
చిన్నారులపై చదువుల కత్తి..
భరోసా ఇవ్వకపోగా భయపెట్టే నైజం
తమ కలలు, ఆశలను వారసులు తీర్చాల్సిందే అనే ధోరణి
పిల్లలు తమ ఆస్తి.. తాము చెప్పినట్లు చేయాలనే మనస్తత్వం
ఇదే కారణంతో పసివారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న వైనం
పిల్లల యోగక్షేమాలు, ఆటపాటలు మానసిక ఉల్లాసం పట్టని తీరు
చివరకు వారి ప్రాణాలను తీసేందుకు కూడా లెక్కచేయని తత్వం
కాకినాడ ఘటనతో చర్చనీయాంశంగా మారిన తల్లిదండ్రుల వ్యవహార శైలి
ఎటుచూసినా పోటీ ప్రపంచం.. పిల్లలు ఇప్పట్నుంచే చదువులో అత్యుత్తమంగా లేకుంటే భవిష్యత్‌లో వెనుకబడిపోతారనే అనవసర ఆందోళన.. మార్కులు సాధించే యంత్రాలుగా చూస్తూ వారిపై తీవ్ర ఒత్తిడి.. తాము సాధించలేని లక్ష్యాలు, తాము నెరవేర్చుకోలేని ఆశలను వారసులు తీర్చాల్సిందే అనే పంతం.. మరోవైపు దీనికి ఆజ్యం పోసేలా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ధోరణి.. వెరసి పిల్లల యోగక్షేమాలు, ఆటపాటలు, మానసిక ఉల్లాసం గురించి పట్టించుకోకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు చివరకు బిడ్డల ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడడం లేదు.
తాజాగా కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు.. ఏడేళ్లు, ఆరేళ్ల వయసున్న తన ఇద్దరి కుమారులను పోటీ ప్రపంచంలో రాణించలేరనే కారణంతో నిర్దాక్షిణ్యంగా చంపేయడమే కాక తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ధోరణి మార్చకోకుంటే మున్ముందు ఇలాంటి ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందేమోనని విద్యావేత్తలు, మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి తీరు మారాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
సాక్షి, స్పెషల్ డెస్క్ : తల్లిదండ్రుల్లో విపరీత పోకడలకు కారణం.. ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచే పోటీ వాతావరణం నెలకొనడం. ఆడుతూ పాడుతూ ఆహ్లాద వాతావరణంలో చదువుకోవాల్సిన వయసులో పిల్లలు సహచరులతో పోటీ పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పిల్లల విజయం తమదిగా, సమాజంలో తమకు గుర్తింపుగా భావిస్తున్న తల్లిదండ్రులు ప్రతికూల ఫలితం వస్తే తట్టుకోలేక ఆ కోపాన్ని పిల్లలపై చూపుతున్నారు.
పిల్లలు ఏదైనా అంశంలో వెనుకబడితే, ఆశించినంత రాణించకపోతే తల్లిదండ్రులు తమ ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ బిడ్డల భుజం తట్టి భరోసా ఇవ్వాల్సింది పోయి భయపెడుతున్నారు. మార్కులు తక్కువ వస్తే పరిష్కారం చూపకుండా నలుగురి ముందు తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. దీంతో పిల్లల్లో ఆత్మన్యూనత పెరుగుతోంది. సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుంగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్నారు.
లాభపడుతున్న కార్పొరేట్ స్కూళ్లు
కార్పొరేట్ స్కూళ్లు ఐదో తరగతి నుంచే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నాయి. వీటిలో చేర్చితే తమ పిల్లలు ఐఐటీల్లో, ఎయిమ్స్‌ల్లో అడుగు పెట్టడం ఖాయమనే ఆలోచనతో ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా.. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నారు. ఫలితాలు ఏ మాత్రం తేడా వచి్చనా.. తమ కోపతాపాలకు పిల్లలను గురి చేస్తున్నారు.
పలుచన అవుతామనే ఆందోళనతో..
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఇలా ప్రవర్తించడానికి.. సమాజంలో తమ పేరు, ప్రఖ్యాతులు పోతాయని లేదా కొలీగ్స్, ఇతరుల ముందు పలుచన అవుతామనే ఆందోళనే కారణమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పిల్లలు తమ ఆస్తి అని, వారిపై అన్ని హక్కులు, అధికారాలు తమకు ఉన్నాయని భావిస్తున్నారు.
తమ కలలను నెరవేర్చడానికే పిల్లలు ఉన్నారనే ప్రమాదకర భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా మారినా ఎంతటి తీవ్ర చర్యకైనా వెనుకాడట్లేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులకు ముందు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డెల్యూజనల్ డిజార్డర్స్
మానసిక రుగ్మత అంటే పిచ్చి ఒక్కటే అనుకుంటున్నారని, అదొక్కటే కాదని, రకరకాల ఆలోచనా విధానాలని నిపుణులు చెబుతున్నారు. వీటినే డెల్యూజనల్ డిజార్డర్స్ (భ్రాంతి రుగ్మత) అంటారని వివరిస్తున్నారు. వ్యక్తిలో అంతులేని నిరాశ, భాగస్వామి పట్ల అనుమానం, ఆరి్థక, సామాజిక ఒత్తిళ్లు, ఏదో వైపరీత్యం జరగబోతుందన్న ఊహ, ప్రమాదంపై భయం, మితిమీరిన, తప్పుదారి పట్టిన ప్రేమలు, తీవ్ర మానసిక రుగ్మతలు వంటివి దుర్ఘటనలకు దారితీస్తున్నాయని అంటున్నారు.
తమ వల్ల ఏదీ కావడం లేదని, దేనికీ పనికిరామేమోనని, సమాజం తమను చెడుగా ఊహించుకుంటోందేమోనన్న ఆలోచనలు ఎక్కువైనవారు చివరకు తమ పిల్లలను చంపేసి, తామూ చనిపోవాలన్న నిర్ణయానికి వస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితుల వద్ద చర్చించినా ఫలితం దొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు.
వారు పెరిగిన పరిస్థితులు కూడా ఓ కారణం
పేరెంట్స్ ప్రతికూల వాతావరణంలో పెరిగితే.. అదే రీతిలో పిల్లలతో వ్యవహరించే ప్రమాదం ఉంది. కాకినాడ ఘటనపై పెద్దఎత్తున చర్చ జరగాలి. పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలి. పోటీ ప్రపంచంలో పరీక్షలు, ఫలితాలు అనివార్యంగా మారిన మాట వాస్తవం. కానీ, వీటితోనే పిల్లల భవిష్యత్తు అని భావించకూడదు. పిల్లల్లోని నైపుణ్యాలను గుర్తించి, వాటిలో రాణించేందుకు ప్రోత్సహిస్తే ఫలితాలు ఉంటాయి. –ఆర్.సి.రెడ్డి, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్
తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
తల్లిదండ్రులు విపరీత పోకడలకు ప్రస్తుత పరీక్షల విధానం కూడా ఓ కారణం. దీనికి పరిష్కారంగా.. వినూత్నంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. సీబీఎస్‌ఈ కూడా రెండుసార్లు వార్షిక పరీక్షల విధానాన్ని ప్రతిపాదిస్తోంది. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి. సృజనాత్మకత, శక్తియుక్తుల ఆధారంగా చదివేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే వారి భవితకు ప్రమాదం ఏర్పడుతుంది. –సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ స్కూల్, హైదరాబాద్
తీవ్ర మానసిక సమస్య
కన్నబిడ్డలను చంపేయడం ఓ తీవ్రమైన మానసిక సమస్య. ఈ తరహా సమస్యలతో బాధపడేవారిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అందులో ప్రధానమైనది చిన్న పిల్లల చర్యలపై తీవ్రంగా స్పందిస్తుండడం. ఇటువంటి వారికి పిల్లలను దూరంగా ఉంచాలి. మానసిక వైద్యుడికి చూపించాలి. – డాక్టర్ వి.వరప్రసాద్, మానసిక వ్యాధుల నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ
గుడ్ పేరెంటింగ్ ముఖ్యం
పేరెంటింగ్ అంటే పిల్లలను కఠిన నిబంధనలతో పెంచడం కాదు. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా పెంచడమే గుడ్ పేరెంటింగ్. పిల్లల గురించి విపరీతంగా ఊహించుకోవడం, మంచి ఉద్యోగం పొందడం లేదా పరీక్షలో నెగ్గడమే అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నారు. అందువల్లే సమస్యలొస్తున్నాయి. –డాక్టర్ వీరేందర్, ప్రముఖ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment