Small cities
-
చిన్న నగరాలే కీలకం
న్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి దేశంలోని చిన్న నగరాలు అభివృద్ధి చెందడం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ లబ్ధిదారులనుద్దేశించి శనివారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశంలోని వేలాది గ్రామాలు, నగరాలకు చేరిందని, ఇందులో చిన్న నగరాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ‘పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారికి మా ప్రభుత్వం సాయంగా నిలుస్తోంది. అందరి నుండి ఆశ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే మోదీ గ్యారెంటీ మొదలవుతుంది’అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాల న్నారు. ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేసేందుకు తమ ప్రభుత్వం కుటుంబ సభ్యుడి మాదిరిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అభివృద్ధి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితంగా మారింది. మా ప్రభుత్వం చిన్న నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన భారత్ బలమైన పునాదులను వేసింది’అని అన్నారు. ‘ఈ యాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించినప్పటికీ నిజానికి ప్రజలే ముందుండి నడిపారు. మధ్యమధ్యలో అంతరాయం కలిగిన చోట్ల, ప్రజలే చొరవ తీసుకుని ఇతర నగరాలు, పల్లెలకు యాత్రను కొనసాగించారు’అని చెప్పారు. మన దేశ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఇటువంటి అంకితభావం, కష్టించే తత్వం ఉన్న వారి కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ఉన్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సాగే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను జెండా ఊపి ప్రారంభించారు. మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 15వ తేదీనే యాత్రలు మొదలుకాగా, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో ఈ అయిదు రాష్ట్రాల్లో యాత్ర ఆలస్యమైంది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయిలో అందించడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం. -
ఊరు.. షాపింగ్ జోరు.. ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: భారత్ ఆన్లైన్ షాపింగ్, ఈ–కామర్స్ మార్కెటింగ్‌లో ద్వితీయశ్రేణి, అంతకంటే తక్కువస్థాయి పట్టణాలు కూడా సత్తా చాటుతున్నాయి. మెట్రో నగరాలకు ఏమాత్రం తగ్గకుండా కొన్ని సందర్భాల్లో అగ్రశ్రేణి నగరాల కంటే కూడా చిన్న నగరాల్లోని వినియోగదారులు ఆన్లైన్ కొనుగోళ్లలో ముందుంటున్నాయి. ఆన్లైన్ షాపర్స్ ఏడాదికి సగటున 149 గంటలు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ రిటైల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వారి ప్రాధమ్యాలు, ప్రాధాన్యతలు, అలవాట్లు, షాపింగ్ చేసే పద్ధతులపై సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) అధ్యయనం నిర్వహించింది. కన్జూమర్ యాస్పిరేషన్ అండ్ ఈ–కామర్స్ ఇన్ భారత్ పేరిట జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు ఎందుకంటే... ఆన్లైన్ షాపింగ్ వైపు కస్టమర్లు ఆకర్షితులు కావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ఆకర్షణీయమైన ధరలు, కలర్, సైజులు మొదలైనవి నచ్చకపోతే రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకొనే సదుపాయం, ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ల వంటివి ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశీలనలో గుర్తించారు. ఈ అంశాల ప్రాతిపదికన భారత్‌లో ఈ–కామర్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించడంతోపాటు పెద్ద సంఖ్యలో ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ఆకర్షితులవుతున్నట్లు సర్వే పేర్కొంది. ముఖ్యాంశాలివే... ♦ ఆన్లైన్ షాపింగ్‌కు వారానికి రెండున్నర గంటల సమయాన్ని ద్వితీయశ్రేణి నగరాల్లోని పౌరులు వెచ్చిస్తున్నారు. ♦ తమ ఆదాయంలో 16% ఆన్లైన్ కొనుగోళ్లకు వారు ఖర్చు చేస్తున్నారు. ప్రథమశ్రేణి నగరాల్లో ఇది 8% గానే ఉంటోంది. ♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అధికంగా కాలక్షేపం చేస్తున్న వారిలో గువాహటి, కోయంబత్తూరు, లఖ్‌నవూ వంటి ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ముందువరుసలో నిలుస్తున్నారు. ♦ ప్రథమశ్రేణి నగరాల్లో బెంగళూరువాసులు వారానికి 4 గంటలపాటు ఆన్లైన్ షాపింగ్‌లో కాలం వెళ్లబుచ్చుతున్నారు ♦ గత 6 నెలల్లో మూడింట రెండు వంతుల మంది వినియోగదారులు సగటున రూ. 20 వేలు ఆన్లైన్ షాపింగ్ చేశారు. ♦ ఈ విషయంలో ముంబై అత్యధిక సగటు రూ. 24,200 వ్యయంతో తొలిస్థానంలో నిలిచింది. ♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ♦ దుస్తులు, బెల్ట్‌లు, బ్యాగ్‌లు, పర్సులతోపాటు ఎల్రక్టానిక్ పరికరాలను ఎక్కువగా కొంటున్నారు. ♦ నాగ్‌పూర్‌లో అత్యధికంగా 81 శాతం మంది ఆన్లైన్లో ఎల్రక్టానిక్ వస్తువులు, పరికరాలు కొన్నారు. -
భారత్‌లో గూగుల్ స్టార్టప్ స్కూల్
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్.. భారత్‌లో స్టార్టప్ స్కూల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్‌గా తొమ్మిది వారాల పాటు ఉంటుంది. మెరుగైన ఉత్పత్తిని సమర్థంగా రూపొందించేందుకు వ్యూహాలు, కొత్తగా ఇంటర్నెట్కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్‌ల రూపకల్పన, కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలు మొదలైన వాటిలో ఇందులో శిక్షణ పొందవచ్చు. అలాగే స్టార్టప్ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు మొదలైనవి కూడా ఉంటాయి. దాదాపు 70,000 పైచిలుకు అంకుర సంస్థలతో స్టార్టప్‌ల విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అనేకానేక స్టార్టప్‌లు వస్తున్నాయి. అయితే, 90 శాతం స్టార్టప్‌లు తొలి అయిదేళ్లలోనే మూతబడుతున్నాయి. ఖర్చులపై అదుపు లేకపోవడం, డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, సారథ్యం సరిగ్గా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని గూగుల్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. ఇలాంటి సవాళ్లను అధిగమించి అంకుర సంస్థలు నిలదొక్కుకోవడంలో సహకరించే లక్ష్యంతోనే స్టార్టప్ స్కూల్‌ను తలపెట్టినట్లు పేర్కొంది. -
చిన్న పట్టణాల్లోని స్టార్టప్‌లకు చేయూతనివ్వాలి
న్యూఢిల్లీ: గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీలు) భారత్‌లోని చిన్న పట్టణాల్లో (ద్వితీయ, తృతీయ శ్రేణి) స్టార్టప్‌లకు నిధుల చేయూతనివ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. గ్లోబల్ వీసీలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. స్టార్టప్‌లకు మద్దతుగా తమ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుందని, భవిష్యత్తులోనూ తీసుకుంటుందని భరోసా కల్పించారు. పెట్టుబడులు పెట్టేందుకు కొత్త రంగాలను గుర్తించాలని సూచించారు. ‘‘భారత యువ వ్యాపారవేత్తలు పొందిన మేధో సంపత్తి హక్కులను కాపాడాలి. ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి. వారికి మీ అనుభవం అందించడం ద్వారా మరింత విస్తరించేందుకు, మరిన్ని పెట్టుబడులతో సహకారాన్ని విస్తృతం చేయాలి’’ అని వీసీలను కోరారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వ్యాపార నిర్వహణ, నిధుల సమీకరణను సులభతరం చేసేందుకు 49 నియంత్రణ సంస్కరణలను అమలు చేసినట్టు మంత్రి చెప్పారు. నిబంధనల అమలు భారాన్ని తగ్గించినట్టు పేర్కొన్నారు. మంత్రి నిర్వహించిన స్టార్టప్‌ల సమావేశంలో అమెరికా, జపాన్, కొరియా, సింగపూర్ తదితర దేశాల నుంచి 75కు పైగా వీసీ ఫండ్స్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీటి నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా 30 బిలియన్ డాలర్ల నిధులున్నాయి. -
‘స్మార్ట్’ జాబితాలో పలు చిన్న నగరాలు!
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద ‘స్మార్ట్’ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన జాబితాలో రాష్ట్రాల రాజధానులను తోసిరాజని పలు చిన్న నగరాలు చోటు పొందడం విశేషం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఎన్నికల ముంగిట్లో ఉన్న బిహార్ రాజధాని పాట్నాకు చోటు దక్కకపోగా.. బిహార్ షరీఫ్ పేరు నామినేట్ అయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాను తోసిరాజని ధర్మశాల చోటుపొందింది. కర్ణాటకలో శివమొగ్గకూ చోటు దక్కింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలకు చోటు లభించింది. జాబితాలో చేరిన వాటిలో ఇంకా రాయ్‌పూర్, గువాహటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఉంది. ఢిల్లీతోపాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకూ చోటు లభించింది. ముంబై, కోల్‌కతా, లక్నో, జైపూర్, రాంచీ, భువనేశ్వర్లూ ఇందులో ఉన్నాయి. ఇప్పటివరకు తమకు 98 నగరాలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వీటిపై విశ్లేషించి తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేసి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కోదానికి రూ.200 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఈ నెలాఖరుకల్లా 20 నగరాల ఎంపిక జరుగుతుందన్నారు. అనంతరం రాబోయే రెండేళ్లలో 40 నగరాలు చొప్పున ఎంపిక చేసి నిధులను అందజేస్తామని తెలిపారు.