న్యూఢిల్లీ: భారతదేశం ఆతిధ్యమిస్తున్న ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ప్రారంభానికి ప్రధాని మోదీ ఒక డిజిటల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు జీ20లో భాగస్వాములు కానీ దేశాల ప్రయోజనాల కోసం సైతం భారతదేశం తాపత్రయ పడుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలతో పాటు జీ20లో భాగస్వాములు కాని వెనబడిన ఆఫ్రికా దేశాల ప్రయోజనాలను కూడా భారతదేశం ముందుకు తీసుకు వెళ్తుందని అన్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల కారణంగా ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో జీ20 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని వినిపించడానికి భారత్, ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ త్రయం సిద్ధమైందని అన్నారు. ఈ జీ20 త్రయం గతేడాది సమావేశాలకు ఆతిధ్యమిచ్చిన ఇండోనేషియా, ఇప్పుడు ఆతిధ్యమిస్తున్న భారత్ వచ్చే ఏడాది ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ దేశాలను సూచిస్తుందన్నారు.
మా తొమ్మిదేళ్లుగా పాలనలో ‘సబ్‌కా సాథ్' 'సబ్‌కా వికాస్' 'సబ్‌కా విశ్వాస్' 'సబ్‌కా ప్రయాస్’ విధానాలను అనుసరించాము. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా అమలు చేయాలనుకుంటున్నామన్నారు. మేము జీ20 కోసం ఇదే మా ఎజెండా అని తెలిపినప్పుడు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయన్నారు ప్రధాన మంత్రి.
జీ20 సమాఖ్యలో ఆఫ్రికా దేశాల సభ్యత్వం విషయంలో ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపించారు. ఆఫ్రికా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన జీ20 నాయకులకు లేఖ కూడా రాశారు. జులైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశాల్లో దీనిపై తుదినిర్ణయం వెలువడే అవకాశముంది. మొత్తం 19 దేశాలు పాల్గొనే జీ20 సమావేశాల్లో ప్రధానంగా వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితుల్లో ఆయా దేశాలకు రుణ సహాయం, క్రిప్టోకరెన్సీ నియమాలు, బ్యాంకు సంస్కరణలతోపాటు నల్ల సముద్రం గుండా ఉక్రెయిన్‌కు బియ్యం ఎగుమతి.. తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి
Comments
Please login to add a commentAdd a comment