న్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి దేశంలోని చిన్న నగరాలు అభివృద్ధి చెందడం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ లబ్ధిదారులనుద్దేశించి శనివారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశంలోని వేలాది గ్రామాలు, నగరాలకు చేరిందని, ఇందులో చిన్న నగరాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.
‘పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారికి మా ప్రభుత్వం సాయంగా నిలుస్తోంది. అందరి నుండి ఆశ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే మోదీ గ్యారెంటీ మొదలవుతుంది’అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాల న్నారు. ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేసేందుకు తమ ప్రభుత్వం కుటుంబ సభ్యుడి మాదిరిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు.
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అభివృద్ధి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితంగా మారింది. మా ప్రభుత్వం చిన్న నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన భారత్ బలమైన పునాదులను వేసింది’అని అన్నారు. ‘ఈ యాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించినప్పటికీ నిజానికి ప్రజలే ముందుండి నడిపారు. మధ్యమధ్యలో అంతరాయం కలిగిన చోట్ల, ప్రజలే చొరవ తీసుకుని ఇతర నగరాలు, పల్లెలకు యాత్రను కొనసాగించారు’అని చెప్పారు.
మన దేశ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఇటువంటి అంకితభావం, కష్టించే తత్వం ఉన్న వారి కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ఉన్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సాగే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను జెండా ఊపి ప్రారంభించారు. మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 15వ తేదీనే యాత్రలు మొదలుకాగా, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో ఈ అయిదు రాష్ట్రాల్లో యాత్ర ఆలస్యమైంది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయిలో అందించడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment