న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి.
దిగుమతుల్లో కూడా తగ్గుదల ..
గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా.
ఎగుమతులు డౌన్
Published Thu, Apr 16 2020 5:26 AM | Last Updated on Thu, Apr 16 2020 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment