వచ్చేదంతా వాట్సప్‌ గవర్నెన్స్‌ | Chief Minister Chandrababu Naidu in review of RTGS | Sakshi
Sakshi News home page

వచ్చేదంతా వాట్సప్‌ గవర్నెన్స్‌

Published Wed, Dec 11 2024 5:43 AM | Last Updated on Wed, Dec 11 2024 7:11 AM

Chief Minister Chandrababu Naidu in review of RTGS

ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

పాలనలో మరింతగా సాంకేతికత వినియోగం

విభాగాల వారీగా రియల్‌టైమ్‌ డ్యాష్‌ బోర్డులు

ఆర్టీజీఎస్‌కు మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు

మరో వెయ్యి సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్లు

జనవరి 1న జనన, మరణాల నమోదుకు కొత్త పోర్టల్‌

సాక్షి, అమరావతి: వచ్చేదంతా వాట్సప్‌ గవర్నెన్స్‌ అని.. అందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించు­కో­వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎంవో సహా ఆర్టీజీఎస్‌కు చెందిన అధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రియల్‌టైమ్‌లో సమాచా­రాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలన్నారు. 

అన్ని శాఖల సమా­చారాన్ని ఆర్టీజీ­ఎస్‌ సమీకృతం చేసి, మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. అంతిమంగా ‘వాట్సప్‌ గవర్నెన్స్‌’ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాల­న్నారు. ప్రజలు కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీక­రణ వంటి అన్ని ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు వాట్సప్‌ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలన్నారు. 

ప్రజల వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్‌టెక్‌ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. వినతుల పరిష్కార విధానం, ప్రజల సంతృప్తి స్థాయిలను ఆర్టీజీఎస్‌ పరిశీలించే ఏర్పాట్లు చేయాలన్నారు.

విజువల్స్‌ ఇంటిగ్రేషన్‌
డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైట్లు, ఐవోటీ డివైస్‌ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్‌ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా పంట తెగుళ్లను గుర్తించి, రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను డ్రోన్ల ద్వారా అన్వేషించి, ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాదా­లను నివారించాలన్నారు. 

ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి
ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని అధికారులు సీఎంకు వివరించగా.. ఎక్కడైనా అసంతృప్తి ఉంటే ఎందుకు వ్యక్తమవుతోందనే విషయాలను పరిశీలించి తక్షణం పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే సమాచార ప్రామాణికతను విశ్లేషించి, అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

హౌస్‌హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95 శాతం కుటుంబాల జియో ట్యాగింగ్‌ పూర్తిచేశామని అధికారులు చెప్పగా.. ట్యాగింగ్‌ సక్రమంగా జరిగిందా, లేదా అనేది సరిచూసుకోవాలని సీఎం కోరారు. 

ఆధార్‌ సంబంధిత సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన మరో వెయ్యి ఆధార్‌ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్ల నిధుల మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వీలైనంతగా త్వరగా గ్రామ/వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. 

ప్రత్యేక పోర్టల్‌లో భారీ ప్రాజెక్టుల ప్రగతి
రాష్ట్రంలో రూ.100 కోట్లకు పైగా వ్యయంతో చేప­ట్టిన వివిధ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒకే పోర్టల్‌ను రూపొందించాలని సీఎం కోరారు. ఈ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్‌టైమ్‌లో అప్డేట్‌ చేయాల­న్నారు. 

జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందడంలో తలెత్తుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కా­రంగా తీసుకువస్తున్న నూతన వెబ్‌ పోర్టల్‌ను జనవరి ఒకటో తేదీన ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. పంచాయతీరాజ్, పట్టణాభి­వృద్ధి శాఖల సమన్వయంతో ఈ పోర్టల్‌ కొనసాగాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement