మొత్తం 7ట్యాక్స్‌శ్లాబులతో మధ్యతరగతి ప్రజలకు ఊరట
న్యూటాక్స్ విధానంలో ట్యాక్స్ శ్లాబుల్లో భారీ మార్పులు
ఈ మార్పులతో రూ.12 లక్షల ఆదాయం వారికి రూ.80,000 తగ్గనున్న పన్ను భారం
రూ.18 లక్షల వారికి రూ.70,000, రూ.25 లక్షల పైన ఉన్న వారికి రూ.1.10 లక్షల పన్ను ప్రయోజనం
సీనియర్ సిటిజన్స్ వడ్డీ టీడీఎస్ పరిమితినిరూ.50,000 నుంచి లక్షకు పెంపు
టీడీఎస్, టీసీఎస్‌లో భారీ మార్పులు..ఇక నుంచి పాన్ లేని వారికే భారీ టీడీఎస్ వర్తింపు
పాత ఆదాయ పన్ను చట్టం స్థానంలో త్వరలోపార్లమెంటులో సరళమైన పన్ను చట్టం
వచ్చేవారం పార్లమెంటుకు సమర్పిస్తామన్నఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్
రూ.12.75 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు
ట్యాక్స్ రిబేట్ పరిధి రూ.7 లక్షల నుంచి12 లక్షలకు పెంపు
దీనికి స్టాండర్డ్‌డిడక్షన్ రూ.75,000 అదనం
ఇకపై వార్షికాదాయం రూ. 24లక్షలుదాటితేనే 30శాతం పన్ను పరిధిలోకి..
(సాక్షి, అమరావతి) : ఏడాదికి వచ్చే ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా రూ.7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచటం ద్వారా... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుకనిచ్చారు. మేమంతా ‘లక్కీ భాస్కర్’లమే అని మధ్య తరగతి వేతన జీవులు సంబరపడేలా తాజా బడ్జెట్లో ప్రతిపా దనలు చేశారు. ఈ రకంగా చూస్తే.. ఏడాదికి రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది.
దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000ను కూడా కలిపితే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదా యం రూ.12.75 లక్షలకన్నా ఒక్క రూపాయి పెరిగినా... వారు వివిధ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పైపెచ్చు ఇది వ్యక్తులు జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి రూ.12 లక్షల లోపు ఉన్నా... మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట!!.
శనివారం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి... త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజీగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా పన్నుల శ్లాబులను మరింత సరళతరం చేస్తూ... అత్యధిక పన్నురేటు30 శాతాన్ని ఇప్పటి దాకా రూ.15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా... ఇకపై దాన్ని రూ.24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్‌కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85 శాతానికి పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక కొత్త పన్ను చట్టం
ఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహరుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది.
కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపు దారుల ఇష్టమని మొదట్లో చెప్పినా... ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా... పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహ పరిచలేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో... ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ... దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల.
వచ్చే వారం పార్లమెంటులో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పటం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వటంతో.... ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయటం, బిల్లులు చూపించటం వంటివి తప్పిపోతాయి.
నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే.... దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.
రూ.80వేల నుంచి రూ.1.10 లక్షల దాకా లాభం
కొత్త పన్ను (2025–26 నుంచి అమలు) విధానం ప్రకారం... మినహాయింపు పరిమితిని రూ.7 నుంచి 12 లక్షలకు పెంచటమే కాదు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న బేసిక్ లిమిట్‌ను రూ.4 లక్షలకు పెంచారు. దాంతో పాటు ప్రతి 4 లక్షలకు ఒక శ్లాబు రేటు చొప్పున మొత్తం 7 శ్లాబులను ప్రవేశపెట్టారు. దీంతో రూ.24 లక్షల లోపు ఆదాయానికి 30% పన్ను వర్తించదు.
గతంలో 15 లక్షలు దాటితే 30% పన్ను రేటు చెల్లించాల్సి వచ్చేది. అలాగే రూ.20–24 లక్షల ఆదాయం ఉన్న వారికి 25% పేరుతో కొత్త శ్లాబు రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80,000, రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70,000, రూ.25 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.
సీనియర్ సిటిజన్లకు ఊరట
వడ్డీ ఆదాయంగా జీవించే సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీడీఎస్ అంటే మూలం దగ్గర చెల్లించే పన్ను. అంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గనక పరిమితిని దాటితే అందులో 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కట్ చేస్తాయి.
ప్రస్తుతం ఈ వడ్డీఆదాయం టీడీఎస్ పరిమితి రూ.50,000. ఇకపై దీన్ని రూ.లక్ష చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.
ఇంటద్దె రూపంలో వచ్చే వార్షికాదాయం గనక రూ.2.4 లక్షలు దాటితే ఇప్పటిదాకా టీడీఎస్‌చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు.
బీమా కమీషన్లపై టీడీఎస్ రేటును 5 నుంచి 2 శాతానికి తగ్గించారు
రెమిటెన్స్‌లపై విధించే టాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు... విదేశీ విద్యకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చేసే రెమిటెన్స్‌లై టీసీఎస్‌ను ఎత్తివేస్తు్తన్నట్లు ప్రకటించారు.
ఇక నుంచి అధిక టీడీఎస్‌ను కేవలం పాన్ నెంబర్ లేని కేసులకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. తప్పుగా ఆదాయం చూపించిన రిటర్నులు సవరించుకునే కాలపరిమితిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. నాలుగేళ్లలోపు స్వచ్ఛందంగా అధిక పన్ను చెల్లించడం ద్వారా సవరించిన రిటర్నులు తిరిగి దాఖలు చేసుకోవచ్చు.
రూ.12.75 లక్షలకుఒక్క రూపాయి మించినా..
నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో... చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని.
అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిఉంటుంది.
ఉదాహరణకు...
మీ వార్షిక వేతనం రూ.12.80 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. కాబట్టి మీ వేతనం నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా... మిగిలిన రూ.12.05 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే... దీన్లో రూ.4 లక్షలవరకూ జీరో... రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు, రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు, మిగిలిన 5వేలపై 15 శాతం... అంటే రూ.750. మొత్తంగా రూ.60,750 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అంటే... రూ.12.75 లక్షలకన్నా 5వేలు ఎక్కువ ఉన్నందుకు రూ.60,750 పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే 12.75 లక్షల లోపుంటే... రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదీ లెక్క.
ఇది మరిచిపోకండి...
జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇంటద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈ సారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు.
వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం రూ.12.75 లక్షల లోపున్నా సరే... మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా రూ.12.75 లక్షల లోపున్నా సరే... వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment