సాక్షి, ముంబై: నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే విజిటర్లతో కిటకిటలాడే మంత్రాలయ భవనం ఎన్నికల పుణ్యమా అని బోసిపోయి కనిపిస్తోంది. మంత్రులు తమతమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలు, రోడ్ షోలు తదితర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మంత్రాలయలో పనిచేసే అనేక మంది సిబ్బంది ఎన్నికల పనులకు వెళ్లిపోయారు. దీంతో క్లర్క్‌లు, ప్యూన్లు, చిన్న చితక ఉద్యోగులు మాత్రమే దర్శనమిస్తున్నారు. వీరివల్ల ఎలాంటి పనులు జరగకపోవడంతో ప్రజలు మంత్రాలయ ఛాయలకు రావడం మానుకున్నారు.
ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌లో బదిలీలు, పాఠశాలల అడ్మిషన్ల కోసం పైరవీలు, వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే విజిటర్ల తాకిడి ఎక్కువ శాతం ఉంటుంది. కాని ఎన్నికల కారణంగా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మంత్రులు, వారి కార్యదర్శులు, సంబంధిత అధికారులు మంత్రాలయ ఛాయలకు రాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో పెండింగు ఫైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌తోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైంది.
మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత ఉన్నతాధికారులు లేకపోవడంతో వారి కింద పనిచేసే ఉద్యోగులు కూడా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సెలవులపై వెళుతున్నారు. దీంతో వివిధ పనుల నిమిత్తం గంపెడాశతో మంత్రాలయకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఈ పరిస్థితి లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే శాసన సభ ఎన్నికల తంతు పూర్తయ్యేంత వరకు తప్పదేమోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు రాకపోవడంతో విజిటర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో మంత్రాలయ ప్రవేశ ద్వారాల వద్ద వాహనాలను తనిఖీకి ఏర్పాటుచేసిన భద్రతా సిబ్బందిని సైతం తగ్గించారు.
మంత్రాలయ మూగబోయింది..
Published Thu, Apr 10 2014 11:27 PM | Last Updated on Tue, Oct 9 2018 3:56 PM
Advertisement
Advertisement