![bird flu in East Godavari district of Andhra Pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/kodi.jpg.webp?itok=c1dDKuaN)
ఉభయగోదావరి జిల్లాల్లో వైరస్
శాంపిల్స్‌ను పరీక్షించి నిర్ధారించిన భోపాల్ ల్యాబ్
అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ
10 కి.మీ పరిధిలో సర్వైలెన్స్ జోన్
ఈ జోన్ పరిధిలో మానవ రక్త నమూనాల సేకరణకు నిర్ణయం
సాక్షి, అమరావతి/పెరవలి: ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ(bird flu) అని నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్.. చివరకు కోళ్లఫారాలనే చుట్టేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క నిడదవోలు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి.
ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ.. నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్‌లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపింది.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఎవియాన్ ఇన్‌ఫ్లూయింజ్(హెచ్5ఎన్1)గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కు అందించారు.
వైరస్ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు.
ఆందోళన చెందాల్సిన పనిలేదు..
ఉభయగోదావరి జిల్లాల్లో రెండు గ్రామాల్లో బర్డ్› ఫ్లూ నిర్ధారణ అయిన మాట వాస్తవమే. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పూర్తిగా అదుపులోనే ఉంది. 90 శాతం సమస్య పరిష్కారమైంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా ఈ వైరస్ వ్యాపించినట్టుగా నిర్ధారణ కాలేదు. ఉడికించిన గుడ్లు, మాంసాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. – డాక్టర్ టి.దామోదర్‌నాయుడు, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ
రెడ్‌జోన్స్, సరై్వలెన్స్ జోన్‌ల ప్రకటన
వైరస్ గుర్తించిన గ్రామాలకు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్‌జోన్, పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని సరై్వలెన్స్ జోన్‌గా ప్రకటించారు. 144, 133 సెక్షన్‌లను అమలు చేస్తున్నారు. సర్వైలెన్స్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల్లోని కోళ్లు, పశువులు, ఇతర జీవాలతో పాటు మనుషుల రక్త నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు. కిలోమీటర్ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లు, కోడిగుడ్లను కాల్చి పూడ్చి పెట్టాలని ఆదేశాలిచ్చారు.
వైరస్ గుర్తించిన గ్రామాలున్న మండలాల్లో చికెన్ షాపులను మూసివేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. మరోవైపు బర్డ్‌ఫ్లూని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోళ్ల రైతులతో ఆయా జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, మొన్నటి వరకు కిలో రూ.250 నుంచి రూ.280 వరకు పలికిన కోడి మాంసం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో రూ.150కు మించి పలకడం లేదు. ఫామ్ గేట్ వద్ద రూ.6.25 పలికిన కోడిగుడ్డు ప్రస్తుతం రూ.4.25కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment