
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహణ
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు (3.15 గంటలు) పరీక్ష ఉంటుంది. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.
రెగ్యులర్ విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్‌రోల్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని పదో తరగతి పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇన్విజిలేటర్లతోపాటు సెంటర్లలో విధులు నిర్వర్తించే పోలీసులు, ఏఎన్‌ఎంలతో సహా ఎవరూ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదని స్పష్టంచేసింది.
ఈ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను నియమించింది. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌తోపాటు రాష్ట్రస్థాయిలో ఎస్‌ఎస్‌సీ డైరెక్టరేట్‌లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. పరీక్షలపై ఫిర్యాదుల కోసం 0866–2974540 నంబర్‌ను కేటాయించారు.
ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా నేటి నుంచే..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నాయి. ఈ పరీక్షలకు 30,334 మంది హాజరుకానున్నారు. వీరికోసం 471 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments
Please login to add a commentAdd a comment