
11 శాతం తగ్గి 37 బిలియన్ డాలర్లు
51 బిలియన్ డాలర్లకు తగ్గిన దిగుమతులు
మూడేళ్ల కనిష్టానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనూ క్షీణతను చవిచూశాయి. ఫిబ్రవరిలో 36.91 బిలియన్ డాలర్ల ఎగుమతులు (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు 41.41 బిలియన్ డాలర్లతో (రూ.3.60 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 11 శాతం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 36.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఫిబ్రవరి నెలలో దిగుమతులు సైతం 50.96 బిలియన్ డాలర్లకు (రూ.4.43 లక్షల కోట్లు) తగ్గుముఖం పట్టాయి. 2024 ఫిబ్రవరిలో దిగుమతులు 60.92 బిలియన్ డాలర్లుగా (రూ.5.30 లక్షల కోట్లు) ఉంటే, ఈ ఏడాది జనవరి నెలలో 59.42 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) 14.05 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2021 ఆగస్ట్ తర్వాత అత్యంత కనిష్ట వాణిజ్య లోటు ఇదేనని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక నెలలో కనిష్ట దిగుమతులు 2023 ఏప్రిల్ తర్వాత మళ్లీ 2025 ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనించొచ్చు.
స్వల్పంగా తగ్గిన పసిడి దిగుమతులు
→ ఫిబ్రవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో 2.68 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది.
→ జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతులు 21 శాతం తగ్గి 2.53 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
→ జనవరితో పోల్చి చూస్తే చమురు దిగుమతులు 13.4 బిలియన్ డాలర్ల నుంచి 11.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
→ ఫిబ్రవరి నెలకు సేవల ఎగుమతులు 35 బిలియన్
డాలర్లుగా నమోదయ్యాయి. జనవరిలో ఈ మొత్తం 38.55 బిలియన్ డాలర్లుగా ఉంది.
→ ఫిబ్రవరిలో సేవల దిగుమతుల విలువ 16.55 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరిలో ఈ మొత్తం 18.22 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
800 బిలియన్ డాలర్ల ఎగుమతులు..
2024–25లో సవాళ్లు నెలకొన్నప్పటికీ 800 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ వ్యక్తం చేశారు. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం అన్నది ప్రధానంగా చమురు, బంగారం, వెండి దిగుమతుల క్షీణతవల్లేనని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment