న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఎగుమతి–దిగుమతి గణాంకాలు వెలువడుతున్నాయి. భారత్ వస్తు ఎగుమతులు వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. దిగుమతుల విషయంలో ఈ క్షీణత తొమ్మిది నెలల నుంచి నమోదవుతోంది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే..
► ఆగస్టులో ఎగుమతులు 2022 ఇదే నెలతో పోల్చితే 6.86 శాతం తగ్గి 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
► ఇదే నెల్లో దిగుమతులు 5.23 శాతం క్షీణించి 58.64 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
► ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం-వాణిజ్యలోటు 24.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూలైలో ఈ విలువ 20.67 బిలియన్‌లు కావడం గమనార్హం.
► ఎగుమతుల రంగంలో తేయాకు, కాఫీ, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు, రత్నాలు–ఆభరణాలు, జౌళి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. అయితే ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆయిల్ సీడ్స్, జీడిపప్పు, తివాచీ, ఇంజనీరింగ్, ఫార్మా, సముద్ర ఉత్పత్తులుసహా మొత్తం 30 కీలక రంగాల్లో 15 సానుకూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి.
ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో...కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతుల విలువ 12 శాతం క్షీణించి 271.83 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 98.88 బిలియన్ డాలర్లు.
పసిడి దిగుమతులు: పసిడి దిగుమతులు ఆగస్టులో 38.75% పెరిగి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఆగస్టు–ఏప్రిల్ మధ్య 10.48% పెరుగుదలతో 18.13 బిలియన్ డాలర్లుగా పసిడి దిగుమతుల విలువ ఉంది.
రష్యా నుంచి దిగుమతులు రెట్టింపు
రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏప్రిల్-ఆగస్టు మధ్య రెట్టింపయ్యాయి. క్రూడ్ ఆయిల్, ఎరువుల దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2022 ఏప్రిల్–ఆగస్టు మధ్య రష్యా నుంచి దిగుమతుల విలువ 13.77 బిలియన్ డాలర్లుకాగా, తాజా సమీక్షా కాలంలో ఈ విలువ 25.69 బిలియన్ డాలర్లకు ఎగసింది. చైనా, అమెరికాల తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్‌ది మూడవ స్థానం. ఇక చైనా నుంచి దిగుమతులు ఈ ఐదు నెలల కాలంలో 43.96 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment