
దేశంలో 70శాతం అమ్మకాలను ప్రభావితం చేస్తున్న డిస్కౌంట్‌లు
పండుగ ఆఫర్లు, డీల్స్ కోసం కొనుగోలుదారుల ఎదురుచూపులు
ఫెస్టివల్ సీజన్ ఆఫర్లు ప్రకటించినప్పుడు విపరీతంగా సేల్స్
2024లో పండుగ సీజన్లలోనే రూ.4.25 లక్షల కోట్ల కొనుగోళ్లు
ఆన్‌లైన్ షాపింగ్ పైనే ఎక్కువగా ఆసక్తి
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా
సాక్షి, అమరావతి: డిస్కౌంట్.. కొద్దికాలంగా భారతీయులను అత్యంత ఎక్కువగా ఆకర్షించే పదం ఇది. గతంలో కంటే ఎక్కువగా వినియోగదారులు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పండుగ సీజన్లలో ఇచ్చే డిస్కౌంట్ల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో 70 శాతానికి పైగా అమ్మకాలు డిస్కౌంట్ల వల్లే జరుగుతున్నాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్, గృహోపకరణ వస్తువులను 50 శాతానికిపైగా డిస్కౌంట్ ఉన్నప్పుడే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.
ఇలా 2024 పండుగ సీజన్లలోనే రూ.4.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగుల సీజన్లలో కొనుగోళ్లు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని, ఆ సమయంలో వివిధ బ్రాండ్లు ఇచ్చే డిస్కౌంట్లు, చేసే ప్రమోషన్లు కొనుగోళ్లను బాగా ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది.
మొబైల్ షాపింగ్‌కి పెరుగుతున్న ఆదరణ
ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ మొబైల్ షాపింగ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ–కామర్స్ అమ్మకాలు పెరగడంలో మొబైల్ షాపింగ్ ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ అమ్మకాల్లో 50 శాతం మొబైల్ షాపింగ్ ద్వారానే జరుగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ అమ్మకాల్లో ముందున్నాయి. ఇలాంటి సంస్థలు సోషల్ మీడియా ద్వారానే వినియోగదారులకు దగ్గరవుతున్నాయి. వారి అభిరుచులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ అన్ని రకాల వస్తువుల అమ్మకాలను పెంచుకుంటున్నాయి.
ఆన్‌లైన్ షాపింగ్‌కే ఓటు..
గతంలో మాదిరిగా షాపులకు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని ఆఫర్లు ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. డిస్కౌంట్‌తోపాటు డోర్ డెలివరీ అనేది కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోందని తెలిపింది.
ప్రజల అభిరుచి మేరకు వివిధ రకాల వస్తువులను అందించే ఆన్‌లైన్ స్టోర్‌లు, పోర్టల్స్ పెరిగిపోయాయి. రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు అన్ని రకాల ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.
ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు పెరగడం వెనుక పండుగ షాపింగ్ అత్యంత కీలకంగా ఉంటోంది. సెలవుల సీజన్లలో వివిధ కంపెనీలు తరచూ కొత్త వాటితోపాటు పాత స్టాకుపై గణనీయమైన తగ్గింపులను ఇస్తున్నాయి. క్యాష్ బ్యాక్ డీల్స్, బై వన్– గెట్ వన్, బై టు–గెట్ త్రీ వంటి ఆఫర్లతో అదనపు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’, మింత్రాలో ‘ఫ్లాష్ సేల్స్‘, అమెజాన్‌లో ‘గ్రేట్ ఫెస్టివ్ సేల్‘ వంటి పేర్లతో విస్తృతంగా అమ్మకాలు చేపడుతున్నాయి. ఇలాంటి సంస్థల మార్కెటింగ్ వ్యూహాలు అమ్మకాల పెరుగుదలకు బాగా దోహదం చేస్తున్నాయి. దేశంలోని సంస్కృతి, సంప్రదాదాలు, సెలవు రోజులు, ప్రజల మూడ్‌కు అనుగుణంగా భారతీయులకు దగ్గరవుతూ అమ్మకాలను ఈ సంస్థలు రోజురోజుకూ పెంచుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment