భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది.
కేంద్రంలో మూడోవిడత మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం విషయంలో మరింత దూకుడు పెంచింది. వాస్తవాధీనరేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా అక్రమిత టిబెట్‌లోని 30 ప్రాంతాల పేర్లు మార్చాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. ఇదే విషయంలో చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న భారత్ డ్రాగన్ ఆక్రమిత టిబెట్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది.
దీనికి తోడు రెండవసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి సమస్యలను పరిష్కరించడంపై భారత్ దృష్టి సారిస్తుందని జైశంకర్ తెలిపారు.
ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్‌తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని,తమ సరిహద్దు వివాదాలను సక్రమంగా నిర్వహించాలని భారత్‌లోని చైనా రాయబార కార్యలయం ఎక్స్ వేదికగా స్పందించింది. మూడో విడత మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
చైనా,భారత్‌లు పొరుగు దేశాలు. సంబంధిత సరిహద్దు సమస్యలను సక్రమంగా నిర్వహించాలి. ఈ రెండు దేశాల్లో అభివృద్ది,శాంతికి అనుకూలంగా ఉన్నాం.భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సరైన దిశలో ముందుకు తీసుకెళ్లాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment