
ఆగస్ట్‌లో 58 శాతం క్షీణత
96.48 కోట్ల డాలర్లకు పరిమితం
మే నెలలో ఇవి 229 కోట్ల డాలర్లు
గత నెల(ఆగస్ట్)లో భారత్ నుంచి యూఎస్‌కు స్మార్ట్‌ఫోన్(Smart Phone) ఎగుమతులు భారీగా క్షీణించాయి. మే నెలతో పోలిస్తే 58 శాతం పడిపోయి 96.48 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. మే నెలలో ఇవి 229 కోట్ల డాలర్లుగా నమోదైనట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) పేర్కొంది. ఇది ఆందోళనకరమని, నిజానికి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులపై టారిఫ్‌లు లేవని తెలియజేసింది. వెరసి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు భారీగా క్షీణించడం వెనుక వాస్తవికర కారణాలను వెంటనే అన్వేషించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. యూఎస్‌కు భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్లు అత్యధికంగా ఎగుమతి అవుతుంటాయని, అయితే 2025 మే నుంచీ చూస్తే నెలవారీగా తగ్గుతూ వస్తున్నట్లు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం..
ఇదీ తీరు..
2025 మే నెలలో యూఎస్‌కు 2.29 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసిన భారత్, జూన్‌లో 2 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ఈ బాటలో జూలైకల్లా ఇవి 1.52 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆగస్ట్‌లో ఇవి మరింత నీరసించి 96.48 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో 10.6 బిలియన్ డాలర్ల విలువతో యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచింది. భారత్ నుంచి గ్లోబల్ ఎగుమతుల విలువ 24.1 బిలియన్ డాలర్లుకాగా.. 44 శాతం వాటాతో యూఎస్ తొలి ర్యాంకును ఆక్రమిస్తోంది. ఈ బాటలో ఈయూకు 7.1 బిలియన్ డాలర్ల విలువైన(29.5 శాతం వాటా) ఎగుమతులు జరుగుతున్నాయి. ఆగస్ట్ ఎగుమతుల్లో టారిఫ్‌లులేని ప్రొడక్టుల వాటా 28.5 శాతంకాగా.. దాదాపు 42 శాతం క్షీణించి 1.96 బిలయన్ డాలర్లకు పడిపోయాయి. మే నెలలో ఇవి 3.37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఫార్మా సైతం..
మే నెలతో పోలిస్తే ఆగస్ట్‌లో ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు సైతం బలహీనపడ్డాయి. 13.3 శాతం క్షీణించి 64.66 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. మే నెలలో ఇవి 74.5 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు అధిక టారిఫ్‌లను ఎదుర్కొంటున్న దేశీ వస్తువుల ఎగుమతులు(Exports) సైతం డీలాపడినట్లు జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఆగస్ట్‌లో జ్యువెలరీ ఎగుమతులు 9.1 శాతం నీరసించి 22.82 కోట్ల డాలర్లకు చేరాయి. పాలి‹Ùడ్ వజ్రాలు, వజ్రాలతోకూడిన బంగారు ఆభరణాల ఎగుమతులు సైతం బలహీనపడ్డాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 44 శాతం పడిపోయి 16.27 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. మే నెలలో ఇవి 28.97 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. టెక్స్‌టైల్స్, దుస్తులు తదితర ఎగుమతులు 9.3 శాతం తక్కువగా 85.55 కోట్ల డాలర్లకు చేరాయి. మేలో ఇవి 94.37 కోట్ల డాలర్లుకాగా.. కెమికల్ ఎగుమతులు 16 శాతం క్షీణించి 45.19 కోట్ల డాలర్లను తాకాయి.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు