మీనం.. దీనం
- చేపల ధరలు పతనం
- తగ్గిన ఎగుమతులు
- దిగుబడులు పెరిగినా రైతుకు నష్టాలే
కాళ్ల : పతనమవుతున్న చేపల ధరలు రైతులను నష్టాల సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. ఆరు నెలల క్రితం వరకూ కిలో రూ.100 పలికిన శీలావతి, కట్ల చేప ధర ఇప్పుడు రూ.75కు పడిపోయింది. ఒకానొక దశలో కిలో రూ.90 వరకూ వెళ్లి ఆ తరువాత రూ.60-రూ.70 మధ్య స్థిరపడిన ఫంగస్ చేప ధర అమాంతం రూ.48కి పడిపోయింది. దిగుబడులు పెరిగినా ఎగుమతులు క్షీణించడం, ధర తగ్గడంతో జిల్లాలో చేపల పెంపకం సంక్షోభంలో పడింది. మొన్నటి వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదై ఆక్సిజన్ లోపం తలెత్తడంతో చెరువుల్లోని చేపలు పెద్దఎత్తున చనిపోయూయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలించి దిగుబడులు కొంతమేర పెరి గాయి. ఇదే సందర్భంలో ఎగుమతులు, ధర లు పడిపోవడం తో చేపల్ని సాగు చేస్తున్న వారు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
50 కంటైనర్లు వెళితే గొప్ప
జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో అధికారికంగా, మరో లక్ష ఎకరాల్లో అనధికారికంగా చేపల సాగు జరుగుతోంది. ఆరు నెలల క్రితం వరకూ జిల్లా నుంచి నిత్యం 250 నుంచి 300 వరకూ కంటైనర్లలో (కంటైనర్‌కు 10 టన్నులు) దేశంలోని వివిధ ప్రాంతాలకు చేపలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 50 కంటైనర్లు కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా, అసోం రాష్ట్రంలోని అసోం, గౌహతి, మహారాష్ట్రలోని ముంబై, ఒడిశా మార్కెట్లకు జిల్లా నుంచి పెద్దఎత్తున చేపల్ని ఎగుమతి చేసేవారు.
అక్కడా చేపల సాగు
రెండేళ్ల క్రితం వరకూ చేపల సాగు లాభదాయకంగా ఉండటంతో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ చెల్లించి రైతులు భూముల్ని లీజుకు తీసుకునేవారు. ఇటీవల కాలంలో కలకత్తా, అసోం, గౌహతి, ముంబై, ఒడిశా మార్కెట్లకు సమీపంలోనే చేపల సాగు మొదలైందని ట్రేడర్లు చెబుతున్నారు. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లోనూ చేపల సాగు చేస్తున్నారు. ఆయూ ప్రాంతాల నుంచి చేపల రవాణా, ప్యాకింగ్ ఖర్చులు తక్కువగా ఉండటంతో అక్కడి సాగుదారులు తక్కువ ధరకే చేపల్ని ఎగుమతి చేయగలుగుతున్నారు. దీంతో మన ప్రాంతంలో ఉత్పత్తయ్యే చేపలకు డిమాండ్ తగ్గిపోయిందని చెబుతున్నారు. మరోవైపు గోదావరి డెల్టాలతోపాటు కృష్ణా డెల్టాలోనూ సాగు అధికమైంది. దీనివల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి, డిమాండ్ మధ్య అంతరం పెరిగిపోయిందని, ధరలు పడిపోవడానికి ఇదే కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
విదేశీ మార్కెట్లపై దృష్టి పెడితేనే...
చేపల్ని విదేశాలకు ఎగుమతి చేయడంపై అటు ప్రభుత్వం, ఇటు వ్యాపారులు ఇప్పటివరకూ దృష్టి సారించలేదు. మన ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న చేపల్ని దేశీయ మార్కెట్‌లోనే విక్రరుుస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి విపరీతంగా పెరిగిన దృష్ట్యా విదేశీ మార్కెట్లపై దృష్టి పెడితే తప్ప చేపల ఉత్పత్తిదారులు కోలుకునే పరిస్థితి ఉండదని ఆకివీడులోని మత్స్యశాఖ అధికారి కె.లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. చేపల రైతులు లాభాల బాట పట్టాలంటే విదేశీ మార్కెట్లకు ఎగుమతులు ప్రారంభించాలని అన్నారు. చైనా లాంటి దేశాలు విదేశాలకు పెద్దఎత్తున చేపల్ని ఎగుమతి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముళ్లు లేని చేపలకు మాత్రమే విదేశాల్లో గిరాకీ ఉంటుందని, వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.