ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్‌ మోసాలు | Most cyber frauds in the name of e commerce jobs | Sakshi
Sakshi News home page

ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్‌ మోసాలు

Published Sun, Dec 17 2023 5:55 AM | Last Updated on Sun, Dec 17 2023 5:55 AM

Most cyber frauds in the name of e commerce jobs - Sakshi

సాక్షి, అమరావతి: ఈ–కామర్స్‌లో విక్రయాలు, ఉద్యోగాలు.. దేశంలో సైబర్‌ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. సైబర్‌ నేరాల్లో ఈ రెండే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ అభిరుచి, ఉద్యోగాల కోసం యువత ప్రయత్నాలను ఆసరా చేసుకుని సైబర్‌ ముఠాలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణవాసులను లక్ష్యంగా చేసుకునే ఈ ముఠాలు చెలరేగుతున్నాయని ప్రముఖ మార్కెటింగ్‌ రిసెర్చ్‌ సంస్థ ‘యు గవ్‌’ సర్వేలో వెల్లడైంది. ఆన్‌లైన్‌ మోసాలపై ఈ ఏడాది నవంబరులో దేశంలో 180 నగరాలు, పట్టణాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. సర్వేలోని ప్రధానాంశాలు.. 

♦ దేశంలో సైబర్‌ ఆర్థి క నేరాలు భారీగా పెరుగుతున్నాయి. 2022లో మోసాలకంటే ఈ ఏడాది (2023లో) ఇప్పటికే ఈ మోసాలు రెట్టింపయ్యాయి. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం 2023 నవంబర్‌నాటికే దేశంలో రూ.5,574 కోట్లు కొల్లగొట్టారు. 2022లో రూ.2,296కోట్లు కొల్లగొట్టారు.  
♦  దేశంలో జరిగిన సైబర్‌ నేరాల్లో ఈ–కామర్స్‌ పేరిట జరిగినవి 35 శాతం, ఉద్యోగావకాశాల పేరిట జరిగినవి 28శాతం. 
♦  ఫోన్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ రూపంలో సైబర్‌ ముఠాలు వారానికి ఓసారి అయినా ప్రయత్నిస్తున్నాయని 54 శాతం మంది చెప్పారు. రోజూ అటువంటి మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ వస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు. 
♦  సైబర్‌ నేరాల బారిన పడి మోసపోయామని 20 శాతం మంది చెప్పారు. స్నేహితులు, పరిచయస్తులు ఆన్‌లైన్‌ మోసాలతో నష్టపోయారని 47 శాతం మంది తెలిపారు. 
♦  సైబర్‌ మోసగాళ్ల బాధితుల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుషుల్లో 35 శాతం, అలాగే ప్రతి వంద మంది మహిళల్లో 24 శాతం వారు ఆన్‌లైన్‌ మోసానికి గురైనట్లు వెల్లడించారు. 
♦ దేశంలో సైబర్‌ నేరాల బాధితుల్లో అత్యధికంగా 23 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల ప్రజలు ఉన్నారు. 
♦  సైబర్‌ మోసాల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం సుముఖత చూపడం లేదు. 59 శాతం మంది వారు మోసపోయినప్పటికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.  
♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. 
♦ సైబర్‌ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్న వారిలో 69 శాతం మంది వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించడంలేదు. 59 శాతం మంది అనుమానాస్పద ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్స్‌ బ్లాక్‌ చేస్తున్నారు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలేదు. 47 శాతం మంది తెలియని వారికి వస్తువుల కొనుగోలు ఇతరత్రా వ్యవహారాల పేరిట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయడంలేదు.  ఈ జాగ్రత్తలతో వారు సైబర్‌ నేరగాళ్ల వల నుంచి తప్పించుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement