ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఏపీకి అన్యాయం
నెగ్గిన నితీశ్ మాట.. బిహార్‌కు భారీగా కేటాయింపులు
విభజన హామీలు నీటి మూటలేనని మరోమారు తేటతెల్లం
గోదావరి– బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు మాటేదీ?
వెనుకబడిన జిల్లాలకు కేటాయింపుల ప్రస్తావనే లేదు
అమరావతికి గతంలో ఇచ్చిన అప్పులతోనే సరి.. పెట్రోలియం, గిరిజన, సెంట్రల్ వర్సిటీలకు ప్రత్యేక కేటాయింపుల్లేవు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు, కేటాయింపులు చేయించుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. శనివారం ప్రవేశపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్‌లో తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న పద్యం తప్ప ఏపీకి సంబంధించి ఒక్క ప్రకటనా వినిపించలేదు. గత బడ్జెట్ తరహాలోనే ఈసారి బడ్జెట్‌లో కూడా బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో నిధుల వర్షం కురిపించారు.
గత బడ్జెట్‌లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల అప్పులు సాధించడం తప్ప.. ఈసారి బడ్జెట్‌లోనూ కూటమి పెద్దలు కొత్తగా కేటాయింపులు చేయించుకోలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల డిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కోరారు. గోదావరి– బనకచర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నదుల అనుసంధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పగా, కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు.
అయితే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు గురించి గానీ, ప్రత్యేక సాయం గురించి గానీ నిర్మలా సీతారామన్ ప్రస్తావనే చేయలేదు. గతంలో పోలవరానికి ఇస్తామని అంగీకరించిన నిధులనే ఈసారి బడ్జెట్‌లో పేర్కొన్నారు తప్ప కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందింది.
ఏ మేలూ లేని బడ్జెట్‌పై పొగడ్తలా?
అమరావతి రాజధానికి అప్పులే తప్ప కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు, ప్రత్యేక సాయాన్ని తెచ్చుకోలేకపోయింది. పైగా గత బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి మాట మాత్రంగానైనా చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో అసలు వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి గానీ, కేటాయింపుల గురించి గానీ పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయకుండా దేశం మొత్తం కేటాయింపుల్లో కలిపి చూపడం గమనార్హం. పెట్రోలియం యూనివర్సిటీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు.
గత బడ్జెట్‌లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈసారి బడ్జెట్‌లో అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు. బీహార్‌కు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కొత్తగా ప్రకటించక పోవడం, విభజన చట్టంలోని అంశాలకు కూడా కేటాయింపులు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశీ సాయంతో కొనసాగుతున్న విద్య, వైద్య, జీవనోపాధి ప్రాజెక్టులకు కేటాయింపులు చూపెట్టారు తప్ప కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయలేదు.
కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ ఆర్థిక ఏడాది కన్నా వచ్చే ఆర్థిక ఏడాది పెరగనున్నట్లు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.52,080 కోట్లు రానున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.57,566 కోట్లుగా పేర్కొన్నారు. ఏ రీతినా చూసినా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయని ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించడం విస్తుగొలుపుతోంది.
గురజాడ మాట తప్ప..ఏపీ ప్రస్తావనేది?
‘తెలుగు మహాకవి, నాటక రచయిత గురజాడ అప్పారావు.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. అని అన్నారు. దేశం అంటే దాని నేల మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రజలని అర్థం. అందుకు అనుగుణంగా వికసిత్ భారత్ ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం మినహా తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క ప్రాజెక్టూ ప్రకటించలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి అదనపు సాయం మాటే లేదు.
గత ఏడాది జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తాం. అందులో భాగంగా 2024–25లో రూ.15 వేల కోట్లు, తర్వాతి సంవత్సరాల్లో అదనపు మొత్తాలను అందజేస్తాం’ అని చెప్పారు. అయితే అందుకు కొనసాగింపుగా ఈ బడ్జెట్‌లో నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు.
విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌లో, హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్ నోడ్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు గురించి ఒక్కమాట చెప్పలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిహార్‌కు మాత్రం భారీ కేటాయింపులు చేసింది. జల్ జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు.
ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్
ప్రధాని మోదీ సారథ్యంలో ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. మోదీ సారథ్యంలోని వికసిత్ భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపునిస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా.
– ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరిస్తుంది
కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడం, రూ.5,936 కోట్లు కేటాయించడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరందుతుంది. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది.
– కె.పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు
2025–26 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్ వల్లే కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో నిలబడగలుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చుకొంటే.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. బిహార్ ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలి. రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచి్చన హామీలు, బడ్జెట్‌లో చేసిన అన్యాయంపై పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తాం.
– పీవీ మిథున్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత
కూటమి చేతకానితనం వల్లే అన్యాయం
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఓ పక్క బిహార్‌కు కేంద్రం అనే కానేక వరాలు ప్రకటిస్తే.. ఏపీకి చంద్రబాబు ఒక్క వరమూ పొందలేకపోయారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీల చేతకాని తనమే. ఏపీకి కేంద్రం ఎప్పుడో ప్రకటించిన వాటిని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.
– మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment