
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్ అయ్యారు.
ములాఖత్ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు.
చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి
చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులు
వల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు.

నాపైనా కేసులు
సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్
కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment