Exports down
-
ఎగుమతులు ఢమాల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి భారత్ వస్తు ఎగుమతులపై ప్రభావం చూపింది. ఆగస్టులో ఎగుమతులు గడచిన 13 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో 9.3 శాతం క్షీణించి (2023 ఆగస్టు నెలతో పోల్చి) 34.71 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. జూలైలో కూడా ఎగుమతుల విలువ పడిపోయినప్పటికీ అది కేవలం 1.5 శాతంగా ఉండడం గమనార్హం. దిగుమతులు రికార్డు... ఇక దిగుమతులుసైతం రికార్డు స్థాయిలో 3.3 శాతం పెరిగి 64.36 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం – వాణిజ్యలోటు 10 నెలల గరిష్ట స్థాయిలో 29.65 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బంగారం, వెండి ప్రభావం.. బంగారం, వెండి దిగుమతులు భారీగా పెరగడం తీవ్ర స్థాయి వాణిజ్యలోటుకు ఒక కారణం. 2023 ఆగస్టులో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లుకాగా, ఈ ఆగస్టులో రెట్టింపై 10.06 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులుసైతం ఇదే సమయంలో 159 మిలియన్ డాలర్ల నుంచి 727 మిలియన్ డాలర్లకు ఎగశాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాలను (15% నుంచి 6%కి) తగ్గించడం, పండుగ సీజన్ డిమాండ్ దిగుమతులు భారీగా పెరగడానికి కారణం. కాగా, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య వస్తు ఎగుమతుల విలువ 1.14% పెరిగి 178.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంది. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి 0.2 శాతం ఎగుమతులు తగ్గినట్లు కస్టమ్స్ డేటా ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే ముడి ఖనిజాల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉంది. దాదాపు 17 అరుదైన ఖనిజాలను ఆ దేశం రవాణా చేస్తుంది. ఈమేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డేటా వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.2024 ఏప్రిల్‌లో చైనా ఎగుమతులు: 4,566 టన్నులు.2023 ఏప్రిల్‌లో ఎగుమతులు: 4,574 టన్నులు2024 మార్చిలో ఎగుమతులు: 4,709.6 టన్నులు 2024 మొదటి నాలుగు నెలల్లో మొత్తం ఎగుమతులు: 18,049.5 టన్నులుఏడాదివారీగా పెరుగుదల: 10 శాతం2024 ఏప్రిల్‌లో చైనా దిగుమతి చేసుకున్న ఖనిజాలు: మార్చితో పోలిస్తే 32.5% తగ్గి 13,145.9 టన్నులకు చేరుకున్నాయి.2024 మొదటి నాలుగు నెలల కాలంలో దిగుమతులు మొత్తం 18.1% తగ్గి 48,842.5 టన్నులుగా నమోదయ్యాయి.యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. చైనా ప్రపంచవ్యాప్తంగా 70 శాతం అరుదైన ఖనిజాలను కలిగి ఉంది. 90 శాతం మైనింగ్ రిఫైన్డ్ అవుట్‌పుట్ సామర్థ్యం చైనా సొంతం. చైనా ఎగుమతిచేసే అరుదైన ఖనిజాలతో లేజర్లు, సైనిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు , విండ్ టర్బైన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుచైనా ఇలాగే అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంటే సమీప భవిష్యత్తులో వీటితో తయారయ్యే వస్తువుల ధర పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయంగా ఖనిజాల అన్వేషణ జరిపి వాటిని వెలికితీసే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వాహన ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం వాహనాల ఎగుమతులు మందగించాయి. 2022–23తో పోలిస్తే 2023–24లో 5.5 శాతం తగ్గాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ ఎగుమతులు 47,61,299 యూనిట్లుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం 45,00,492 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ విదేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడమే ఎగుమతులు నెమ్మదించడానికి కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ‘మన వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులకు మంచి డిమాండ్ ఉన్న కొన్ని దేశాలు.. విదేశీ మారకం సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు స్వల్పంగా పెరిగినప్పటికీ, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర..త్రిచక్ర వాహనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి తొలి త్రైమాసికంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో రికవరీ కనిపించిందని, మిగతా ఏడాదంతా కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల వివరాలివీ.. ► ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6,62,703 యూనిట్ల నుంచి 6,72,105 యూనిట్లకు పెరిగాయి. మారుతీ సుజుకీ అత్యధికంగా 2,80,712 యూనిట్లు, హ్యుందాయ్ 1,63,155, కియా మోటర్స్ 52,105, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 44,180 యూనిట్లు ఎగుమతి చేశాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం క్షీణించి 36,52,122 యూనిట్ల నుంచి 34,58,416 యూనిట్లకు తగ్గాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు 16 శాతం తగ్గి 78,645 యూనిట్ల నుంచి 65,816 వాహనాలకు పరిమితమయ్యాయి. త్రిచక్ర వాహనాలు 18 శాతం క్షీణించి 3,65,549 యూనిట్ల నుంచి 2,99,977 యూనిట్లకు నెమ్మదించాయి. -
ఏడోనెలా ఎగుమతులు రివర్స్..పసిడి దిగుమతులు రయ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఎగుమతి–దిగుమతి గణాంకాలు వెలువడుతున్నాయి. భారత్ వస్తు ఎగుమతులు వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. దిగుమతుల విషయంలో ఈ క్షీణత తొమ్మిది నెలల నుంచి నమోదవుతోంది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ► ఆగస్టులో ఎగుమతులు 2022 ఇదే నెలతో పోల్చితే 6.86 శాతం తగ్గి 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇదే నెల్లో దిగుమతులు 5.23 శాతం క్షీణించి 58.64 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం-వాణిజ్యలోటు 24.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూలైలో ఈ విలువ 20.67 బిలియన్లు కావడం గమనార్హం. ► ఎగుమతుల రంగంలో తేయాకు, కాఫీ, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు, రత్నాలు–ఆభరణాలు, జౌళి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. అయితే ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆయిల్ సీడ్స్, జీడిపప్పు, తివాచీ, ఇంజనీరింగ్, ఫార్మా, సముద్ర ఉత్పత్తులుసహా మొత్తం 30 కీలక రంగాల్లో 15 సానుకూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో...కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతుల విలువ 12 శాతం క్షీణించి 271.83 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 98.88 బిలియన్ డాలర్లు. పసిడి దిగుమతులు: పసిడి దిగుమతులు ఆగస్టులో 38.75% పెరిగి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఆగస్టు–ఏప్రిల్ మధ్య 10.48% పెరుగుదలతో 18.13 బిలియన్ డాలర్లుగా పసిడి దిగుమతుల విలువ ఉంది. రష్యా నుంచి దిగుమతులు రెట్టింపు రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏప్రిల్-ఆగస్టు మధ్య రెట్టింపయ్యాయి. క్రూడ్ ఆయిల్, ఎరువుల దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2022 ఏప్రిల్–ఆగస్టు మధ్య రష్యా నుంచి దిగుమతుల విలువ 13.77 బిలియన్ డాలర్లుకాగా, తాజా సమీక్షా కాలంలో ఈ విలువ 25.69 బిలియన్ డాలర్లకు ఎగసింది. చైనా, అమెరికాల తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్‌ది మూడవ స్థానం. ఇక చైనా నుంచి దిగుమతులు ఈ ఐదు నెలల కాలంలో 43.96 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
ఎగుమతులు.. మూడో నెలా మైనస్
న్యూఢిల్లీ: ప్రపంచ, దేశీయ తాజా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతి, దిగుమతి గణాంకాలు అద్దం పడుతున్నాయి. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ఎగుమతులు వరుసగా మూడవ నెల ఫిబ్రవరిలోనూ వృద్ధిలేకపోగా క్షీణతనే నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల విలువ 8.8 శాతం పడిపోయి, 33.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల్లోనూ 8.21 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. 2022 ఇదే నెలతో పోల్చితే ఈ విలువ 55.9 బిలియన్ డాలర్ల నుంచి 51.31 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వెరసి అధికారిక గణాంకాల ప్రకారం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 17.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య... 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య 11 నెలల్లో వస్తు ఎగుమతులు 7.5% పెరిగి, 406 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇదే కాలంలో దిగుమతులు 18.82% పెరిగి 653 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 247 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లు తాకాయి. 2022-23లో ఈ విలువను అధిగమిస్తున్నామన్న హర్షాతిరేకాలు భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ)సహా సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ► 11 నెలల్లో పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ గూడ్స్, బియ్యం, రెడీ మేడ్ దుస్తుల ఎగుమతులు పెరగ్గా, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాభరణాలు, కాటన్ యార్న్, ఫ్యాబ్రిక్స్, ప్లాసిక్, లినోలియం ఎగుమతులు క్షీణించాయి. ► పసిడి దిగుమతులు ఇదే కాలంలో భారీగా పడిపోయి, 45.12 బిలియన్ డాలర్ల నుంచి 31.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఇక క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు 11 నెలల్లో 140.67 బిలియన్ డాలర్ల నుంచి 193.47 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
రెండోనెలా ఎగుమతులు కిందికే... జనవరిలో 7 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 6.58 శాతం తగ్గి, 32.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులు దీనికి నేపథ్యం. గడచిన 10 నెలలుగా ఇంజనీరింగ్ గూడ్స్, ముడి ఇనుము, ప్లాస్టిక్, రత్నాలు–ఆభరణాల రంగాలు క్షీణ రేటులో ఉన్నాయి. 10 నెలల్లో... ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 21.89 శాతం పెరిగి 602.20 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు ఈ కాలంలో 233 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లుపైబడగా, 2022–23లో కూడా దాదాపు ఇదే గణాంకాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా సమీక్షా కాలం 10 నెలల్లో క్రూడ్ దిగుమతుల విలువ 53.54 శాతం పెరిగి 178.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులూ క్షీణతే.. దిగుమతులు కూడా జనవరిలో 3.63 శాతం క్షీణించాయి. విలువలో 50.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు ఏప్రిల్–జనవరి మధ్య 11.26% తగ్గి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 12 నెలల కనిష్టం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 12 నెలల కనిష్టంగా 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రష్యా నుంచి 384 శాతం పెరిగిన దిగుమతులు 2022–23 ఏప్రిల్–జనవరి మధ్య రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏకంగా 384 శాతం పెరగడం గమనార్హం. విలువలో ఏకంగా 37.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రూడ్ ఈ విలువలో కీలక వెయిటేజ్ పొందింది. 2021–22లో 9.86 బిలియన్ డాలర్ల దిగుమతులతో రష్యా భారత్‌కు 18వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. తాజా సమీక్షా నెల్లో ఈ అంకె 4కు తగ్గిపోయింది. ఆర్థిక మంత్రి సూచనలు.. అంతర్జాతీయంగా మందగమనం వచ్చే అవకాశాలను, తమ తమ వ్యాపారాలపై దాని ప్రభావాల గురించి ఎగుమతిదారులు ముందస్తుగానే అంచనాలు వేసుకుని సన్నద్ధంగా ఉండాలని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని పేర్కొన్నారు. రూపాయిలో వాణిజ్యానికి ఆసక్తి భారత్‌తో రూపాయిలో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు పలు దేశాల్లో ఆసక్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు వీలుగా పలు బ్యాంకులు ప్రత్యేక వ్యాస్టో అకౌంట్లను ప్రారంభిస్తున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అకౌంట్లు ప్రారంభించిన జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యుకో బ్యాంక్‌సహా 20 బ్యాంకులు ఉన్నట్లు ఆయన తెలిపారు. రష్యాసహా రూపాయిలో ట్రేడింగ్‌కు ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి. భారత్ పొరుగు దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్లు కూడా వీటిలో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో ఆ దేశంపై అంతర్జాతీయ ఆంక్షలు, దీనితో డాలర్ మారకంలో వాణిజ్యంలో ఇబ్బందులు వంటి పరిణామాలు రూపాయిలో వాణిజ్యానికి దారితీసిన సంగతి తెలిసిందే. -
ఆర్థిక మందగమనం: జ్యుయల్లరీ ఎగుమతులు డౌన్
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జూలైలో స్వల్పంగా తగ్గాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశం ఈ కాలంలో రూ.24,914 కోట్ల (3,130 మిలియన్ డాలర్లు) విలువైన రత్నాలు, ఆభరణాలను ఎగుమతి చేసింది. జీజేఈపీసీ నివేదిక ప్రకారం 2021 ఇదే నెల్లో ఈ విలువ రూ.25,158 కోట్లు (3,376 మిలియన్ డాలర్లు). ఇక ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో వీటి ఎగుమతుల పరిమాణం 11 శాతం పెరిగి 1,03,931 కోట్లకు (13,368 మిలియన్ డాలర్లు) చేరింది. కాగా ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ స్థూల ఎగుమతులు 8 శాతం పెరిగి రూ.15,388 కోట్లకు (1,933.32 మిలియన్ డాలర్లు) ఎగశాయి. ఇక ఏప్రిల్–జూలై మధ్య వెండి ఆభరణాల ఎగుమతుల విలువ తొలి అంచనాల ప్రకారం 30 శాతం పెరిగి రూ.8,232 కోట్లకు (1,058 మిలియన్ డాలర్లు) ఎగసింది. -
నెమ్మదించిన చక్కెర మిల్లుల ఎగుమతి ఒప్పందాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరల పతనం నేపథ్యంలో దేశంలో చక్కెర మిల్లుల తాజా ఎగుమతి ఒప్పందాలు నెమ్మదించాయిని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) పేర్కొంది. అయితే ఒప్పందాలకు సమయం మించిపోలేదని, ఇందుకు సంబంధించి సమయం ఇంకా మిగిలే ఉందని కూడా స్పష్టం చేసింది. చక్కెర మిల్లుల సంఘం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకూ సీజన్‌కాగా, ఇందులో తొలి రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) చక్కెర మిల్లుల నుంచి 6.5 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన ఎగుమతులు 3 లక్షల టన్నులు. ► ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ 37 లక్షల టన్నుల ఎగుమతులకు చక్కెర మిల్లులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే, ఈ ఒప్పందాలు చాలా వరకు అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరలు పౌండ్‌కు (0.453 గ్రాములు) 20–21 సెంట్ల శ్రేణిలో (100 సెంట్లు ఒక డాలర్) ఉన్నప్పుడు జరిగాయి. కనిష్టంగా ఈ ధర 19 సెంట్స్‌కు పడిపోయింది. ప్రస్తుతం 19.6 సెంట్స్ స్థాయిలో ఉంది. అయితే ఈ ధర వద్ద భారత్ చక్కెర ఎగుమతులకు తగిన ధర లభించని పరిస్థితి ఉంది. ► ప్రస్తుత సీజన్లో ఇంకా తొమ్మిది నెలలకు పైగా సమయం మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో చక్కెర మిల్లులు ఎగుమతి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలమైన క్షణం కోసం వేచి ఉండటానికి తగినంత సమయం ఉందని సాధారణ అభిప్రాయం నెలకొంది. ► భారత చక్కెర మిల్లులు రాబోయే 7–8 నెలల్లో మరో రెండు మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయాలని ప్రపంచం కోరుకుంటే, ప్రపంచ (చక్కెర) ధరలు ప్రస్తుత స్థాయిల నుండి పెరగాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ► ప్రస్తుతం కొనసాగుతున్న 2021–22 సీజన్లో డిసెంబర్ 15 వరకు దేశంలో చక్కెర ఉత్పత్తి 77.91 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది గత సీజన్ ఇదే కాలంలో పోల్చితే (73.34 లక్షల టన్నులు) ఎక్కువ. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో చెరకు క్రషింగ్‌ను ముందుగా ప్రారంభించినందున ఈ సీజన్లో ఉత్పత్తి కొంచెం ఎక్కువగా ఉంది. ► అయితే దేశంలో చక్కెర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 15 వరకు 19.83 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. గత సీజన్లో ఇదే కాలంతో పోల్చిచూస్తే (22.60 లక్షల టన్నులు) ఇది తక్కువ. ► దేశంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉత్పత్తి 26.96 లక్షల టన్నుల నుంచి 31.92 లక్షల టన్నులకు పెరిగింది. క్రషింగ్ కార్యకలాపాలు ముందుగా ప్రారంభం కావడం, ప్రస్తుత సీజన్లో చెరకు ఎక్కువగా లభ్యం కావడం వంటి అంశాలు మహారాష్ట్రలో ఉత్పత్తి పెరుగుదలకు కారణం. ► దేశంలోని మూడో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన కర్ణాటకలో ఈ సీజన్లో డిసెంబర్ 15 వరకు ఉత్పత్తి 18.41 లక్షల టన్నులకు చేరుకుంది. క్రితం ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది (16.65 లక్షల టన్నులు) ఇది ఎక్కువ. లక్ష్యం దిశగా ఇథనాల్ సరఫరా.... ఐఎస్ఎంఏ ప్రకటన ప్రకారం, ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యం దిశగా వెళుతోంది. నవంబర్‌తో ముగిసిన 2020–21 సీజన్లో 302.30 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా జరిగిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ తెలిపింది. దీనితో పెట్రోల్‌లో దీని మిశ్రమం అఖిల భారత స్థాయిలో 8.1 శాతానికి చేరింది. 2019–20లో ఈ మిశ్రమం కేవలం 5 శాతం కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్లో (2021 డిసెంబర్–2022 నవంబర్) 10 శాతం మిశ్రమం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకు 459 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. మొదటి రెండు ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియల (ఈఓఐ) అనంతరం చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇప్పటివరకు మొత్తం 366 కోట్ల లీటర్లను కేటాయించడం జరిగింది. తదుపరి ఈఓఐల ద్వారా మిగిలిన లీటర్ల కేటాయింపులు జరుగుతాయని భావిస్తున్నట్లు ఐఎస్ఎంఏ పేర్కొంది. -
కరోనా కేసులు, ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: వచ్చేవారంలో స్టాక్ మార్కెట్ గమనానికి కరోనా కేసుల పెరుగుదల, కంపెనీల జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయని స్టాక్‌మార్కెట్ నిపుణులంటున్నారు. గతవారంలో దేశీయంగా కీలక సూక్ష్మ ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి 6.93శాతంగా నమోదైంది. ఎగుమతులు మాత్రం 10.21శాతం క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాటిని విశ్లేషిస్తే ఆర్థిక మందగమనం కొంత రికవరి సాధించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధిక ద్రవ్బోల్బణం నెలకొంది. దీంతో సెంటిమెంట్ కొంత బలహీన మార్కెట్లో అస్థిరత కొనసాగవచ్చని వారంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం రెండో దఫా చర్యలకు శ్రీకారం చుట్టవచ్చని అంచనాలు దలాల్ స్ట్రీట్ వర్గాల్లో నెలకొన్నాయి. అలాగే ఈ వారంలో 12కి పైగా ప్రధాన కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్ మార్కెట్‌కు కీలకం కానుంది. మరో విడత ప్యాకేజీపై ఆశలు... ‘ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఇది మార్కెట్ వర్గాలను కచ్చితంగా ఉత్సాహపరిచే అంశమే. కంపెనీల క్యూ1 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించగలవు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. క్యూ1 ఫలితాల విడుదల అంతిమ దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు తిరిగి కోవిడ్–19 కేసులు నమోదు, లాక్డౌన్ సడలింపులు తర్వాత ఆర్థిక వ్యవస్థ రికవరి అంశాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్‌పర్సన్ సంజీవ్ జర్బాదే తెలిపారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలతో వచ్చే వారంలో మార్కెట్ ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా కరోనా కేసుల పెరుగుదల అంశం దలాల్ స్ట్రీట్‌ను గమానికి కీలకం కానుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలు... కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు అమెరికా మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే అక్కడి ఆర్థికవేత్తలు అభిప్రాయపడున్నారు. అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. అలాగే క్రూడాయిల్ ధరలు కూడా మార్కెట్‌కు కీలకం కానున్నాయి. విదేశీ పెట్టుబడుల జోరు! దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా లిక్విడిటీ పెరగడంతో పాటు ఇప్పటివరకు విడుదలైన దేశీయ కార్పోరేట్ కంపెనీల క్వార్టర్ ఫలితాలు అంచనాలకు మించి నమోదుకావడంతో మన మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్‌పీఐలు ఆసక్తిచూపుతున్నారు. ఈ ఆగస్ట్ ప్రథమార్ధంలో డెట్, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.28,203 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 5నెలల అనంతరం డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా మారడం విశేషం. ఎఫ్‌పీఐలు జూన్, జూలైలో వరుసగా రూ.3,301 కోట్లు, రూ.24,053 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూల కారకాల మేళవింపు ఫలితంగా భారత మార్కెట్లోకి అధిక మొత్తంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని మార్నింగ్‌స్టార్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ హిమాంశ్ శ్రీవాస్తవ తెలిపారు. కరోనా ఎఫెక్ట్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు పలుదేశాల సెంట్రల్ బ్యాంకులు ఉద్దీపన చర్యలు ప్రకటించడమూ దీనికి నేపథ్యం. -
ఎగుమతులు 10% డౌన్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఎగుమతులు క్షీణించాయి. జూలైలో 23.64 బిలియన్ డాలర్ల (రూ.1.77 లక్షల కోట్లు) ఎగుమతులు సాధ్యమయ్యాయి. ప్రధానంగా పెట్రోలియం, తోలు, రత్నాలు, జ్యుయలరీ ఎగుమతులు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ (లాక్ డౌన్ లు ఎక్కువగా అమలైన కాలం) నెలలతో పోలిస్తే జూలైలో ఎగుమతుల క్షీణత తగ్గిందనే చెప్పుకోవాలి. ఏప్రిల్ లో ఎగుమతులు ఏకంగా అంతక్రితం ఏడాది అదే నెలతో పోలిస్తే 60 శాతం పడిపోగా, మే నెలలోనూ 37 శాతం, జూన్ లో 12.41 శాతం మేర తగ్గాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలు కూడా సతమతమవుతుండడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇక జూలై నెలలో దిగుమతులు సైతం 28 శాతం మేర తగ్గి 28.47(రూ.2.17లక్షల కోట్లు) బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులతో పోలిస్తే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం) 4.83 బిలియన్ డాలర్లు(రూ.36,225కోట్లు)గా నమోదైంది. గతేడాది జూలై నాటికి ఉన్న వాణిజ్య లోటు 13.43 బిలియన్ డాలర్ల (రూ.లక్ష కోట్లు)తో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉండడం కాస్త ఊరటగానే చెప్పుకోవాలి. 18 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జూన్ లో మన దేశం వాణిజ్య పరంగా మిగులును నమోదు చేయడం గమనార్హం. -
ఎగుమతులు.. మూడోనెలా రివర్స్
న్యూఢిల్లీ: ఎగుమతులు క్షీణబాట వీడలేదు. వరుసగా మూడవనెల మేలో మైనస్ 36.47 శాతం క్షీణించాయి (2019 మే నెల ఎగుమతుల విలువతో పోల్చి). 19.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఏప్రిల్‌తో (–60.28 శాతం) పోల్చితే క్షీణ రేటు మెరుగుపడ్డమే ఊరటనిచ్చే అంశం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను ఆవిష్కరించింది. కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► పెట్రోలియం ఉత్పత్తులు (–68.46 శాతం) జౌళి (–66.19 శాతం), ఇంజనీరింగ్ (–24.25 శాతం), రత్నాలు–ఆభరణాల (–68.83 శాతం), తోలు (–75 శాతం) ఎగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. ► మేలో దిగుమతులు మైనస్ 51% క్షీణతను నమోదుచేసుకుని, 22.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► దీనితో ఎగుమతి–దిగుమతిల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు 3.15 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019 ఇదే నెల్లో 15.36 బిలియన్ డాలర్లు. ► మేలో ఒక్క చమురు దిగుమతుల విలువ మైనస్ 71.98 శాతం పతనమై, 3.49 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019 మే నెలలో 12.44 బిలియన్ డాలర్లు. కాగా చమురుయేతర దిగుమతుల విలువ మైనస్ 43.13 శాతం క్షీణించి 18.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► పసిడి దిగుమతులు 98.4% క్షీణించి 76.31 మిలియన్ డాలర్లకు దిగజారాయి. ఏప్రిల్–మే చూస్తే...: 2020 ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు మైనస్ 47.54% క్షీణించి, 29.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు మైనస్ 5.67% క్షీణించి 39.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్లుగా ఉంది. శుభ సంకేతం... మేలో దేశం మొత్తం దాదాపు లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలోనూ ఎగుమతులు తక్కువగా క్షీణించడం (ఏప్రిల్‌తో పోల్చితే) శుభసంకేతం. జూన్ మొదటివారంలో ఎగుమతుల డేటా మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. 2019 ఇదే కాలంతో పోల్చితే జూన్ మొదటివారం ఎగుమతులు కేవలం మైనస్ 0.76 శాతం క్షీణతతో 4.94 బిలియన్ డాలర్లకు తగ్గాయి. – పియూష్ గోయెల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి -
ఎగుమతులు.. 60 శాతం మైనస్
న్యూఢిల్లీ: కరోనా ప్రభావం ఏప్రిల్ ఎగుమతులపై తీవ్రంగా పడింది. ఎగుమతుల్లో –60.28 శాతం క్షీణత నెలకొంది. ఇక దిగుమతులదీ అదే పరిస్థితి. 58.65 శాతం క్షీణించాయి. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదలచేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► ఏప్రిల్‌లో ఎగుమతుల విలువ కేవలం 10.36 బిలియన్ డాలర్లు. 2019 ఇదే నెలలో ఈ విలువ 26 బిలియన్ డాలర్లు. ► ఇక దిగుమతుల విలువ 41.4 బిలియన్ డాలర్లు (2019 ఏప్రిల్) నుంచి తాజా సమీక్షా నెలలో 17.12 బిలియన్ డాలర్లకు పడింది. ► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 6.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2019 ఇదే నెలలో ఈ వ్యత్యాసం 15.33 బిలియన్ డాలర్లు. ► ఆభరణాలు(–98.74%), తోలు (–93.28%), పెట్రోలియం ప్రొడక్టులు(–66.22 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–64.76%) ఎగుమతులు భారీ క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. ► ఏప్రిల్‌లో మొత్తం దిగుమతుల విలువలో చమురు వాటా 4.66 బిలియన్ డాలర్లు. 2019 ఏప్రిల్‌తో పోల్చితే విలువ 59.03% తక్కువ. ► మార్చి నెలలో కూడా ఎగుమతుల విలువ 34.57 శాతం పడిపోయిన సంగతి గమనార్హం. ► కాగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం ఎగుమతుల విలువ 214.61 బిలియన్ డాలర్లని ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. 2018–19తో పోల్చితే ఇది 4.3% పెరుగుదల. ఇక ఈ రంగం దిగుమతుల విలువ ఈ కాలం లో 131.56 బలియన్ డాలర్లు. ఒక్క మార్చి నెలలో ఎగుమతులు 18.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా ఇదే నెలలో సేవల దిగుమతులు 11.11 బిలియన్ డాలర్లు. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. దిగుమతుల్లో కూడా తగ్గుదల .. గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా. -
వజ్రాల ఎగుమతులకూ దెబ్బ..
ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ మరింతగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత వజ్రాల ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. 2020–21 ఆఖరు నాటికి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ ఎగుమతులు తగ్గడమో లేదా అదే స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. 2018–19లో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారత్ నుంచి మొత్తం వజ్రాల ఎగుమతులు విలువపరంగా 18% తగ్గాయి. వీటిలో 40% ఎగుమతులు హాంకాంగ్‌కి జరిగాయి. అయితే, జనవరి 15 నుంచి హాంకాంగ్‌కు ఎగుమతులు నిల్చిపోయాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో ఎగుమతులు మరింత తగ్గవచ్చు. ఆగ్నేయాసియా ప్రాంతంలో సెలవులు, కోవిడ్ వ్యాప్తితో మార్కెట్లు మూతబడటం మొదలైన అంశాల కారణంగా ఈ ఒక్క త్రైమాసికంలోనే దాదాపు బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని అంచనా’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సుబోధ్ రాయ్ తెలిపారు. ఇప్పటికే డిమాండ్ పడిపోయి, వసూళ్లు తగ్గిపోవడం.. హాంకాంగ్‌లో రాజకీయ సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న వజ్రాల పరిశ్రమకు కోవిడ్19 మరో కొత్త సమస్యగా పరిణమించిందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య భాగంలో గానీ పరిశ్రమ పరిస్థితి చక్కబడకపోవచ్చని చెప్పారు. -
ఎగుమతులు ‘రివర్స్’లోనే..
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా నాల్గవ నెలా నిరాశనే మిగిల్చాయి. అసలు వృద్ధిలేకపోగా –0.34 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 25.98 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులూ క్షీణ బాటలో ఉన్నాయి. –12.71 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి దిగుమతుల విలువ 38.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 12.12 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018 నవంబర్‌లో వాణిజ్యలోటు 17.58 బిలియన్ డాలర్లు. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► పెట్రోలియం (–13.12 శాతం), రత్నాలు– ఆభరణాలు(–8.14 శాతం), పండ్లు–కూరగాయలు (–15.10%), తోలు ఉత్పత్తులు (–5.29%), రెడీమేడ్ దుస్తుల (–6.52 శాతం) ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు. ఎగుమతులకు సంబంధించి దాదాపు 30 కీలక రంగాల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి. ► పసిడి దిగుమతులు నవంబర్‌లో 6.59 శాతం ఎగబాకాయి. 2.94 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ► చమురు దిగుమతులు – 18.17% పడిపోయి 11.06 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతుల విలువ 10.26 శాతం తగ్గి 27.04 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎనిమిది నెలల్లోనూ క్షీణత...: కాగా, ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే, ఎగుమతులు 1.99 శాతం పడిపోయి 211.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 8.91 శాతం పడిపోయి 318.78 బిలియన్ డాలర్లకు చేరాయి. సేవల ఎగుమతుల్లో 5 శాతం వృద్ధి ఇదిలావుండగా, అక్టోబర్‌లో సేవల ఎగుమతులు 5.25 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఈ ఎగుమతులు 17.70 బిలియన్ డాలర్లు. అయితే ఎగుమతుల విలువ మాత్రం దాదాపు యథాతథంగా 10.86 బిలియన్ డాలర్లుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2018 అక్టోబర్‌లో సేవల ఎగుమతుల విలువ 16.82 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 10.10 బిలియన్ డాలర్లు. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల వాటా దాదాపు 55 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇబ్బందిగానే ఉంది.. 2019 నవంబర్‌లో ఇంజనీరింగ్ ఎగుమతుల్లో వృద్ధి 6.32 శాతంగా ఉంది. అయితే మొత్తంగా చూస్తే, విదేశీ వాణిజ్య పరిస్థితులు సవాళ్లమయంగా కనిపిస్తోంది. ప్రపంచమార్కెట్లో మరింతగా పోటీపడేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. – రవి సింఘాల్, ఈఈపీసీ ఇండియా చైర్మన్ ఆర్థిక వ్యవస్థలో బలహీనత గణాంకాలు చూస్తుంటే, ఆర్థిక వ్యవస్థలో బలహీన డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఆయిల్, రవాణా తదితర పరికరాల దిగుమతులు క్షీణతలో ఉండడం ఇక్కడ గమనార్హం. – అదితి నాయర్, ఐసీఆర్ఏ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
ఎగుమతులు రివర్స్‌గేర్
న్యూఢిల్లీ: భారత్ ఆరి్థక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి–దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాశాలను చూస్తే... ► ఆగస్టులో ఎగుమతుల విలువ 26.13 బిలియన్ డాలర్లు. 2018 ఆగస్టుతో పోలి్చతే విలువ పెరక్కపోగా 6 శాతం క్షీణించింది. పెట్రోలియం, ఇంజనీరింగ్, తోలు, రత్నాలు, ఆభరణాల విభాగంలో అసలు వృద్ధిలేదు. ఎగుమతులకు సంబంధించి మొత్తం 30 కీలక రంగాలను చూస్తే, 22 ప్రతికూలతనే నమోదుచేసుకున్నాయి. రత్నాలు ఆభరణాల విభాగంలో –3.5% క్షీణత, ఇంజనీరింగ్ గూడ్స్ విషయంలో 9.35% క్షీణత, పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో 10.73% క్షీణత నమోదయ్యింది. కాగా సానుకూలత నమోదు చేసిన రంగాల్లో ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, సుగంధ ద్రవ్యాలు, మెరైన్ ప్రొడక్టులు ఉన్నాయి. ► దిగుమతుల విలువలో కూడా (2018 ఆగస్టుతో పోలి్చతే) అసలు పెరుగుదల లేకపోగా 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ 39.58 బిలియన్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో ఇంత స్థాయి క్షీణత 2016 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో ఈ క్షీణ రేటు మైసస్ 14 శాతంగా ఉంది. ► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఆగస్టులో వాణిజ్యలోటు 17.92 బిలియన్ డాలర్లు. ► ఆగస్టులో చమురు దిగుమతులు 8.9 శాతం పడిపోయి 10.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు కూడా 15 శాతం క్షీణించి, 28.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక ప్రత్యేకించి పసిడి దిగుమతులు చూస్తే, భారీగా 62.49 శాతం పడిపోయి 1.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏడాదంతా నిరుత్సాహమే... భారత్ ఎగుమతుల విభాగం ఈ ఏడాది ఇప్పటి వరకూ నిరుత్సాహంగానే నిలిచింది. ఆరి్థక వ్యవస్థ మందగమనం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తయారీ రంగం మందగమనంతో జూలైలో తయారీ రంగం వృద్ధి కూడా 4.3 శాతానికి పరిమితం అయ్యింది. కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ చూసుకుంటే, భారత్ ఎగుమతులు 1.53 శాతం క్షీణించి, 133.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు కూడా 5.68 శాతం పడిపోయి 206.39 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 72.85 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సరుకులపై ‘సమ్మె’ట
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలపై లారీల సమ్మె పోటు పడింది. దేశవ్యాప్తంగా లారీల బంద్ నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధర లు 15 శాతం వరకు పెరిగాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. లారీ సమ్మెను సాకుగా చూపుతూ రాజధానిలోని పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి, ఆలు, కర్నూలు నుంచి సరఫరా అయ్యే బియ్యం, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చే టమోట ధరలు పెరిగాయి. భవన నిర్మాణ రంగంపైనా సమ్మె ప్రభావం కనిపిం చింది. సిమెంట్, స్టీల్ రవాణాకు ఆటంకం కలగడం తో నిర్మాణ రంగం స్తంభించింది. రాజధానికి రోజూ సరఫరా అయ్యే సుమారు 5 వేల లారీలకు పైగా ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో నిల్వల ధర లు అనూహ్యంగా పెరిగాయి. సిమెంట్, ఐరన్, కంకర వంటి వస్తువుల సరఫరా ఆగిపోయింది. మరింత ఉధృతం చేస్తాం.. మరోవైపు సమ్మె విరమణ దిశగా బుధవారం రవాణా శాఖ అధికారులు లారీ సంఘాలతో సమావేశమైనప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి లేకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సమ్మె విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తా మని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అవసర మైతే అత్యవసర వస్తువులను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. లారీ బంద్‌లో భాగంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా ఒక రోజు బంద్ పాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా నిరవధిక బంద్‌కు దిగుతారని స్పష్టం చేశారు. ధరలకు రెక్కలు హైదరాబాద్‌లోని బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్, కొత్తపేట్, బోయిన్పల్లి, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, తదితర మార్కెట్లలోని అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కొంత మేర పెరిగాయి. సమ్మెకు ముందుతో పోలిస్తే రిటేల్ మార్కెట్లో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంపు ఉంది. వస్తువుల నిల్వలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు సమ్మెను సొమ్ము చేసుకొనేందుకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే కంది పప్పు ధర రూ.60 నుంచి రూ.66కు పెరిగింది. ఎర్ర పప్పు ధర రూ.50 నుంచి రూ.55కు, పెసర పప్పు కిలో రూ.60 నుంచి రూ.67కు పెరిగింది. పంజాబ్ నుంచి దిగుమతి అయ్యే మినప పప్పు రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. వంట నూనెల ధరలు లీటర్ రూ.86 నుంచి రూ.96కు పెరిగాయి. మదనపల్లి నుంచి నగరానికి వచ్చే టమోటా కిలో రూ.30 నుంచి రూ.40కి చేరింది. చిక్బల్లాపూర్ నుంచి వచ్చే బిన్నీస్ కిలో రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. పచ్చి మిర్చి కిలో ధర రూ.50 నుంచి రూ.60కి పెరిగింది. భారీగా పడిపోయిన అమ్మకాలు లారీల సమ్మె వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.2,500 కోట్ల మేర వ్యాపార కార్యకలాపాలు స్తంభించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరవ్యాప్తంగా వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు పడిపోయింది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల లారీలు సరుకు రవాణా చేస్తుండగా ఒక్క హైదరా బాద్ నుంచే 50 వేలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఈ లారీలన్నీ సమ్మెలో పాల్గొనడంతో డీసీఎంలు, ఇతర మినీ వాహనాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్‌కు దిగుమతులు నిలిచిపోయాయి. సమ్మె ఇలాగే కొనసాగితే నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభావం స్వల్పమే ఇప్పటి వరకైతే సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు డీసీఎంలలో వస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలను తెచ్చేందుకు రైతులు ఆటోలు, చిన్న ట్రాలీలను వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో సమ్మె ప్రభావం తక్కువగానే ఉంది. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ ధరలు పెరిగాయి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయల ధరలు కొంతమేరకు పెరిగాయి. దీంతో మేం కూడా ఆ మేరకు ధరలు పెంచి అమ్మాల్సి వస్తోంది. ఈ సీజన్లో ఎక్కువగా పండని వాటిపైనా ధరల ప్రభావం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే కూరగాయల విషయంలో లారీల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. – జంగయ్య, కూరగాయల వ్యాపారి, మీరాలంమండి ధరలు భగ్గుమంటున్నాయి రెండ్రోజుల నుంచి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఇటీవల వరకు వంకాయ, ఆలు, గొకరకాయ ధరలు కిలో రూ.30 వరకు ఉండేవి. ఇప్పుడు రూ.50 వరకు పలుకుతున్నాయి. ఇదేంటని అడిగితే సమ్మె ప్రభావమని చెబుతున్నారు. – సయ్యద్ ముక్తార్, వినియోగదారుడు -
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: 2017–18 భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 8.67 శాతం తగ్గాయి. 2016–17లో రూ.2,89,207 కోట్లుగా ఉన్న ఈ ఎగుమతుల విలువ 2017–18లో 2,64,131 కోట్లకు తగ్గిందని రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) గణాంకాలు పేర్కొన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 27 శాతం తగ్గిన డిమాండ్ దీనికి కారణమని కూడా జీజేఈపీసీ విశ్లేషించింది. యూఏఈలో జనవరిలో 5 శాతం వ్యాట్‌ను విధించిన విషయాన్ని గుర్తు చేసింది. ఎగుమతుల్లో తొలిస్థానం 33 శాతంతో హాంకాంగ్ నిలవగా, 25 స్థానంలో యూఏఈ, 23 స్థానంలో అమెరికా నిలిచింది. -
మళ్లీ ఎగుమతులు డౌన్!
• ఆగస్టులో మైనస్ 0.3% క్షీణత • వెనుకడుగు వీడలేదన్న సంకేతాలు • దిగుమతులదీ క్షీణబాటే... • 12 బిలియన్ డాలర్ల నుంచి • 8 బిలియన్ డాలర్లకు వాణిజ్యలోటు • 77 శాతం పడిపోయిన పసిడి దిగుమతి న్యూఢిల్లీ: ఎగుమతులకు సంబంధించి ‘జూన్’ వృద్ధి ఆ నెలకే పరిమితమయ్యింది. జూలై తరువాత వరుసగా రెండవ నెల ఆగస్టులోనూ దేశ ఎగుమతులు పడిపోయాయి. ఆగస్టు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా -0.3% క్షీణత నమోదయ్యింది. విలువ రూపంలో చూస్తే... ఆగస్టు 2015లో ఎగుమతుల విలువ 21.58 బిలియన్లుకాగా 2016 ఆగస్టులో విలువ 21.51 బిలియన్ డాలర్లు. 2014 డిసెంబర్ నుంచీ వరుసగా 19 నెలలు 2016 మే వరకూ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా పడిపోతూ వచ్చాయి. జూన్‌లో స్వల్ప వృద్ధితో ఊరట నిచ్చాయి. దిగుమతులు చూస్తే... ఇక దిగుమతుల్లోనూ వృద్ధి లేదు. ఆగస్టులో -14 శాతం క్షీణించి 29.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్య లోటు 7.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యిం ది. గత ఏడాది ఆగస్టులో వాణిజ్య లోటు 12.4 బిలియన్ డాలర్లు. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణతలో ఉన్న రంగాల్లో పెట్రోలియం ఉత్పత్తులు (14 శాతం), తోలు (7.82 శాతం) కెమికల్స్ (5 శాతం). ⇔ ఇక చమురు దిగుమతుల విలువ -8.47 శాతం పడిపోయి 6.74 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ⇔ ఎగుమతుల్లో సానుకూల వృద్ధి నమోదయిన రంగాల్లో ఇంజనీరింగ్, జౌళి, ఫార్మా, రత్నాలు, ఆభరణాలు, ఇనుప ఖనిజం విభాగాలు ఉన్నాయి. ⇔ ఎగుమతులు మొత్తంలో నాన్-పెట్రోలియం ఎగుమతుల విలువ 1.79 శాతం పెరిగి 19.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పసిడి... కేంద్రానికి ఊరట పసిడి దిగుమతుల విలువ 2015 ఆగస్టుతో పోల్చిచూస్తే ఏకంగా -77.45% పడిపోయి 2016 ఆగస్టులో 1.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆగస్టులో ఈ విలువ 4.95 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ ఈ మెటల్ దిగుమతులు పడిపోతూ వస్తున్నాయి. దేశానికి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం (ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా) మధ్య వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటుకు సంబంధించి ప్రభుత్వానికి ఇది ఎంతో సానుకూల వార్తని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఎండీ రాజేష్ కోస్లా తెలిపారు. ఐదు నెలల్లో ఇలా...: ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ గత ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే- ఎగుమతులు 3% పడిపోయి 108.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 16% పడిపోయి 143.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు గణనీయంగా 58 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 40 శాతానికి పైగా పడిపోయి 35 బిలియన్ డాలర్లకు తగ్గింది. సేవల ఎగుమతులూ తగ్గాయ్ కాగా గురువారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూలై నెలలో భారత సేవల ఎగుమతుల విలువను వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఎగుమతుల విలువ 4.11 శాతం క్షీణించి, 12.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ విభాగంలో దిగుమతులు సైతం 1.2 శాతం తగ్గిపోయి 7.41 బిలియన్లుగా నమోదయ్యాయి. ఐదు నెలల కాలంలో ఈ విభాగంలో ఆర్డర్ విలువ 52.47 బిలియన్ డాలర్లు. వృద్ధికి త్రిముఖ వ్యూహం... భారత్ ఎగుమతుల వృద్ధి క్షీణ ధోరణి పట్ల కేంద్రం వాణిజ్యశాఖ ఆందోళనతో ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వృద్ధికి త్రిముఖ వ్యూహం అవలంభించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందులో ఒకటి అత్యుత్తమ ఎక్స్ఛేంజ్ రేటు రూపకల్పన ఒకటని తెలి పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రవాణా రేట్లలో సవరణలు, వీసా వ్యవస్థ సరళీకరణ ప్రణాళికలో భాగమని వివరించారు. -
మే నెలలోనూ ఎగుమతులు డౌన్
వరుసగా 18వ నెలలోనూ క్షీణతే న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడంతో ఎగుమతులు మే నెలలో 0.79 శాతం క్షీణించి 2,217 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు వరుసగా 18వ నెలలో కూడా పతనమయ్యాయి. మే నెలలో ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా క్షీణించాయి. గత ఏడాది మేలో 3,275 కోట్లు డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది మేలో13 శాతం తగ్గి 2,844 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది మేలో 1,040 కోట్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈ ఏడాది మేలో 627 కోట్ల డాలర్లకు తగ్గింది. ఎగుమతుల్లో క్షీణత తగ్గిందని ఈ గణాంకాల విడుదల సందర్భంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, ముడి చమురు ధరల పతనం కారణంగా 2014 డిసెంబర్ నుంచి ఎగుమతులు క్షీణిస్తున్నాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) ఎగుమతులు 3.7 శాతం క్షీణించి 4,273 కోట్ల డాలర్లకు, అలాగే దిగుమతులు 18 శాతం క్షీణించి 5,385 కోట్ల డాలర్లకు తగ్గాయని పేర్కొంది. ఫలితంగా ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 1,111 కోట్ల డాలర్లుగా ఉందని తెలిపింది. పుత్తడి దిగుమతులు 39 శాతం డౌన్ బంగారం దిగుమతులు మేలో 39% తగ్గి 147 కోట్ల డాలర్లకు పడిపోయాయి. పుత్తడి దిగుమతులు తగ్గడం ఇది వరుసగా 4వ నెల. గత ఏడాది మేలో పుత్తడి దిగుమతులు 242కోట్ల డాలర్లుగా ఉన్నాయి. పుత్తడి దిగుమతుల క్షీణత కారణంగా వాణిజ్య లోటు 627 కోట్ల డాలర్లకు పరిమితమైంది. గత ఏడాది మేలో వాణిజ్య లోటు 1,040 కోట్లు.