ఫ్లిప్ కార్ట్ లోకి 6 వేల కోట్లు!
బెంగళూరు: భారతదేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీగా నిధులను పెంచింది. ఆన్ లైన్ వ్యాపారంలో విపరీతమైన పోటి తలెత్తిన కారణంగా కొత్త ఇన్వెస్టర్ల గ్రూప్ తో పెట్టుబడులపై ఓ అవగాహన కుదుర్చుకోవడంతో సుమారు ఒక బిలియన్ (6 వేల కోట్లు) నిధులను సమీకరించుకుంది. అయితే నూతన ఫండ్ హోల్డింగ్ ను గోప్యంగా ఉంచింది. తాజా నిధుల ప్రవాహంతో మార్కెట్ లో ఫ్లిప్ కార్ట్ విలువ 7 బిలియన్ డాలర్ల(42 వేల కోట్లు)కు చేరుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నూతన ఇన్వెస్టర్లలో టైగర్ మేనేజ్ మెంట్ అండ్ నాస్పర్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ, ఎక్సెల్ పార్టనర్, డీఎస్టీ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, సొఫినా లు ఉన్నారు. కస్టమర్ కు మెరుగైన సేవలందించుటకు కొత్తగా సమకూర్చుకున్న నిధులను ఆన్ లైన్, మొబైల్ సర్వీసెస్, రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్ కార్ట్ సేవలందిస్తోంది.