Fish prices
-
మృగశిర ఎఫెక్ట్.. కొర్రమీను@ 650
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. గురువారం నగరంలోని చేపల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాల అంచనా. మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో కొర్రమీను ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలోకు రూ.320 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ. 650 వరకు విక్రయించారు. బొచ్చ, రవ్వు చేపలను కిలో రూ.120 నుంచి రూ. 150కి, పాంప్లేట్ రూ. 90–120 విక్రయించారు. -
Fish Prices: కొండెక్కిన చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్: చేపల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుత సీజన్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం మృగశిర కార్తె సందర్భంగా ధర ఎంతైనా సరే కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. ఈ రోజు తప్పకుండా చేపలు తినాలనే నానుడితో ప్రజలు ఉదయం నుంచే చేపల మార్కెట్లకు పోటెత్తారు. దీంతో రాంనగర్, బేగంబజార్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే రాంనగర్ చేపల మార్కెట్లో జనం బారులు తీరారు. లాక్డౌన్ కారణంగా తక్కువ సమయం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు అన్ని మార్కెట్లలో దాదాపు చేపలు అమ్ముడు పోయాయి. కొరమీను కిలో రూ.700 నుంచి రూ.800 ఆల్‌టైమ్ రికార్డు ధర పలికింది. మామూలు రోజుల్లో ఇదే చేప ధర రూ.400 నుంచి 550 వరకు ఉంటుంది. అలాగే.. రవ్వ, బొచ్చ చేపలు కిలోకు ఏకంగా రూ.150 నుంచి రూ. 250 ధర పలికాయి. కరోనా నిబంధనలు గాలికి.. ఎలాగైనా చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరిచారేగానీ.. కరోనా నిబంధనలు అసలు పట్టించుకోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో జనం గుంపులు గుంపులుగా తరలివచ్చారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు పాటించాలన్న పోలీసుల సూచనలను ప్రజలు బేఖాతరు చేశారు. -
మీనం.. దీనం: తగ్గిన చేపల ధరలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేపల ధరలు పడిపోవడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితులు తలెత్తాయి. శీలావతి, కట్ల, బొచ్చె చేపలను 15 రోజులక్రితం వరకు కిలో రూ.110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం ఆ ధర రూ.90కి పడిపోయింది. ధరలు పడిపోవడం, ఎగుమతులు మందగించడంతో చేపల్ని చెరువుల్లోనే ఉంచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మేత, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. కిలోకు రూ.20 చొప్పున ధర తగ్గడంతో రైతులు టన్నుకు రూ.20 వేల ఆదాయాన్ని నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మేత, నిర్వహణ ఖర్చుల రూపంలో మరో రూ.10 వేల వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి పెరిగింది.. డిమాండ్ తగ్గింది రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల హెక్టార్లలో రైతులు చేపల సాగు చేస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.20 లక్షల హెక్టార్లలో రైతులు చేపలు సాగు చేస్తుండగా.. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా సుమారు 22.50 లక్షల టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రం నుంచి 15 రోజుల క్రితం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, బిహార్, కర్ణాటక రాష్ట్రాలకు రోజుకు సగటున 6,500 టన్నుల చేపలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 3,900 టన్నులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. 15 రోజుల క్రితం వరకు శీలావతి, కట్ల, బొచ్చె వంటి రకాల చేపలను కిలో రూ.110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం కిలో రూ.90కి పడిపోయింది. పెట్టుబడులు, లీజు, మేత, కూలీల ఖర్చులు పెరిగిపోయిన తరుణంలో చేపల ధర తగ్గడం రైతులను నష్టాలకు గురి చేస్తోంది. మరోవైపు బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లోనూ చేపల సాగు మొదలవడంతో ఉత్పత్తి పెరిగింది. దీంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, దీనివల్ల ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో విద్యుత్ కొరత, యూనిట్ ధరలు ఎక్కువ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ అందించడంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. గత ఏడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో చేపల దిగుమతులు నిలిచిపోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవడంతో ఆక్వా రైతులు ఎంతో ఉత్సాహంతో సాగును చేస్తున్నారు. స్థానిక మార్కెట్లూ మందగమనమే కోవిడ్ కారణంగా పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతమవుతుండటంతో ఆ ప్రభావం స్థానిక చేపల మార్కెట్లలో కొనుగోలుపై పడుతోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు గోదావరిలో నీరు తక్కువగా ఉండటం, చేపల చెరువులకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. చేపల చెరువులకు మరికొంత కాలం నీరివ్వగలిగితే కొంతకాలం పట్టుబడులు పట్టకుండా ఆపవచ్చని, ఈలోగా ధర పెరిగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గడం వల్లే.. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల వివిధ రాష్ట్రాలలోని పట్టణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. దీంతో చేపల ఎగుమతులపై దీని ప్రభావం పడుతోంది. కిలో ధర వంద రూపాయలకు తగ్గితే రైతులు నష్టపోతారు. ఇతర రాష్ట్రాలలో చేపల పెంపకం పెరగడం కూడా ధరపై ప్రభావం చూపుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ కిలోకు రూ.20 తగ్గింది నెల రోజుల్లో చేపల ధర కిలోకు రూ.20 వరకూ తగ్గింది. ఇతర రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి పెరగడం, అక్కడ చేపల పట్టుబడులు ముమ్మరంగా చేపట్టడమే ఇందుకు కారణం. రైతులంతా ఒకేసారి చెరువుల్లో చేప పిల్లలు వేయకుండా జాగ్రత్త వహిస్తే.. చెరువులన్నీ ఒకేసారి పట్టుబడులకు రాకుండా ఉంటాయి. తద్వారా చేపల ధరల తగ్గుదలను నివారించవచ్చు. – గాదిరాజు సుబ్బరాజు, అధ్యక్షుడు, చేపల రైతుల సంఘం కరోనా ప్రభావంతో.. కరోనా ప్రభావం ఇంకా ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. దేశవ్యాప్తంగా చేపల కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గడంతో ధరలు తగ్గుతున్నాయి. దీనికితోడు ఇతర రాష్ట్రాల్లో చేపల పెంపకం పెరగడంతో అక్కడి వినియోగదారులు లైవ్ ఫిష్ తినడానికి అలవాటుపడ్డారు. దీనివల్ల ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే చేపలకు గిరాకీ తగ్గింది. – శాయన సుపర్ణ, చేపల రైతు, ఆకివీడు, పశ్చిమ గోదావరి చదవండి: రూ.92 కోట్లతో పార్కులు.. పచ్చదనం చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. -
కొండెక్కిన చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్: చేపల ధరలు కొండెక్కికూర్చున్నాయి. కరోనా కారణంగా గత కొద్ది రోజులనుంచి ఎక్కడా కనిపించని చేపలు బుధవారం అక్కడక్కడా విక్రయానికి వచ్చాయి. అయితే ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. రవ్వ, బొచ్చ, బంగారుతీగ చేపల ధరలు కిలో రూ. 200 దాటిపోయాయి. కొర్రమీను ఏకంగా 700 నుంచి 800 వరకు పలికింది. ఏపీ నుంచి చేపలు వస్తుండటం, తెలంగాణ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడంతో ధరలు ఇలా పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. ధరలను అందుబాటులో ఉంచుతామని చెబుతున్న అధికారులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. అధిక ధరలను కట్టడిచేసి చేపలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. త్వరలో ధరలు అందుబాటులోకి.. ‘కరోనా నేపథ్యంలో తెలంగాణ మత్స్యకారులు చేపలు పట్టడంలేదు. దీంతో డిమాండ్ కారణంగా కొంత మేర ధరలు పెరిగాయి. ఆదివారంలోగా ధరలు తగ్గుముఖం పడతాయి. మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు కరోనా నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు, ధరలపై హైదరాబాద్‌లో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ధరలపై సుదీర్ఘంగా చర్చించాం’అని అధికారులు తెలిపారు. కాగా, ఏపీ నుంచి సరుకులు తీసుకొచ్చే వాహనాలు దొరకడం లేదని, రవాణా భారం ఖర్చు చేపల ధరలతో కలిపి అమ్మాల్సి వస్తోందని విక్రయదారులు అంటున్నారు. -
వైజాగ్ చేప.. ‘కోనాం’గలరా?
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ మత్స్యకారులకు బుధవారం అతి భారీకొమ్ము కోనాం చేపలు లభ్యమయ్యాయి. ఫిషింగ్ హార్బర్లో బుధవారం సాయంత్రం సుమారు 20 వరకు కొమ్ము కోనాం చేపలను విక్రయించారు. ఒక్కో కొమ్ము చేప 100 కేజీల నుంచి 800 కేజీల బరువు తూగాయి. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలు పలికింది. ఇంత బరువున్న చేపలను నీటిలో నుంచి బయటకు తీసేందుకు జాలర్లు కష్టపడాల్సి వచ్చింది. వీటిని వేలం పాటలో పాడుకునేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. -
మీనం.. దీనం
- చేపల ధరలు పతనం - తగ్గిన ఎగుమతులు - దిగుబడులు పెరిగినా రైతుకు నష్టాలే కాళ్ల : పతనమవుతున్న చేపల ధరలు రైతులను నష్టాల సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. ఆరు నెలల క్రితం వరకూ కిలో రూ.100 పలికిన శీలావతి, కట్ల చేప ధర ఇప్పుడు రూ.75కు పడిపోయింది. ఒకానొక దశలో కిలో రూ.90 వరకూ వెళ్లి ఆ తరువాత రూ.60-రూ.70 మధ్య స్థిరపడిన ఫంగస్ చేప ధర అమాంతం రూ.48కి పడిపోయింది. దిగుబడులు పెరిగినా ఎగుమతులు క్షీణించడం, ధర తగ్గడంతో జిల్లాలో చేపల పెంపకం సంక్షోభంలో పడింది. మొన్నటి వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదై ఆక్సిజన్ లోపం తలెత్తడంతో చెరువుల్లోని చేపలు పెద్దఎత్తున చనిపోయూయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలించి దిగుబడులు కొంతమేర పెరి గాయి. ఇదే సందర్భంలో ఎగుమతులు, ధర లు పడిపోవడం తో చేపల్ని సాగు చేస్తున్న వారు నష్టాల్లో కూరుకుపోతున్నారు. 50 కంటైనర్లు వెళితే గొప్ప జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో అధికారికంగా, మరో లక్ష ఎకరాల్లో అనధికారికంగా చేపల సాగు జరుగుతోంది. ఆరు నెలల క్రితం వరకూ జిల్లా నుంచి నిత్యం 250 నుంచి 300 వరకూ కంటైనర్లలో (కంటైనర్‌కు 10 టన్నులు) దేశంలోని వివిధ ప్రాంతాలకు చేపలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 50 కంటైనర్లు కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా, అసోం రాష్ట్రంలోని అసోం, గౌహతి, మహారాష్ట్రలోని ముంబై, ఒడిశా మార్కెట్లకు జిల్లా నుంచి పెద్దఎత్తున చేపల్ని ఎగుమతి చేసేవారు. అక్కడా చేపల సాగు రెండేళ్ల క్రితం వరకూ చేపల సాగు లాభదాయకంగా ఉండటంతో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ చెల్లించి రైతులు భూముల్ని లీజుకు తీసుకునేవారు. ఇటీవల కాలంలో కలకత్తా, అసోం, గౌహతి, ముంబై, ఒడిశా మార్కెట్లకు సమీపంలోనే చేపల సాగు మొదలైందని ట్రేడర్లు చెబుతున్నారు. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లోనూ చేపల సాగు చేస్తున్నారు. ఆయూ ప్రాంతాల నుంచి చేపల రవాణా, ప్యాకింగ్ ఖర్చులు తక్కువగా ఉండటంతో అక్కడి సాగుదారులు తక్కువ ధరకే చేపల్ని ఎగుమతి చేయగలుగుతున్నారు. దీంతో మన ప్రాంతంలో ఉత్పత్తయ్యే చేపలకు డిమాండ్ తగ్గిపోయిందని చెబుతున్నారు. మరోవైపు గోదావరి డెల్టాలతోపాటు కృష్ణా డెల్టాలోనూ సాగు అధికమైంది. దీనివల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి, డిమాండ్ మధ్య అంతరం పెరిగిపోయిందని, ధరలు పడిపోవడానికి ఇదే కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విదేశీ మార్కెట్లపై దృష్టి పెడితేనే... చేపల్ని విదేశాలకు ఎగుమతి చేయడంపై అటు ప్రభుత్వం, ఇటు వ్యాపారులు ఇప్పటివరకూ దృష్టి సారించలేదు. మన ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న చేపల్ని దేశీయ మార్కెట్లోనే విక్రరుుస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి విపరీతంగా పెరిగిన దృష్ట్యా విదేశీ మార్కెట్లపై దృష్టి పెడితే తప్ప చేపల ఉత్పత్తిదారులు కోలుకునే పరిస్థితి ఉండదని ఆకివీడులోని మత్స్యశాఖ అధికారి కె.లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. చేపల రైతులు లాభాల బాట పట్టాలంటే విదేశీ మార్కెట్లకు ఎగుమతులు ప్రారంభించాలని అన్నారు. చైనా లాంటి దేశాలు విదేశాలకు పెద్దఎత్తున చేపల్ని ఎగుమతి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముళ్లు లేని చేపలకు మాత్రమే విదేశాల్లో గిరాకీ ఉంటుందని, వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.