ముక్క లేనిదే ముద్ద దిగదాయె.. | Childrens Loves Eating Non Vegetarian Food, Not Showing Interest On Eating Fiber Food, Reasons Inside | Sakshi
Sakshi News home page

ముక్క లేనిదే ముద్ద దిగదాయె..

Published Sun, Mar 2 2025 10:50 AM | Last Updated on Sun, Mar 2 2025 11:52 AM

Childrens loves eating non vegetarian food

ఇదీ యుక్త వయసు పిల్లల ఆహారశైలి 

75.3 శాతం మంది చికెన్‌పై అమితాసక్తి  

కూరగాయలు, పండ్లు, పీచు పదార్థాలపై నిరాసక్తత 

చేపల వినియోగంలో ఉమ్మడి జిల్లా టీనేజర్ల వెనుకంజ

అనంతపురంలోని పాతూరుకు చెందిన షణ్ముగ వయసు 15 ఏళ్లు. చికెన్‌ అంటే మహా ఇష్టం. ఒక్క రోజులోనే కేజీ చికెన్‌ ఫ్రైచేసి ఇచ్చినా తినేస్తానంటాడు. నెలలో 10 రోజులు చికెన్‌ ఉండాల్సిందే అంటున్నాడు.

గుంతకల్లుకు చెందిన రోషన్‌ ఆలీకి ఇరవై ఏళ్లు. తండ్రి మటన్‌ వ్యాపారం చేస్తాడు. అయినా సరే రోషన్‌కు చికెన్‌ అంటే ప్రాణం. రోజూ రెండు ముక్కలైనా చికెన్‌ ఉండాల్సిందే అంటున్నాడు.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: యుక్తవయసు పిల్లలు శాకాహారం కన్నా మాంసాహారానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ పిల్లలు చికెన్‌ అంటే మరీ లొట్టలేసుకుని తింటున్నారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్, మటన్‌ తింటున్న వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లా మూడవ స్థానంలో ఉన్నట్టు తేలింది. నేషనల్‌ న్యూట్రిషనల్‌ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల పిల్లల్లో 75.3 శాతం మంది చికెన్‌ తింటున్నారు. తర్వాతి స్థానం 51.6 శాతంతో మటన్‌ ఆక్రమించింది. దేశంలో మాంసాహార వినియోగంఏపీలో ఎక్కువగా ఉండగా, అందులో ఉమ్మడి  అనంతపురం జిల్లాలో తక్కువేమీ కాదన్నట్టుంది.  

కూరగాయలు, పండ్లు తినడంలో వెనుకంజ 
ఉమ్మడి జిల్లాలో చిన్నారులు, కుర్రాళ్లు చికెన్, మటన్‌ను ఇష్టపడినట్టుగా కూరగాయలు, పండ్లపై మక్కువ చూపడం లేదు. ఫ్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఆంధ్ర అని జిల్లాకు పేరున్నా ఇక్కడ పండ్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. 2–4 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో విటమిన్‌–ఏతో కూడిన తిండి, కూరగాయలు తినడంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నట్టు తేలింది. పండ్లు, కూరగాయలు తినడంలో కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేపల లభ్యత బాగానే ఉన్నప్పటికీ చికెన్, మటన్‌తో పోలిస్తే తక్కువ వినియోగం ఉన్నట్టు తేలింది.

మాంసాహారంపైనే మక్కువ|
ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది కుర్రాళ్లు మాంసాహారం తినడానికి రకరకాల కారణాలున్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే... 
కుటుంబ నేపథ్యంలో చిన్నప్పటినుంచే మాంసాహారంపై మక్కువ పెంచుకోవడం. 
చికెన్‌ ఉత్పత్తులు ఎక్కువగా అందుబాటులో ఉండటం. 

సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కొనుగోలు స్థాయి పెరగడం. 
మాంసాహారాన్ని సాధారణ మెనూగా భావించి వినియోగించడం. 

యువతను ఎక్కువగా ఆకర్షించేలా విభిన్న రుచుల్లో మాంసాహార వంటకాలు     ఉండటం. 
మాంసాహార వినియోగం పెరుగుతున్న స్థాయిలో వ్యాయామం చేయడం లేదు. 
వయసుకు మించి బరువు ఎక్కువగా ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఫైబర్‌ ఆహారం తినడం లేదు
శరీరానికి అత్యవసరమయ్యే ఫైబర్‌ (పీచు)తో కూడిన ఆహారం కుర్రాళ్లకు రుచించడం లేదు. 
చిక్కుడు, గోరు చిక్కుడు, బీన్స్‌ వంటి కూరగాయలను పట్టించుకోవడం లేదు. 
చిరుధాన్యాలను దరిచేరనివ్వడం లేదు. 

గోబీ మంచూరియా, పానీపూరీ, కట్‌లెట్‌ లాంటి అనారోగ్యకర ఆహారంపై మక్కువ. 
పాలు, పాలపదార్థాలతో కూడిన ఆహారం కూడా తక్కువగా     వినియోగిస్తున్నారు. 
ఫ్రైడ్‌ ఆహారం తినడం వల్ల 30 ఏళ్లకే గ్యా్రస్టిక్, అల్సర్‌ సమస్యలతో సతమతం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement