సాక్షి, హైదరాబాద్: భారత్ ఆన్‌లైన్ షాపింగ్, ఈ–కామర్స్ మార్కెటింగ్‌లో ద్వితీయశ్రేణి, అంతకంటే తక్కువస్థాయి పట్టణాలు కూడా సత్తా చాటుతున్నాయి. మెట్రో నగరాలకు ఏమాత్రం తగ్గకుండా కొన్ని సందర్భాల్లో అగ్రశ్రేణి నగరాల కంటే కూడా చిన్న నగరాల్లోని వినియోగదారులు ఆన్‌లైన్ కొనుగోళ్లలో ముందుంటున్నాయి. ఆన్‌లైన్ షాపర్స్ ఏడాదికి సగటున 149 గంటలు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ రిటైల్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి ప్రాధమ్యాలు, ప్రాధాన్యతలు, అలవాట్లు, షాపింగ్ చేసే పద్ధతులపై సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) అధ్యయనం నిర్వహించింది. కన్జూమర్ యాస్పిరేషన్ అండ్ ఈ–కామర్స్ ఇన్ భారత్ పేరిట జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గు ఎందుకంటే...
ఆన్‌లైన్ షాపింగ్ వైపు కస్టమర్లు ఆకర్షితులు కావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ఆకర్షణీయమైన ధరలు, కలర్, సైజులు మొదలైనవి నచ్చకపోతే రిటర్న్ లేదా ఎక్స్‌ఛేంజ్ చేసుకొనే సదుపాయం, ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ల వంటివి ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశీలనలో గుర్తించారు. ఈ అంశాల ప్రాతిపదికన భారత్‌లో ఈ–కామర్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించడంతోపాటు పెద్ద సంఖ్యలో ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ఆకర్షితులవుతున్నట్లు సర్వే పేర్కొంది.
ముఖ్యాంశాలివే...
♦ ఆన్‌లైన్ షాపింగ్‌కు వారానికి రెండున్నర గంటల సమయాన్ని ద్వితీయశ్రేణి నగరాల్లోని పౌరులు వెచ్చిస్తున్నారు.
♦ తమ ఆదాయంలో 16% ఆన్‌లైన్ కొనుగోళ్లకు వారు ఖర్చు చేస్తున్నారు. ప్రథమశ్రేణి నగరాల్లో ఇది 8% గానే ఉంటోంది.
♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అధికంగా కాలక్షేపం చేస్తున్న వారిలో గువాహటి, కోయంబత్తూరు, లఖ్‌నవూ వంటి ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ముందువరుసలో నిలుస్తున్నారు.
♦ ప్రథమశ్రేణి నగరాల్లో బెంగళూరువాసులు వారానికి 4 గంటలపాటు ఆన్‌లైన్ షాపింగ్‌లో కాలం వెళ్లబుచ్చుతున్నారు
♦ గత 6 నెలల్లో మూడింట రెండు వంతుల మంది వినియోగదారులు సగటున రూ. 20 వేలు ఆన్‌లైన్ షాపింగ్ చేశారు.
♦ ఈ విషయంలో ముంబై అత్యధిక సగటు రూ. 24,200 వ్యయంతో తొలిస్థానంలో నిలిచింది.
♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.
♦ దుస్తులు, బెల్ట్‌లు, బ్యాగ్‌లు, పర్సులతోపాటు ఎల్రక్టానిక్ పరికరాలను ఎక్కువగా కొంటున్నారు.
♦ నాగ్‌పూర్‌లో అత్యధికంగా 81 శాతం మంది ఆన్‌లైన్‌లో ఎల్రక్టానిక్ వస్తువులు, పరికరాలు కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment