కేంద్ర కొత్త బడ్జెట్-2025 (Union Budget 2025) మన ముందుకు వచ్చేందుకు ఇక కొన్ని రోజులే ఉన్నాయి. ఇదిలా ఉంటే పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానానికి సంబంధించి రెండు పెద్ద ప్రకటనలు చేయనున్నారు. కొత్త పన్ను విధానంలో మినహాయింపుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇచ్చే ప్రణాళిక ఇది. అలాగే ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చేసి వారి ఖర్చు సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యం.
ఆయా వర్గాల సమాచారం నిజమైతే.. ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయవచ్చు. కానీ ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, మినహాయింపు పరిధిని పెంచవచ్చు. మొదటి ప్రయోజనం స్టాండర్డ్ డిడక్షన్‌లో కాగా, రెండోది రూ.15-20 లక్షల పన్ను శ్లాబ్‌లో ఉన్నవారికి ఇవ్వవచ్చు.
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు?
కొత్త పన్ను విధానంలో ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.75,000 లుగా ఉంది. మూలాల ప్రకారం.. ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచవచ్చు. గత బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50000 నుండి రూ. 75000కి పెంచింది. ఈ మార్పు జరిగితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో రూ.లక్ష వరకు పన్ను ఆదా అవకాశాన్ని పొందుతారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.
20% పన్ను శ్లాబ్ పరిధి పెంపు?
రెండవ పెద్ద శుభవార్త ఏమిటంటే.. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం 20% పన్ను స్లాబ్ పరిధిని పెంచవచ్చు. రూ. 12-15 లక్షల ఆదాయం ఉన్న వారిపై ఇప్పటి వరకు 20% పన్ను విధించేవారు. కానీ, ఇప్పుడు దాన్ని రూ.20 లక్షల ఆదాయానికి పెంచవచ్చు. ఈ మార్పు ముఖ్యంగా రూ.15-20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మార్పు మధ్య, అధిక ఆదాయ సమూహానికి చెందిన పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇదీ చదవండి: బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
పీఎంవోదే తుది నిర్ణయం
2025 బడ్జెట్‌లో పన్ను సంబంధిత మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం పీఎంవో తీసుకుంటుంది. దీనికి సంబంధించిన నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత పన్ను విధానాన్ని ఉపసంహరించుకునేందుకు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిధిని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో ఉంది.
ఆర్థిక లోటును తగ్గించడమే సవాలు
దేశ సార్వత్రిక బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తి బడ్జెట్. ఆర్థిక లోటును అదుపులో ఉంచుకోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉంటుందని పెద్ద ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు లక్ష్యం 4.9%. దీనిని 2026 నాటికి 4.5% కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment