Cyber Media Research
-
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ కింగ్ ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత స్మార్ట్‌ఫోన్స్ విపణిలో శామ్సంగ్ హవా కొనసాగుతోంది. 2023లో 18 శాతం వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో నిలిచినట్టు పరిశోధన కంపెనీ సైబర్‌మీడియా రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. గతేడాది 16 శాతం వాటాతో వివో రెండవ స్థానంలో, 13 శాతం వాటాతో వన్‌ప్లస్ మూడవ స్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే గతేడాది భారత స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్ 19 శాతం వృద్ధి చెందింది. 5జీ మోడళ్ల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. 5జీ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023లో 122% వృద్ధి సాధించడం విశేషం. ఫీచర్ ఫోన్లకూ గిరాకీ.. రూ.7–25 వేల ధర శ్రేణిలో 5జీ మోడళ్ల వాటా 58 శాతంగా ఉంది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 47 శాతం నమోదైంది. రూ.25,000లకుపైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్స్ విభాగం గతేడాది 71 శాతం ఎగబాకింది. రూ.50,000పైగా విలువైన సూపర్ ప్రీమియం మోడళ్ల విక్రయాలు 65 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే ఫీచర్ ఫోన్ల విభాగంలో అమ్మకాలు గతేడాది 52 శాతం అధికం అయ్యాయి. 4జీ ఫీచర్ ఫోన్లు ఈ దూకుడుకు కారణం అయ్యాయి. 2జీ ఫీచర్ ఫోన్స్ 12 శాతం క్షీణించాయి. రిలయన్స్ జియో 38 శాతం వాటాతో ఫీచర్ ఫోన్స్ విభాగంలో ముందు వరుసలో ఉంది. ఐటెల్ 23 శాతం, లావా 15 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నాల్గవ త్రైమాసికంలో.. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 29 శాతం దూసుకెళ్లింది. 19 శాతం వాటాతో షావొమీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్సంగ్ 18.9 శాతం, వివో 16, రియల్మీ 12, ఒప్పో 8, యాపిల్ 6 శాతం వాటా దక్కించుకున్నాయి. 2023 యాపిల్ అమ్మకాల్లో ఐఫోన్–15 సిరీస్ 50 శాతంపైగా వాటా చేజిక్కించుకుంది. ఇక 2024లో స్మార్ట్ఫోన్ల విపణి దేశవ్యాప్తంగా 7–8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. 5జీ మోడళ్ల అమ్మకాలు 40 శాతం పెరిగే ఆస్కారం ఉంది. 4జీ ఫీచర్ ఫోన్స్ 10 శాతం దూసుకెళ్లవచ్చు. -
ఊరు.. షాపింగ్ జోరు.. ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: భారత్ ఆన్లైన్ షాపింగ్, ఈ–కామర్స్ మార్కెటింగ్‌లో ద్వితీయశ్రేణి, అంతకంటే తక్కువస్థాయి పట్టణాలు కూడా సత్తా చాటుతున్నాయి. మెట్రో నగరాలకు ఏమాత్రం తగ్గకుండా కొన్ని సందర్భాల్లో అగ్రశ్రేణి నగరాల కంటే కూడా చిన్న నగరాల్లోని వినియోగదారులు ఆన్లైన్ కొనుగోళ్లలో ముందుంటున్నాయి. ఆన్లైన్ షాపర్స్ ఏడాదికి సగటున 149 గంటలు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ రిటైల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వారి ప్రాధమ్యాలు, ప్రాధాన్యతలు, అలవాట్లు, షాపింగ్ చేసే పద్ధతులపై సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) అధ్యయనం నిర్వహించింది. కన్జూమర్ యాస్పిరేషన్ అండ్ ఈ–కామర్స్ ఇన్ భారత్ పేరిట జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు ఎందుకంటే... ఆన్లైన్ షాపింగ్ వైపు కస్టమర్లు ఆకర్షితులు కావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ఆకర్షణీయమైన ధరలు, కలర్, సైజులు మొదలైనవి నచ్చకపోతే రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకొనే సదుపాయం, ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ల వంటివి ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశీలనలో గుర్తించారు. ఈ అంశాల ప్రాతిపదికన భారత్‌లో ఈ–కామర్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించడంతోపాటు పెద్ద సంఖ్యలో ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ఆకర్షితులవుతున్నట్లు సర్వే పేర్కొంది. ముఖ్యాంశాలివే... ♦ ఆన్లైన్ షాపింగ్‌కు వారానికి రెండున్నర గంటల సమయాన్ని ద్వితీయశ్రేణి నగరాల్లోని పౌరులు వెచ్చిస్తున్నారు. ♦ తమ ఆదాయంలో 16% ఆన్లైన్ కొనుగోళ్లకు వారు ఖర్చు చేస్తున్నారు. ప్రథమశ్రేణి నగరాల్లో ఇది 8% గానే ఉంటోంది. ♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అధికంగా కాలక్షేపం చేస్తున్న వారిలో గువాహటి, కోయంబత్తూరు, లఖ్‌నవూ వంటి ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ముందువరుసలో నిలుస్తున్నారు. ♦ ప్రథమశ్రేణి నగరాల్లో బెంగళూరువాసులు వారానికి 4 గంటలపాటు ఆన్లైన్ షాపింగ్‌లో కాలం వెళ్లబుచ్చుతున్నారు ♦ గత 6 నెలల్లో మూడింట రెండు వంతుల మంది వినియోగదారులు సగటున రూ. 20 వేలు ఆన్లైన్ షాపింగ్ చేశారు. ♦ ఈ విషయంలో ముంబై అత్యధిక సగటు రూ. 24,200 వ్యయంతో తొలిస్థానంలో నిలిచింది. ♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ♦ దుస్తులు, బెల్ట్‌లు, బ్యాగ్‌లు, పర్సులతోపాటు ఎల్రక్టానిక్ పరికరాలను ఎక్కువగా కొంటున్నారు. ♦ నాగ్‌పూర్‌లో అత్యధికంగా 81 శాతం మంది ఆన్లైన్లో ఎల్రక్టానిక్ వస్తువులు, పరికరాలు కొన్నారు. -
5జీ స్మార్ట్ఫోన్లదే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరందుకున్నాయి. 2021తో పోలిస్తే గతేడాది 5జీ మోడళ్ల అమ్మకాలు 74 శాతం అధికం అయ్యాయి. కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ 5జీ స్మార్ట్ఫోన్ల విలువ సుమారు రూ.1.65 లక్షల కోట్లు ఉంటుందని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తన నివేదికలో వెల్లడించింది. కఠినమైన మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో 2022లో మొత్తం మొబైల్స్ సేల్స్ 17 శాతం, స్మార్ట్ఫోన్ల విక్రయాలు 8 శాతం తగ్గడం గమనార్హం. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 28 శాతం క్షీణించింది. 2023లో స్మార్ట్ఫోన్ల పరిశ్రమ చక్కటి వృద్ధి తీరుతో 16–16.5 కోట్ల యూనిట్లు ఉండే వీలుంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. మరోవైపు రూ.1 లక్ష ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం విభాగం ఏకంగా 95 శాతం దూసుకెళ్లిందని సీఎంఆర్ వెల్లడించింది. రూ.7 వేల లోపు ధర ఉండే మొబైల్స్ సేల్స్ గతేడాది 55 శాతం తగ్గాయి. సరఫరా సమస్యలు, ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణం. రూ.7–25 వేల ధరల శ్రేణిలో విక్రయాలు 8 శాతం క్షీణించాయి. రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య ఉండే ప్రీమియం మోడళ్ల అమ్మకాలు 12 శాతం, రూ.50,000 నుంచి రూ.1 వరకు ఉండే సూపర్ ప్రీమియం 41 శాతం దూసుకెళ్లాయి. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో యాపిల్ వాటా 4 శాతం. గతేడాది ఈ సంస్థ 17 శాతం వృద్ధి నమోదు చేసింది. యాపిల్ విక్రయాల్లో రూ.50,000–1,00,000 ధరల శ్రేణి మోడళ్ల వాటా 79 శాతం ఉంది. -
‘మాన్సూన్ హంగామా’తో మరింత కిక్
జియో ఫోన్ మరో ప్రత్యేకతను సంతరించుకుంది. 2018 సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 27% మార్కెట్ వాటాను జియో ఫోన్ కైవసం చేసుకుందని సైబర్ మీడియా రీసెర్చ్ చేసిన అధ్యయనం వెల్లడించింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లోని ఫ్యూజన్ సెగ్మెంట్లో జియో ఫోన్ చరిత్ర సృష్టించిందని ఈ నివేదిక విశ్లేషించింది. 4జీ కనెక్టివిటీ కలిగి ఉండి వినియోగదారులకు నచ్చే యాప్‌లను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉందని వివరించింది. 2018 రెండో త్రైమాసికంలో స్వల్పకాలంలో మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని సైబర్ మీడియా రీసెర్చ్ తెలిపింది. ``అందులో ఒకటి జియో ప్రవేశపెట్టిన సంచలన మాన్సూన్ ఆఫర్. ఈ ఆఫర్ వల్ల అన్ని ప్రముఖ హ్యాండ్సెట్ల బ్రాండ్లకు అనియతమైన డిమాండ్ ఏర్పడింది. రెండో అంశం చిన్న తరహా విభాగానికి చెందిన వారు సీకేడీ మాన్యూఫాక్చరింగ్ వైపు దృష్టి సారించారు. దీంతోపాటుగా వారి సొంత ఎస్ఎంటీ లైన్ల ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించారు`` అని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) హెడ్ ప్రభురామ్ తెలిపారు. ఫీచర్ ఫోన్లు మరియు ఫ్యూజన్ ఫోన్లు కలిపి 2020 నాటికి స్మార్ట్ ఫోన్లను దాటివేస్తాయని సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. జియో ప్రకటించిన ఎక్సేంజ్ స్కీమ్`జియో ఫోన్ మాన్సూన్ హంగామా`కు తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించిందని నివేదిక తెలిపింది. ఈ ఆఫర్‌తో విపణిలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా.. జియో ఫోన్ అమ్మకాలలో విశేష వృద్ధి స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. ఈ పథకం ప్రవేశపెట్టిన కేవలం పదిరోజుల వ్యవధిలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది జియోఫోన్ల అమ్మకాలు జరిగాయని చెప్పింది. జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్లో భాగంగా వినియోగదారులు ఏదైనా ఫీచర్ ఫోన్ (ఏ బ్రాండ్ కు చెందినది అయినా) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ ( ప్రస్తుతం ఉన్న మోడల్)ను కేవలం రూ.501 సెక్యురిటీ డిపాజిట్ రుసుముతో పొందవచ్చు. వాస్తవ సెక్యురిటీ డిపాజిటల్ రూ.1500 కాగా, ఈ ఆఫర్లో రూ. 999 తగ్గింపు కావడం విశేషం. ఫీచర్ ఫోన్‌ను అందించే ఈ పథకంలో భాగంగా వినియోగదారులు రూ. 594(రూ.99 x 6) చెల్లించడం ద్వారా 6 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్, డేటాను పొందవచ్చు. అంటే వినియోగదారుడు రూ. 1,095 (రూ.501 తిరిగి చెల్లించే సెక్యురిటీ మొత్తం+ రూ.594 రీచార్జీ మొత్తం) చెల్లించడం ద్వారా ఆరునెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్, డేటా అందించే జియో ఫోన్‌ను తమ పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌లో సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. -
దేశీ మొబైల్ కంపెనీలకు విదేశీ బ్రాండ్స్ షాక్
చైనా కంపెనీలకు దేశీ హ్యాండ్సెట్ మార్కెట్లో 49% వాటా న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు దేశీ బ్రాండ్స్‌కు గట్టి పోటీనివ్వడమే కాదు.. ఏకంగా వాటిని కనుమరుగు చేసేలా కనిపిస్తున్నాయి. చైనా బ్రాండ్స్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (2017, జనవరి–మార్చి) ఇండియన్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే వీటి ఆదాయంలో 180 శాతం వృద్ధి నమోదయ్యింది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రూపొందించిన ‘ఇండియా క్వార్టర్లీ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ రివ్యూ’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. జనవరి–మార్చి త్రైమాసికంలో దేశంలో మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ రూ.3,46,295 మిలియన్ల రాబడిని అర్జించింది. త్రైమాసికం పరంగా చేస్తే ఇందులో 8 శాతం క్షీణత నమోదయ్యింది. విక్రయాల పరంగా చూస్తే శాంసంగ్, ఐటెల్, షావోమి కంపెనీల మార్కెట్ వాటా వరుసగా 27 శాతం, 9 శాతం, 6 శాతంగా ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో చైనా కంపెనీలు ఇప్పటికే దేశీ బ్రాండ్స్‌కు టాప్–5లో చోటులేకుండా చేశాయి. రానున్న రోజుల్లో మన బ్రాండ్స్‌కు మొత్తం మొబైల్ హ్యాండ్సెట్స్ విభాగంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ఇక యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ మోడల్ని దేశీయంగా ఉత్పత్తి చేస్తుండటంతో వివో, ఒప్పొ బ్రాండ్స్‌కి రూ.15,000–రూ.25,000 విభాగంలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. -
భారత్‌లో ఈ ఏడాది 25 కోట్ల మొబైల్స్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 శాతం వృద్ధితో 25 కోట్ల యూనిట్లకు చేరుతుందని సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ తెలిపింది. రూ.5,000 ధరకు దిగువన ఉండే హ్యాండ్సెట్స్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 2014తో పోలిస్తే గతేడాది స్మార్ట్‌ఫోన్ విభాగం 32 శాతం వార్షిక సగటు వృద్ధిరేటుతో 7.7 కోట్ల యూనిట్ల నుంచి 9.5 కోట్ల యూనిట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది 4జీ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు 5 కోట్ల యూనిట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఫీచర్ ఫోన్ మార్కెట్ విషయానికి వస్తే 2014లో 18 కోట్ల యూనిట్లుగా ఉన్న ఫీచర్ ఫోన్స్ విక్రయాలు గతేడాదిలో 17 శాతం క్షీణతతో 14.4 కోట్ల యూనిట్లకు తగ్గాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది కొనసాగే అవకాశం ఉంది. కంపెనీలు గతేడాది రూ. 10,000 ధర శ్రేణిలోని మొబైల్ హ్యాండ్‌సెట్స్‌కు ప్రాధాన్యమిచ్చాయని, కానీ ప్రస్తుతం రూ.5,000 ధరకు దిగువన ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.