ కాలనీలను ఆ పేర్లతో పిలవకూడదన్న ఉద్దేశంతో జాతీయ నాయకుల పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయించారు. ఈ నేపథ్యంలోనే రాయంపల్లి ఎస్సీ కాలనీకి ‘అంబేడ్కర్ కాలనీ’గా నామకరణం చేసి నేమ్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోర్డు పడిపోవడంతో కొందరు యువకులు మరమ్మతు చేయించి.. అంబేడ్కర్ జయంతి రోజున అదే స్థలంలో మళ్లీ ఏర్పాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు దళితులతో ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సద్దుమణిగించారు. కాగా, ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్‌బోర్డు ఏర్పాటు చేస్తే అంతు చూస్తామంటూ కులం పేరుతో దూషించి న కూటమి పార్టీల నాయకులు శీనప్ప, మద్దానప్ప, హనుమంతప్ప, జయన్న, ఆంజనేయులు, బోయ దొడ్డపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు దళితులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తిప్పేరుద్ర, వన్నూరుస్వామి, కిష్టప్ప, రుద్రన్నతో పాటు మరో 12 మంది డిమాండ్ చేశారు. -
90
జేఎన్టీయూ (ఏ) పరిధిలో అనుబంధ కళాశాలలుఅనంతపురం: ఇంజినీరింగ్ కష్టమనే అపోహను విద్యార్థుల్లో తొలగిపోయేలా మానసికంగా సంసిద్ధం చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా, ఐఐటీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను పరిగణనలోకి తీసుకుని గత రెండేళ్లుగా ఏఐసీటీఈ జరిపిన అధ్యయనాల్లో బోధనా ప్రణాళికతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న విషయం వెల్లడైంది. జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పులపై తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే ఇందుకు కారణంగా గుర్తించి ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేలా మార్గదర్శకాలను జారీ చేశారు. ఇంజినీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులు మూస విధానం నుంచి బయటపడి స్వతహాగా ఆలోచించే విద్యా విధానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే ఇది కూడా మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోందని ఏఐసీటీఈ జరిపిన మరో అధ్యయనంలో తేలింది. దీంతో తరగతుల ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా విద్యార్థులను సంసిద్ధులను చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. బ్యాక్‌లాగ్స్ భారమై.. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కేవలం 18 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. సింహభాగం విద్యార్థులు మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యా ప్రణాళిక, బీటెక్ విద్యా ప్రణాళిక విభిన్నంగా ఉండడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ వరకు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజినీరింగ్‌లో బట్టీ విధానం ఉండదు. కంప్యూటర్ సైన్స్‌లో గణితం ఒక్కసారిగా మారిపోతుంది. రెండో ఏడాదికి వచ్చే సరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్‌లను విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలూ సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్‌లోనూ ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ముందుకెళ్లని పరిస్థితి. ఈ కారణంగా బీటెక్ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థులకు బ్యాక్‌లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే వారి మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోంది. అధునాతన కోర్సులకు అధ్యాపకుల కొరత.. పోటీ ప్రపంచానికి దీటుగా కంప్యూటర్ సైన్సెస్ కోర్సు, దాని అనుబంధ కోర్సులకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. గత మూడేళ్లుగా డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ కోర్సులు భోదించే అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. దీంతో ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యత కలిగి ఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. విద్యార్థుల శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ విద్యా ప్రణాళికపై తరగతుల ప్రారంభానికి ముందే వారిలో అవగాహన పెంచేలా చర్యలు తీసుకున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అన్ని విధాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. – హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ(ఏ) ఇంటర్, బీటెక్ విద్యా ప్రణాళికలు విభిన్నం దీంతో ఇంజినీరింగ్ కష్టమనే అపోహ అపోహలు తొలగిపోయేలా విద్యార్థులకు ముందస్తుగా కౌన్సెలింగ్ క్యాంపస్ కళాశాలలో సీట్ల పెంపుదలకు కసరత్తు జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రస్తుతం ఒక్కో బ్రాంచ్‌కు 60 సీట్లు ఉండగా, వీటిని 120కు పెంచేలా పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్ .సుదర్శనరావు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. అలాగే స్నాతకోత్సవం నిర్వహణపై కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. పులివెందుల కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు వర్సిటీనే నిధులు అందించేలా చర్యలు తీసుకున్నారు. -
19న వివాహం... యువతి బలవన్మరణం
రాప్తాడు రూరల్: పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట కాబోయే పెళ్లికూతురు బలవన్మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం రూరల్ మండలం పూలకుంటలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన మేరకు... పూలకుంట గ్రామానికి చెందిన కురుబ నారాయణస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహమైంది. రెండో అమ్మాయి రేణుక (24) ఆకుతోటపల్లి–1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఈమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 19న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు ఓవైపు పెళ్లి పత్రికల పంపిణీ చేస్తూనే మరోవైపు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి బంధువుల రాక కూడా మొదలైంది. పెళ్లంటే ఇష్టం లేక.... అయితే రేణుకకు పెళ్లంటే ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు సచివాలయంలో సహచర ఉద్యోగులతో చెప్పేది. ‘పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో...అత్త మామలు ఎలా ఉంటారో....ఇప్పుడున్నట్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఉండేందుకు ఉండదు... కొత్తగా పెళ్లి చేసుకున్న వారి కాపురాలు చాలా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకోవాలో?’ అని చర్చించేది. మరోవైపు పెళ్లి తేదీ దగ్గరకు వస్తుండడంతో హడావుడి పెరిగిపోయింది. ఇక పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె సోమవారం ఉదయం మేడపై ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తె కనిపించింది. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట విషాదం మృతురాలు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ -
సజావుగా ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్షిప్ పరీక్షలు సజావుగా జరిగాయి. సీడీఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం 45.07, ఎన్డీఏ పరీక్షకు 65.42 శాతం నమోదైంది. అనంతపురం కేఎస్ఎన్ పీజీ మహిళా కళాశాలలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావెల్ అకాడమీ (ఎన్ఏ), ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షలు నిర్వహించారు. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. సీడీఏ పరీక్షకు 94 మంది హాజరవ్వాల్సి ఉండగా పేపర్–1కు 41 మంది,పేపర్–2 కు 48 మంది హాజరయ్యారు. పేపర్–3 పరీక్షకు 37 మందికి 15 మంది హాజరయ్యారు. ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షకు 269 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. పేపర్–1కు 178, పేపర్–2కు 174 మంది హాజరయ్యారు.ఎం.రామ్మోహన్,డి.తిప్పేనాయక్లు పరీక్షలను పర్యవేక్షించారు. ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆదివారం రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 5వ తరగతి ప్రవేశానికి 7,595 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 6,972 మంది హాజరయ్యారు. 625 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 4,945 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,099 మంది హాజరయ్యారు. 847 మంది గైర్హాజరయ్యారు. బి.పప్పూరు, కొర్రపాడు, కురుగుంట స్కూళ్లలో కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు క్లారెన్స్ రాజు పరిశీలించారు. కురుగుంట కళాశాల కేంద్రంతో పాటు తిమ్మాపురం, అమరాపురం, నల్లమాడ పాఠశాలల కేంద్రాలను అంబేడ్కర్ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త జయలక్ష్మీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు ఫిర్యాదుల స్వీకరణ ఉండదు అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ ఈ సోమవారం ఉండదని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో జరగాల్సిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు. వృద్ధ దంపతుల ఆత్మహత్య ● అనారోగ్యంతో మనస్తాపం చెంది బలవన్మరణం అనంతపురం: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీ చెందిన దేవా శివానంద (70), దేవా శాంతమ్మ (60) దంపతులు. వీరికి దేవా గోపాల్, దేవా చంద్రశేఖర్ సంతానం కాగా, హిందూపురంలో కుమారులు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన శివానందకు ఇటీవల షుగర్ ఎక్కువైంది.కిడ్నీ కూడా దెబ్బతినడంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. శాంతమ్మ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి అనంత పురం చేరుకున్నారు. నగర సమీపంలోని నేషనల్ పార్కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక శివానంద అదే రోజు ప్రాణాలు విడిచారు. శాంతమ్మ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
పరిస్థితి దారుణంగా ఉంది
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ తోటలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 93 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,250 ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ పంట సాగవుతోంది. వాటి ద్వారా ఏటా 7.20 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తోంది. ఏటా సరాసరి రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల టర్నోవర్ ఉన్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో 18 వేల ఎకరాలు, యల్లనూరు 11,296, కూడేరు 9,300, పామిడి 5,300, నార్పల 5,200, పుట్లూరు 5 వేలు, ఆత్మకూరు 4,200, అనంతపురం 3,900, పెద్దపప్పూరు 3,500 ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చీనీ అత్యధికంగా సాగులో ఉంది. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి.. ఉమ్మడి జిల్లాలో పండించే చీనీలో 70 నుంచి 80 శాతం వరకు ఢిల్లీలో ఉన్న అజాద్‌పూర్ మార్కెట్‌కు, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ సారి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు అక్కడికి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల మార్కెట్లకు సరుకు విపరీతంగా వెళుతుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని మార్కెట్‌యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. ఇటీవల జిల్లా నుంచి అక్కడకు వెళ్లిన 50 నుంచి 70 లారీల సరుకు ఇంకా అన్లోడ్ కాలేదని, దీంతో ధరలు పెరగడం లేదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ధరలు పలికేవి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ధరలు పెరగడం అటుంచి తగ్గుదల కనిపిస్తుండటంతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్‌లో టన్ను రూ.40 వేలకు పైగా పలకాల్సివుండగా... గత రెండు నెలలుగా టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి పలకడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఇటీవల నిత్యం 1,000 నుంచి 1,500 టన్నుల సరుకు వస్తోంది. ఈ క్రమంలో శనివారం టన్ను గరిష్ట ధర రూ.20 వేల లోపే పలికింది. సరాసరి ధర రూ.13 వేలు మాత్రమే పలకడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు శనివారం మార్కెట్‌యార్డులో జీవాల సంత ఉండటంతో చీనీ అమ్మకాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. చాలా వాహనాల్లోని సరుకును కిందికి దించి అమ్మకాలు చేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఇలా రోజురోజుకు కష్టాలు ఎక్కువ అవుతుండటంతో చీనీ రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ‘అనంత’ రైతులకు ఒకప్పుడు లాభాల తీపి పంచిన చీనీ ఇప్పుడు చేదెక్కింది. మంచి ధర కోసం వారాలు, నెలల తరబడి కాయలు కోయకుండా ఎదురుచూసినా ఫలితం కానరాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉన్నా కూటమి సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ధరలు మరింత పతనం గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరిస్థితులు రైతుల్లో తీవ్ర ఆందోళన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చీనీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రంజాన్, ఉగాది, హోలీ పండుగలు అన్నీ వెళ్లినా... ధరలు మాత్రం పెరగడం లేదు. తోటల్లోనే టన్ను రూ.25 వేలకు మించి అడగడం లేదు. దానికి డబుల్ సూట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే నెల పాటు కాయలు కోయకుండా ధరల కోసం ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. నాకు ఏడెకరాల చీనీ తోట ఉంది. దిగుబడి బాగానే ఉన్నా ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. టన్ను రూ.40 వేలు అటుఇటుగా పలికితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో కన్నా ఈ సారి చీడపీడల తాకిడి ఎక్కువ కావడంతో పురుగుల మందుల ఖర్చు బాగా పెరిగింది. – కుళ్లాయిరెడ్డి, చీనీ రైతు, కునుకుంట్ల గ్రామం, తాడిమర్రి మండలం -
వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో..
అనంతపురం కార్పొరేషన్: ‘వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో.. హమ్ కిసీకో డర్తా నహీ (వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోండి.. మేం దేనికీ భయపడేది లేదు)’ అంటూ ముస్లింలు నినదించారు. అనంతపురం నగరంలో ఆదివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ విజయ వంతమైంది. ర్యాలీలో వేలాదిగా ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ప్రజా, కుల సంఘాలు వీరికి మద్దతు తెలిపాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి క్లాక్‌టవర్, రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందన్నారు. 11 ఏళ్లుగా ముస్లిం మైనార్టీలను బీజేపీ ఇబ్బంది పెడుతోందని, తమ పూర్వీకుల ఆస్తులను కాజేసేందుకు తాజాగా కుట్ర చేస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది అదానీ, అంబానీలని, రానున్న రోజుల్లో ‘వక్ఫ్’ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెబుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వక్ఫ్ చట్టాన్ని తెచ్చారన్నారు. ఉర్దూ అకాడమీ రాష్ట్ర మాజీ చైర్మన్ నదీం అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముస్లింలకు న్యాయం చేయాలని ఉంటే రంగనాథ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ ‘వక్ఫ్’ చట్టం ఉపసంహరించుకునే వరకు ముస్లింలకు అండగా ఉంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో తప్పక బుద్ధి చెబుతామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, తబ్లిక్ జమాత్, సున్ని జమాత్ మతపెద్దలు, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు నియాజ్, వేమల నదీం, ఏకేఎస్ ఫయాజ్, ఖాజా, తనీష, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులు సాకే హరి, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, నాయకులు తాజుద్దీన్, హారూన్ రషీద్, సూఫీ ఖాజా, జావెద్, జక్రియా, షమీ, అలీ, అల్లీపీరా, ఐఎంఎం బాషా, చామలూరు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
48 ఏళ్ల తర్వాత...
● అ‘పూర్వ’ సమ్మేళనంపెద్దవడుగూరు: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 1992లో పదో తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సరస్వతీ దేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ పంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలకు చేరుకుని తమతో పాటు చదువుకుని అకాల మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. రూ.40 వేలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పూర్వ విద్యాఉ్థలు అనిల్, రాజేశ్వరమ్మ ముందుకు వచ్చారు. అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని శ్రీపొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో 1976–1977లో 10వ తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవితంలో స్థిరపడిన వారు 48 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చాలామంది విద్య, వైద్యం, న్యాయ శాఖ, రెవెన్యూ, ఆడిట్, అటవీ శాఖ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర రంగాల్లో సేవలందించి ఉద్యోగ విరమణ సైతం పొందారు. తమ చిన్ననాటి అల్లర్లను, గురువులతో వారికున్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్నారు. గురువులు సూర్యనారాయణ శాస్త్రి, రంగప్ప, కృష్ణమూర్తి, గంగాచారిని ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్యామసుందర్, అటవీ శాఖ అధికారి ఆంజనేయులు, వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షకులు మనోహర్, పోస్టల్ శాఖ వన్నప్ప, ఆడిటర్ హరినాథ్, విశ్రాంత తహసీల్దార్ సిరాజుద్దీన్, విద్యా శాఖ షేక్ మహబూబ్‌బాషా, రియాజుద్దీన్, రక్షణ శాఖ లక్ష్మీకాంత రెడ్డి, వ్యాపారవేత్త అబ్దుల్ ఖయూమ్తో పాటు మరో 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గురువులు పుల్లన్న, పద్మనాభ శాస్త్రి, చిన్నకేశవులు ఇళ్ల వద్దకు వెళ్లి ఘనంగా సత్కరించారు. -
●వైభవం.. చిక్కణ్ణేశ్వరుడి రథోత్సవం
కణేకల్లు మండల కేంద్రంలో ఆదివారం చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. రథోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కణేకల్లులో సందడి నెలకొంది. ‘చిక్కణ్ణేశ్వరా.. శరణు’ అంటూ భక్తులు చేసిన ఘోషతో పురవీధులు మార్మోగాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆశీనులు గావించి ఉత్సవం ప్రారంభించారు. రథోత్సవం సాగుతున్నంత సేపూ శివన్నామస్మరణ చేసుకుంటూ భక్తులు తన్మయత్వం చెందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. – కణేకల్లు: -
నెట్టికంటుడికి కిలో వెండి వితరణ
గుంతకల్లు రూరల్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మౌనిక, రాకేష్ దంపతులు ఆదివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కిలో బరువున్న వెండిని అందజేశారు. అంతకు ముందు దాతల కుటుంబసభ్యుల పేరున ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. లైంగిక వేధింపులపై కేసు నమోదు గార్లదిన్నె: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను లైంగికంగా వేధిస్తున్న పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు భాస్కర్‌పై కేసు నమోదు చేసినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపారు. భాస్కర్ యర్రగుంట్ల గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలసి బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఉపాధ్యాయుడి మృతి గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎన్.కాంతారావు (58) ఆదివారం కన్నుమూశారు. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే వారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్ధితి విషమించడంతో ఆదివారం ఉదయం 6.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన మృతి చెందారు. ఆయన మృతిపై వైఎస్సార్‌టీఏ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓబులేసు, వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. -
సంక్షోభంలో రవాణా రంగం
హిందూపురం అర్బన్: లారీ రవాణా రంగం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. రాష్ట్రంలో విజయవాడ తరువాత పదేళ్ల క్రితం వరకూ హిందూపురం రవాణా రంగంలో రెండో స్థానంలో ఉండేది. డీజిల్ ధరలు పెరగడం.. టోల్ గేట్ల మోత.. లోడింగ్– అన్లోడింగ్ల ఖర్చు, జీఎస్టీల భారంతో కనీస ఖర్చులు కూడా చేతికి అందడం లేదని లారీ యజమానులు వాపోతున్నారు. ఉన్నవి నడపడమే గగనం గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 12వేలకు పైగా లారీలు ఉండేవి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, నాగపూర్, కొలకత్తా, చైన్నె, కొచ్చికి ఇక్కడి నుంచి సరుకు ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా జరిగేవి. దీంతో పదేళ్ల క్రితం వరకు లారీల నిర్వాహకులకు ఆదాయం బాగుండేది. ఈ క్రమంలో చాలా మంది ఫైనాన్స్ కింద లారీలు కొనుగోలు చేసి సరుకు రవాణా రంగంలో స్థిరపడ్డారు. కాలక్రమేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరుల కారణంగా సరుకు రవాణా వ్యవస్థ కుదేలవుతోంది. కొత్తగా లారీలు కొనుగోలు చేసేవారి సంగతి పక్కన ఉంచితే... ఉన్నవాటిని నడపడమే గగనంగా మారుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 వేల వరకు లారీలు ఉన్నాయి. కాలం మారినా అవే బాడుగలు రవాణా రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా ఐదారేళ్ల క్రితం ఉన్న కిరాయినే ఇప్పటికీ ఉంది. లోడింగ్‌లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సీజన్లో కాస్త మెరుగనిపించినా ఆ తర్వాత లారీలన్నీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం ఎదుటే ఉంటున్నాయి. సరుకు రవాణాకు ఇప్పుడు రైళ్లను ఎక్కువగా ఎంచుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెరిగిన ఇన్సూరెన్స్, పన్నులు లారీ విలువను బట్టి రెండేళ్ల క్రితం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బీమా ప్రీమియంను యజమానులు చెల్లించేవారు. ఇప్పుడు ఇదే ప్రీమియం రూ.40 వేల నుంచి రూ.75 వేల వరకు చేరింది. 22 చక్రాల కొత్త లారీకి ఇన్సూరెన్స్ కింద రూ.1.25 లక్షల ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. అలాగే లారీని బట్టి మూడు నెలలకు ఒకసారి స్టేట్ పర్మిట్ కింద పన్ను రూ.8 వేల నుంచి 13 వేల వరకు చెల్లించాలి. నేషనల్ పర్మిట్ అయితే మరింత ఎక్కువవుతుంది. ఇక ఏడేళ్లు దాటిన లారీలకు పన్నులకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ తప్పక చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన ఇంధనం, టైర్లు, విడి పరికరాల ధరలు కూలీలతో లోడింగ్, అన్లోడింగ్ కష్టాలు ఈఎంఐలు కట్టలేక రోడ్డు మీద పడే దుస్థితి రేపటి నుంచి కర్ణాటకకు నో ఎంట్రీ పెరిగిన విడిభాగాల ధరలు ఇంజన్ ఆయిల్‌తో పాటు లారీల విడిభాగాల ధరలు దాదాపు 22 శాతం మేర పెంచారు. దీంతో లారీ సామర్థ్యాన్ని బట్టి నెలవారీ నిర్వహణ ఖర్చు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు వస్తోంది. టైర్ల ధరలు మూడేళ్ల క్రితం రూ.16,500 ఉంటే ఇప్పుడు అవే టైర్లు రూ.21,500కు చేరుకున్నాయి. రేడియల్ టైర్లయితే రూ.26వేలు ఖర్చవుతోంది. రోడ్డుపై లారీ తీసిన ప్రతిసారీ పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. మోయలేని ఆర్థిక భారం రవాణా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్ తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే దీని ధర ఎక్కువ. విడి భాగాల ధరలు సైతం అందుబాటులో లేవు. అంతేకాక కొందరిని నమ్మి లారీలు అప్పజెప్పే కాలమూ పోయింది. ఓనర్లే తిప్పడమో లేదా డ్రైవర్‌తో పాటు వెళ్లడం చేస్తున్నారు. జీఎస్టీతో యజమానులపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. వీటిని తగ్తిస్తే ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. – షేక్ ఇందాద్, హిందూపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాదుడు 10 ఏళ్ల క్రితం లీటర్ డీజిల్ ధర రూ.68 ఉండేది. అప్పట్లో విజయవాడకు టన్ను సరకు రవాణాకు రూ.1,600 ఇచ్చేవారు. అంటే లారీకి 15 టన్నులు వేసినా రూ.24 వేలు వచ్చేది. రానూపోను రూ.48 వేలు దక్కితే ఖర్చులు పోను రూ.15వేలు మిగిలేది. ఇప్పుడు లీటరు డీజిల్ రూ.100కు చేరువలో ఉంది. విజయవాడకు కిరాయి టన్నుకు రూ.14 వేలు ఇస్తున్నారు. ఈ లెక్కన రానూపోను రూ.42 వేలు వస్తుంది. ఖర్చులన్నీ పోనూ యజమానికి మిగిలిదే ఏదీ ఉండదు. దీనికి తోడు గ్రీన్‌ట్యాక్స్‌ను అమాంతం పెంచేశారు. – షౌకత్ అలీఖాన్, లారీ ఓనర్, హిందూపురంప్రజా జీవితంలో రవాణా రంగం కీలక భూమిక పోషిస్తోంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. రకరకాల పన్నుల పేరుతో అధిక మొత్తంలో నగదు వసూళ్లతో రవాణా రంగం కుదేలవుతోంది.15 నుంచి కర్ణాటకకు లారీల బంద్ రవాణా రంగాన్ని కలవర పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు నిరసనగా ఈ నెల 14న అర్ధరాత్రి నుంచి రవాణా కార్యకలాపాలు విరమించాలని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ లారీ ఓనర్స్, ఏజెంట్స్ అసోషియేషన్ నిర్ణయించింది. ఇందుకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. లీటర్ డీజల్‌పై రూ. 5 అదనంగా పెంచడం, టోల్గేట్ల వద్ద బలవంతపు వసూళ్లు, బెంగళూరులో అశాసీ్త్రయమైన నో ఎంట్రీ నిబంధనలు, అప్పు కింద కొనుగోలు చేసిన లారీ యజమానులపై ఫైనాన్స్ వారి వేధింపులు.. తదితరాలను నిరసిస్తూ కర్ణాటక లారీ అసోసియేషన్ ఈ మేరకు ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో ఈ నెల 15 నుంచి కర్ణాటకకు లారీల రాకపోకలు నిలిపివేయనున్నారు. -
విద్యా విధానంలో.. గందరగోళ నిర్ణయాలు తగదు
● రాష్ట్రోపాధ్యాయ సంఘం అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని విద్యా విధానంలో రోజురోజుకూ గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాలు సముచితం కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు మండిపడ్డారు. ఆదివారం విజయవాడ వేదికగా జరిగిన ఎస్టీయూ రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు కాబోతున్న విద్యా విధానంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగేలా అధికారిక నిర్ణయాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 117 జీఓను రద్దు చేస్తామని, ప్రతి పంచాయతీకి ఓ మోడల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. మరోసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ప్రతి పంచాయతీకి మోడల్ పాఠశాల ఏర్పాటు చేయలేమని, ఆ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గమన్నారు. ఈ విధానాలతో ఉపాధ్యాయుల మీద ఒత్తిళ్లు పెరిగిపోతాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించి జీఓ 117ను రద్దు చేసి విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉంచి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రామాంజనేయులు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జి. సూర్యుడు, రాష్ట్ర కార్యదర్శి కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్య పెద్దవడుగూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు (49)కు భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమకున్న ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుమార్తెల పెళ్లిళ్లు, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య చికిత్సకు తెలిసిన వారి వద్ద రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. గ్రామంలో వ్యవసాయ పనులు సక్రమంగా లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఆయన శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. అపస్మారకంగా పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
తీర్థయాత్రలో విషాదం
పుంగనూరు: నూతనంగా కొనుగోలు చేసిన కారులో తీర్థయాత్రకు వెళ్లి వస్తున్న ఉపాధ్యాయ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా... విషమ పరిస్థితుల్లో భర్త, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లికి చెందిన వెంకటరమణ, శారద (45) దంపతులకు కుమార్తె కీర్తన, కుమారుడు శ్రీకర్ ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నివాసముంటూ అదే మండలం బాలప్పగారిపల్లిలో ఉపాధ్యాయురాలిగా శారద, అన్నమయ్య జిల్లా సోంపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా వెంకట రమణ పనిచేస్తున్నారు. కీర్తన ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. శ్రీకర్ గుడివాడలోని ఓ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఉపాధ్యాయ దంపతులు నూతనంగా ఓ కారును కొనుగోలు చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపు శనివారం ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. కుమార్తె కీర్తన అత్యధిక మార్కలతో ఉత్తీర్ణత సాధించడంతో ఎంతో సంతోషపడిన ఉపాధ్యాయ దంపతులు తిరువణ్ణామలైకు వెళ్లి పూజదికాలు ముగించుకుని ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో పుంగనూరు మండలం సుగాలీమిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. శారద అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, కుమారై కీర్తనను స్థానికులు గమనించి మదనపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, శారద అంత్యక్రియలను వెంకటరమణ స్వగ్రామం కలకడలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మహిళా ఉపాధ్యాయురాలు మృతి భర్త, కుమార్తె పరిస్థితి విషమం -
ఘనంగా కదిరప్పస్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామంలో వెలసిన కదిరప్పస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. వేకువజామునే ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహ మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి కల్యాణం జరిపించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజల అనంతరం గోవింద నామస్మరణతో భక్తులు ముందుకు లాగారు. జీఓ 77ను రద్దు చేయాలి : పీడీఎస్‌యూ అనంతపురం ఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పీజీ విద్యార్థులను దూరం చేసే జీఓ 77ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలోని జార్జిరెడ్డి కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.భాస్కర్‌తో పాటు పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,600 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో జీఓ 77 రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇంతవరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా పాలకులు కాలయాపన చేస్తున్నారన్నారు. వీసీ నియామకాలపై యూజీసీ నూతన ప్రతిపాదనలను వ్యతిరేకించి, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని, జీఓలు 107, 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, కోశాధికారి బండారి శంకర్, నాయకులు తేజ, ఉదయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ పాల్గొన్నారు. ఏడుగురిపై కేసు నమోదు తాడిపత్రి టౌన్: ఈ నెల 11న తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట బంగారం వర్తకుడు గౌసుల్లా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ ఆదివారం తెలిపారు. నిందితుల్లో తాడిపత్రికి చెందిన జిలాన్, రఫీ, హజీ, రసీద్, గౌస్, ఇంతియాజ్, రబ్బాన్నీ ఉన్నారని పేర్కొన్నారు. -
టీడీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
● కుమారుడి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని తొలగించారని అఘాయిత్యం ● డబ్బు ముట్టజెప్పినా.. మరొకరితో మళ్లీ వసూలు చేసి అన్యాయం చేశారు: బాధిత కుటుంబీకుల ఆరోపణ గుత్తి రూరల్: డబ్బు ముట్టజెప్పి కుమారుడికి ఇప్పించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని.. వేరొకరితో మళ్లీ వసూళ్లకు పాల్పడి తొలగించారని మనస్తాపం చెందిన ఓ టీడీపీ నాయకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని మాముడూరు గ్రామంలో కలకలం రేపింది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..మామడూరుకు చెందిన బోలే ఎల్లప్ప టీడీపీలో చాలాకాలంగా చురుగ్గా పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎల్లప్ప కుమారుడు బోలే గిరిష్ని ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఇందుకోసం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, అప్పటి గుత్తి పార్టీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ రూ.4 లక్షలు తీసుకొన్నారు. ఇటీవల నారాయణ స్థానంలో గుత్తి ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్.. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి బోలే గిరిష్ని తొలగించి అదే గ్రామానికి చెందిన మరొకరిని నియమించారు. ఇందుకు ఆయన రూ.8 లక్షలు తీసుకొన్నారు. తన కుమారుడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఎల్లప్ప అవమానంగా భావించాడు. ఆదివారం తన భార్య లక్ష్మిదేవి, గ్రామంలోని సన్నిహితులు, ఇతర పార్టీ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. ఈ క్రమంలోనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కొన ఊపిరితో ఉన్న ఎల్లప్పను కిందికి దించి వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రమణీయం.. రంగనాథుడి కల్యాణం
తాడిపత్రి: జయ జయ రంగనాథస్వామి నామ సంకీర్తనలు.. వేదపండితుల వేదోక్త మంత్రాల నడుమ రంగనాథుడి పరిణయ వేడుక రమణీయంగా జరిగింది. ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, చైత్ర శుద్ధ పౌర్ణమి శనివారం ఉదయం మీన లగ్నంలో వేకువజామున 4.45 గంటలకు వజ్రవైఢూర్యాలు, బంగారు నగలు ధరించి రంగనాథుడు, నవ వధువుగా శ్రీదేవి, భూదేవిలు ముస్తాబయ్యారు. పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగా, ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి యజ్ఞోపవీతం చేశారు. వెంటనే సకల దేవతల ఆశీస్సులతో వేద మంత్ర పఠనంతో శ్రీ వారు అమ్మవారికి, అమ్మవార్లు శ్రీ వారికి జీలకర్ర బెల్లం పెట్టిన తంతును కనులపండువగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు మోగుతుండగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ గావించారు. రంగనాథస్వామి, అమ్మవార్లకు తలంబ్రాల వేడుకను నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలను తీసుకున్నారు. రూరల్ సీఐ లక్ష్మికాంతరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎనిమిది జతల వృషభాలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో అనంతపురం జిల్లా యాడికి మండలం యంగన్నగారిపల్లి వాసుదేవరెడ్డి వృషభాలు నిర్ణీత 20 నిమిషాల్లో 1,550 అడుగులు లాగి ప్రఽథమ స్థానంలో నిలిచాయి. సోమలదొడ్డి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు 1,500 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ వృషభాలు 1,250 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత వృషభాల యజమానులకు ప్రథమ బహుమతి కింద రూ.70వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.30 వేలుతో పాటు నాలుగో బహుమతి కింద రూ.20వేలు, ఊదో బహుమతి కింద రూ.10 వేలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకులు తాడిమర్రి మనోజ్‌రెడ్డి, చెన్నారెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, వైటీ చంద్రశేఖర్‌రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్ నార్పల: బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నార్పల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన మహేష్ శుక్రవారం నార్పలలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి నిందితుడు మహేష్‌ను నార్పల శివారులో పోలీసులు అరెస్టు చేశారు. -
మెరిసిన మట్టిలో మాణిక్యాలు
అనంతపురం ఎడ్యుకేషన్: వారు లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేదు. అంతా కూలినాలి చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారే. చాలామంది తల్లిదండ్రులు నిర్లక్షరాస్యులే. వారికి చదువులు లేవు కానీ పిల్లలపై గంపెడాశలైతే ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు. తమ కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చుకానీ తమ చదువుకు ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం ఆటంకం కావని నిరూపించారు ఆ విద్యార్థులు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాను కాదని ఎక్కడో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కర్నూలు లాంటి నగరాల్లో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ విద్యార్థులు మార్కులు సాధించారు. వారితో పోటీపడీ మార్కులు సాధించి పలువురితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విద్యార్థులకు వచ్చిన మార్కులు చూసి వారికి చదువులు చెప్పిన అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.... తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. పైసా ఖర్చు లేకుండా తమ విద్యార్థులు సత్తా చాటారంటూ ప్రిన్సిపాళ్లు ధీమాగా చెబుతున్నారు. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్, ప్రైవేట్‌తో పోటీ ఇంటర్లో రాణించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు -
పోలీసులు వేధిస్తున్నారు!
తాడిపత్రిటౌన్: ‘పంచాయితీ’ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బంగారు వ్యాపారి గౌసుల్లా శుక్రవారం స్టేషన్ ఎదుటే సైనేడ్ తాగి బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అయితే పోలీసులు తనను వేధిస్తున్న తీరు, తన కటుంబ పరిస్థి తి గురించి గౌసుల్లా కన్నీరుపెట్టుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ బతుకుతున్నానని, పుట్టిన పిల్లల్లోనే సంతోషం చూసుకుంటూ వారి కోసం బతుకుతున్నాని, అయితే పోలీసుల తీరు కలచివేస్తోందని చెప్పుకొచ్చాడు. ‘సార్ (పోలీసులను ఉదేశించి) మీరు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. వాడు మంచివాడా చెడ్డావాడా.. వాడు ఎలా బతుకుతున్నాడు తెలుసుకొని విచారించాలి. డబ్బులు తీసుకురా.. అది దొంగ బంగారు అంటే ఎలా సార్. తెలిసినవ్యక్తి బ్యాంకులో వేలంలో బంగారు పోతుంది అంటే.. వారికి సాయం చేసినట్లు ఉంటుందని ఆరోజు డబ్బులు ఇచ్చి కొన్నాను. అదే నా తప్పు అయ్యింది. అది దొంగ బంగారు అని ఎలా తెలుస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పక న్యాయం చేస్తాం పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న గౌసుల్లా కుటుంబానికి తప్పక న్యాయం చేస్తామని సీఐ సాయిప్రసాద్ తెలిపారు. శనివారం పట్టణంలోని పెద్దబజార్లో ఉన్న గౌసుల్లా ఇంటి వద్దకు సీఐ వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వీఆర్‌కు హెడ్‌కానిస్టేబుల్ బంగారు వ్యాపారిని పంచాయితీ పేరుతో వేధించిన తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ రెహమాన్‌ను ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్‌కు పంపారు. విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోండి ఆత్మహత్యకు ముందు బంగారు వ్యాపారి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ -
‘అనంత’లో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం
● ప్రదర్శనలో 150 కేజీల బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు అనంతపురం కార్పొరేషన్: బంగారు, వజ్రాభరణాల అతి పెద్ద షోరూంల్లో ఒక్కటైన జోయాలూక్కాస్... అనంతపురంలోని రాజు రోడ్డులో తన నూతన బ్రాంచ్‌ను శుక్రవారం ప్రారంభించింది. జోయాలుక్కాస్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్, ఎండీ జాయ్ అలూక్కాస్తో కలసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన జోయాలుక్కాస్ షోరూంను జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జోయాలుక్కాస్ ఎండీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 175 షోరూంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్కువ బరువుతో ఉన్న ప్రపంచ స్థాయి మోడల్స్‌తో డైమండ్, గోల్డ్, సిల్వర్ జ్యువెలరీను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనుగ్రహ టెంపుల్ జ్యువెలరీ, ప్రైడ్ డైమండ్స్, ఎలిగంజా పోల్కి డైమండ్స్, యవ ఎన్విరిడే జ్యువెలరీ, అపూర్వ యాంటిక్ కలెక్షన్, రత్న ప్రెషన్ స్టోన్ జ్యూవెలరీ తదితర 150 కిలోల ఆభరణాలను ప్రదర్శనలో ఉంచామన్నారు. తమ ఉత్పత్తులకు రిటర్న్ విలువ ఉంటుందన్నారు. -
బాల కార్మికులకు పునరావాసం కల్పించాలి
అనంతపురం సిటీ: జిల్లాలో బాల కార్మికులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి, వారికి పునరావాసం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మతో కలసి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి బాల కార్మికుని ప్రొఫైల్, ట్రాక్ రికార్డు మెయింటెన్ చేయాలన్నారు. ప్రాసిక్యూషన్, మినిమం వేజెస్, బాల కార్మికులకు అందజేసిన సహాయక చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలన్నారు. ప్రతి బాల కార్మికుడిని పునరావాసం కల్పించి, తిరిగి పని ప్రదేశానికి వెళ్లకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన అసంఘటిత రంగ కార్మికులందరి వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, మున్సిపల్, ప్లాన్ అప్రూవల్ అథారిటీలందరూ ప్రతి నిర్మాణంపై మొత్తం వ్యయంలో ఒక శాతం సెస్‌ను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు జమ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ లలిత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, కార్మిక శాఖ అధికారులు లక్ష్మీ,నర్సయ్య, రాధా రమాదేవి, సుజాత, ప్రతాప్ నాయుడు, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీఈఓ ప్రసాద్, చేనేత శాఖ ఏడీ శ్రీనివాసరెడ్డి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కలల సాకారానికి ఈ–సెట్
అనంతపురం: ఉన్నత కలలకు ఏపీ ఈ–సెట్ తొలిమెట్టుగా నిలుస్తోంది. పేరెన్నికగల కళాశాలల్లో బీటెక్, బీఈ పూర్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ద్వారా గణనీయమైన ర్యాంకు సాధిస్తే ఈ కలను సాకారం చేసుకోవచ్చు. అయితే ఈఏపీసెట్‌కు పోటీ అధికంగా ఉంటుంది. కానీ, మంచి కళాశాలల్లో ఇంజినీరింగ్ సీటు దక్కించుకునేందుకు ఏపీ ఈ–సెట్ మరో చక్కటి మార్గం. ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈ–సెట్)లో సత్తా చాటితే నేరుగా బీటెక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన వారు, బీఎస్సీ(మేథమేటిక్స్) పూర్తి చేసినవారు ఇందుకు అర్హులు. ఫార్మసీ కోర్సుల్లో సైతం అడ్మిషన్లు పొందడానికి ఈ–సెట్ దోహదపడుతుంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనూ సీట్లు దక్కించుకోవచ్చు. మొత్తం సీట్లలో 10 శాతం ఈ–సెట్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నారు. దీంతో ఈ–సెట్ అనేది డిప్లొమా విద్యార్థులకు వరంలా మారింది. లేటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం ఇంజినీరింగ్ కోర్సులో లేటర్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలోకి అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఏపీ ఈ–సెట్–2025కు భారీగా దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మొత్తం 33,454 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగానికి–143, బీఎస్సీ(మేథమేటిక్స్) –41, సిరామిక్ టెక్నాలజీ–3, కెమికల్ ఇంజినీరింగ్ –290, సివిల్ ఇంజినీరింగ్ –2,874, కంప్యూటర్ సైన్సెస్–10,639, ఈఈఈ–5492, ఈసీఈ–9,024, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ –54, మెకానికల్ ఇంజినీరింగ్ –4,424, మెటలార్జీ –97, మైనింగ్–66, ఫార్మసీ విభాగానికి –307 చొప్పున మొత్తం 33,454 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరింత పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీ వరకు రూ.వెయ్యి అపరాధ రుసంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీ వరకు రూ.2వేలు, 24వ తేదీ వరకు రూ.4వేలు, 28వ తేదీ వరకు రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూకు అవకాశం ఏపీ ఈ–సెట్‌ను ఇప్పటి వరకూ 8 దఫాలుగా నిర్వహించే అవకాశం జేఎన్టీయూ (ఏ)కు దక్కింది. 2015 నుంచి 2020 వరకు ఏపీ ఈసెట్‌ను రాష్ట్ర కన్వీనర్‌గా ప్రొఫెసర్ పీఆర్ భానుమర్తి , 2021లో ప్రొఫెసర్ సి. శశిధర్, 2024లో ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్‌ను ఈసెట్ కన్వీనర్‌గా నియమించారు. క్రేజీ కంప్యూటర్ సైన్సెస్ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సెస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే ఏపీఈఏపీ సెట్లో గణనీయమైన ర్యాంక్‌ను సాధించాల్సి ఉంటుంది. అదే డిప్లొమో కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేసిన వారు ఈ–సెట్ ద్వారా మంచి కళాశాలల్లో కంప్యూటర్ సైన్సెస్ కోర్సు దక్కించుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది ఈ–సెట్ కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్‌కు దరఖాస్తులు పెరగడమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్లోకి అడ్మిషన్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు సువర్ణ అవకాశం జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహణ -
జగన్‌ను విమర్శించే స్థాయి నీకెక్కడది?
ఉరవకొండ: జనంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌కు లేదని శాసనమండలి ప్రివిలైజ్ కమిటీ చైర్మెన్/ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీకి తొత్తులుగా మారిన కొందరు పోలీసులను ఉద్దేశించి తప్పు చేసిన పోలీసులైన చట్టం ముందు సమానమేనని, వారి యూనిఫాం తీసేయిస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తే... దానిని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌కు పటిష్ట భద్రతను అప్పటి సీఎం వైఎస్ జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఈ అంశంపై అప్పట్లో ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా భద్రతా వైపల్యం కనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో 1,100 మంది పోలీసులను, 200 మందిని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటూ భద్రతా వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేవలం అభిమానులను, కార్యకర్తలను ఆపడానికి పోలీసులను మోహరించారు కానీ, మాజీ సీఎం భద్రతకు కాదనే విషయం క్షేత్ర స్థాయిలో బట్టబయలైందన్నారు. వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ పార్టీలోనైనా మహిళల వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేలావ్యాఖ్యలు చేయడం తగదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్‌పై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మండిపాటు తప్పు చేస్తే పోలీసులైనా చట్టం ముందు సమానమే నేర నిరూపణ అయితే యూనిఫాం తీసేసి శిక్ష అనుభవించాల్సింది -
వైభవంగా సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట్ర కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలో 3 రోజుల పాటు ఆగమ శాస్త్ర సంప్రదాయాలతో పూజలు జరిగాయి. ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి, ఆలూరి రమణారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం నేత్రపర్వంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రోటరీపురంలో ఎంతో సుందరంగా సీతారామాలయం రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో శనివారం రథోత్సవం నిర్వహించన్నట్లు తెలిపారు. -
ఉద్యాన రైతులూ అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, పెను గాలులు, వడగండ్లు, అకాల వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు జి.చంద్రశేఖర్, జి.ఫిరోజ్‌ఖాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా పంట చేతికివచ్చే సమయం కావడంతో చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అరటి, బొప్పాయి పంటలు నేలవాలకుండా సరైన పోట్లు ఏర్పాటు చేసుకుంటే నష్ట తీవ్రత బాగా తగ్గుతుందని తెలిపారు. తోట చుట్టూ వెలుపలి ప్రాంతంలో నీటి తడి ఇస్తే సుడిగాలి తీవ్రత బాగా తగ్గిపోతుందన్నారు. పెను గాలులకు దెబ్బతిన్న తోటల్లో వెంటనే కాయలు, గెలలు తొలగించి, కొమ్మలను బయట పడేయాలన్నారు. చీడపీడల బారి నుంచి రక్షించుకునేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. నిల్వ ఉన్న వర్షపు నీరు ఆవిరైన తర్వాత పైపాటుగా ఎకరాకు 10 కిలోల యూరియా చల్లుకోవాలన్నారు. తోటల చుట్టూ అవిశె, సుబాబుల్ లాంటి రక్షణ పంటలు వేసుకుంటే పెనుగాలుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చన్నారు. అవకాశం ఉన్న రైతులు కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వేసవి సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. -
ఈదురుగాలులకు రూ.8.83 కోట్ల పంట నష్టం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వారం రోజులుగా ఈదురుగాలుల తాకిడితో వ్యవసాయ పంటలకు రూ.8.83 కోట్లు మేర నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శెట్టూరు, నార్పల, గార్లదిన్నె, అనంతపురం, శింగనమల, కంబదూరు, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బొమ్మనహాళ్, బెలుగుప్ప, డీ.హీరేహాళ్ తదితర మండలాల పరిధిలో 51 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశామన్నారు. మొత్తంగా 881 మంది రైతులకు చెందిన 1,136 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో 659 హెక్టార్లలో మొక్కజొన్న నేలవాలడంతో 603 మంది రైతులకు రూ.5.60 కోట్లు మేర నష్టం జరిగిందన్నారు. 239 మంది రైతులకు చెందిన 383 హెక్టార్లలో వరి దెబ్బతినడంతో రూ.275 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. 39 మంది రైతులకు చెందిన 94 హెక్టార్లలో పత్తి దెబ్బతినడంతో రూ.47 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేశామని పేర్కొన్నారు. కుప్పకూలిన గాలిమర పుట్లూరు: ఎ.కొండాపురం వద్ద కొండలపై ఏర్పాటు చేసిన గాలిమర కుప్పకూలింది. వివరాలు ఇలా ఉన్నాయి. 1999లో బీహెచ్ఈఎల్కు చెందిన 16 గాలిమరలను కొండలపై ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులుకు ఒక గాలిమర కుప్పకూలిపోయింది. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల రూ.50 లక్షల మేర నష్టం చేకూరినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
బీసీల ప్రయోజనాలకు కూటమి విఘాతం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం బీసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలు చేపడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అనంత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. దురాచారాలను రూపుమాపేందుకు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. పూలే స్ఫూర్తితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. బడుగు, బలహీనల వర్గాలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. విద్యలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేలా చూశారన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో 50 శాతంకుపైగా రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడుగులను నట్టేట ముంచుతోందన్నారు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలను ప్రకటించి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలయాపన చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా బడుగులకు మేలు చేసేలా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, అనుబంధ సంఘాల అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, శ్రీదేవి, వైపీ బాబు, అమర్నాథ్రెడ్డి, నేతలు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, పెన్నోబులేసు, మాల్యవంతం మంజుల, మీసాల రంగన్న, పామిడి వీరాంజనేయులు, కేశవరెడ్డి, తలారి వెంకటేష్, చింతకుంట మధు, అనిల్‌కుమార్ గౌడ్, ఆసిఫ్, రాధాకృష్ణ, సాదిక్, కార్పొరేటర్లు రహంతుల్లా, రాజేశ్వరి, దుర్గాదేవి, సుమతి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
వడగండ్ల వాన.. ఈదురుగాలులు
● దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు ● అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ ● విరిగి పడిన భారీ వృక్షాలు ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలుయర్రగుంట గ్రామం వద్ద నేలకొరిగిన వరి పంట రాయదుర్గం/కణేకల్లు/ బొమ్మనహాళ్/ బెళుగుప్ప/ కూడేరు/ బ్రహ్మసముద్రం/ శింగనమల: జిల్లా వ్యాప్తంగా గాలీవాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం, శుక్రవారం వడగండ్ల వాన, ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. కణేకల్లు మండలంలోని యర్రగుంట, గెనిగెర, కణేకల్లు, గంగలాపురం, బ్రహ్మసముద్రం గ్రామాల్లో గురువారం రాత్రి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. వడగండ్లు, ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు సుమారు రూ.13.97 కోట్ల మేర నష్టం వాటిల్లింది. యర్రగుంటలో తెల్లారితే వరికోత చేసేందుకు సిద్ధం కాగా... రాత్రికి రాత్రే వడగండ్ల వాన కురిసి పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని రైతులు జగన్నాథం, లింగారెడ్డి, వాల్మీకి వండ్రప్ప, కురుబ తిప్పేస్వామి, కె.ఎర్రిస్వామి, కురుబ ఆదెప్ప, బోయ వండ్రప్ప ఆందోళన వ్యక్తం చేశారు. గోపులాపురంలో బసవరాజుకు చెందిన 6 ఎకరాల్లో అరటితోట, బి.నవీన్ 8, రామక్రిష్ణకు చెందిన 6 ఎకరాల్లో అరటితోట దెబ్బతింది. బొమ్మనహాళ్ మండలం శ్రీధరఘట్ట, గోనేహాళ్, లింగదహాళ్, ఉద్దేహాళ్, ఉప్పరహాళ్, దేవగిరి, ఉంతకల్లు, బండూరు, లింగదహాళ్ తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరితో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, అక్కడక్కడ చెట్లు కూడా నేలకొరిగాయి. రాయదుర్గం మండలంలోనూ పంటలు దెబ్బతిన్నాయి. బెళుగుప్ప మండలంలోని బెళుగుప్ప, బెళుగుప్ప తండా, నక్కలపల్లి, గుండ్లపల్లి, రమనేపల్లి, బ్రాహ్మణపల్లి, యలగలవంక, శీర్పి, గంగవరం, దుద్దేకుంట, అంకంపల్లి, ఆవులెన్న, రామసాగరం, రమనేపల్లి తదితర గ్రామాల్లో 650 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 50 ఎకరాల్లో అరటి తదితర పంటలు ఈదురుగాలులకు నేలవాలాయి. ఇంకా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు పడిపోయాయి. ఇదిలా ఉండగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అంచనా వేశారు. బొమ్మనహాళ్ మండలం గోనేహాళ్ వద్ద దెబ్బతిన్న వరి పంట పొలాలను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ, నాగిరెడ్డిపల్లి, గుండిగానిపల్లి, ఎర్రకొండాపురం తదితర గ్రామాల్లో బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. కూడేరు మండలం కడదరగుంట, పి.నారాయణపురం, ఎంఎం హళ్లి, మరుట్ల–1, 2, 3 కాలనీలు, చోళసముద్రం, ముద్దలాపురం, మరికొన్ని గ్రామాల్లో పెనుగాలులకు అరటి, మొక్కజొన్న, బ్యాడిగి మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నాయి. శింగనమల మండలంలో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. తరిమెలలో శుక్రవారం సాయంత్రం గాలీవానకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై అడ్డంగా పడిపోయాయి. -
పూలే ఆశయాలు కొనసాగించాలి
అనంతపురం సిటీ: మహాత్మ జ్యోతిబా పూలే ఆశయలు కొనసాగించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ క్యాంపస్‌లో గల ఆయన విగ్రహానికి శుక్రవారం మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కలెక్టర్ వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ గుత్తా కేశవనాయుడు, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ బోయ రామాంజనేయులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూభవన్‌లో నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతిలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వినోద్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై నివాళులర్పించారు. -
11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం
అనంతపురం అగ్రికల్చర్: భూగర్భజలాల పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తున్నా.. 11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. భూగర్భజలశాఖ తాజాగా 97 ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లా సగటు నీటిమట్టం 11.86 మీటర్లుగా నమోదైంది. సగటు నీటి మట్టం కన్నా 11 మండలాల్లో భూగర్భజలాలు కాస్తంత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ వర్షపు సంవత్సరంలో ఇప్పటి వరకు 463.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉడగా 30.3 శాతం అధికంగా అంటే 603.6 మి.మీ నమోదైంది. దీంతో పాతాళగంగ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అంతటా 40.94 టీఎంసీలు అందుబాటులో ఉండగా అందులో 14.45 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ఇంకా 26.49 టీఎంసీల భూగర్భజలాలు మిగులు కింద ఉన్నట్లు ఆ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. డేంజర్ జోన్లో నార్పల అత్యధిక నీటివినియోగం కలిగిన నార్పల మండలం పూర్తి డేంజర్ జోన్లో ఉంది. అలాగే బ్రహ్మసముద్రం, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, కూడేరు, కుందుర్పి, పామిడి, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో కూడా నీటి వినియోగం అధికంగా ఉండటంతో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. 20 మండలాల్లో ఫిజోమీటర్ల ద్వారా 8 నుంచి 20 మీటర్లలో నీటిమట్టం కనిపిస్తోందని చెబుతున్నారు. ● జిల్లా వ్యాప్తంగా బోరుబావులు 1,87,610 వినియోగిస్తుండగా, భూమి, నీరు, చెట్టు చట్టం (వాల్టా) కింద 13 గ్రామ పంచాయతీల్లో బోరుబావుల తవ్వకాన్ని నిషేధించారు. వేసవి కావడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో మరింత తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నందున జూన్ నుంచి తిరిగి భూగర్భజలాలు పెరగవచ్చని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 13 గ్రామపంచాయతీల్లోబోరుబావుల తవ్వకం నిషేధం జూన్‌లో భూగర్భజలాలు పెరిగే చాన్స్ -
రైతులకు పరిహారం అందించాలి
రాయదుర్గం నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వర్షం, ఈదురుగాలుల బీభత్సానికి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరిహారం అందించి ఆదుకోవాలి. బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలపాలు కావడం బాధాకరం. రాయదుర్గం, గుమ్మఘట్ట, డీ హీరేహాళ్ మండలాల్లోనూ మొక్కజొన్న, ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రతి రైతుకూ న్యాయం చేకూర్చేలా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాం. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
పాలిటెక్నిక్ కళాశాలకు ఉపకరణాల వితరణ
అనంతపురం: ఉరవకొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రూ.40 లక్షల పరికరాలను కియా కంపెనీ సమకూర్చింది. ఈ మేరకు ఉరవకొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రఫ్ఆలీ, కియా ఇండియా కంపెనీ ఉన్నత సలహాదారు యోన్గిల్మా సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (కంపెనీ సామాజిక బాధ్యత) కింద ఈ పరికరాలను అందజేయనున్నారు. దీంతో అనంతపురం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పయ్యావుల కేశవ్‌ను ప్రిన్సిపాల్ ఆష్రఫ్ ఆలీ, ఈఈఈ విభాగాధిపతి వై. సురేష్ బాబు తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పీసీ ప్యాపిలిలో చిరుత సంచారం ● భయాందోళనలో గ్రామస్తులు వజ్రకరూరు: మండల పరిధిలోని పీసీ.ప్యాపిలి పరిసర ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని ‘తురాత్ కొండ’ను అవాసంగా చేసుకుని చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రెండు, మూడురోజులుగా చిరుత ఉదయం, సాయంత్రం వేళల్లో అటూ ఇటూ తిరుగుతోంది. అటువైపు వెళ్లిన కొందరు చిరుత సంచారాన్ని సెల్ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో ‘తురాత్ కొండ’ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడటంతో రైతులు పొలాలను చదును చేసేకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో చిరుత సంచారం రైతులు, గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. అటవీశాఖ అధికారులు తక్షణం స్పందించి తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు
నిషేధిత పొగాకు ఉత్పత్తుల గురించి సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. ప్రత్యక్షంగా.. పరోక్షంగా గుట్కా అక్రమ వ్యాపారానికి సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. గుట్కా వ్యాపారుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఇప్పటివరకు గుట్కా విక్రయిస్తూ పట్టుబడిన వారందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాం. గుట్కా విక్రయాలపై పోలీసులతో ప్రజలు సహకరించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – వి.రత్న, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ -
ఐ–టీడీపీ కార్యకర్త కిరణ్‌పై కఠిన చర్యలకు డిమాండ్
అనంతపురం: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యుల ప్రతిష్టకు భంగం కలిగేలా అత్యంత హేయకరమైన వ్యాఖ్యలు చేసిన ఐ–టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా, మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌కు సోషల్ మీడియా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ షేక్ బాబా సలామ్, సంయుక్త కార్యదర్శి మన్‌ప్రీత్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, అధికార ప్రతినిధి కృష్ణవేణి గురువారం ఫిర్యాదు చేశారు. పాయింట్‌బ్లాక్ టీవీ(పీబీ టీవీ) అనే యూట్యూబ్ ఛానల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఆత్మాభిమానం దెబ్బతీనేలా చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ చర్యల వల్ల దేశ, విదేశాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోట్లాది మంది అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్ధేశ్యపూర్వకంగానే హైదరాబాద్‌లో ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని, సదరు యూట్యూబ్ ఛానల్ ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకున్న పెయిడ్ ప్రిపరేషన్ లేబరేటీల ద్వారా ఇలాంటి నీచమైన వీడియోలు తయారు చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలోనే ఐ–టీడీపీ లాంటి సంస్థలు ఈ పోస్టింగ్‌లను తయారు చేసి, వాటిని మార్ఫింగ్ చేసి, తప్పుడు సమాచారంతో ప్రజలను పెడదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. తమ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారితో పాటు వారిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కులమతాలు, వర్గాల మధ్య వైషమ్యాలు, విభేదాలు పెంచి రాష్ట్రంలో అశాంతిని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఐ–టీడీపీ సభ్యుల పోస్టింగ్‌లపై సమగ్రంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐ–టీడీపీ సభ్యుడు చేబ్రోలు కిరణ్‌కుమార్, అతన్ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్, పాయింట్‌బ్లాక్ ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు -
నేరాల నియంత్రణలో డ్రోన్ కెమెరాలను వినియోగించండి
అనంతపురం: నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను విస్త్రృతంగా వినియోగించాలని సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలు, ఇతర కేసుల నమోదు, ఛేదనలపై సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. సీడీ ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం పామిడి సీఐగా పనిచేస్తున్న యుగంధర్ 2022లో రాయదుర్గం సీఐగా పనిచేశారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగ్‌ల నుంచి 24 తుపాకులు సీజ్ చేశారు. ఇందుకు గాను సీఐ యుగంధర్‌కు మంజూరైన డీజీపీ డిస్క్ అవార్డును ఎస్పీ అందజేసి, అభినందించారు.పెనుకొండ డీఎస్పీగా నరసింగప్పపెనుకొండ: పెనుకొండ డీఎస్పీగా నరసింగప్ప నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా డీఎస్పీగా నియమితులైన నరసింగప్పకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.‘ఈ–శ్రమ్’లో నమోదు చేసుకోండిఅనంతపురం సిటీ: జొమాటో, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లూడాట్, ఈ–కార్ట్ తదితర ఈ కామర్స్ సంస్థల్లో పని చేసే కార్మికులు ఈ–శ్రమ్‌లో సభ్యత్వం కోసం వివరాలు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ కార్మిక కమిషనర్ ఎస్ఎన్ లావణ్య సూచించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై ఈ నెల 17వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక శాఖ కార్యాలయాల్లోనూ అవగాహన కల్పిస్తామన్నారు. సందేహాల నివృత్తి కోసం 94925 55188 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
కూలీల సంఖ్య పెంచాలి
బొమ్మనహాళ్: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ సలీంబాషా సూచించారు. మండలంలోని నేమకల్లు, లింగదహాళ్, కొలగానహళ్లి గ్రామాల్లో ఉపాధి హామీ కింద జరుగుతున్న సీసీ రోడ్లు, గోకులంషెడ్లు, అవని ఫ్లాంటేషన్ పండ్ల మొక్కల పెంపకం, పశువుల తొట్టె నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. పీడీ మాట్లాడుతూ నేమకల్లులో సీసీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ విజయభాస్కర్, పీఆర్ రాజ్ జేఈఈ జగదీష్, ఏపీఓ భాగ్యలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్లు బ్రహ్మయ్య, నాగేంద్ర పాల్గొన్నారు. పిడుగుపాటుకు గొర్రెలు, మేకల మృతి గార్లదిన్నె: పెనకచెర్ల గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపడి గొర్రెలు, మేకలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన రైతు చితంబరప్ప తమ గొర్రెలు, మేకలను పొలాల్లో మేపుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో గాలీవాన, ఉరుములు, మెరుపులు అధికమయ్యాయి. దీంతో వాటిని సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద చెట్టు కిందకు వదిలాడు. చితంబరప్ప గుడి వద్ద నిల్చున్నాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో 8 గొర్రెలు, 2 మేకలు మృతి చెందాయి. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. -
నాణ్యమైన మద్యంతో ప్రజారోగ్యానికి పెద్దపీట
అనంతపురం: నాణ్యమైన మద్యాన్ని అందిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతపురం సమీపంలోని సోములదొడ్డి గ్రామంలో రూ.11.10 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐఎంఎఫ్ఎల్ డిపో గోడౌన్‌ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం పాలసీని పరిశీలించి ఏపీలో నూతన పాలసీ తీసుకొచ్చామన్నారు. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు నుంచే ప్రభుత్వానికి సుమారు రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్ర సాధారణ పరిపాలన, పొలిటికల్, రెవెన్యూ(ఎకై ్సజ్) శాఖల ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్‌మీనా మాట్లాడుతూ 2016లో ఇక్కడ బాట్లింగ్ ప్లాంట్ కాలిపోయి సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఘటన తర్వాత ఇన్సూరెన్స్ క్లైం చేశామన్నారు. అనంతరం అధునాతన గోడౌన్ నిర్మించేలా మంత్రి ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, బండారు శ్రావణిశ్రీ, దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కమిషనర్ అనసూయదేవి, ఏపీఎస్‌బీసీ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రవణ్‌కుమార్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్‌రెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు పాల్గొన్నారు. -
బాబు ద్వంద్వ వైఖరిని ఎవ్వరూ నమ్మరు
అనంతపురం కల్చరల్: ముస్లిం మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎవ్వరూ నమ్మబోరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా యూజేఏసీ (యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రిలే నిరాహారదీక్షలు చేశారు. గురువారం నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన దీక్షలకు అనంత సంఘీభావం తెలియజేసిన అనంతరం మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ వైఎస్సార్సీపీ వ్యతిరేకంగా ఓటు వేసిందని, తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బిల్లును సమర్థించిన టీడీపీ నాయకులు.. పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగా ఉంటూ పైకి మాత్రం ముస్లింలను నమ్మించడానికి వైఎస్సార్సీపీ వైఖరిని తప్పుపడడ్డం వారి దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు. మతోన్మాద రాజకీయాలకు దేశంలో చోటు ఉండకూడదని, టీడీపీ, జనసేన చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వక్ఫ్ సవరణ బిల్లు దేశానికి ప్రమాదకరమని, ఒక వర్గం వారిని టార్గెట్ చేసినట్లుండే బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. మేయర్ వసీం మాట్లాడుతూ ముస్లింలతో చర్చలు జరపకుండానే బిల్లును ఏకపక్షంగా తీసుకువచ్చారని, సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, కాంగ్రెస్ నాయకుడు దాదా గాంధీ, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం అహ్మద్, వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ అధ్యక్షులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, జేఏసీ నాయకులు కేవీ రమణ, సాకే హరి తదితరులు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మత రాజకీయాలను ఖండించారు. రిలే నిరాహార దీక్షలకు కార్పొరేటర్లు ఇషాక్, రహంతుల్లా, వైఎస్సార్సీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అబూజర్ నదీం, దాదు, జావీద్, ఖాజా హుస్సేన్, మునీరా, గ్రీవెన్స్ అధ్యక్షులు బాకే హబీబుల్లా, అడ్వొకేట్ రసూల్, మునిసిపల్ మాజీ చైర్మన్ నూర్‌మహ్మద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, నాయకులు గోల్డ్బాషా, ఐఎంఎం మహబూబ్ బాషా, తాజ్, కాంగ్రెస్ నాయకులు ఇమామ్, ఎమ్మార్పీఎస్ సామ్రాట్, డాక్టర్ చంద్రశేఖర్, మధు సంఘీభావం ప్రకటించారు. నిరసన దీక్షల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
కమ్మూరు వెల్నెస్ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు
కూడేరు: మెరుగైన వైద్య సేవలందించిన కమ్మూరు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గత ఏడాది జూలై 16న జాతీయస్థాయి అధికారులు కమ్మూరు హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు. సెంటర్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలతో ఆరా తీశారు. సేవలు బాగా అందిస్తుండడంతో జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపునకు ఎంపిక చేశారు. గురువారం డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి చేతుల మీదుగా హెల్త్ సెంటర్ సీహెచ్ఓ జయ జాతీయస్థాయి సర్టిఫికెట్ అందుకున్నారు. సెంటర్‌కు గుర్తింపు తెచ్చినందుకు మండల వైద్యాధికారి సౌమ్యారెడ్డి, సీహెచ్ఓ జయ, ఏఎన్ఎం మాధవి, ఆశా వర్కర్లు శ్రీదేవి, ఆదెమ్మ, మీనాక్షి, చంద్రకళను అభినందించారు. భర్తను కడతేర్చిన భార్యకు జీవిత ఖైదు అనంతపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన కేసులో భార్యకు జీవితఖైదు విధిస్తూ అనంతపురం 7వ సెషన్స్ అడిషనల్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన రాజేంద్రప్రసాద్, యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన బత్తిని సుమకుమారికి 17 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరి కాపురం కొన్ని రోజులు సవ్యంగా జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి భర్త మందలించాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించేందుకు 2021 నవంబర్ రెండో తేదీ రాత్రి 7 గంటల సమయంలో రోకలి బండతో కొట్టింది. దీంతో రాజేంద్రప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. హతుని అన్న విజయకుమార్ ఫిర్యాదు మేరకు అప్పటి వన్‌టౌన్ సీఐ డి.ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అనంతపురం అడిషనల్ 7వ సెషన్స్ జడ్జి కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. జడ్జి హరిత గురువారం 15 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో సుమకుమారికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. పీపీ నాగరాజ బాబు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. అప్పటి వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ వెంకటేష్ నాయక్, వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎస్ఐ సునీల్‌కుమార్‌లు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టి ముద్దాయికి శిక్షపడేలా తమ వంతు కృషి చేశారు. వీరందరినీ ఎస్పీ అభినందించారు. పనులు వేగవంతం చేయాలి అనంతపురం అర్బన్: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన్, పీఎంశ్రీ ఫేజ్–1 ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ సెక్టార్‌కు సంబంధించిన పనులపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈలు, ఈఈలు, డీఈఈలు, ఇతర అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద గ్రామాలకు రహదారులు నిర్మించే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనుల ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంశ్రీ ఫేజ్–1 పనులకు సంబంధించి ఆటస్థలాలు, గ్రంథాలయలు, కంప్యూటర్ గదులు, కిచెన్ గార్డెన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తే త్వరితగతిన నిధుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో పీఆర్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మురళీధర్ శర్మ, ఏపీఎస్ఎంఐడీసీ ఈఈ శ్రీనివాసనాయుడు, ఏఎంసీ ఎస్ఈ చంద్రశేఖర్, పీహెచ్ ఈఈ ఆదినారాయణ, ఎస్ఎస్ఏ ఈఈ శంరయ్య, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. -
జగన్‌కు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం
వజ్రకరూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన వజ్రకరూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరి, అధికార పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయన పర్యటనకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని తెలిపారు. మూడు రోజల క్రితం శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. జగన్‌కు భద్రత కల్పించడం కంటే పర్యటనకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకుండా పోలీసుల చేత అడ్డుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. 400 కేవీ లైన్ల మధ్యలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన తీరు, ఎంపిక చేసిన స్థలాన్ని బట్టి చూస్తే అక్కడ ప్రజలను నియంత్రించడం సాధ్యం కాదని తెలుస్తుందని, హెలిప్యాడ్ సురక్షితమైన ప్రదేశంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయడం అనేక సందేహాలను లేవదీస్తోందని పేర్కొన్నారు. పాపిరెడ్డిపల్లి సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తే జగన్‌కు అసాంఘిక శక్తులు హాని తలపెట్టే ప్రమాదం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఇన్చార్జ్గా ఉన్న సీనియర్ డీఎస్పీ ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరించి ప్రజలను నియంత్రించలేక చేతులెత్తెశారని ఆరోపించారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా పోలీస్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించలేకపోయారని వెల్లడించారు. వైఎస్ జగన్ పర్యటనలో జరిగిన తప్పిదాలు, భద్రత గురించి మాట్లాడకుండా అధికార పార్టీ నాయకులు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. పోలీస్ అధికారులు మాజీ సీఎం పట్ల పరిధి దాటి రాజకీయ నాయకుల్లా మాట్లాడటం సరికాదన్నారు. మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు హాస్యాస్పదం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగాను, ఒకింత ఆశ్చర్యకరంగాను ఉన్నాయని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గతంలో పోలీసుల పట్ల, పోలీస్ అధికారుల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసిన అనుచిత వాఖ్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం చాలామంది పోలీస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని, అనేక మంది పోలీస్ అధికారులపై కేసులు పెట్టి ఇళ్ల వద్దనే ఉండేలా చేస్తున్న విషయం మరిచారా అని మంత్రి పయ్యావులను ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కూడా పోలీసుల చేత పాలన సాగించాలని చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఏదైనా వ్యా పారం చేసుకోవాలంటే మంత్రి సోదరుడు పయ్యావుల శ్రీనివాసులును కలవాలంటూ పోలీసుల చేత చెప్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఇలాంటి పనులు చేయడం వల్ల సమాజంలో వారికున్న గౌరవం తగ్గుతుందన్నారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందు, ఉరవకొండ మండల కోఆర్డినేటర్ ఓబన్న, మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్, యువజన నాయకుడు శశాంక్‌రెడ్డి, సర్పంచులు మోనాలిసా, మల్లెల జగదీష్, వజ్రకరూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు రవికాంతరెడ్డి, సీనియర్ నాయకులు ప్యాపిలి కిష్ట, రాకెట్ల బాబు, భరత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రభుదాస్, భీమా, పట్టా ఖాజాపీరా తదితరులు పాల్గొన్నారు. ప్రజలను రాకుండా అడ్డుకోవడానికే పోలీసుల ప్రాధాన్యత అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే విధుల్లో అలసత్వం హెలిప్యాడ్‌కు ఎంపిక చేసిన స్థలంపై ప్రజల్లో సందేహాలు భద్రతను గాలికొదిలేసి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు పోలీస్ అధికారులు రాజకీయనాయకుల్లా మాట్లాడటం సరికాదు మంత్రి పయ్యావుల మాట్లాడినతీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి -
రౌడీషీటర్ బరితెగింపు
● రస్తా విషయంలో తప్పుడు ఫిర్యాదు ● దళితుడిని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు ● నిన్ను నరికితే దిక్కెవడంటూ ఖాకీల సమక్షంలోనే బెదిరింపు ● బాధితుడి ఫిర్యాదుతో 20 రోజుల తర్వాత రౌడీషీటర్‌పై కేసు నమోదు తాడిపత్రిటౌన్(యాడికి): అధికారం మాది.. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికితే దిక్కెవడంటూ ఓ దళితుడిని స్టేషన్లోనే బెదిరించిన టీడీపీకి చెందిన రౌడీషీటర్‌పై ఫిర్యాదు చేసిన 20 రోజుల తర్వాత యాడికి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. యాడికి మండలం పచ్చారుమేకలపల్లికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ పరిమి చరణ్ రస్తా విషయంలో గత మార్చి 19న పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పోలీసులు విచారణ నిమిత్తం ఆదినారాయణను స్టేషన్‌కు పిలిపించారు. పోలీసుల ఎదుటే రౌడీషీటర్ రెచ్చిపోయాడు. కులం పేరుతో దూషిస్తూ ‘అధికారం మాదే.. నిన్ను ఇక్కడే (పోలీస్‌స్టేషన్ ముందే) ముక్కలు ముక్కలుగా నరికితే నీకు దిక్కెవడు’ అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయమై బాధితుడు ఆదినారాయణ పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు. అయితే ఆ రౌడీషీటర్‌పై కేసు మాత్రం నమోదు చేయలేదు. ఇదే విషయంపై ఈ నెల 4న రెండోసారి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తనకు న్యాయం చేయాలని తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరికి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు యాడికి పోలీసుల తీరునూ విన్నవించాడు. ఏఎస్పీ స్పందిస్తూ కేసు నమోదు చేయాలని యాడికి పోలీసులను ఆదేశించారు. అయితే సీఐ ఈరన్న, ఎస్ఐ రమణలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చారని బాధితుడు ఆదినారాయణ వాపోయాడు. 20 రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో రౌడీషీటర్‌కు సహకరించే ధోరణి వీడకుంటే స్టేషన్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతానని సీఐకి తెలిపారు. దీంతో బాధితుడి నుంచి బుధవారం రాత్రి మరోసారి ఫిర్యాదు తీసుకుని రౌడీషీటర్ పరిమి చరణ్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు. -
రైల్వే సమస్యలను పరిష్కరించాలి
గుంతకల్లు: రైల్వేలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్లో 66వ డివిజినల్ యూజర్స్ కన్సలేటివ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్త అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతోపాటు డివిజన్ పరిధిలోని డీఆర్‌యూసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో రైల్వే పరమైన అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య 65 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ మార్గం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తద్వారా కడపలోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులకు, రైతులు పండించిన పంటలు ఇతర ప్రాంతాలకు తరలించడానికి రవాణామార్గం ఎంతగానో ఉపయోగపడుతుందన్నా రు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ నిరంతరాయంగా రిజర్వేషన్ కౌంటర్లు ఉండేలా చూడాలన్నారు. కరోనా సమయంలో రద్దయిన విజయవాడ–బెంగుళూరు, తిరుపతి–హుబ్లీ ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించాలని కోరారు. అలాగే కరోనా కారణంగా స్టాపింగ్‌లు నిలిపి వేసిన స్టేషన్లను తిరిగి పునరుద్దరించాలన్నారు. ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి అవరోధంగా మారిన ధర్మవరం రైల్వే ఎల్సీ గేట్ స్థానంలో ఆర్యూబీ నిర్మాణ పనులు చేపట్టాలని, కసాపురం రైల్వే మోరీ విస్తీరణ పనులు చేపట్టాలని సూచించారు. సమస్యలను రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్త అన్నారు. సమావేశంలో సీనియర్ డీసీఎం మనోజ్, డీఆర్‌యూసీసీ సభ్యులు పాల్గొన్నారు. డీఆర్‌యూసీసీ సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విజ్ఞప్తి -
కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో త్వరలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపునకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా కళాశాలల్లోనే నేరుగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి వెళ్తే సిబ్బంది ససేమిరా అంటున్నారు. అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల, పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్సు ఫీజు ముందస్తుగా చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించగా... అప్పు చేసి వారు ఫీజులు చెల్లిస్తున్నట్లు సమాచారం. మంత్రి ఆదేశాలు బేఖాతర్.. కోర్సు ఫీజులతో సంబంధం లేకుండా పరీక్షలకు అనుమతించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయినా మాజీ మంత్రి, టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలతో పాటు అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు పట్టించుకోకపోవడం గమనార్హం. ఫీజు వసూలే తమ లక్ష్యమనేలా వ్యవహరిస్తూ విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా తలకిందులు.. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్, ‘వసతి దీవెన’ నిధులు గతేడాది జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లి దండ్రుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాల బకాయిలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ. 90 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. పథకాల పేర్లు మార్చారే కానీ.. నిధుల ఊసే ఎత్తడం లేదు. మరో వైపు ఇళ్లకు దూరంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘వసతి దీవెన’ అందించి ఆదుకోగా.. నేడు ఆ పథకాన్నే పూర్తిగా నిలిపేయడంతో అప్పుల భారం పడింది. వైఎస్సార్ సీపీ పోరుబాటతో.. రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత పోరుబాట’తో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. అప్పటికప్పుడు తేరుకుని ఒక త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అందులోనూ పాక్షిక చెల్లింపులే జరిగాయి. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయడం ప్రారంభించాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఫీజుల వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జేఎన్టీయూ (ఏ) పాలక భవనం వద్ద బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నయాపైసా బకాయి పెట్టకుండా మొత్తం ఫీజు చెల్లిస్తామని మంత్రి లోకేష్ చెప్పారని, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కళాశాల గుర్తింపు కూడా రద్దు చేస్తామని ఆయన ప్రకటించినా ఖాతరు చేయకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు. వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు మాట్లాడుతూ.. రెండు వారాల క్రితమే అన్ని కళాశాలలకు సర్క్యులర్ జారీ చేశామని, తాజాగా మరో సర్క్యులర్ జారీ చేస్తామని పేర్కొన్నారు. ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు తరిమెల గిరి, నగర ఉపాధ్యక్షుడు సోము, విజయ్, సాయి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) బుధవారం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలు, స్పాట్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా మూల్యాంకనం ముగిసిన సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా విద్యశాఖాధికారి డీఈఓ ప్రసాద్ బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరణం హరి కృష్ణ, బాల సుబ్రహ్మణ్యం, మహబూబ్ ఖాన్, ఖలందర్, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, ఆదిశేషయ్య, తిమ్మప్ప, గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డేగావత్ రవీంద్రనాథ్, హెచ్ఎం పురుషోత్తం బాబు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. హిందీ టీచరుకు సన్మానం ఏటా మాదిరిగానే రిటైర్డ్ అయిన హిందీ టీచర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిటైర్డ్ టీచరు అల్లు సుబ్బ కృష్ణమనాయుడుని డీవైఈఓ శ్రీనివాసరావు, ఏసీ గోవిందనాయక్ చేతులమీదుగా ఏసీఓ, హెచ్ఎంలు పి.ఫయాజుద్దీన్,అజ్మతుల్లా, చంద్రమౌళి ఆధ్వర్యంలో సన్మానించారు. సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు -
13న యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్: ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఈనెల 13న ఫ్లాగ్షిప్ పరీక్ష జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 363 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. యూపీఎస్సీ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరుగుతాయన్నారు. అధికారులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.రామ్మోహన్, రూట్ ఆఫీసర్‌గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, కేఎస్ఎస్ డిగ్రీ, పీజీ కళాశాల పరీక్ష కేంద్రా నికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, రూట్ అధికారిగా వి.మల్లికార్జునరెడ్డిని నియమించామన్నారు. కేంద్రం వద్ద ఒక ఎస్ఐ, ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించే సమయంలో నలుగురు ఆర్మ్డ్ పోలీసులను ఎస్కార్ట్‌గా నియమించాలని చెప్పారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష వేళలకు అనుకూలంగా బస్సులు నడపాలని ఆదేశించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరీక్ష సమయం ఇలా... ● ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేపర్–2, 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–3 పరీక్ష జరుగుతుంది. ● కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల పరీక్ష కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1, 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 జరుగుతుంది. ● అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ● ఈ–అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు, సెల్ఫ్ ఫొటోలు, పెన్, పెన్సిల్ తీసుకురావాల్సి ఉంటుంది. ● మొబైల్ ఫోన్లు, డిజిటల్, స్మార్ట్ గడియారాలు, బ్లూటూత్ తదితర వస్తువులను అనుమతించరు. నిషేధిత భూములపై శిక్షణ అనంతపురం అర్బన్: నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాన్ని ఆధార్‌తో అనుసంధించాలని చెప్పారు.రెవెన్యూ సెక్టార్‌పై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ‘అనంత అభ్యాసం’ కింద ఈనెల 11న డివిజన్, మండలస్థాయి రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తాను, జేసీ పాల్గొంటామని చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకాన్ని ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిశీలన చేపట్టాలని, నివేదికలు ఈ–ఆఫీసులో సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
జెడ్పీలో 10 మందికి పదోన్నతి
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పది మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరికి ఉత్తర్వులను బుధవారం తన చాంబర్లో జెడ్పీసీఈఓ రామచంద్రారెడ్డితో కలసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న డి.మాధవి చౌదరికి పదోన్నతి కల్పిస్తూ తిరిగి జెడ్పీనే కేటాయించారు. ఇదే కార్యాలయంలో పని చేసే బి.సుశీలాదేవిని పెనుకొండలోని పీఆర్ క్యూసీ సబ్ డివిజన్‌కు, కె.రమాదేవిని చిలమత్తూరు మండల పరిషత్ కార్యాలయానికి, విజయవాడలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఎం.అరుణశ్రీని యల్లనూరు మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించారు. తగరకుంట హైస్కూల్లో పని చేస్తున్న పి.షాహీనా బేగంను రొద్దం మండల పరిషత్ కార్యాలయానికి, పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే జి.రవీంద్రను పుట్టపర్తి పీఆర్ అనుబంధ పీఐయూ సబ్ డివిజన్‌కు, సిద్ధరాంపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే జె.సుబ్రహ్మణ్యంను లేపాక్షి మండల పరిషత్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఎద్దులపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేసే పి.ఉమామహేశ్వరరెడ్డిని గుత్తిలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్‌కు, నాగసముద్రం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే వి.విశ్వనాథ్‌ను మడకశిర పీఆర్ఐ సబ్ డివిజన్‌కు, రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే పి.మహేష్‌ను కణేకల్లు మండల పరిషత్ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. -
వావ్.. చాలా బాగుంది!
ఫుట్‌పాత్ పొడవునా తాటిముంజల విక్రయాలు చేపట్టిన దృశ్యంఐస్ ఆపిల్‌గా పిలిచే తాటిముంజలను నోట్లో పెట్టుకోగానే.. ’వావ్.. చాలా బాగుంది’ అని మనకు తెలియకుండానే మాట జారిపోతుంటుంది. వేసవిలో మాత్రమే లభించే ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంటుంటారు. ఇంతటి అమృత ఫలాన్ని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు అనంతపురంలోని వైద్య కళాశాల ఎదురుగా ఫుట్‌పాత్‌పై పెట్టుకుని విక్రయిస్తున్నారు. కొనుగోలుదారుల సమక్షంలోనే తాటికాయ గెలల నుంచి తాజా ముంజలను వేరు చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
అందని సలహాలు సూచనలు
అనంతపురం అగ్రికల్చర్: ‘పేరు గొప్ప... ఊరు దిబ్బ’ అనే చందంగా మారింది జిల్లా ఉద్యానశాఖ పరిస్థితి. పదేళ్ల కిందటే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరు పొంది... ప్రస్తుతం ఉద్యానహబ్‌గా పిలవబడుతున్న ‘అనంత’లో ఆ శాఖకు జిల్లా స్థాయి అధికారి లేక ఏడాదవుతోంది. డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) స్థాయి అధికారి డిప్యుటేషన్లో ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారి నెల రోజుల పాటు సెలవులో వెళ్లారు. కనీసం ఇన్చార్జి అధికారిని కూడా నియమించలేదు. దీంతో పాలన గాడితప్పి హెచ్ఓ స్థాయి అధికారులే అతి కష్టమ్మీద నెట్టుకొస్తున్నారు. పథకాల అమలు, పంటల సస్యరక్షణ సలహాలు అందక ఉద్యాన రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వంలో కాసింత కూడా చలనం లేకుండా పోయింది. విస్తీర్ణంలో నంబర్ వన్ జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా ఉద్యాన తోటల విస్తీర్ణంలో ‘అనంత’ మొదటి స్థానంలో ఉంది. యాపిల్ లాంటి నాలుగైదు రకాలు మినహా మిగిలిన అన్ని రకాల ఉద్యాన తోటలకు నిలయంగా మారింది. జిల్లా నుంచి చీనీ, అరటి, దానిమ్మ, టమాట, గులాబీ తదితర ఉత్పత్తులు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో పేరున్న అజాద్‌పూర్ మండీలో ‘అనంత’ ఉద్యాన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. వేలాది మంది ఉద్యాన రైతుల శ్రమ ఫలితంగా లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు, రూ.వేల కోట్ల టర్నోవర్‌తో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల హార్టికల్చర్ కాంక్లేవ్ పేరుతో జాతీయ స్థాయి సదస్సు సైతం అనంతపురంలోనే నిర్వహించారు. అరటి, చీనీ, మిరప, మామిడి, టమాట పంటలను ఐదు గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి కొన్ని కార్పొరేట్ కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకున్నారు. ఇవన్నీ సక్రమంగా అమలు చేసి వాటి ఫలాలు రైతులకు అందించే సరైన అధికారులు లేరు. అతి తక్కువ ఉద్యానతోటల విస్తీర్ణం కలిగిన కొన్ని జిల్లాల్లో డీడీ స్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం... ఉద్యానహబ్‌గా పేరున్న ‘అనంత’ను నిర్లక్ష్యం చేయడం గమనార్హం. 72 రకాల ఉద్యాన తోటలు జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లోనూ పండ్ల తోటలు పెద్ద ఎత్తున విస్తరించాయి. వేలాది మంది రైతులు వ్యవసాయ పంటలను తగ్గించి అంతో ఇంతో నీటి వనరుల కింద పండ్లు, పూలు, కూరగాయలు ఇతర ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలు ఉండగా... అందులో 1.80 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, 40 వేల ఎకరాల్లో సుగంధం, ఔషధ పంటలు, పూలతోటలు సాగులో ఉన్నాయి. ఒకట్రెండు కాదు... ఏకంగా 72 రకాల ఉద్యాన తోటలు సాగులో ఉన్నట్లు ఈ–క్రాప్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ద్వారా ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తోంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారి లేక గాడితప్పిన పాలన జిల్లాలో 3 లక్షల ఎకరాలకు పైగా ఉద్యానతోటలు 72 రకాల ఉద్యాన పంటల సాగు పంట సస్యరక్షణ సలహాలు అందక రైతుల అవస్థలు తరచూ వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పు కారణంగా చీడపీడలు, తెగుళ్ల బెడద కూడా అధికంగా ఉంటోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు కూడా ఏటా దెబ్బతీస్తున్నాయి. అలాగే మార్కెటింగ్ సమస్య సైతం రైతులను వేధిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న ‘అనంత’లో ఖచ్ఛితంగా జిల్లా స్థాయి (డీడీ) అధికారి ఉండాల్సిన చోట... ఏడీ స్థాయి అధికారితో నెట్టుకొస్తున్నారు. ఆయన కూడా ఇటీవల సెలవు పెట్టారు. ఇన్చార్జి అఽధికారినీ నియమించలేదు. గతంలో ఇక్కడకు రెగ్యులర్ డీడీని నియమించినా... బాధ్యత తీసుకున్న రోజే డిప్యుటేషన్ కింద కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. దీంతో ఏడీ బీఎంవీ నరిసింహారావుకే ఇన్చార్జి డీడీ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయనకు టెలీ కాన్ఫరెన్స్‌లు, జూమ్ మీటింగ్, కమిషనరేట్ రివ్యూలు, కలెక్టరేట్ సమీక్షలకు హాజరయ్యేందుకే సమయం చాలడం లేదంటున్నారు. ఇపుడు ఆయన కూడా సెలవు పెట్టడంతో ఉద్యానశాఖకు దిక్కులేకుండా పోయింది. సస్యరక్షణ సిఫారసులు, సాంకేతిక సలహాలు, పథకాల సమచారం ఇచ్చేవారు లేకపోవడంతో రైతులకు పెద్ద సమస్యగా మారింది. -
నీటి సరఫరాలో సమస్యలౖపై నేడు కలెక్టర్ ‘ఫోన్‌ఇన్’
అనంతపురం అర్బన్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఆకాశవాణి కేంద్రం నుంచి ‘అనంత మిత్ర ఫోన్‌ఇన్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజలు 08554–225533, 296890 నంబర్లకు ఫోన్ చేసి తాగునీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. 100 శాతం సబ్సిడీతో డ్రిప్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎస్సీ, ఎస్టీలు, చిన్న, సన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీతో బిందు సేద్యానికి ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ ప్రాథమిక రంగ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఐదెకరాల విస్తీర్ణానికి సబ్సిడీ మొత్తం రూ.2.18 లక్షలుగా ఉంటుందని, ఐదు నుంచి 10 ఎకరాలు ఉన్న రైతు (ఎస్సీ, ఎస్టీలతో సహా) 90 శాతం సబ్సిడీ, పెద్ద రైతులకు (12.5 ఎకరాలు) 50 శాతం సబ్సిడీతో డ్రిప్ అందిస్తామన్నారు. తపాలా ఎస్పీపై ఉన్నతాధికారుల సీరియస్ ● తక్షణం రిలీవ్ కావాలని ఆదేశం ● కడప ఎస్పీ రాజేష్‌కు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అనంతపురం సిటీ: అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ (ఎస్పీ) బి.గుంపస్వామిపై ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. తెలంగాణ సర్కిల్లోని ఆదిలాబాద్ డివిజన్‌కు ఆయన్ను బదిలీ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రిలీవ్ కాకుండా అనంతపురంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని, బదిలీ రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విన్నపాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బదిలీ రద్దు కోసం ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు పెంచారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఈ నెల 9వ తేదీలోపు విధుల నుంచి తప్పనిసరిగా రిలీవ్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. లేకపోతే ఈ నెల 16 నుంచి జీతం నిలిపివేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కడప తపాలా ఎస్పీగా పనిచేస్తున్న రాజేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 16న అనంతపురం డివిజన్ ఎస్పీగా అదనపు బాధ్యతలను రాజేష్ స్వీకరించనున్నట్లు సమాచారం. హనుమద్ వాహనంపై శ్రీవారు తాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం హనుమద్ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథుడు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరి శాయి. రాత్రి హనుమద్ వాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బెళుగుప్పలో అర్జీల కుప్ప
● ‘ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వినతుల వెల్లువ ● అన్నింటినీ పరిష్కరిస్తాం: మంత్రి కేశవ్ బెళుగుప్ప: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో ఏకంగా 713 వినతులు అందడం గమనార్హం. రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, ఇళ్ల మంజూరు, భూ సమస్యలతో పాటు రహదారుల నిర్మాణాలు, గ్రామాభి వృద్ధికి సంబంధించిన వినతులే ఎక్కువగా ఉన్నాయి.అర్జీల స్వీకరణ అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పుకు రూ.3,800 కోట్ల నిధులను కేటాయించి 70 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. ఒకే సారి హంద్రీ–నీవా కాలువలోకి 12 మోటార్లు పంపింగ్ చేయవచ్చన్నారు. అంతకుముందు రూ.1.75 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని, రూ.50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కేంద్రాన్ని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.16.7 లక్షలతో నిర్మించిన రహదారిని మంత్రి ప్రారంభించారు. బెళుగుప్ప కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ వసంతబాబు, డీఎంహెచ్ఓ ఈబీ దేవి, తహసీల్దార్ షర్మిళ, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, వైద్యాధికారులు కార్తీక్‌రెడ్డి, ప్రియాంక, ఎంఈఓ మల్లారెడ్డి, కేజీబీవీ ఎస్ఓ నాగరత్న, ఎంపీపీ పెద్దన్న, సర్పంచ్ సాలీబాయి, వైస్ ఎంపీపీ పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా అందజేస్తున్న ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు సుమన జయంతి కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాల కోసం 08554– 275575లో సంప్రదించవచ్చు. మహిళపై దేవర దున్నపోతు దాడి గుత్తి: మండల పరిధిలోని శ్రీపురం (కొజ్జేపల్లి) గ్రామానికి చెందిన అనంతమ్మపై మంగళవారం రాత్రి దేవర దున్నపోతు దాడి చేసింది. ఇంటి బయట నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతమ్మను కుటుంబ సభ్యులు తొలుత గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వివాహితపై అత్యాచార యత్నం పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు మండలం ఎర్రపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన యువకుడు చంద్ర అత్యాచారయత్నం చేశాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వరి కల్లాల వద్ద ఉన్న ఒంటరిగా వివాహితను గమనించిన చంద్ర అత్యాచారం చేయబోతే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలో ఆమె గొంతు, మెడపై దాడి చేసి యువకుడు పరారయ్యాడు. బుధవారం ఉదయం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
బూటు కాలితో తన్ని.. గొంతు నులిమి
అనంతపురం: బిడ్డను అక్కున చేర్చుకుని ప్రేమను పంచాల్సిన ఓ తండ్రి కర్కశత్వం ప్రదర్శించాడు. రాక్షసుడిలా మారి అభంశుభం తెలియని చిన్నారిని చిత్రహింసలకు గురి చేశాడు. అనంతపురం వన్‌టౌన్ సీఐ వి. రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన శివ, మౌనికలు కులాంతర వివాహం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అనంతపురానికి వచ్చి జేఎన్టీయూ (ఏ) ఎదురుగా ఉన్న ఓ బాయ్స్ హాస్టల్లో వంట మనుషులుగా చేరారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి హాస్టల్లో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తోందన్న కోపంతో తండ్రి శివ మంగళవారం విచక్షణారహితంగా కొట్టాడు. బూటు కాలితో తన్నాడు. చెంప పగులకొట్టడమే కాకుండా బుగ్గలు గట్టిగా కొరికాడు. గొంతు నులిమి చిత్రహింసలు పెట్టాడు. దెబ్బలు తాళలేక చిన్నారి ఆర్తనాదాలు పెడుతున్నా కనికరం చూపలేదు. సొమ్మసిల్లిపడిపోయినా ఆపకుండా మరీ చితకబాదాడు. ఈ విషయాన్ని హాస్టల్లో ఉంటున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఐసీడీఎస్ అధికారులు హాస్టల్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మూడేళ్ల చిన్నారిపై కసాయి తండ్రి కర్కశత్వం కేసు నమోదు చేసిన పోలీసులు -
జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 39.4–42.2, రాత్రి ఉష్ణోగ్రతలు 22.6–24.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 60–68 శాతం, మధ్యాహ్నం 18–21 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పయ్యావుల విడపనకల్లు: జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిల్లా అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి, మాట్లాడారు. 70 రోజుల్లో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మలోలా, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీఏఓ ఉమామహేశ్వరమ్మ, ఎల్డీఎం నర్సింగరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, సివిల్ సప్లయీస్ డీఎం రమేష్‌రెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు, బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దారు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ షకీలాబేగం, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్‌సీకి జాతీయ స్థాయి సర్టిఫికెట్ రాప్తాడు: స్థానిక పీహెచ్‌సీకి జాతీయ స్థాయి సర్టిఫికెట్ దక్కింది. మంగళవారం అనంతపురంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సర్టిపికెట్‌ను పీహెచ్సీ వైద్యాధికారి ఎం.శివకృష్ణ అందుకున్నారు. అలాగే చిన్మయనగర్ ఆయుష్మన్ ఆరోగ్య కేంద్రం కూడా జాతీయ నాణ్యత ప్రమాణాలకు ఎంపిక కావడంతో ఎంఎల్‌హెచ్‌పీ ప్రసన్న, ఏఎంఎం చంద్రకళకు సర్టిఫికెట్లను అందజేశారు. ఏపీ ఈసెట్‌కు 33 వేల దరఖాస్తులు అనంతపురం: ఇంజినీరింగ్ కోర్సులో లేటరల్ ఎంట్రీ కింద రెండో సంవత్సరంలోకి అడ్మిషన్లు పొందడానికి నిర్వహించే ఏపీఈసెట్–2025కు మొత్తం 33,454 దరఖాస్తులు అందినట్లు ఈసెట్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్ తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 12 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు, రూ.4 వేల అపరాధ రుసుముతో ఈ నెల 24వ తేదీ వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. మాజీ జవాన్ మృతి గుత్తి: స్థానిక 21వ వార్డులో నివాసముంటున్న మాజీ జవాన్ అల్లాబకాష్ (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆయన తన కాలును పోగొట్టుకున్నారు. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, మాజీ సైనిక ఉద్యోగులు కృష్ణయ్య, రామ్మూర్తి తదితరులు అల్లాబకాష్ భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. -
అభిమాన నేతను చూశాం.. అదే చాలు
ఎంతో ఆనందం కలిగింది మాది వ్యవసాయ కుటుంబం. పొలంలో వేరుశనగ, మొక్కజొన్న సాగు చేస్తాం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏటా ఠంచనుగా ‘రైతు భరోసా’ అందించడంతో సాఫీగా పంటలు సాగు చేశాం. వరుణుడు కరుణించి పంటలు బాగా పండటంతో నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాం. అలా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్న అభిమాన నేత మా ప్రాంతాన్ని రావడంతో ఎలాగైనా చూడాలని వచ్చాం. ఆయన్ను చూశాక ఎంతో ఆనందం కలిగింది. – చెన్నకేశవ దంపతులు, కుంటిమద్ది గ్రామం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి నాకు పది ఎకరాల పొలం ఉంది. చంద్రబాబు రైతులకు ఏమీ చేయడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు మా కష్టాలు తెలియడం లేదు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలకు అడుగడుగునా చేయూతనిచ్చారు. ఆయన ఉంటే మాకు ఈ బాధలు ఉండేవే కావు. రాష్ట్రానికి తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం. – రంగయ్య, ఆర్. కొట్టాల, పెనుకొండ మండలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి మండల పర్యటనలో జన తరంగం ఎగిసి పడింది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జనం తాకిడికి ముదిగుబ్బకు చెందిన శోభారాణి చెప్పులు తెగిపోగా.. జగన్‌ను చూడాలనే సంకల్పంతో ఆమె తన వద్ద ఉన్న టవల్‌ను చింపి కాళ్లకు చుట్టుకుని మరీ ఎర్రటి ఎండలో ముందుకు నడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి కొందరు తలపై టవల్స్ ధరించి, కానుగ ఆకులు కట్టుకొని వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ రాష్ట్రానికి శని పట్టింది.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రానికి శని పట్టింది. మాకు కుమార్తె, ఒక కుమారుడు సంతానం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం జగనన్న అమ్మఒడి ఇచ్చేవారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు. జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటే.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు. – వెంకట్రామ్ దంపతులు, పోలేపల్లి గ్రామం -
మద్దతు ధర చట్టం అమలుకు మరో ఉద్యమం
అనంతపురం సిటీ: మద్దతు ధర చట్టం అమలకు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని రైతులకు రైతు సంఘం రాష్ట్ర క్యాదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. వ్యవసాయ పథకాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో అనంతపురంలోని డీపీఆర్సీ భవన్లో ఉద్యాన రైతుల రాష్ట్ర సదస్సు మంగళవారం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేవీవీ ప్రసాద్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీస్, జిల్లా కార్యదర్శి జాఫర్, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర రైతు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కాటమయ్య, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత రాముడు హాజరయ్యారు. కేవీవీ ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. దేశ వ్యాప్తంగా 600 రకాల పండ్లను రైతులు ఉత్పత్తి చేస్తున్నా.. కేవలం 24 రకాల పండ్ల ఉత్పత్తులకు మాత్రమే కేంద్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం బాధాకరమన్నారు. రెతులు పండించిన పంట ఉత్పత్తులపై శ్రమ, ఖర్చులతో పాటు 50 శాతం అదనంగా కలిపి ధర నిర్ణయిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుందన్నారు. అప్పుడే రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడుకోగలమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనంతపురం జిల్లా ఫ్రూట్ బోల్గా ఎదగాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. అప్పటి వరకూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ.. ఎకరాకు రూ.30 వేలు ఇస్తూ 30 ఏళ్లకు రైతుల నుంచి భూములు అగ్రిమెంట్ చేసుకున్న గాలిమరల నిర్వాహకులు ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం దారుణమన్నారు. కాటమయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్ అప్పులను రద్దు చేస్తున్న తరహాలోనే రైతుల అప్పులనూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యు డు లింగమయ్య, ఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేశ్, నిర్మల, ఇంకా వివిధ స్థాయిల నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ -
అధికారుల నిర్లక్ష్యం.. దివ్యాంగులకు శాపం
తాడిపత్రి రూరల్: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. దీంతో సదరం క్యాంప్‌లో వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో స్లాట్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి తేదీ, సదరం క్యాంప్ నిర్వహించే ఆస్పత్రి ఖరారు చేసి సమాచారాన్ని అందజేస్తారు. ఈ విధానం దివ్యాంగులకు ఎంతో సౌలభ్యంగా మారింది. అయితే ఇటీవల ఆర్థో, కంటి పరీక్షలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకున్న వారికి తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిని కేటాయిస్తూ మంగళవారం సదరం క్యాంప్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి వందలాది మంది దివ్యాంగులు వారి సహాయకులతో కలసి వచ్చారు. అయితే వైద్య పరీక్షలు చేసేందుకు ఎలాంటి పరికరాలు లేవని తెలియడంతో దివ్యాంగులు అయోమయంలో పడ్డారు. పరికరాల్లేవు.. పరీక్షలు చేయలేం ఆర్థో, కంటి వైద్య పరీక్షలు చేసేందుకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలాంటి వైద్య పరికరాలు లేవు. అర్థోకు అరకొరగా పరికరాలు ఉన్నా కంటి పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరమూ లేదు. తమకందిన సమాచారంతో మంగళవారం ఉదయం 8 గంటలకే వందలాది మంది దివ్యాంగులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 11గంటలైన పరీక్షలు మొదలు పెట్టకపోవడంతో విసుగెత్తి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్‌ను నిలదీశారు. దీంతో కంటి డాక్టర్ వసంత, ఆర్థో వైద్యుడు హరిప్రసాద్‌ను డాక్టర్ డేవిడ్ పిలిపించుకుని మాట్లాడారు. సదరం క్యాంప్‌కు హాజరైన దివ్యాంగులకు అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలు లేవని వారు చేతులేత్తేయడంతో విషయాన్ని వెంటనే డీసీహెచ్ డాక్టర్ పాల్ రవికుమార్ దృష్టికి సూపరింటెండెంట్ తీసుకెళ్లారు. బయటి నుంచి పరికరాలు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఆయన సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశారు. వెంటనే మరోసారి డీసీహెచ్కు డాక్టర్ డేవిడ్ ఫోన్ చేయడంతో ఆయన మంత్రి సత్యకుమార్ పర్యటనలో ఉన్నారంటూ కింది స్థాయి ఉద్యోగి తెలిపి ఫోన్ పెట్టేశారు. ఈ విసయం తెలియగానే దివ్యాంగులు మండిపడుతూ సూపరింటెండెంట్‌తో వాగ్వాదానికి దిగారు. రాప్తాడుకు చెందిన దివ్యాంగుడు విషయాన్ని వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనకే నేరుగా ఫోన్ చేశారు. అయితే మంత్రి మీటింగ్‌లో ఉన్నారని పీఏ హర్ష తెలిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. చివరకు పరికరాలే లేనప్పుడు వైద్య పరీక్షలు చేయడం సాధ్యం కాదంటూ చేతులెత్తేయడంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరీక్షల కోసం పిల్లాపాపలు, వృద్దులతో కలసి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. వైద్య పరీక్ష పరికరాలు లేకున్నా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి సదరం స్లాట్ ఖరారు జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి తరలివచ్చిన దివ్యాంగులు -
మళ్లీ బుక్ చేసుకునే అవకాశం కోల్పోయాం
నా కుమార్తె జోషికకు పుట్టుకతోనే కుడి కన్ను లేదు. చిన్నారికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే కన్ను లేదని నిర్ధారించవచ్చు. ఆమె చదువులకు, ఉద్యోగ అవకాశాలకు పనికి వస్తుందని సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. దీంతో ముదిగుబ్బ నుంచి తెల్లవారుజామునే బయలుదేరి వచ్చాను. ఇక్కడకు వచ్చిన తర్వాత కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదని అంటున్నారు. పోతే పోయిందేలే అనుకుని మళ్లీ స్లాట్ బుక్ చేద్దామనుకుంటే రూల్స్ ఒప్పుకోవంటా. ఎందుకు పరీక్షలు చేయించుకోలేదో వైద్యులు రాతపూర్వకంగా ఇచ్చిన వివరణను జతపరచాలంటా. అంతేకాక మరో మూడు నెలల వరకూ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. – రమాదేవి, ముదిగుబ్బ, శ్రీసత్యసాయి జిల్లా -
ప్రభుత్వ లాంఛనాలతో రమాదేవి అంత్యక్రియలు
కంబదూరు: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల సమీపంలో సోమవారం ఉదయం రెండు కార్లు బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఓ కారులో ఉన్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామమైన కంబదూరు మండలం తిమ్మాపురానికి మంగళవారం తీసుకొచ్చారు. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల డీఆర్ఓలు మలోల, విశ్వేశ్వర నాయుడు, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంత బాబు, కంబదూరు తహసీల్దార్ బాలకిషన్ తదితరులు రమాదేవి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. యువకుడి ఆత్మహత్య కణేకల్లు: మండలంలోని యర్రగుంట గ్రామానికి చెందిన గొల్ల గంగాధర్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య సిద్దమ్మ, ఇద్దరు కుమార్తెలు, తల్లి లక్ష్మి ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడిన గంగాధర్ రోజూ సంపాదన మొత్తాం తాగుడుకే ఖర్చు పెడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు ఉన్న ఇంటిని అమ్మేసి, అద్దె గదికి మకాం మార్చారు. అయినా మద్యం తాగడాన్ని మానుకోలేదు. దీంతో తాగుడు మానేస్తే కుటుంబం బాగుపడుతుందని మంగళవారం ఇంట్లో అందరూ మందలించారు. అనంతరం కుటుంబసభ్యులందరూ యణ్ణేరంగస్వామి ఉత్సవాలకు వెళ్లారు. సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న గంగాధర్.. చిన్నారికి వేసిన ఊయల చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసుల అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఉద్యానశాఖ డీడీగా ఫిరోజ్‌ఖాన్ అనంతపురం సెంట్రల్: ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్‌ఖాన్ మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ పనిచేస్తున్న బీఎంవీ నరసింహారావు మెడికల్ లీవ్‌లో వెళ్లడంతో ఆయన స్థానంలో ఫిరోజ్ఖాన్కు ఎఫ్ఏసీ డీడీగా బాధ్యతలు అప్పగిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
పరికరాలు లేవంటున్నారు
నేను కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా. సదరం స్లాట్ బుక్ చేసుకోవడమంటే ఓ యుద్ధం చేసినట్లవుతోంది. ఆన్లైన్లో సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా అర్థం కావడం లేదు. అష్టకష్టాలు పడి ఎప్పుడో బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. ఇక్కడకు వస్తే కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదంటున్నారు. పరికరాలు లేనప్పుడు సదరం క్యాంప్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారు. మాకెలా సమాచారం ఇచ్చారు. దివ్యాంగులంటే ఇంత చులకనా? – శ్రీనివాసులు, రాప్తాడు -
15 వరకు మద్దతు ధరతో కందుల కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటా రూ.7,550 ప్రకారం కందుల కొనుగోళ్ల కార్యక్రమం ఈ నెల 15న ముగుస్తుందని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ 7,900 మంది రైతుల నుంచి 10,687 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయగా, ఇందులో 6,886 మంది రైతులకు రూ.59 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. -
వైఎస్సార్సీపీ నేత తోటకు నిప్పు
ఉరవకొండ: మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రైతు విభాగం మండల సహాయ కార్యదర్శి నెట్టెం రామకృష్ణప్ప దానిమ్మ తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బాధితుడు తెలిపిన మేరకు.. తనకున్న నాలుగు ఎకరాల్లో 1,300 దానిమ్మ మొక్కలతో సాగు చేపట్టాడు. మరో నెలలో పంట చేతికొస్తుంది. ఈ క్రమంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. చుట్టు పక్కల పొలాల రైతులు గమనించి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. దాదాపు 80 చెట్లు కాలిపోయాయి. ఘటనతో రూ.1.50 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు మేకల సిద్దార్థ్, రాకెట్ల సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీలు శీనానాయక్, శ్రీనివాసులు తదితరులు తోటను పరిశీలించి, బాధితుడిని ఓదార్చారు. -
నేత్రపర్వంగా రథోత్సవం
కణేకల్లు: మండలంలోని యర్రగుంట గ్రామంలో వెలసిన యణ్ణేరంగస్వామి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా సాగింది. రాయదుర్గం, బొమ్మనహళ్, బెళుగుప్ప, డి.హిరేహళ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకూ విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంకాలం 5 గంటలకు స్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగిస్తూ రథంపైకి చేర్చారు. మేళాతాళాలు, తపెట్లతో రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ యండ్రకాయల వన్నూరప్ప, మాజీ వైస్ ఎంపీపీ పి.సంజీవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కెనిగుంట రామిరెడ్డి, పాటిల్ వెంకటరెడ్డి, కె.జె.ఈరన్న, కేజీ వన్నూరుస్వామి, హనుమంతప్ప పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన యణ్ణేరంగస్వామి ఉత్సవాలు సోమవారం నాటి రథోత్సవంతో ముగిసాయి. -
‘పీపీపీ’తో పేదలకు వైద్య సేవలు దూరం
అనంతపురం కార్పొరేషన్: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానం ద్వారా పేదలకు వైద్య సేవలు శాశ్వతంగా దూరమవుతాయని, ఈ విధానం కింద ప్రభుత్వ ఆస్పత్రులను చేర్చే ఆలోచనను మానుకోకపోతే ఉద్యమిస్తామంటూ కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ హెచ్చరించారు. పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా పేదలకు సర్వజనాస్పత్రినే దిక్కుగా మారిందన్నారు. ప్రైవేట్ కంపెనీలను భాగస్వామ్యం చేసుకుంటే పేదలకు నాణ్యమైన వైద్యం అందదన్నారు. హెల్త్ కేర్ సెక్టార్‌కు సంబంధించి బడ్జెట్లో 5 శాతం నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీరభద్రయ్య, నాయకులు రాజు, తిరుపాల్, చంద్రశేఖర్, సురేంద్ర, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.సింహ వాహనంపై రంగనాథుడుతాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి సింహ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రంగనాథస్వామిని ప్రత్యేక పూలు, ఆభరణాలతో అర్చకులు అలంకరించారు. రాత్రి సింహ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. -
వైభవంగా ‘వేమన’ ఉత్సవాలు
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో రెండో రోజు సోమవారం రాత్రి విశ్వకవి యోగి వేమన ఉత్సవాలు వైభవంగా సాగాయి. పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి విశేష పూజలు చేశారు. కదిరి పరిసర మండలాల నుంచే కాక వైఎస్సార్ జిల్లా, కర్నూలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వేమన ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. భక్తులకు పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి చిన్నారుల శాసీ్త్రయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాటల కచేరీ అలరించింది. -
సైనిక లాంఛనాలతో జవాన్‌కు అంత్యక్రియలు
పామిడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్మీ జవాన్ కొండేటి అనిల్‌కుమార్(36)కు సైనిక లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు... పామిడి మండలం ఎదురూరుకు చెందిన అనిల్‌కుమార్ అహమ్మదాబాద్ రెజిమెంట్‌లో హవల్దార్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రమావత్ పార్వతి, 12 ఏళ్ల వయసున్న సాయితేజ, తొమ్మిదేళ్ల వయసున్న మోక్షిత్ అనే కుమారులు ఉన్నారు. పిల్లల చదువుల కోసమని అనంతపురంలో కాపురం పెట్టిన ఆయన గత నెల సెలవుపై ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 19న ద్విచక్ర వాహనంపై వెళుతూ అనంతపురంలోని రుద్రంపేట సమీపంలో స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనం అదుపు తప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి పోయారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు బెంగుళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఆయన మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం స్వగ్రామం ఎదురూరుకు సైనికులు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో అహమ్మదాబాద్ రెజిమెంట్ అధికారుల సమక్షంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప, తహసీల్దార్ ఎన్. శ్రీధరమూర్తి, సీఐ వి.యుగంధర్, మాజీ సైనికోద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
‘స్టార్’ తిరగబడింది!
● తాడిపత్రిలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ ● రూ.6 లక్షలతో ఉడాయించిన సంస్థ ఇన్చార్జ్ భాస్కర్ ● సంస్థ సిబ్బందిని నిలదీస్తున్న బాధితులు ● పోలీసులను ఆశ్రయించిన సిబ్బంది, బాధితులు తాడిపత్రి టౌన్: ‘బిజినెస్ చేయాలనుకున్నారా?. సొంత ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేక ఆగిపోయారా? ఇప్పుడు మీ కలలను సాకారం చేసేందుకు స్టార్ ఫైనాన్స్ మీ ముందుకు వచ్చింది. సిబిల్ స్కోర్ లేకున్నా మీకు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఊరించి నెల రోజులు తిరగకుండానే బాధితులకు రూ.6 లక్షల కుచ్చుటోపీ పెట్టి తాడిపత్రిలో ఓ ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వివరాలు... తాడిపత్రి మండలం కొండేపల్లికి చెందని సాగిబండ భాస్కర్... స్థానిక నంద్యాల రోడ్డులో ఓ గదిని అద్దెకు తీసుకుని స్టార్ పైనాన్స్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. సిబిల్ స్కోర్ లేకపోయినా వ్యక్తిగత రుణాలు, బిజినెస్ లోన్లు, హౌస్.. ప్లాట్ లోన్లు ఇస్తామంటూ ఆకర్షణీయమైన ఫ్లెక్సీలో విస్తృత ప్రచారం చేశాడు. నెలకు రూ.10వేల వేతనంతో దాదాపు 20 మంది సిబ్బందిని నియమించుకుని ఆర్థిక ఇబ్బందులతో బాదపడుతున్న వారిపై ఉసిగొల్పాడు. ఎదుటి వ్యక్తి అవసరాలను బట్టి రుణం మంజూరుకు సంబంధించి రూ.లక్షకు 6 శాతం చొప్పున ప్రాసెసింగ్ పీజును ముందుగానే రాబట్టుకున్నాడు. ఇలా దాదాపు 35 మందితో రూ.6 లక్షలు వసూలు చేసుకుని 30 రోజుల్లోపు రుణం మొత్తం వారి బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని నమ్మబలికాడు. దాదాపు నెల రోజలకు పైగా గడుస్తున్నా బ్యాంక్ ఖాతాలకు రుణం మొత్తం జమ కాకపోవడంతో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన పలువురు నేరుగా కార్యాలయానికి చేరుకుని అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. దీంతో రేపోమాపో వస్తుందని చెబుతూ వచ్చిన సిబ్బంది సైతం ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుడు భాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో లబోదిబో మంటూ బాధితులతో కలసి సోమవారం ఏఎస్సీ రోహిత్‌కుమార్‌కు సమస్య విన్నవించారు. ఘటనపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, అప్పులు చేస్తే తప్ప ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సోమవారం ఆయన ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని, శుక్రవారం వస్తే ఏ బ్యాంకు నుంచి ఏ ఫోన్ వస్తోందోనన్న భయం వేస్తోందని అన్నారు. బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి మీ డ్యూ డేట్ వచ్చింది.. సోమవారంలోగా వడ్డీ కట్టాలని ఎక్కడ అడు గుతారోనన్న భయం వెంటాడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అతి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి నిధులు వెచ్చిస్తున్నామన్నారు. జిల్లాకు ముఖ్యమైన హంద్రీ–నీవా కాలువను ఈ ఏడాది జూన్ 10 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం పెంచాలని 2014–19 మధ్యకాలంలో 40 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హంద్రీ–నీవా విస్తరణకు రూ.3,800 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.నూతన జిల్లా జడ్జిగా భీమా రావు● నెల్లూరుకు శ్రీనివాస్ బదిలీఅనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఈ. భీమా రావు నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయనను జిల్లాకు బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న జి. శ్రీనివాస్ నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అలాగే, అనంతపురం నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (గుత్తి)గా విధులు నిర్వహిస్తున్న శ్రీహరిని పిఠాపురం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా, అదనపు జిల్లా జడ్జి ఎం. శోభారాణిని సీబీఐ స్పెషల్ జడ్జి (కర్నూలు)గా బదిలీ చేశారు.● ఈ.భీమారావు 1972లో పిఠాపురంలో జన్మించారు.బీఎస్సీ, ఎల్ఎల్బీ కాకినాడలో పూర్తి చేశారు. పిఠాపురంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2013లో అదనపు జిల్లా జడ్జిగా విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. 2017లో ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు. అదే సంవత్సరంలోనే విజయనగరం ఫ్యామిలీ కోర్టు కమ్– నాలుగో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదటిసారి 2020లో పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.● నెల్లూరుకు బదిలీపై వెళ్తున్న జడ్జి జి. శ్రీనివాస్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సంచలన తీర్పులు వెలువరించారు. కందుకూరు శివారెడ్డి హత్య కేసులో నిందితులకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించారు. జిల్లా కోర్టు చరిత్రలోనే మొత్తం 12 కేసుల్లో ముద్దాయిలకు జీవిత ఖైదు విధించిన తొలి ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కావడం గమనార్హం. -
ఆశతో వచ్చాం.. ఆదుకోండి
అనంతపురం అర్బన్: ‘ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చాం. కరుణించి ఆదుకోండి’ అంటూ కలెక్టర్, ఇతర అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రమేష్‌రెడ్డి, తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 492 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కార క్రమంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. అర్జీదారునితో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా నాణ్యతగా పరిష్కరించడంతో పాటు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని.... ● చీనీ మార్కెట్ యార్డులో ఈనామ్ వ్యవస్థను రద్దు చేసి వేలం ద్వారా అమ్మకాలు జరపాలని రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, బీహెచ్‌రాయుడు, రాజారాంరెడ్డి విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ 10 శాతం వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సూట్ విధానం అరికట్టాలన్నారు. ● తమ తాత పేరున ఉన్న భూమిని వేరొకరు వారి పేరున ఆన్లైన్లో ఎక్కించుకున్నారని అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన తిరుపతయ్య ఫిర్యాదు చేశాడు. బుక్కరాయసముద్రం సిద్ధరాంపురం సర్వే నంబరు 336–1లో 5.08 ఎకరాలు తమ తాత పేరున ఉందని చెప్పాడు. అయితే ముగ్గురు వ్యక్తులు భూమిని తమ పేరున ఎక్కించుకున్నారని, విచారణ చేసి న్యాయం చేయాలని కోరాడు. ● గ్రామకంఠం స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నాడని గార్లదిన్నె మండలం కమలా పురానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రహరీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పాడు. ● వితంతు పింఛను మంజూరు చేయించాలని యాడికికి చెందిన కందికుంట రుక్మిణిదేవి విన్నవించింది. తన భర్తకు వృద్ధాప్య పింఛను వచ్చేదని, ఆయన గత ఏడాది జూన్ 12న చనిపోయాడని చెప్పింది. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల వేడుకోలు వివిధ సమస్యలపై 492 వినతులు ఈ వృద్ధురాలి పేరు లక్ష్మమ్మ. ఆత్మకూరు మండల కేంద్రంలో నివాసముంటోంది. ఈమెకు నలుగురు కుమారులు సంతానం. భర్త 2016లో చనిపోయాడు. వీరికి సర్వే నంబరు 547–7లో 4.24 ఎకరాల భూమి ఉంది. భూమికి డీ పట్టా, పట్టా నంబరు 3072 పాసుపుస్తకం ఉంది. అయితే, సాగులో ఉన్న తమను భూమిలోకి వెళ్లకుండా కొందరు దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని ఆవేదన చెందింది. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఇబ్బందికి గురిచేస్తున్నారని చెప్పింది. -
దయనీయం.. దౌర్భాగ్యం
● సర్వజనాస్పత్రిలో దిగజారిన సేవలు ● గంటల తరబడి ఎమర్జెన్సీలోనే రోగులు ● ప్రత్యక్ష నరకం చూస్తున్న బాధితులు ● పట్టించుకోని ఉన్నతాధికారులు అనంతపురం మెడికల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో రోజురోజుకూ సేవలు దిగజారుతు న్నాయి. ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి.ఆస్పత్రికొచ్చే రోగులు ఆర్తనాదాలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కానరావడం లేదు. అత్యవసర కేసులు ఉదయం ఎమర్జెన్సీకి వస్తే సాయంత్రమైనా వార్డులకు తరలించడం లేదు. ఉరవకొండ మండలం గడేహొతూరుకు చెందిన తులసి తలకు గాయంతో సోమవారం ఉదయం 11.30 గంటలకు సర్వజనాస్పత్రికి రాగా, ఇక్కడ ఆమెను సర్జరీ వైద్యులు చూడడానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఇదొక్కటే కాదు..ఆస్పత్రిలో తగినన్ని పడకలు లేకపోవడం, వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యం వెరసి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. రోజులో ఒక్కసారైనా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, ఏడీ మల్లికార్జున రెడ్డి, ఆర్‌ఎంఓలు ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి రోగులను సకాలంలో వార్డులకు పంపేలా చూస్తే సగం కష్టాలు తీరుతాయి. కానీ ఆస్పత్రిలో అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అమాత్యా.. ఆలకించండి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎమర్జెన్సీ వార్డును పది నిమిషాలు పరిశీలిస్తే.. ఇక్కడ రోగులు నిత్యం ఎంత నరకం అనుభవిస్తారో తెలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆస్పత్రిలో వివిధ విభాగాధిపతులు, అధికారుల మధ్య ఏపాటి సమన్వయం ఉందో, సూపరింటెండెంట్, ఏడీ, ఆర్ఎంఓలకు పరిపాలనపై పట్టు ఏమాత్రం ఉందో ఇట్టే తెలిసి పోతుందంటున్నారు. ● వైద్యం కోసం సర్వజనాస్పత్రికి వచ్చిన కూడేరుకు చెందిన సంగప్ప, శెట్టూరుకు చెందిన హనుమంతులను ఒకే మంచంపై ఉంచిన దృశ్యమిది. గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్న తరుణంలోనూ చాలీచాలని మంచంపై పడుకోబెట్టడం.. చాలా సేపు వైద్యులు పట్టించుకోకపోవడంతో సంగప్ప నరకయాతన అనుభవించాడు. దయచేసి వార్డుకు పంపండంటూ బోరున విలపించినా సిబ్బంది కనికరం చూపలేదు. ● కురుకుంటకు చెందిన సురేష్ సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అతడిని సిటీ స్కాన్ రూముకు తీసుకెళ్లేందుకు ఎంఎన్ఓలు అందుబాటులో లేరు. దీంతో కుటుంబీకులు, మిత్రులే సురేష్‌ను తరలించాల్సి వచ్చింది.పైగా స్ట్రెచర్‌కు చక్రం లేకపోవడంతో ఎత్తుకుని తీసుకెళ్లారు. -
మారణహోమాన్ని ఆపేందుకే జగనన్న రాక
రాప్తాడురూరల్: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ సభలో పాల్గొనేందుకు రావడం లేదు. చీమకు కూడా హాని తలపెట్టని పేద రైతు కురుబ లింగమయ్యను హత్య చేస్తే ఆ కుటుంబానికి అండగా నిలవడానికి, మారణ హోమాన్ని ఆపేందుకు, జిల్లాలో మరో రాజకీయ హత్య జరగకూడదనే సందేశం ఇవ్వడానికి వస్తున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాపిరెడ్డిపల్లికి వస్తున్న నేపథ్యంలో సోమవారం తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి కుంటిమద్ది మీదుగా పాపిరెడ్డిపల్లి చేరుకుంటారన్నారు. ఇటీవల హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడతారని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని వెల్లడించారు. ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొడదాం జిల్లాలో ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టాలనుకునే విజ్ఞులు, భవిష్యత్తు బాగుండాలని కోరుకునే యువత, రాప్తాడు నియోజకవర్గ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మేల్కోవాలని ప్రకాష్ రెడ్డి కోరారు. కుట్ర, హత్యా రాజకీయాలు కలగలిసి ప్రభుత్వ మద్దతుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘నడుచు కుంటూ వస్తారో... సైకిల్, బైకు, ట్రాక్టర్, ఆటోల్లో వస్తారో మీ ఇష్టం. మీరు రావాలి. వస్తేనే జిల్లా నుంచి ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టగలం అనే విషయం గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో శాంతి కుసుమాలు మనందరం అభివృద్ధిని కాంక్షిస్తున్నామని, గత ఐదేళ్లూ జగనన్న సంక్షేమాన్ని చూశామని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న హయాంలో శాంతి కుసుమాలు ఎలా వికసించాయో అందరూ చూశారన్నారు. ఒక గొడవ కాని, హత్యకాని జరగకుండా ఐదేళ్లు పరిపాలన సాగించారన్నారు. ‘కూటమి’ అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి మారణకాండను ఆపుదామా.. ఆపుదామంటే అందరూ వచ్చి జగనన్నకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ‘ఎవరో కాకమ్మ కథలు చెబుతుంటారు, కుట్రలతో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని, ‘పచ్చ’ మీడియాను ఉపయోగించుకుని జగన్మోహన్రెడ్డిపైనా, నాపైనా దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ఇక్కడ బతకాల్సింది నువ్వు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుకోవాల్సింది నువ్వు. అది నీ బాధ్యత. ఆ బాధ్యతను నిలబెట్టుకోవడానికి మంగళవారం ఉదయం 9 గంటలకు కుంటిమద్ది గ్రామానికి రావాలి’ అని ఆయన పేర్కొన్నారు. శాంతిస్థాపనకు జగనన్నతో కలిసి కవాతు చేద్దామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, దుర్మార్గాలను జిల్లా ఓర్చదనే సందేశం ఇద్దామని, జిల్లాను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. చీమకు కూడా హాని తలపెట్టని కురుబ లింగమయ్యను హత్య చేశారు శాంతిస్థాపనకు జగనన్నతో కలిసి కవాతు చేద్దాం ప్రజలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు -
పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుగుణంగా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్ – డెమో ప్యాసింజర్) రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే డెమో రైళ్లలో ఎలాంటి మౌలిక
●డెమో ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికుల బేజారు ●మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ●జనరల్ బోగీలతో నడపాలని ప్రయాణికుల డిమాండ్ డెమో రైలులో ప్రయాణిస్తున్న దృశ్యం గుంతకల్లు: డివిజన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుంతకల్లు–హిందూపురం (77213/14), గుంతకల్లు–రాయచూర్ (77201/02), గుంతకల్లు–డోన్ (77203/04), డోన్–గుత్తి (77205/06), నంద్యాల–రేణిగుంట (77212/11), కర్నూలు సిటీ–నంద్యాల (77209/10) మధ్య నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లలో రాయలసీమ జిల్లా వాసులు తక్కువ ధరతో ప్రయాణం చేయాడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. దీంతో మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతా ప్రయాణికులు ఈ రైళ్ల వైపు మెగ్గు చూపారు. మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వసతులు కరువు హైదరాబాదు, బెంగుళూరు తదితర నగరాల్లో నడుతుపున్న ఎంఎంటీఎస్ రైళ్ల (డెమో)ను రైల్వేశాఖ సాధారణ ప్రయాణికుల కోసం గుంతకల్లు డివిజన్లోపి పలు ప్రాంతాల నుంచి నడుపుతోంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకపోవడంతో పాటు సమయానికి నిర్దేశించిన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో సిటీ ప్రజలు ఎక్కువగా ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వెళ్లడానికి 5 నిమిషాల సమయం కూడ పట్టదు. 700ల మంది కూర్చొని, మరో వెయ్యి మందికి పైగా నిల్చోని ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది. దీంతో ఈ రైళ్లలోని బోగీల్లో టాయిలెట్లు, నీటి వసతి అనేవి ఉండవు. గుంతకల్లు–హిందూపురం మధ్య నడస్తున్న డెమో ప్యాసింజర్ రైలు దాదాపు 200 కి.మీ.లు ప్రయాణించాల్సి ఉంది. గుంతకల్లు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన రైలు హిందూపురానికి రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులు టాయిలెట్‌కు వెళ్లాలంటే వీలుపడదు. బోగీల్లో టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి వృద్దులు, మహిళలు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో నిలబడిన వెంటనే రైలు దిగి టాయిలెట్ల వైపు పరుగు తీస్తున్నారు. ఈ లోపు రైలు వెళ్లిపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైలు మిస్ అయిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్లతో గొడవకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్యాసింజర్లు అంటే చులకన... పేదోడి రైళ్లు (ప్యాసింజర్) అంటే రైల్వేశాఖకు చులకనై పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడ్స్ రైళ్లపై ఉన్న శ్రధ్ద ప్యాసింజర్ రైళ్లపై లేదని విమర్శిస్తున్నారు. గుంతకల్లు–గుత్తి. గుత్తి–ధర్మవరం మధ్య డబుల్‌లైన్ పూర్తయింది. ఈ మార్గంలో ఒకేసారి రెండు రైళ్ల పరుగులు పెడుతాయి. అయితే గూడ్స్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్న సమయంలో డెమో రైళ్లను ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేస్తున్నారు. దీంతో ఈ రైళ్లు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి ఎండలకు రైళ్లలో ఉక్కపోతకు చిన్నారులు, వృద్దులు తాళలేకపోతున్నారు. -
పొలాల్లో రేషన్ బియ్యం డంప్
పామిడి: మండలంలోని తంబళ్లపల్లి గ్రామ పొలాల్లో కొందరు అక్రమార్కులు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని డంప్ చేశారు. పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని కొందరు యథేచ్ఛగా నల్లబజారులో అధిక ధరతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి గ్రామంలోని పాత గంగమ్మ గుడి సమీపంలోని పొలాల్లో సోమవారం నాటికి 70 బస్తాల బియ్యాన్ని కొందరు గుట్టు చప్పుడు కాకుండా డంప్ చేశారు. కొన్ని రోజులుగా ఆటోలో బియ్యాన్ని తీసుకువచ్చి అక్కడ డంప్ చేస్తున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
తప్పుడు కేసులతో ప్రాణాలు తీస్తున్నారు
కళ్యాణదుర్గం: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారని పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య విమర్శించారు. టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు బనాయించడంతో ఆవేదనకు గురై గుండెపోటుతో కళ్యాణదుర్గం మండలం శీబావికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చాకలి రామాంజనేయులు ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలో రామాంజనేయులు మృతదేహానికి సోమవారం పార్టీ నేతలతో కలిసి రంగయ్య నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. పోలీసులు ఏకపక్షంగా అక్రమ కేసు బనాయించడంతోనే చాకలి రామాంజనేయులు మృతి చెందాడన్నారు. వీటిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్సీ బోయ మంగమ్మ మాట్లాడుతూ శీబావిలో ఎన్నడూ లేని సంస్కృతి తీసుకువచ్చారన్నారు.ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేసేవాళ్లమని, కానీ నేడు కక్షలు పెంచుకుని అమాయకుల ప్రాణాలతో టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రామాంజనేయులు కుటుంబాన్ని వీధి పాలు చేశారని, ఆయన భార్య, పిల్లలకు ఎవరు దిక్కని వాపోయారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ చాకలి రామాంజనేయులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. కళ్యాణదుర్గం రూరల్ సీఐ వంశీకృష్ణ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నాయకులు నారాయణపురం వెంకటేశులు, నరేంద్రరెడ్డి, మండల కన్వీనర్ గోళ్ల సూరి, చంద్రశేఖర్‌రెడ్డి, సర్వోత్తమ, గోపాల్, సూరప్ప, ఆంజనేయులు, పాతలింగ, మల్లి, మురళి తదితరులు పాల్గొన్నారు. -
మచ్చుకు కొన్ని....
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ ఆదేశాలను ఎమ్మెల్యేలు కనీసంగానూ లెక్క చేయడం లేదు. ‘సర్కారుది ఒకదారైతే... మాది మరోదారి’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా వారికి పట్టడం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో వెలుగుచూసిన ఓ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఒక వైపు ప్రభుత్వమేమో రేషన్ బండ్ల (ఎండీయూ) ద్వారా బియ్యం, సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశిస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఎండీయూలు తిరగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. భయంతో కొందరు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తప్పడు లెక్కలతో నివేదిక.. ఎండీయూలు కదలకుండా ఉంటున్నా.. ప్రతి నెలావాటి ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వానికి అధికారులు తప్పుడు లెక్కలతో నివేదికలు పంపిస్తున్నట్లు తెలిసింది.జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 405 ఎండీయూలు ఉన్నాయి. వీటిలో 297 వాహనాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు, 27 తాత్కాలికంగా పనిచేస్తున్నట్లు, 81 వాహనాలు పనిచేయడం లేదంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ క్రమంలో ఒక్కో వాహనానికి రూ.21 వేల లెక్కన 324 వాహనాలకు ప్రతి నెలా రూ.68.04 లక్షలు వేతనం కింద విడుదలవుతుండటం గమనార్హం. వాస్తవంగా 405 వాహనాలకు గానూ క్షేత్రస్థాయిలో 30 ఎండీయూలకు మించి పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. దీన్ని బట్టి తిరగని వాహనాలకూ వేతనం చెల్లిస్తుండడం అవినీతిలో మరో కోణం! ● అనంతపురం అర్బన్‌లో 39 ఎండీయూలు ఉంటే 35 పూర్తిస్థాయిలో, ఒకటి తాత్కాలికంగా పనిచేస్తున్నాయని, మూడు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అనంతపురం అర్బన్ పరిధిలో రెండు, మూడు తప్ప మిగిలినవి తిరగడం లేదు. వాటిని కూడా ఒకట్రెండు రోజులు మాత్రమే తిప్పుతున్నారు. ● అనంతపురం రూరల్ పరిధిలో 20 ఎండీయూలు ఉంటే 18 పూర్తిస్థాయిలో, ఒకటి తాత్కాలికంగా పనిచేస్తుండగా, ఒకటి పనిచేయడం లేదు. అయితే అధికారుల ఒత్తిడితో రెండు, మూడు వాహనాలు ఒకట్రెండు రోజులు మొక్కుబడిగా తిప్పుతున్నారు. ● గుత్తిలో 16 ఎండీయూలు ఉండగా అన్ని వాహనాలు తిరుగుతున్నట్లు అధికారిక నివేదిక చెబుతోంది. అదే విధంగా పామిడి మండలంలో 11 ఎండీయూలు ఉంటే అన్నీ తిరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ● కణేకల్లు మండలంలో 11 వాహనాలు ఉంటే 11 తిరుగుతున్నట్లు, గుమ్మఘట్టలో 10 ఎండీయూలు ఉంటే 10 తిరుగుతున్నట్లు, డి.హీరేహాళ్‌లో 9 ఉంటే అన్నింటి ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావాల్సినంత నొక్కడానికే... ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు పాత డీలర్లను తొలగించి తమ పార్టీ వారిని నియమించారు. ఈ క్రమంలో ఎండీయూల ద్వారా అయితే రేషన్ సరుకుల నొక్కుడుకు అవకాశం ఉండదనే ఆలోచనతో డీలర్లు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనం ద్వారా పంపిణీ చేస్తే బియ్యం, కందిపప్పు, చక్కెర నొక్కేసేందుకు వీలుండదు. కోటా మేరకు వాహన నిర్వాహకుడికి సరుకులు అప్పగించాలి. అదే స్టోర్ ద్వారా అయితే తూకంలో మోసం చేసి రెండుమూడు కిలోల బియ్యం తక్కువగా, ఇక మిగతా సరుకులు ఇవ్వకుండా మిగుల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నొక్కుడు కోసమే ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ చేయకుండా ఎమ్మెల్యేల ద్వారా అధికారులపై డీలర్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై డీఎస్ఓ (జిల్లా పౌర సరఫరాల అధికారి) జగన్మోహన్ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
నేత్రపల్లి బీపీఎంపై వేటు
గుమ్మఘట్ట: మండలంలోని నేత్రపల్లి గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (బీపీఎం)గా పని చేస్తున్న సి.కె.జనార్దనరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు గుంతకల్లు పోస్టల్ అసి స్టెంట్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్ ఆదివారం వెల్లడించారు. కాగా, గ్రామంలోని తపాలశాఖ పరిధిలో రికరింగ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాల్లో పలు అవకతవకలకు పాల్పడినట్లుగా జనార్దనరావుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును వారి ఖాతాల్లోకి జమ చేయని అంశంపై ఇటీవల రాయదుర్గం మండలం 74ఉడేగోళం సబ్ పోస్టుమాస్టార్ నాగాబింక ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమికంగా చేపట్టిన విచారణలో అక్రమాలు బహిర్గతం కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జనార్దనరావు అక్రమాలపై లోతైన విచారణకు పోస్టల్ ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.చేతిలోని మొబైల్ లాక్కెళ్లిన దొంగరాప్తాడు రూరల్: చేతిలో మొబైల్ పట్టుకుని చూస్తుండగా ఓ యువకుడు లాక్కొని ఉడాయించిన ఘటన ఆదివారం సాయంత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... అనంతపురం రూరల్ మండలం కొడిమి పంచాయతీ దర్గాకొట్టాలుకు చెందిన జాఫర్ పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై ఆదివారం నగరానికి వచ్చిన ఆయన సాయంత్రం బళ్లారి రోడ్డు కూడలిలో ఆటో కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో ఫోన్ రింగ్ కావడంతో జేబులో నుంచి తీసి చూస్తుండగా రెప్పపాటులో ఓ యువకుడు లాక్కొని కళ్యాణదుర్గం రోడ్డు వైపుగా పరుగుతీశాడు. జాఫర్ తేరుకుని గట్టిగా కేకలు వేసినా లాభం లేకపోయింది. చీకట్లు ముసురుకుంటుండడంతో సెకన్లలోనే ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. ఇటీవలే రూ. 20 వేలు పెట్టి మొబైల్ కొనుగోలు చేశానని, ఇంతలో ఇలా జరిగిందంటూ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.హోరాహోరీగా రాతిదూలం పోటీలుపుట్లూరు: శ్రీరామనవమి సందర్భంగా పుట్లూరు మండలం రంగమనాయునిపల్లిలో ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉదయం ఆలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించారు. పోటీలను చూసేందుకు పుట్లూరు, యల్లనూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.విచ్చలవిడిగా మద్యం అమ్మకాలుబ్రహ్మసముద్రం : మండల వ్యాప్తంగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వేపులపర్తి గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. అయితే మండల వ్యాప్తంగా టీడీపీ నాయకులు 30 గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో మద్యం సరఫరా చేస్తూ.. 50కి పైగా బెల్టు షాప్‌లు నడుపుతున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. మండల కేంద్రంలో అయితే ఏకంగా పాత తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే మద్యం విక్రయాలు చేపట్టి, అక్కడే తాగేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణం ఓ బార్లా మారింది. ఎటుచూసిన తాగి పడేసిన మద్యం బాటిళ్లే కనిపిస్తున్నాయి. అదే తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి నీటిని తీసుకెళ్లేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టి చేతులు తడుపుకునే అధికారులు.. పాత తహసీల్దార్ కార్యాలయం వైపుగా కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. -
13 నుంచి రత్నగిరిలో బ్రహ్మోత్సవాలు
రొళ్ల: మండలంలోని రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజవంశీకుడు రంగప్పరాజు (దొర), ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ ఆలయానికి దాదాపు 628 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. రాజవంశీకులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు, సమీపంలోని కర్ణాటక వాసులు తమ ఇలవేల్పుగా అమ్మవారిని కొలుస్తుంటారు. 13న జలధి ఉత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగ పూజ, 16 నుంచి 19వ తేదీ వరకు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతురాజు బండార కార్యక్రమం, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా పశువుల జాతరను నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాలకు వచ్చి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మడకశిర డిపోతో పాటు కర్నాటకలోని మధుగిరి, శిర, పావగడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. -
జగన్‌కు మద్దతుగా నిలుద్దాం
● కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడుబిల్లే మంజునాథ్ పిలుపుఅనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో కురుబలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లి అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుబలు మద్దతుగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని, వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు బిల్లే మంజునాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు ఇటీవల హత్య చేశారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని హతుడి కుమారుడు మీడియా ముందు బహిర్గతం చేశారని గుర్తు చేశారు. ఆ కుటుంబానికి కురుబలందరూ అండగా నిలవాలన్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్ జగన్ రానున్నారని, కురుబలు పెద్ద ఎత్తున పాపిరెడ్డిపల్లికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కురుబల మీద ఎలాంటి దాడులు జరగకుండా అందరూ ఐక్యంగా నిలవాలని కోరారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కురుబలు వైఎస్సార్సీపీకి పూర్తిస్థాయిలో మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకూడేరు: ఉత్తీర్ణతపై అనుమానంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం జయపురం గ్రామానికి చెందిన మదన్మోహన్, సునీత దంపతులకు కుమార్తె అర్చన (16), ఓ కుమారుడు ఉన్నారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అర్చన ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి చేరుకుంది. పరీక్షలు సక్రమంగా రాయలేకపోయానని, ఫెయిల్ అవుతానంటూ తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన అర్చన... ఆదివారం వేకువజామున ఇంట్లోనే బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.యువకుడి దుర్మరణంగుత్తి: ట్రాక్టర్ ట్రాలీ కింద చిక్కుకుని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రమణ, సుజాత దంపతుల చిన్న కుమారుడు విజయ్ రాఘవేంద్రగౌడ్ (19) ఆదివారం ఉదయం చెర్లోపల్లి గ్రామ సమీపంలో నుంచి ఎరువును తరలించేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ట్రాలీలోకి ఎరువు లోడు చేస్తుండగా హైడ్రాలిక్ లిఫ్ట్ పనితీరును పరిశీలించాడు. లిఫ్ట్ సక్రమంగా పనిచేయకపోవడంతో కిందకు సరి చేస్తుండగా ఉన్నఫళంగా ట్రాలీ కిందకు దిగింది. దీంతో ట్రాలీ కింద చిక్కుకున్న విజయ్రాఘవేంద్రను స్థానికులు గమనించి వెలికి తీసేలోపు మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వేమన ఉత్సవాలు ప్రారంభం
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో వెలసిన విశ్వకవి యోగి వేమన ఆలయంలో ఉత్సవాలు ఆదివారం రాత్రి ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి పూజలు చేశారు. కదిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఉడికించిన జొన్నలను భం పోసి పసుపు కుంకుమ కలిపి ఆదిశక్తి పూజలు నిర్వహించారు. అనంతరం జొన్న ధాన్యాన్ని ప్రసాదంగా భక్తులు స్వీకరించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా సోమవారం బండ్ల మెరవణి, ఆర్కెస్ట్రా (పాటల కచేరి) ఉంటుంది. మొక్కుబడి ఉన్న భక్తులు ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
గార్లదిన్నె: శ్రీరామనవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కల్లూరులో నిర్వహించిన గ్రామీణ క్రీడాపోటీలు ఉత్సాహంగా... ఉల్లాసంగా సాగాయి. అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆదివారం ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. 151 కిలోల ఇసుక మూట ఎత్తే పోటీల్లో పాల్తూరు రాజు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానంలో కల్లూరు సుధాకర్ నిలిచాడు. 146 కిలోల బరువున్న గుండును ఎత్తే పోటీల్లో మాధవరం రాజశేఖర్ మొదటి స్థానం, ప్యాపిలి మండలానికి చెందిన ఈశ్వరరెడ్డి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 60 కిలోల బరువున బండను ఒక్క చేతితో పైకి ఎత్తే పోటీల్లో మొదటి స్థానాన్ని హుస్సేన్ దక్కించుకోగా, రెండో స్థానంలో ఈశ్వరరెడ్డి నిలిచాడు. కర్ర సాము పోటీల్లో మొదటి స్థానంలో రాజేష్, రెండో స్థానంలో యాడికి నాగార్జున గెలుపొందారు.ఇరుసు పోటీల్లో మొదటి స్థానంలో నాగులాపురం వనేంద్ర, రెండవ స్థానంలో వంకరాజుకాలువ నరేష్ నిలిచారు. విజేతలను గ్రామస్తులు అభినందించి, నగదు పురస్కారాలతో సత్కరించారు. -
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
అనంతపురం: డిప్లొమా కోర్సులకు డిమాండ్ భారీగా నెలకొంది. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులకు ఆసక్తి ఉన్న ఏ కోర్సులోనైనా చేరి ఇష్టంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చిరుప్రాయంలోనే ఐదు అంకెల వేతనం.. పూర్తిగా ప్రాక్టికల్ ఓరియంటేడ్ సిలబస్ ఉన్న పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దీంతో 19 సంవత్సరాల్లోపే రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం అందుకునే అవకాశముంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య పూర్తి చేసే అవకాశం కేవలం డిప్లొమా కోర్సులతోనే సాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. సింహభాగం కంపెనీలు సైతం ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారి కంటే డిప్లొమా పూర్తి చేసిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిప్లొమా కోర్సుల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ తరువాత ఇంజినీరింగ్ కోర్సు చదివితే ఆరు సంవత్సరాల కాల వ్యవధి అనివార్యం. ఇలా కాకుండా కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం మూడేళ్లలో డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే కొలువు దక్కడం ఖాయమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కోర్ బ్రాంచ్లే అధికం.. ఇంజినీరింగ్‌లో కోర్ బ్రాంచ్‌ల్లో గణనీయంగా అడ్మిషన్లు పడిపోయి కొత్త బ్రాంచ్‌ల వైపు విద్యార్థులు చూస్తున్నాయి. కానీ డిప్లొమోలో కోర్ బ్రాంచ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి కోర్ బ్రాంచ్‌లతో పాటు కంప్యూటర్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా దక్కుతాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాలల్లో తరచూ ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో కోర్సు పూర్తి చేయడానికి మూడేళ్లకు కలిపి కేవలం రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ కింద) నేరుగా చేరవచ్చు. లేదా ఉద్యోగంలో చేరవచ్చు. పాలీసెట్ ఎంట్రెన్స్ ఇలా.. పాలీసెట్‌ను 120 మార్కులకు నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ నెల 30న పాలీసెట్ నిర్వహించనున్నారు. డిప్లొమా కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ నెల 30న పాలీసెట్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఉచిత శిక్షణ పాలీసెట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు. – సి.జయచంద్రారెడ్డి, పాలీసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, అనంతపురం -
రేపు జగన్ పర్యటన
● పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ రామగిరి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం నాటి జిల్లా పర్యటన ఖరారైంది. రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులైన టీడీపీ నాయకుల చేతిలో దారుణహత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రానున్నారు. పర్యటన షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గాన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడ వైఎస్సార్సీపీ నాయకులతో కలసి 10.50 గంటలకు రోడ్డు మార్గాన ఎన్ఎస్ గేట్ మీదుగా బయల్దేరి 11.05 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుంటారు. 12.05 గంటల వరకు లింగమయ్య కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ధైర్యం చెప్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి కాన్వాయ్‌లో చెన్నేకొత్తపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.30 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయల్దేరుతారు. ఆలూరు కోనలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం తాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భూనీల సమేత శేష తల్ప రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురార్పణ, ధ్వజారోహణము, కలశస్థాపన, దీక్షా హోమంతో ఉత్సవాలను ప్రారంభించారు. పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సింహవాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు.